Wednesday, 12 June 2019

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం – 129
శ్రీ సాయినాధుని లీలలు, మహత్యం గురించి విని, ఆయనను నాస్తిక, హేతు భావాలతో పరీక్షించుదామని వచ్చి ఆయన యొక్క కారుణ్యం, ప్రేమానురాగాలు, మమత, మహత్యం స్వయం గా అనుభవించి, తమ మనసులను మార్చుకొని, శ్రీ సాయి భక్తులుగా మారిన వారు ఎందరో వున్నారు. అందులో సోమదేవ స్వామి ఒకరు ! వారి కధను ఇప్పుడు స్మరించుకుందాం. శ్రీ సాయి లీలామృతాన్ని మనసారా ఆస్వాదించుదాము.


కాకా సాహెబ్ దీక్షిత్ తమ్ముడు భాయీజీ నాగపూరులో ఉద్యోగం చేస్తుండేటప్పుడు 1906 వ సంవత్సరం లో హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ అతనికి సోమదేవ స్వామి అనే సాధువుతో పరిచయం కల్గింది. సోమదేవ స్వామి సదాచార సంపన్నుడు. ఫరమ నిష్టా గరిష్టుడు. హరిద్వార్ లో మఠం నిర్మించుకొని అక్కడ నివసిస్తున్నాడు. ఆయిదు సంవత్సరాల తర్వాత సోమదేవ స్వామి నాగపూర్ వచ్చి భాయీజీ ఇంట్లో ఆతిధ్యం స్వీకరించాడు. మాటల మధ్యలో శ్రీ సాయినాధుని లీలలు గురించి విని ఎంతో ఆనందించి శిరిడీ వెళ్ళి సాయి దర్శనం చేసుకుందామని నిర్ణయించుకున్నాడు.మర్నాడు బయలుదేరి కోపర్గావ్ లో రైలు దిగి, టాంగాను కట్టించుకున్నాడు సోమదేవ స్వామి. శిరిడీ సమీపించేటప్పుడు దూరం గా మశీదుపై రెండు పెద్ద జండాలను చూసి ఒకింత ఆశ్చర్యపడ్డాడు . ఈ యోగి వుండే ప్రదేశం లో పెద్ద పెద్ద జండాలను కట్టించుకున్నాడు. చూస్తుంటే ఆడంబరాల యందు, కీర్తి ప్రతిష్టల కొరకు ఈ యోగి ఎక్కువగా మక్కువ చూపిస్తునట్లు వుందనుకున్నాడు. ఆ మాటే మిగితా యాత్రికులతో చెప్పగా “ అయ్యా ! జండాలను చూదగానే ఇంతగా వ్యాకులం చెందిన మీ మనస్సు మశీదులో రధం, పల్లకి, గుర్రం, లక్షలు విలువ చేసే వెండి సామానును చూస్తే ఇంకెంత చికాకు పడుతుందో కదా !” అని వారు అన్నారు. ఆ మాటలను విన్న సోమదేవ స్వామి మరింత ఆశ్చర్యం, విసుగు చెందాడు. గుర్రాలు, రధాలు, వెండి సామగ్రితో హడావిడి చెసే సన్యాసులను, యోగులను నేనింతవరకూ చూడలేదు. అటువంటి వారిని దర్శించుట కంటే వెనక్కి తిరిగి పోవడమే మేలు అని తాను వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటునట్లు మిగితా వారితో చెప్పాడు. ఆ మాటలను విన్న తోటి యాత్రికులు సోమదేవ స్వామి ని గట్టిగా మందలించారు. తప్పుడు ఆలోచనలు మానుకొమ్మని సలహా ఇచ్చారు. శ్రీ సాయినాధులు పరిశుద్ధ పరబ్రహ్మ అవతారమని, చిరిగిపోయిన దుస్తులతో చాలా సాధారణమైన జీవితం వెళ్ళబుచ్చే ఒక మహిమాన్విత, శక్తి స్వరూపమైన అసాధారణ యోగి యని, ఆయన ఈ ఆడంబరాలను గాని,కీర్తి ప్రతిష్తలను గని అసలేమాత్రం లక్ష్య పెట్టరని , వాటిని ఏర్పాటు చేసినది వారి అసంఖ్యాకమైన భక్తులే గాన ఒక్క సారి మశీదు లోనికి వచ్చి శ్రీ సాయిని దర్శించిన తర్వాత ఆయన పట్ల తగు అభిప్రాయం ఏర్పాటు చేసుకోమని చెప్పి సోమదేవ స్వామి ని బలవంతం గా మశీదు లోనికి తీసుకువెళ్ళారు. 

