Saturday, 10 December 2016

శ్రీ సాయి దివ్య జ్ఞానామృతం – 26మన మహాత్ములు చేసే బోధలన్నీ ఆనాటి దేశ, కాల, సమాజ పరిస్థితులకు అనుగుణంగా, అనుకూలంగా వుంటాయి. ఆ బోధలే మనకు ధర్మాలు అయ్యాయి. ఈ కారణం వలనే మహాత్ముల బోధలన్నీ ఏకీభవించవు. ఓక్క తత్వం విషయంలోనే వీరి బొధలన్నీ ఏకీభవిస్తాయి.
ఈ విధంగా ప్రస్తుత కాల ధర్మాన్ని నిర్ణయించేది సద్గురువే ! కలియుగానికి సాటిలేని, మేటిలేని సద్గురువు శ్రీ సాయినాధులు. కనుక శ్రీ సాయి ఏమి చెప్పారో అవే మనకు వేద శాస్త్రాలు. శ్రీ సాయి ఏమి బోధించారో అవే మనకు ధర్మ శాస్త్రాలు. శ్రీ సాయి వేటిని శాసించారో అవే మనకు ధర్మాలు. శ్రీ సాయినాధుల తన భక్తులకు ఉపదేశింఛిన మరి కొన్ని వైదిక రహస్యాలను ఇప్పుడు స్మరించుకుందాము.

1. అమ్మా ! ఎందుకీ ఉపవాస వ్రతం. ఎవ్వరిని సంతోష పెట్టుటకు ? అన్నం, అన్నం భుజించువారు ఇరువురూ దైవ స్వరూపులే ! మనకు ఉపవాసం వుండే ఖర్మ ఏమిటి ? ఎందుకీ కఠిన వ్రతాలను చేపడతావు ? హాయిగా ఇంటికి వెళ్ళి, అన్నం భుజించి , ఇంటిలోని వారందరకూ పెట్టి నీవూ భుజింపుము. ఆ విధంగా చేస్తే నన్ను ఎంతో సంతోష పెట్టినదానివవుతావు.

2. నేనెవరి నుండీ ఊరికే ఏదీ తీసుకోను. నేను అందరినీ అడగను కూడా. ఆ ఫకీరు నాకెవరిని చూపిస్తాడో , వారినే నేను దక్షిణ అడుగుతాను. అట్లా దక్షిణ ఇచ్చిన వారు విత్తనాలను నాటుకుంటున్నారు. తరువాత పెరిగిన పంటను కోసుకుంటున్నారు.

3. మీలో ఎవరైనా సరే,ఎక్కడున్నా సరే, ఎప్పుడు నన్ను స్మరించినా సరే, నా ముందు భక్తితో చేతులు చస్తే చాలు, నేను వెంటనే మీ చెంతన వుంటాను. రాత్రింబవళ్ళు ఎప్పుడైనా సరే, మీ బాధ్యతను స్వీకరించి మీ విశ్వాసాన్ని పెంచుతాను.

4. కర్మ ఒక్క మార్గం చిత్రమైనది. నేనేమీ చెయ్యకున్ననూ,నన్నే సర్వమునకు కారణభూతునిగా ఎంచెదరు. ఆది అదృష్టము బట్టి వచ్చును. నేను సాక్షీ భూతుడను మాత్రమే. చేయువాడు,ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్ధ హృదయులు నేను భగవంతుడను కాను, ప్రభువును కను. నేను వారి నమ్మకమైన బంటును. వారి నెల్లప్పుడూ జ్ఞాపకము చెయుదును. ఎవరైతే తమ అహంకారమును పక్కకు దోసి భగవంతునకు నమస్కరించెదరో , ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారి బంధం లూడి మోక్షమును పొందెదరు.

5. ఎవరయితే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో, ఎల్లప్పుడు వారు నన్నే దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయూ వానికి శూన్యము. నా కధలు తప్ప మరేమియూ చెప్పడు, నన్నే సదా ధ్యానము చేయును. నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును. ఎవరైతే నాకు సర్వశ్య శరణాగతి చెసి , నన్నే ధ్యానింతురో వారికి నేను ఋణగస్తుడను, వారికి మోక్షము నిచ్చి వారి ఋణము తీర్చుకొనెదను. ఎవరయితే నన్నే చింతించుచూ నా గూర్చియే దీక్షతో నుందురో, ఎవరయితే నాకర్పించనిదే ఏమియూ తినరో అట్టివారిపై నేను ఆధారపడి వుందును. ఎవరయితే నా సన్నిధానముకు వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోవునట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము , అహంకారము లేశమైనా లేకుండా , నీ హృదయములో వున్న నన్ను సర్వస్య శరణాగతి వేడవలెను.

లోకాస్సమస్తా సుఖినోభవంతు :
సర్వే జన: సుఖినోభవంతు

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణమస్తు

Saturday, 26 November 2016

శ్రీ సాయి దివ్య జ్ఞానామృతం – 25బాబా వారి ప్రత్యేకత ఏమనగా తన భక్తుల మనస్సులలో ఎవైనా మంచి ఆలోచనలు కలిగినప్పుడు, తన కరుణా కటాక్షములతో ఆ ఆలోచనలు కార్య రూపము దాల్చునట్లు చేసేవారు. ఈ విధముగా భక్తుల సత్సంకల్పములు నెరవేరునట్లు చేసి వారిని సన్మార్గము వైపు నడుచునట్లు చేసేవారు.

సాయిబాబా సచ్చరిత్ర గ్రంధకర్త అయిన హేమాడ్పంత్ కు ఎల్లప్పుడూ బాబా తన ఇంటికి వచ్చి తన ఆతిధ్యము స్వీకరిస్తే బావుండుననిపించేది. ఏన్నొ సార్లు ఈ కోరికను బాబా ముందు వెల్లడి చేసాడు కాని ప్రతీ సారీ అతనికి బాబా నుండి ఒక చిరునవ్వే ఎదురయ్యేది. 1917 వ సంలో హోళీ పండుగ వేకువజాము నాడు హేమడ్పంత్ కొక కల వచ్చింది. అందులో చక్కని దుస్తులను ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి ఈ రోజున నేను నీ ఇంటికి భోజనానికి వస్తున్నానని తెలిపారు. ఆనందాశ్చర్యములతో నిద్ర నుండి లేచి చూసేసరికి హేమడ్పంత్ కు బాబా గాని, ఆ సన్యాసి గాని కనిపించలేదు. వచ్చిన కలను బాగా జ్ఞపకము తెచ్చుకొని , బాబా ఇచ్చిన వాగ్దానమునకు సంతోషించి, వెంతనే తన భార్య వద్దకు పోయి ఈ రోజున బాబా మన ఇంటికి భోజనమునకు వస్తున్నారని కావున ఎక్కువ పిండి వంటలు చేయమని చెప్పాడు. అయితే భర్త మాటలను ఆ ఇల్లాలు నమ్మలేదు. శిరిడీ లో కొలువుండే దైవం శ్రీ సాయినాధులు ఎన్నడూ కూడా శిరిడీని విడిచి వెళ్ళలేదు. కానీ ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు ఆయనకు తెలుస్తూవుండేవి. అటువంటి శ్రీ సాయి అసంఖ్యాకమైన తన భక్తులను విడిచి బాంద్రా లోని తమ ఇంటికి వచ్చునా అని ఆమెకు సంశయము కలిగింది.అందుకు హేమడ్పంత్ బాబా స్వయంగా రాకపోవచ్చును కానీ తన ప్రతినిధిగా ఇంకెవరినైనా పంపవచ్చు కదా అందుకని కొంచెం ఎక్కువ వంటలు చేయడంలో తప్పేమీ లేదని ఆమెకు తెలియజేసాడు.