మశీదు లోనికి అడుగు పెట్టి దూరం నుండి శ్రీ సాయిని చూడగానే సోమదేవ స్వామి మనసు కరిగిపోయింది. కళ్ళు ఆనందం తో వర్షించసాగాయి. గొంతుక ఆర్చుకొని పోయింది. అప్పటి వరకు అతని మనస్సులో తాండవం చెసిన సంశయాలన్నీ పటా పంచలు అయిపోయాయి. అనిర్వచనీయమైన ఆనందం, శాంతి అతనికి లభించింది. వేల సంవత్సరాలు కఠోర నియమాలతో తపస్సు చేసినా కలుగని ఆత్మ సంతృప్తి , పరమానందం శ్రీ సాయిని ఒక్కసారిగా చూడగానే అతనికి కలిగింది. ఎక్కడైతే మన పంచేంద్రియాలు, మనస్సు శాంతించి ఆత్మానందం పొందుతాయో అదే మన గమ్యం ! వాటిని కలిగించువారే సద్గురువులు అన్న అతని గురుదేవుల ఉపదేశం సోమదేవ స్వామి కి గుర్తుకు వచ్చింది. వెంటనే పట్టరాని ఆనందంతో మశీదు లోనికి పరుగులు తీసాడు. కాని అతనిని చూసిన వెంటనే శ్రీ సాయి పట్టరాని కోపం తో “ మా వేషాలన్నీ మా దగ్గరే వుండనివ్వు. ఆడంబరాల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం వెంపర్లాడే మా వంటి కపట సాధువుల దర్శనం నీవు చేయనేల ? ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యక బయటకు దయ చెయ్యు” అని అరిచారు. ఆ మాటలకు సోమదేవ స్వామి చాలా ఆశ్చర్యపోయాడు. శ్రీ సాయికి తన మనసులో మెదిలే ఆలోచనలన్నీ తెలుసునని, తనను సంస్కరించడానికే తనపై కోపగించుకున్నారని అర్ధం చెసుకున్నాడు. దూరం నుందే మశీదులో జరిగే తతంగమంతా గమనించసాగాడు. మశీదుకు వేల సంఖ్యలో భక్తులు ఎన్నో బాధలు, చింతనలు, కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు, కోరికలతో వస్తున్నారు. శ్రీ సాయిని దర్శించి తమకు చిత్తం వచ్చిన రీతిలో పూజిస్తున్నారు. శ్రీ సాయి రక రకాల భక్తులను వివిధ రకాలుగా ఆశీర్వదిస్తున్నారు.కొందరిని కౌగలించుకోవడం, కొందరిని ఓదార్చడం, కొందరికి సలహాలు,సూచనలివ్వడం, మరి కొందరిపై తన అమృత సమానమైన దయామృత చూపులను ప్రసరించడం ఈ విధం గా అందరినీ ఆనందింపజెస్తున్నారు. ఏడుస్తూ వచ్చిన వారు ఆనందం గా తిరిగి వెళ్తున్నారు. ఇదంతా చూసిన సోమదేవ స్వామి హృదయం శ్రీ సాయిని శంకించినందుకు పశ్చ్త్తాపంతో రగిలి పోయింది. శ్రీ సాయి పట్ల భక్తి శ్రద్ధలు రెట్టింపయ్యాయి. అనుక్షణం శ్రీ సాయి నామస్మరణను చేయసాగాడు. అతనిలో శాశ్వతమైన మార్పు వచ్చాక అతనికి శ్రీ సాయి తన దర్శన భాగ్యం కలిగించారు. శ్రీ సాయి ఆశీర్వదించగానే అతనిలో గొప్ప అధ్యాత్మిక జాగృతి కలిగింది. నాటి నుండి శ్రీ సాయికి గొప్ప భక్తుడయ్యాడు. తన శేష జీవితమంతా శ్రీ సాయిని ఆరాధించడం తోనే గడిపి చివరకు శ్రీ సాయినాధునిలో ఐక్యం అయ్యాడు. 

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు
లోకాస్సమస్తా సుఖినోభవంతు
సర్వే జన: సుఖినోభవంతు

Monday, 10 June 2019

శ్రీ సాయి దివ్య జ్ఞానామృతం - 128ఆధ్యాత్మికత అన్న పదానికి వేద శాస్త్రాలు ఇచ్చిన నిర్వచనం :


1. నిర్మలమైన హృదయం తో , పవిత్ర జీవనం కొనసాగించడం.
2. సకల జీవ రాసులలో భగవంతుని దర్శించగలగడం.
3. భగవంతునికి సంపూర్ణ , సర్వశ్య శరణాగతి చేసి  ప్రసాద భావంతో జీవించడం.
4. గురువులు, తల్లిదండ్రులు , వయస్సులో పెద్దల యందు గౌరవాభిమానములు కలిగి వుండడం.
5. సర్వ జీవ సమానత్వం భావనను ఆచరణలో పెట్టడం.
6. అత్యున్నత విలువలు,నీతి నియమాలు, నియమ నిష్టలతో , నిరంతరం ధర్మాచరణ ఒనరించడం.
7. కోరికలనే గుర్రాలను అదుపులో వుంచుకోవడం.
8. వేద,శాస్త్ర సమ్మతమైన కార్యములను మాత్రమే చేయడం.
ఏది నీది కాదో, అది ఎప్పటికీ నీకు చెందదు. నీ దగ్గరకు ఫ్రాదు. ఒకవేళ అవచ్చినా అది నీ దగ్గర వుండదు. ఒకవేళ తీవ్ర ప్రయత్నం తో సంపాదించాలని యత్నించినా అది నీ దగ్గర నిలబదదు. నీది కాని దాని గురించి అనవసరం గా ప్రయాస పడకు. ఇవి పదవులు, అధికారం, భోగభాగ్యాలు, ఆస్థి అంతస్థులు, మానవ సంబంధాలు ఏమైనా కావచ్చు.