మద్యాహ్నము భొజనమునకు అన్ని ప్రయత్నాలు జరిగాయి.హోళీ పూజ ముగిసింది. విస్తళ్ళను వేసారు, ముగ్గులు పెట్టారు, భోజనమునకు రెండు పంక్తులు తీరాయి. రెండింటి మధ్య బాబా గారి కోసం ఒక ఆసనమును ఏర్పాటు చేసారు. హేమడ్పంత్ యొక్క కుటుంబ సభ్యులందరూ వచ్చి వారి వారి స్థానములలో కూర్చున్నారు. అందరిలోనూ ఒకటే అతృత. బాబా ఎప్పుడు వస్తారు ? తమ విందును స్వీకరించి తమలను ఆశీర్వదిస్తారు ?

మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నశుద్ధి అయ్యింది. నెయ్యను వడ్డించిరి. శ్రీ కృష్ణునకు నైవేద్యం సమర్పించి భోజనం ప్రారంభించేంతలో మేడ మెట్లపై చప్పుడు వినిపించింది. అంతలోనే తలుపు చప్పుడు అయ్యింది. హేమడ్పంత్ వెళ్ళి తలుపు తీయగా గుమ్మంలో ఇద్దరు మనుష్యులు కనిపించారు. వారిరువురూ తమను ఆలీ మహ్మద్ మరియు మౌలానా ఇస్ము ముజావర్ గా పరిచయం చేసుకొని తమతో తెచ్చిన ఒక ఫొటోను హేమాడ్పంత్ కు అందించారు. అందులో చిరునవ్వులొలికిస్తూ ఆభయ హస్తం అందిస్తున్న శ్రీ సాయినాదుని ఫొటొ వుంది. దానిని చూడగానే హేమాడ్పంత్ కు ఆనందంతో కళ్ళు వర్షించాయి. గొంతుకు పూడిపోయినట్లనిపించింది. తన మాటను నిలబెట్టుకొని, సరిగ్గా భోజన సమయంలో తన ఆతిధ్యం స్వీకరించేందుకు తన వద్దకు వచ్చిన బాబా వారి భక్త పరాయణతత్వానికి మైమరిచిపోయాడు. హేమాడ్పంత్ యొక్క అలౌకిక ఆనంద స్థితిని చూసి ఆశ్చర్యపోయిన వారు ఇరువురూ అయ్యా ! భోజనం మధ్యలో మిమ్మల్ని లేపినందుకు క్షంతవ్యులం. ఈ వస్తువు నీకు సంభందించినది కావున నీకు ఇచ్చేందుకు మేము వచ్చాము. తరువాత తీరుబడిగా ఈ పటమును యొక్క వృత్తాంతమును తమకు తెలియబరెచదముఅని ఆ ఫొటోను హేమాడ్పంత్ కు అందించి వారు వెళ్ళిపోయారు. ఆ పటమును బాబా వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంపై వుంచి, హారతి ఇచ్చి, నైవేద్యం సమర్పించి , ఆ తరువాత తన కుటుంబ సభులతో కలిసి హేమాడ్పంత్ ఎంతో సంతృప్తిగా భోజనం చేసాడు. బాబా వారు ఎన్నటికీ తన భక్తుల కిచ్చిన వాగ్దానం తప్పరని, భక్తులకోసం తమ ప్రాణాలనైనా ఇచ్చుటకు సందేహించరని అందరూ ఈ అద్భుతమైన లీల వలన తెలుసుకున్నారు.

మనం కూడా అపురూపమైన ఈ జన్మలో ఈ విశ్వానికే గురువు అయిన శ్రీ సాయినాధుని భక్తులం అయ్యినందుకు ఎంతో సంతోషించి , మనకు కలిగిన ఈ అపురూపమైన భాగ్యానికి ఆ భగవంతునికి సహస్ర కోటి కృతజ్ఞతాభివందనములను అర్పించి ఎల్లవేళలా మన గురుదేవులను సేవిస్తూ ఆయన యొక్క అపూర్వమైన, అత్యద్భుతమైన కరుణా కటాక్షములకు పాత్రులమౌదాము.

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణమస్తు


Monday, 21 November 2016

శ్రీ సాయి దివ్య జ్ఞానామృతం – 24కలియుగ దైవం , సమర్ధ సద్గురువు అయిన శ్రీ సాయినాధుల వివిధ సంధర్భములలో తన భక్తులొ పలికిన పలుకులను ఇప్పుడు స్మరించుకుందాము. సద్గురువు పలుకులే మనకు వేద శాస్త్రాలు. సద్గురువు ఆచరించునవే మనకు వేద కర్మ కాండ. అందుకని మన గురువు బోధలను తు చ తప్పక ఆచరించడమే మన కర్తవ్యం.