ఏది నీకు పూర్వ జన్మ సుకృతం వలన చెందుతుందో అది స్వల్ప ప్రయత్నం వలన, దైవానుగ్రహం వలన , ఎన్ని కష్ట నష్టాలు , అడ్డంకులు ఎదురైనా నీవద్దకు వచ్చి తీరుతుంది. అది నీ వద్దే వుంటుంది. మానవమాత్రులెవరూ అది నీ దగ్గరకు రాకుండా అడ్డగించలేరు. మనకు జీవితం లో కష్టాలు, ఆందోళనలు, అశాంతి మనకు చెందని వాటిని వ్యర్ధ ప్రయాసతో చేజిక్కించుకునే ప్రయత్నాల వలనే వస్తాయి.

ఏది నీదో, ఏది నీది కాదో తెలుసుకోవడమే వివేకం. నిరంతర దైవ స్మరణ వలన అది మనకు అలవడుతుంది.

Wednesday, 29 May 2019

శ్రీ సాయి దివ్య జ్ఞానామృతం - 127మానవ జీవితం చాలా అమూల్యమైనది. అది ఎప్పుడు అంతమవుతుందో ఎవరికీ తెలియదు.. జీవితకాలాన్ని సద్వినియోగం చేసుకోవడం పైనే సాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రపంచంలో మనం ఏదైనా సాధించవచ్చు. డబ్బు, గౌరవం, ఉద్యోగం, అధికారం, హోదా మొదలైనవి ఏమైనా కావచ్చు . కాని కాలాన్ని మాత్రం ఎంత ధనం ధారపోసినా, ఎంతపలుకుబడి ఉపయోగించినా సాధించలేము. గడిచినకాలం – అది రెప్పపాటైనా సరే – కోట్లు కుమ్మరించినా మనకు లభించదు. ఇది కాలం చెప్పే సత్యం. మనం దాని విలువను గుర్తించకపోతే అది మనకోసం ఆగదు.. సమయాన్ని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోగలిగినప్పుడే అది మనకు ఉపకరిస్తుంది.

ఏది నీది కాదో, అది ఎప్పటికీ నీకు చెందదు. నీ దగ్గరకు ఫ్రాదు. ఒకవేళ అవచ్చినా అది నీ దగ్గర వుండదు. ఒకవేళ తీవ్ర ప్రయత్నం తో సంపాదించాలని యత్నించినా అది నీ దగ్గర నిలబదదు. నీది కాని దాని గురించి అనవసరం గా ప్రయాస పడకు. ఇవి పదవులు, అధికారం, భోగభాగ్యాలు, ఆస్థి అంతస్థులు, మానవ సంబంధాలు ఏమైనా కావచ్చు.ఏది నీకు పూర్వ జన్మ సుకృతం వలన చెందుతుందో అది స్వల్ప ప్రయత్నం వలన, దైవానుగ్రహం వలన , ఎన్ని కష్ట నష్టాలు , అడ్డంకులు ఎదురైనా నీవద్దకు వచ్చి తీరుతుంది. అది నీ వద్దే వుంటుంది. మానవమాత్రులెవరూ అది నీ దగ్గరకు రాకుండా అడ్డగించలేరు. మనకు జీవితం లో కష్టాలు, ఆందోళనలు, అశాంతి మనకు చెందని వాటిని వ్యర్ధ ప్రయాసతో చేజిక్కించుకునే ప్రయత్నాల వలనే వస్తాయి.

ఏది నీదో, ఏది నీది కాదో తెలుసుకోవడమే వివేకం. నిరంతర దైవ స్మరణ వలన అది మనకు అలవడుతుంది.

సర్వం శ్రీ శిరిడీ సాయి పాదారవిందార్పణమస్తు

Friday, 24 May 2019

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 126శ్రీకృష్ణుడు భగవద్గీతలో తనకు అర్పించకుండా భుజించిన ఆహారము పాపభూయిష్టమైనదని , అందువలన నిష్కృతి లేని పాపాలను మూటగట్టుకుందురని . అదేవిధంగా భగవంతునికి అర్పించి, పావనం చేసిన పిమ్మట తీసుకున్న ఆహారం అమృతతుల్యమని అందువలన జీవునకు ఇహం లోనూ , పరం లోనూ శ్రేయస్సు కలుగుతుంగని సెలవిచ్చి ఉన్నారు. ఈ గీతా సారాన్ని కలియుగ దైవం , భక్తుల పాలిటి కల్పవృక్షం అయిన శ్రీసాయినాధులు తనదైన రీతిలో భక్తులకు బోధించారు. ఆ లీలను ఇప్పుడు స్మరించుకుందాము.

శిరిడీలో ప్రతీ ఆదివారం సంత జరిగేది. చుట్టు పక్కల గ్రామాలనుండి ప్రజలు వచ్చి ఆ వారానికి కావలసిన సరుకులను కొనుకొని తిరిగి వెళ్ళిపోయేవారు.వెళ్ళెముందు వారు మశీదుకు వచ్చి సాయిని దర్శించుకోవడం ఒక అలవాటు. ఒక ఆదివారం ఎప్పటివలెనే మశిదు కిక్కిరిసిపోయి వున్నాది.

హేమాద్రిపంత్ బాబా ముందు కూర్చోని ఆయన పాదములను ఒత్తుతూ మనస్సులో నామజపం చేసుకుంటున్నాడు. బాబా గారి ఎడమవైపున శ్యామా, కుడివైపున బూటీ, కాకా దీక్షిత్ కుడా కూర్చోని వున్నారు. అప్పుడు శ్యామ నవ్వుతూ, " హేమాద్రిపంత్ జీ, నీ కోటుకు శనగ గింజలు అంటినవి చూడు " అని అన్నాడు. అంతే కాక హేమాద్రిపంత్ చొక్కా చేతులను తట్టగా కొన్ని శనగ గింజలు రాలిపడ్డయి.హేమాద్పంత్ వెంటనె తన చేతులను ముందుకు చాచగే మరి కొన్ని శనగపు గింజలు రాలి పడ్దాయి.

ఈ సంఘటనకు అందరూ ఆశ్చర్యపడ్డారు. శనగలు చోక్కా చేతుల లోపలకు ఎలా ప్రవేశించాయో ఎవరికి తోచినట్లు వారు ఊహించనారంభించారు. అప్పుడు శ్రీసాయి కల్పించుకొని " ఆ హేమాద్పంతుకు తాను తిన్నప్పుడు ఇంక ఎవ్వరికీ పెట్టని దుర్గుణము వున్నాది. ఈ రోజు సంతలో శనగలు కొని తానొక్కాడే తంటూ ఇకడికి వచ్చాడు" అని అన్నారు. సాయి మాటలకు హేమాడ్పంతు ఒకింత ఆశ్చర్య పడి " బాబా ! నేనెప్పుడూ దేనినీ ఒంటరిగా తిని ఎరుగను. ఈ రోజు దాకా శిరిడీ లోని సంత ఎక్కడ జరుగుతుందో కూడా నాకు తెలియదు.ఈ రోజు కూడా నేను సంతకు వెళ్ళలేదు, అయినప్పుడు నేను శనగలు ఎలా కొని వుండగలను ?నా దగ్గర ఏ వస్తువైనా వున్నప్పుడు దానిని దగ్గర వున్నవారికి పంచి ఇవ్వకుండా నేనొక్కడినీ తినే అలవాటు నాకు లేదు. అటువంటప్పుడు ఈ దుర్గుణమును , అభాండమును ఏల నాపై మోపెదవు ? " అని అడిగాడు.అప్పుడు సాయి చిరునవ్వుతో " భావూ (తమ్ముడా !)దగ్గర వున్నప్పుడు ఇంకొకరికి పంచి ఇస్తావు కానీ ఎవరూ లేన్నప్పుడు ఏం చేస్తావు? తినెటప్పుడు కనీసం నన్ను స్మరిస్తావా ?నేనెల్లప్పుడు నీ చెంత లేనా ?నీవేదైనా తిన్నేటప్పుడు నాకు అర్పిస్తున్నావా ?" ఆ మాటలకు హేమాద్పంత్ ముఖం చిన్నబోయింది. బాబా మాటలలోని అర్ధం అక్కడు కూర్చున్న వారందరికీ అవగతమై అందరి అజ్ఞానం పటాపంచలు అయ్యి జ్ఞానోదయం అయ్యింది.****
హేమాద్పంత్ శనగలు తినుటను ఆసరాగా చేసుకొని శ్రీ సాయి ఒక అద్భుతమైన, అపూర్వమైన బోధను చేసారు.మనస్సు, బుద్ధి పంచేంద్రియముల కంటే ముందుగా విషయములను అనుభవిస్తాయి, కనుక మమము ముందే ఏ విషయానైననూ భగవదర్పితం చేయాలి.అప్పుడు మనకు ఆ విషయములందు అభిమానము అదృశ్యమైపోతుంది.విషయములను అనుభవించే మూందు బాబా మన చెంతనే వున్నట్లు భావించినచో ఆ వస్తువును మనము అనుభవించవచ్చునా లేదా అన్న ప్రశ్న ఉదయించి తద్వారా వైరాగ్యం, వివేకము ఉదయిస్తాయి. అధ్యాత్మిక జీవితంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి.మనము మన సద్గురువును లేదా ఇష్ట దైవమును స్మరించనిదే ఏ పనినీ చేయరాదు. మనస్సును ఈ విధముగా క్రమశిక్షణతో వుంచినట్లయితే శ్రీఘ్రమే ఆ సద్గురువు యొక్క అపూర్వమైన,అత్యద్భుతమైన కరుణా కటాక్షాలకు పాత్రులమవుతాము.

శ్రీ సాయి చేసిన ఈ భోధనామృతమును మనసారా వంటబట్టించుకొని భక్తులందరూ తమ తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళారు.సర్వం శ్రీ శిరిడీ సాయినాధార్పణ మస్తు