1. సమస్త విషయములయందు మనము నిర్మలుడవుగా వుండవలెను. నిజమైన మానవునికి మమత కాక సమత వుండవలెను. చిన్న చిన్న విషయముల గూర్చి ఇతరులతో పోట్లాడుట అవివేకం.ధనమిచ్చిన పుస్తకము లనేకములు వచ్చును, కాని మనుష్యులు రారు.

2. నా మనుష్యుడు ఎంత దూరమున వున్నప్పటికీ , 100 క్రోసుల దూరమున వున్నప్పటికీ , పిచ్చుక కాళ్ళకు దారము కట్టి ఈడ్చినటుల అతనిని శిరిడీకి లాగెదను.

3. నన్ను గూర్చి ఇతరులను అడుగవలదు. మన కండ్లతోనే సమస్తము చూడవలెను. నా గురించి నన్నె అడుగవలెను. ఆప్పు చేసి శిరిడీకి రావలదు.

4. నా భక్తుల గృహముల యందు ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరం లేదు. నాకు రూపము లేదు.నేను అన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరయితే నన్నే నమ్మి, నా ధ్యానమందే మునిగియుందురో వారి పనులన్నియూ సూత్రధారినై నేనే నడిపించెదను.

5. ఎవరయితే తమ అంత్య దశలో నన్ను జ్ఞపకము ఉంచుకొనెదరో వారు నన్నే చేరెదరు.ఎవరయితే వేరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు.

6. ధనము,ఐశ్వర్యం మున్నగు నవి శాశ్వతము కావు. శరీరము సైతం శిధిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకొని,నీ కర్తవ్యమును చేయుము. ఇహ పరలోక వస్తువులన్నింటియందు వ్యామోహము విడిచి పెట్టుము. ఎవరయితే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదాలను శరణు వేడెదరో , వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు.ఎవరయితే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరో వారికి దేవుడు పరిగెత్తి పోయి సహాయము చేయును.

7. శిరిడీలో నువ్వు నన్ను నిత్యం చూసే ఈ మూడున్నర దేహము గల మనిషిగా నన్ను భావించితివి. నేనెల్లప్పుడు శిరిడీలోనే యుండెదననుకొంటివి. నేను సర్వాతర్యామిని. నేను సర్వ జీవుల హృదయము నందు నివశించుచున్నాను.


సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణమస్తు

Saturday, 19 November 2016

శ్రీ సాయి దివ్య జ్ఞానామృతం – 23ఓం శ్రీ సాయి పరమేశ్వరాయ నమ:
ఓం శ్రీ సాయి జనార్ధనాయ నమ:
ఓం శ్రీ సాయి మృత్యుంజయాయ నమ:
ఓం శ్రీ సాయి అగణిత గుణాయ నమ:
ఓం శ్రీ సాయి సర్వ జ్ఞాన ప్రదాయ నమ:


ఈ కలియుగంలో సద్గురువు భోధలే ధర్మ శాస్త్రాలు.సద్గురువు ఆచరించి చూపినవే వేద కర్మ కాండ. సద్గురువు చూపించిన బాటలో నదవడమే మన కర్తవ్యం. కలియుగ దైవం, భక్తుల పాలిట కల్పవృక్షం, కల్పతరువు, భక్తజన పరాయణుడు అయిన శ్రీ సాయినాధులు వివిధ సంధర్భములలో తన భక్తులకు ఉపదేశీంచిన అమృత పలుకులను ఇప్పుడు మనం స్మరించుకుందాము. ఈ ఉపదేశములను జాగ్రత్తగా విచారణ చేసి, వంట పట్టించుకొని, ఆచరిస్తే మన చిత్తం శాంతించి, సకల దుర్గుణములు నశించి ఆనందకరమైన జీవితం గడుపగలం.