Wednesday, 22 May 2019

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 125


భగవంతుని అద్భుతమైన, అపూర్వమైన, కరుణ కటాక్షములకు పాత్రులమైన వారు ఎంతో అదృష్టవంతులు. మట్టికుప్ప లోని రాయి వంటి వారు క్షణాలలో అతి విలువైన వజ్రం లా మారిపోతారు. వారి కీర్తి ప్రతిష్టలు దిశ దిశలకు ప్రాకిపోతాయి. అయితే ఈ అదృష్టం అందరికీ లభించదు. ఆనన్య చింతనతో, తీవ్రమైన తపనతో, సాధనతో భగవంతునికి సర్వశ్య శరణాగతి ఒనరించిన భక్త శ్రేష్టులకు మాత్రమే ఈ భాగ్యం లభ్యం. శ్రీ సాయినే తమ సద్గురువుగా నమ్ముకొని రేయింబవళ్ళూ భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసిన హేమాద్రిపంత్, నానా చందోర్కర్, దాసగణు మహారాజ్ , తాత్యా కోటే పాటిల్, మహల్సాపతి , మాధవరావు దేశ్ పాండే (శ్యామా) వంటి వారు సామాన్య స్థితి నుండి ఆధ్యాత్మికం గా ఎంతో ఉన్నత స్థితికి ఎదిగి చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారసులకు సైతం నేటికీ శ్రీ సాయి రక్షణ కవచం లభ్యమౌతునే వుంది.
ఒకసారి దాసగణు మహారాజ్ ఈశావాస్యోపనిషత్తు పై మరాఠీ భాషలో వ్యాఖ్యానం వ్రాయడానికి సంకల్పించాడు.ఈ గ్రంధ రాజానికి వేదాలలో ఎంతో ఉన్నతమైన స్థానం వుంది.వేద సంహిత లోని మంత్రములు వుండడం తో దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అంటారు. దీనికి వాజసనేయ సంహితాపనిషత్తు అని మరొక పేరు కూడా వుంది. ఆన్ని ఉపనిషత్తుల కంటే శ్రేష్టముగా దీనిని పండితులు భావిస్తారు. ఈశావాస్యోపనిషత్తు గ్రంధములో ఆత్మను గూర్చి అపూర్వమైన వర్ణన వుంది. గురువు స్థానం లో వుండే యోగి శ్రేష్టుల గుణముల గూర్చి విపులం గా వ్రాయబడి వుంది. కర్మ యోగమును, జ్ఞాన మార్గమును సమన్వయం చేసిన అద్భుత కావ్యం గా ఈ ఉపనిషత్తు గూర్చి పండితులు తెలియజేసారు.ఇటువంటి అపూర్వ గ్రంధముపై వ్యాఖ్యానం వ్రాయడానికి దాసగణు ప్రారంభించి , రాత్రిబంవళ్ళూ ఆ గ్రంధాన్ని అధ్యయనం చేసాడు. కాని ఆ గ్రంధం సరిగ్గా అతనికి అర్ధం కాలేదు. ఎందరో పండితులను కలిసి తన అనుమానాలను నివృత్తి చేసుకున్నాడు కాని సంతృప్తికరం గా అతనికి సమాధానం లభించలేదు.

ఛివరకు ఒక పండితుడు దాసగణుతో ఈ పవిత్రమైన గ్రంధాన్ని అధ్యయనం చేయడం ,వివరించి చెప్పడం అంత సుళువు కాదని . ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు వద్దకు వెళ్ళి ఆయన ఆశీర్వాదములను పొందమని సలహా ఇచ్చాడు. తాను ఇంత కాలం ఏ విధం గా కాలయాపన చేసాడో గుర్తించిన దాసగణు వెంటనే శిరిడీ వెళ్ళి, శ్రీ సాయి కాళ్ళపై పడి తనకు వచ్చిన కష్టాన్ని తీర్చమని ప్రార్ధించాడు. శ్రీ సాయి చిరునవ్వుతో ఆశీర్వదించి “ ఏ మాత్రం తొందర పడవద్దు. తిరుగు ప్రయాణం లో విల్లేపార్లే లోని దీక్షిత్ కాకా పనిపిల్ల నీ సందేహాలను తీరుస్తుందని" అన్నారు. ఆ మాటలు విన్న ఇతర సాయి భక్తులు ఆశ్చర్యం తో ముక్కున వేలేసుకున్నారు. శ్రీ సాయి తమతో హాస్యమాడుతున్నారని భావించారు. లేకపోతే చదువు సంధ్యలు లేని ఒక అనామకురాలు దాసగణు యొక్క సందేహాలను ఎలా తీరుస్తుంది ? ఇది అసాధ్యం అని అందరూ భావించారు.

కాని సాయి భక్తాగ్రేసరుడైన దాసగణు మాత్రం శ్రీసాయి మాటలపై విశ్వాసముంచి శిరిడీ నుండి బయలుదేరి విల్లేపార్లె లోని కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట్లో బస చేసాడు. ఆ మరునాటి ఉదయం దాసగణు నిద్ర లేవగానే పెరట్లో నుండి ఒక చక్కని పాటను విన్నాడు. దీక్షిత్ యొక్క పనిమనిషి చెల్లెలు ఒక ఎర్రచీర గురించి మృదుమనోహరం గా పాడుతోంది. ఆమె చాలా బీద కుటుంబీకురాలు. చిరిగిపోయిన బట్టలను కట్టుకుంది. అయినా తన ఊహల్లో మెదిలే ఎర్ర చీర గురించి చక్కగా పాడుతోంది. ఆమెపై జాలిపడ్డ దాసగణు అప్పటికప్పుడు ఒక ఎర్ర చీరను కొని ఆమెకు బహుకరించాడు. ఆకలితో నక నక లాడే వారికి పరమాన్నం దొరికినట్లు ఆ చీరను చూడగానే ఆ చిన్న పిల్ల మనస్సు ఆనందం తో పరవళ్ళు తొక్కింది. మరునాటి ఉదయం ఆ క్రొత్త చీరను కట్టుకొని వచ్చి ఉత్సాహం తో పని చేసింది.అందరికీ కావల్సినవి చేసి పెట్టింది. ఆమె ముఖం ఆనందం తో వెలిగిపోయింది. ఆ మరునాడు పాత బట్టలనే ధరించి పని లోనికి వచ్చింది. అయినా ఆమె లో ఆనందానికి అంతు లేదు. నిన్నటి రోజు వలె అదే ఉత్సాహం, ఆనందం ! నిరాశా నిస్పృహలు అన్నవి మచ్చుకైనా ఆమె ముఖం లో కాన రాలేదు. ఇదంతా చూసిన దాసగణు జాలి భావం మెచ్చుకోలుగా మారింది. సరిగ్గా అప్పుడే అతనిలో అజ్ఞానంధకారాలు పటాపంచలై జ్ఞాన జ్యోతులు వెలిగాయి. ఈశావాస్యోపనిషత్తు కావ్యం యొక్క నిఘూఢ రహస్యాలన్నీ సాయి అనుగ్రహం వలన క్షణాలలో అవగతం అయ్యాయి.

ఆ పిల్ల కటిక పేదది కావడం వలన చింకి గుడ్దలు కట్టుకుంది. ఖ్రొత్త చీర లభించినప్పుడు దానిని ధరించింది. రెండు సంధర్భాలలో కూడా ఆమె ఒకే విధమైన ఆనందం తో వుంది. చీర వున్నప్పుడు , లేనప్పుడు కూడా అదే సంతృప్తితో ఆమె వుంది. కాబట్టి కష్ట సుఖములనే భావనలను మన మనో వైఖరి పైనే ఆధారపడి వున్నాయి. మన పూర్వ జన్మ సుకృతం వలన కష్ట సుఖములను, లాభ నష్టములను భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. భగవంతుడిచ్చిన వాటితో మనము సంతృప్తులై వుందాలి. మనకు ఏమి ప్రసాదించినా అది మన మేలు కోసమే నని గ్రహించి అన్నింటినీ సమ భావం తో స్వీకరించి ఆయనకు కృతజ్ఞలమై వుండాలి.ఆ పిల్ల, ఆమె పేదరికం, ఆమె సంతృప్తి, ఆనందం, క్రొత్త చీర, దాసగణు యొక్క దానగుణం, ఇవన్నీ భగవంతుని ప్రతిరూపాలే ! అన్నింటి యందు ఆ భగవంతుడు సమానం గా వ్యాపించి వున్నాడు. శివాజ్ఞ లెనిదే చీమైనా కుట్టదు. భగవంతుని అనుజ్ఞ ప్రకారమే మనకు అన్ని సంఘటనలు సంభవిస్తున్నాయి. కాబట్టి ఇతరులను కష్టపెట్టరాదు, ఇతరుల సొత్తుకై మనం ఆశింపరాదు, మనకు వునదానితోనే సంతుష్టి చెందవలెను, మనకు ఏమైనా కావల్సి వచ్చినప్పుడు హృదయపూర్వకం గా ఆ భగవంతుని డినే ప్రార్ధించాలి. అంతే కాక మనం మనకు శాస్త్రములలో విధింపబడిన కర్మలను ఎల్లవేళలా చేస్తుండాలి. భగవంతుని అనుగ్రహం కోసం సత్కర్మలు ఒనరించుట అన్నింటి కంటే మేలు.భగవంతుడు సర్వాంతర్యామి. జడ, జీవ పదార్ధాలన్నింటిలోనూ సమానం గా వ్యాపించి వున్నాడు. అంతులేని నమ్మకం తో ఒక రాయిని కొలిచి , ప్రార్ధించినా మన కోరికలను తీరుస్తాడు. ఏ మానవుడైతే సమస్త జీవరాశి యందు కొలువై వున్న భగవత్స్వరూపమైన ఆత్మను దర్శిస్తాడో, అన్ని జీవ, జడ పదార్ధములను ఒకే విధం గా భావిస్తాడో అతను ఏ విధమైన మోహములకు గురికాడు. ఎటువంటి సంతోష, వికారాలకు గురి అవడు.

దాసగణుకు శ్రీ సాయినాధుని అనుగ్రహం వలన క్షణం లో జ్ఞానోదయం అయ్యింది. ఈశావాస్యోపనిషత్తు లోని అంతరార్ధం , నిఘూఢ తత్వం వెంటనే అవగతం అయ్యాయి. ఆ గ్రంధం పై మరాఠీ బాషలో అపూర్వమైన రీతిలో భాష్యాన్ని రచించి శ్రీ సాయికి అంకితం చేసాడు. ఈశావాస్యోపనిషత్తు పై మనకు లభించే వివిధ భాష్యాలలో దాసగణు మహరాజు రచించిన భాష్యాన్నే అత్యుత్తమైన దానిగా ఇప్పటికీ పండితులు భావిస్తారు.