1.సద్గురువు కృప వలన ఆత్మ జ్ఞానం సిద్ధించినప్పుడు, భౌతికంగా మనం చేసే పన్నులన్నీ మన హృదయంలో కొలువై వున్న ఆ భగవంతుడు కర్తగా జరుగుతాయి. తదనుగుణంగా ఫలాన్ని అందించేది కూడా ఆ భగవంతుడే !

2. ఏ వేళయందు వచ్చినా ఇంటి యజమాని తన అథిధికి తనకు వున్న దాంట్లో అన్నం పెట్టి సంతృప్తి పరచాలి. ఆ విధంగా నన్నే సంతృప్తి పరిచిన వారవుతారు. ఆట్లు కాక తన ఇంటికి వచ్చిన అథిధులకు అన్న పానీయాలు సమర్పించక వెనక్కి తిప్పి పంపినచో , ఆ యజమానులు అతి సంక్లిష్టమైన, పాపభూయిష్టమైన మరు జన్మలకు బాటలు వేసుకుంట్తునారు.

3. ఎవరైనా నీకు ఏ విధమైన హాని చేసిన వారికి ప్రతి చెటు చెయ్యవద్దు. నీ శక్తికి తగినట్లుగా సహనం ప్రదర్శించు. సహనం అన్ని గుణములలో కెల్లా అతి అమూల్యమైనది. సహనం ప్రదర్శించే వారంటే భగవంతుని కెంతో ఇష్టం.నీకు హాని చేసిన వారికి సైతం హాని తలపెట్టవద్దు. చేయగలిగితే మంచి మాత్రమే చెయ్యు.

4. నేనెప్పుడూ ఎవరిపైనా కోపించి ఎరుగను.తల్లి తన బిడ్దలనెక్కడైనా తరిమి వేయునా ? సముద్రం తనను చేరు నదులనెప్పుడైనా తిరుగగొట్టునా ? నేను మిమ్మల్నెందులకు నిరాకరించెదను ? నేనెప్పుడూ మీ యోగక్షేమములనే ఆపేక్షించెదను. నేను మీ సేవకుడను. నేనెప్పుడూ మీ వెంటనే వుండి పిలచిన పలికెదను. నేనెప్పుడూ కోరేది మీ ప్రేమను మాత్రమే !

5.నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంతనే నేనుండెదను. నా దేహము నిచ్చట వున్నప్పటికీ సప్త సముద్రముల ఆవల మీరు చేయుచున్న పనులు మాకు తెలియును. ప్రపంచమున మీ కిచ్చ వచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చేంతనే వుండెదను. నా నివాస స్థలము మీ హృదయము నమెద్ కలదు. నేని మీ శరీరములోనే వున్నాను. ఎల్లఫ్ఫుడు మీ హృదయములలోనూ, సర్వ ప్రాణుల హృదయములలోనూ గల నన్ను పూజింపుడు. ఏవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు. పావనులు, అదృష్టవంతులు.

6. నా సర్కారు వారి ఖజానా నిండుగా వున్నది. ఎవరికేది కావలసిన దానిని వారికి ఇవ్వగలను. కాని ఇచ్చే ముందు పుచ్చుకొను వారికి వారికి తగు యోగ్యత వుందా అని నేను పరీఖ్షించవలెను. కావున బ్రహ్మ జ్ఞానమును అభిలషించు ముందు మనము తగు అర్హత సాధించుకోవలెను.

7. ఊరకనే గ్రంధములను చదువుట వలన ప్రయోజనం లేదు. ఊత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనం. నీవు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారణ చెసి, అర్ధం చెసుకొని, ఆచరణలో పెట్టవలెను. గుర్వనుగ్రహం లేని ఉత్త పుస్తక జ్ఞానము రాణించదు.