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు
లోకాస్సమస్తా సుఖినోభవంతు
సర్వే జన: సుఖినోభవంతు

Tuesday, 21 May 2019

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 124
రామాయణం జీవన విలువల గురించి గొప్ప సందేశం అందించింది. తండ్రిమాటకు, ప్రజల మాటకు ఎలాంటి గౌరవం ఇవ్వాలో శ్రీరాముడు బోధించాడు. ఆయన బోధ ఆచరణాత్మకంగా సాగింది. పట్టాభిషేకానికి సిద్ధమై ప్రజల ఆశీర్వచనాలు, అభినందనలు పొందినప్పుడు విరిసిన రాముడి చిరునవ్వు, వనవాసానికి వెళ్లేటప్పుడూ చెక్కుచెదరలేదు. కష్టాలకు కుంగక, సుఖాలకు పొంగని స్థిరచిత్తమే నిజమైన సంపదగా శ్రీరాముడు భావించాడు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలనే సత్వగుణాలు మానవతా విలువలుగా ప్రసిద్ధి పొందాయి. దయగల హృదయమే దైవ మందిరమన్నది పెద్దల మాట. జాలి, కరుణ, సానుభూతి మనిషిని ఉన్నతస్థితికి చేరుస్తాయి.అత్యున్నత జీవన విధానాన్ని తెలుపిన శ్రీ మద్రామాయణ మహాకావ్యాన్ని అందుకే అందరం నిత్యం చదవాలి, అందులోని ధర్మాన్ని ఆచరించాలి.మానవ జన్మకు సార్ధకత చేకూర్చుకోవాలి. శ్రీ రామ నామాన్ని నిత్యం జపించాలి. అదియే మోక్షకారకం.


ఈ జగత్తులో ధర్మాచరణను మించిన శ్రేష్ఠమైన మహత్కార్యం మరొకటి లేదు. మనిషికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించి, సక్రమ జీవన విధానాన్ని చూపిస్తుంది ధర్మం. మనిషికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేదీ ధర్మమే. భగవంతుని దరికి చేర్చేది ధర్మాచరణ మాత్రమే. మానవ జీవితాన్ని పతనావస్థ నుండి కాపాడేది ధర్మం, న్యాయం, శౌచం మరియు తపస్సులు మాత్రమే. ధర్మాన్ని మనం కాపాడితే, ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మాన్ని కాపాడటమంటే- అన్నివేళలా ధర్మాన్నే ఆచరించాలి. ధర్మం మనిషిని మంచి స్థితిలో నిలబెడుతుందని, అధర్మం వల్ల మనిషి పతనమవుతాడని శాస్త్రం స్పష్టం చేస్తోంది.


Tuesday, 7 May 2019

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 123అఖిలాంఢకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు, పరిశుద్ధ పరమేశ్వర అవతారం అయినా శ్రీ సాయినాధుని లోని విశిష్ట ఏమిటంటే కల్పవృక్షం, కామధేనువు కంటే భిన్నంగా అడిగినవారికీ, అడగనివారికీ కూడా వారికి నిత్య జాగృతుడై, కావల్సినవన్నింటినీ సమకూర్చి, మొదట వారి భౌతిక అవసరాలను తీర్చి, పిమ్మట వారిని అధ్యాత్మిక మార్గంలో పయనింపజేస్తారు. అంతే కాక మొదటి నుండి వారి వెంట వుండి,వారిని దారి తప్పకుండా మార్గ దర్శి వలే నిలిచి,చివరికంటా గమ్యం చేరుస్తారు. తనకు సర్వస్య శరణాగతి చేసిన భక్తులకు ఎళ్ళవేళలా రక్షణ కవచాన్ని అందిస్తూ వారికి ముక్తిని ప్రసాదించే అతి శక్తివంతుడు, ఆర్తత్రాణ పరాయణుడు శ్రీసాయినాధులు. ఇప్పుడు ఆ మహనీయుడు చేసిన ఒక అద్భుతమైన లీలను స్మరించుకుందాం.