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణమస్తు

Friday, 18 November 2016

శ్రీ సాయి దివ్య జ్ఞానామృతం – 22శ్రీ సాయి మిరీకర్ ను పాము కాటు నుండి తప్పించుట. :

ఖలియుగ దైవం , భక్తుల పాలిట ఆర్తత్రాయపరాయణుడుగా అశేష భక్త జనావళిచే పూజలందుకుంటున్న శ్రీ సాయినాధులు తనకు అనన్య చింతనతో సర్వశ్య శరణాగతి ఒనరించిన భక్తులను ఎళ్ళవేళలా రక్షన కవచం అందించి కాపాడుతుండెడివారు. తన భక్తునకు రాబోయే ఆపదలను ముందుగానే కనిపెట్టి, వారికి తగు రీతిన హెచ్చరికలు చేసి, అటు పిదప వారిని ఆ ఆపదలనుండి రక్షించి భక్తులపై తనకు గల అవాజ్యమైన ప్రేమను శ్రీ సాయినాధులు కనబరిచేవారు. అటువంటి ఒక లీలను ఈ క్రింద స్మరించుకుందాము.

బాబాకు కూర్మి భక్తుడైన సర్దార్ కాకా సాహెబ్ మిరీకర్ పుత్రుడైన బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గావ్ తాలూకాకు మామలతదారుగా వుండెవాడు. ఒకసారి అతను చితలీ గ్రామ పర్యటనకు పోతూ మధ్య మార్గంలో బాబాను దర్శించడానికి శిరిడీకి వచ్చి, మశీదుకు పోయి బాబాకు నమస్కరించాడు. బాబా అతనిని కుశల ప్రశ్నలు వేసి నీవు చాలా జాగ్రత్తగా వుండవలెను. నీవు ఇప్పుడు కూర్చున్న ప్రదేశం మన ద్వారకామయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చుంటారో వారిని ఆ తల్లి అన్ని కష్ట నష్టములనుండి కాపాడుతుంది.ఆమె ఒడినాశ్రయంచిన వారికి అన్ని చింతనలు దూరమౌతాయిఅని అన్నారు. అటు తర్వాత మిరీకర్ కు ఉదీనిచ్చి తన ఎడమ చేతిని మూసి కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగ వలెనుంచి నీకు ఆ పడవాటి వ్యక్తి తెలియునా ? అదే సర్పం. ఆతను మిక్కిలి భయంకరమైనవాడు. కాని మన ఆయీ (అమ్మ) బిడ్డలను అతనేం చెయ్యలేడు, నువ్వు క్షేమంగా వెళ్ళి లాభంగా రా !అని అన్నారు.