పూనా జిల్లా, జున్నూరు తాలూకా నారాయణ గ్రామము వాస్తవ్యుడు అయిన భీమాజీ పాటిల్ కు ఒకసారి ఉపిరితిత్తుల వ్యాధి సోకి, క్రమంగా అది క్షయగా పరిణమించింది. వైద్య విజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజులలో క్షయవ్యాధిని మృత్యు ద్వారంగా పరిగణించేవారు. స్వతాహాగా ధనవంతుడైన భీమాజీ ఎన్నో రకములైన మందులను వాడాడు, ఎందరో ప్రసిద్ధమైన దాక్టర్లకు చూపించాడు కాని ఆ వ్యాది ఇసుమంతైనా తగ్గలేదు. ఇక ప్రాణం మీద ఆశ వదులుకొని " ఓ భగవంతుడా నీవే నాకిక దిక్కు" అని రాత్రింబవళ్ళూ అతి దీనంగా ప్రార్ధించసాగాడు. అతని ప్రార్ధనలు ఆ సాయికి చేరాయా అన్నట్లుగా ఆ తర్వాత భీమాజి తన అనారోగ్యం వివరాలను సాయి భక్త శిఖామణి నానా చందోర్కర్ కు రాసాడు. అందుకు నానా " అన్ని వ్యాధులకు ఏకైక నివారణ సర్వస్య శరణాగతి చేసి సాయి పాదాలపై పడుటయే" అని సమాధానమిచ్చాడు. అప్పుడు భీమాజీ నానా సలహాపై అధారపడి తన బంధువుల సహాయంతో శిరిడీకి వచ్చి మశిదులో బాబా కాళ్ళపై పడి తన వ్యాధి తగ్గించమని ప్రాధేయపడ్డాడు. ఈ వ్యాధి అతని గత జన్మల ప్రారబ్ధ ఫలితమని, ఆ పాపములను అనుభవించి వాటి నుండి విముక్తి అవ్వడమే సరైన మార్గమని, అందువలన ఈ విషయంలో తాను కలుగజేసుకొనడం లేదని బాబా ఖచ్చితంగా చేప్పేసారు.ఆ మాటలకు హతాశుడైన భీమాజీ తనకు వెరే దిక్కు లేదని, సాయి కల్పించుకోకపోతే ఇక మరణమే శరణ్యమని కన్నీరు మున్నీరుగా సాయిని ప్రార్ధించాడు. అతని పరుశుద్ధమైన ప్రార్ధనకు బాబా హృదయం కరిగింది. అపుడు భీమాజీతో సాయి" ఊరుకో. నీ అతృతలను పారద్రోలుము. నీకష్టముల్లనీ గట్టెక్కే సమయం వచ్చింది. ఎంతటి బాధలునవారైనా తల్లి వంటి ఈ మశీదు మెట్లెక్కితే వారి కష్టములనీ నిష్క్రమించి సంతోషమునకు దారి తీస్తాయి. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయామయుడు. నీ రోగమును తప్పక బాగు చేయును" అని ప్రేమపూర్వక పలుకులను పలికారు. ఆ కమ్మని పలుకులతో భీమాజీకి కొండంత ఊరట కలిగినట్టయ్యింది. అప్పటి వరకూ ప్రతీ అయిదు నిమిషాలకూ రక్తం కక్కుతున్న అతను సాయి సుముఖంలో ఒక్కసారి కూడా రక్తం కక్కలేదు. సాయి వానికి నిన్ను కాపాడుతాను అని దయతో అభయం ఇచ్చినప్పటినుండి భీమాజి జబ్బు నయమవడం ఆరంభించింది. అతనిని భీమాభాయి అను వారి ఇంట వుంచమని సాయి సలహా ఇచ్చారు. ఆ ఇంటికి గాలీ, వెలుతురూ సరిగ్గా వుండక ఏమంత సౌకర్యంగా వుండదు. క్షయ రోగంతో బాధపడు వారికి ఆ ఇల్లు అసలు పనికిరాదు. కాని సాయి వాక్కు బ్రహ్మ వాక్కుతో సమానం. ఆ రాత్రి అతనికి రెండు స్వప్నములు వచ్చాయి. మొదటి స్వప్నములో భీమాజి ఒక పాఠశాల విద్యార్ధిగా వున్నాడు. టీచరు చెప్పిన పద్యములను కంఠస్తం చేయకపోవడం వలన టిచరు గారు అతడిని తీవ్రంగా దెబ్బలు కొట్టారు.రెండవ స్వప్నంలోగుర్తు తెలియని వ్యక్తులు కొందరు భీమాజి చాతిపై పెద్ద బండను వేసి కిందకూ, మీదకు తొక్కడం వలన చాతిలో నొప్పి ఎక్కువగా వచ్చి భీమాజీ తీవ్రమైన బాధను అనుభవించాడు. కలలో పడిన ఈ బాధలతో అతని జబ్బు పూర్తిగా నయమైపోయింది. కొద్ది రోజులలోనే శ్రీ సాయి యొక్క ఊదీ ప్రసాదాలను తీసుకొని ఆనందంగా తన బంధువులతో ఇంటికి తిరిగి వెళ్ళాడు. సాయినాధులు తనకు చేసిన ఈ మేలును మరువక ప్రతీ నెలా శ్రీ సాయి సత్య వ్రతం అనే వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకోసాగాడు.

ఈ విధంగా శ్రీ సాయినాధుల తమదైన శైలిలో తన భక్తుని వ్యాధిని తగ్గించి వేసారు.సాయి తాను తన భక్తులకు చేసిన మేలుకు ప్రతిఫలముగా ఏమీ ఆశించేవారు కాదు.వార్కి కావలసింది భక్తులు తాము పొందిన మేలును గుర్తుంచుకొని తనపై అచంచలమైన నమ్మకం కలిగి వుండడమే ! తనకు సర్వస్య శరణాగతి చేసిన భీమాజీ యొక్క కిందటి జన్మలో చేసుకున్న ప్రారబ్ద కర్మలను సైతం తప్పించి,మందులు ఆపరేషన్ లు లేకుండా కేవలం స్వప్నానుభవములతో అతి దుర్లభమైన అతని వ్యాధిని తగ్గించి పరిపూర్ణ ఆరోగ్యవంతుడిని గావించి తదనంతరం సుఖవంతమైన నూతన జీవితం ప్రసాదించిన కరుణా మూర్తి శ్రీ సాయి. సాయి కరుణను, అపారమైన అనుగ్రహమును పొందాలంటే ఆడంబరమైన భజనలు, ఆర్భాటమైన పూజలు, యజ్ఞ యాగాదులు అవసరం లేదు. పరిశుద్ధమైన మనస్సు, ఇచ్చేది, పుచ్చుకునేది ఆ సాయియే అన్న ధృఢమైన నమ్మకం చాలు.