అక్కడున్నవారికి , మిరీకర్ తో సహా బాబా మాటలు బోధపడలేదు. బాబాను అడిగి తెలుసుకుందామని కుతూహలపడ్డారు గాని ఆయనను అడిగే ధైర్యం ఎవ్వరికీ లేకపోయింది.బాబా తర్వాత శ్యామాను పిలిచి బాలా సాహెబ్ తో చితలీకి వెళ్ళి ఆనందించమని చెప్పారు. బాలాసాహెబ్ శ్యామతో కలిసి బాబా వద్ద సెలవు తీసుకొని టాంగాలో బయల్దేరాడు. వారిద్దరూ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో చితలీ గ్రామం చేరారు.ఆఫీసులో పని చేసే వారు ఎవ్వరూ రానందున వారు ఆంజనేయాలయములో బస చేసారు. ఇద్దరూ భోజనాది కార్యక్రములను పూర్తి చేసుకొని ఆలయంలో ఒక మూల కూర్చోని మాట్లాడుకోసాగారు. చాప పైని కూర్చోని మిరీకర్ వార్తా పత్రిక చదువుకొంటుండగా మెల్లగా అతని అంగ వస్త్రముపై ఒక నల్లటి విష సర్పం చేరింది. అయితే దానినెవ్వరూ చూడలేదు. అటువంటి విష సర్పం కరిస్తే ఇక మరణమే శరణ్యం. దీని కాటుకు మందులు కూడా లేవు. విధి రాత ప్రకారం బాలాసాహెబ్ మిరీకర్ ఆ సమయంలో ఆ పాము కాటుకు మరణించవలిసి వుంది. కానీ మిరీకర్ బాబా భక్తుడు. పైగా ఈ ఆపద గురించి బాబా ఇంతకు ముందే మిరీకర్ కు చెప్పి వున్నారు. ఇక తన భక్తుడిని బాబా ఎలా రక్షించారో చూడండి. ఆ నల్లటి విష సర్పం నెమ్మదిగా బుస కొట్ట సాగింది. పడగను విప్పి మిరీకర్ ను కాటు వేయబోయేంతలో ఎక్కడో దూరంగా వున్న నౌకరు ఆ బుస ధ్వనిని విని దగ్గరగా వచ్చి, పామును చూసి పాము, పాముఅంటూ పెద్దగా కేకలు పెట్టాడు. బాలా సాహెబ్ , శ్యామా లిద్దరికీ ముచ్చెమటలు పోసాయి. గడ గడ వణకడం ప్రారంభించారు. ఆ నౌఖరు కర్రను తీసుకొని వచ్చాడు కానీ ఏం చెయ్యలేకపోయాడు. ఎందుకంటే ఆ సర్పం సరిగ్గా మిరీకర్ భుజంపై వుంది. ఆ గందరగోళానికి ఆ పాము మిరీకర్ భుజంపై నుండి దిగడం ప్రారంభించింది. పక్కకు వెళ్ళాక కర్రలతో ఆ పామును కొట్టి చంపేసారు. శ్రీ సాయినాధులు ఈ విధంగా తన భక్తునికి రాబోయే ఆపదను ముందుగానే హెచ్చరించి తద్వారా వానిని ఆ ఆపద నుండి కాపాడారు. తనను రక్షించి తనకు ఒక నూతన జీవితాన్ని ఇచ్చిన శ్రీ సాయికి మిరీకర్ వేన్నోళ్ళ కృతజ్ఞతలను అర్పించి ఆ నాటి నుండి శ్రీ సాయి యొక్క ఆరాధనను తీవ్ర తరం చేసాడు. అంతే కాక బాబానే తన సర్వస్వంగా భావించి తన జీవితానంతటినీ బాబా సేవకే అంకితం చేసాడు.

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణమస్తు

Wednesday, 16 November 2016

శ్రీ సాయి దివ్య జ్ఞానామృతం – 21శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో శ్రద్ధా భక్తులతో నాకు సర్వస్య శరణాగతి చేసి ఎవ్వరైనా పత్రం గాని, పుష్పం గాని, ఫలం గాని ఆఖరుకు నీరు గాని సమర్పించినచో దానిని నేను మిక్కిలి ప్రీతితో గ్రహించి వారిని ఆశీర్వదించెదనుఅని పలికి ఉన్నారు. కలియుగదైవం, సమర్ధ సద్గురువు, పరిశుద్ధ పరబ్రహ్మ అవతారం, సకల దేవతా స్వరూపి అయిన శ్రీ సాయి నాధులు ఆ ప్రభోధాన్ని తన భక్తులకు ఆచరణ పూర్వకంగా తన అద్భుతమైన లీలల ద్వారా చూపించారు. శ్రీ సాయినాదుల ప్రత్యేకత ఏమిటంటే తన భక్తుడేదైనా తనకు సమర్పించవలెననుకొని, ఏ కారణము చేతనైనా దానిని మరిచిపోతే , వారికి తగిన సంధర్భంలో ఆ విషయం జ్ఞాపకం చేసి, ఆ నివేదనను గ్రహించి వారిని బంధ విముక్తులను చేసేవారు. అట్టి లీలను ఈ క్రింద స్మరించుకుందాము.

రామ చంద్ర ఆత్మారాం తర్ఖడ్ అనువాడు తన యవ్వన దశలో ప్రార్ధనా సమాజస్థుడు, విగ్రహారాధన అంటే ఏ మాత్రం గిట్టని వాడు. కాని తర్వాత దశలో తనకు జరిగిన కొన్ని అద్భుతమైన అనుభవముల వలన బాబాకు ప్రియ భక్తుడైనాడు.అతని కుటుంబ సభ్యులు కూడా బాబాకు ప్రియ భక్తులే. ఒక సారి తల్లీ కొడుకులిద్దరు శిరిడీకి పోయి అక్కడ వేసవి సెలవలను గడుపవలెనని నిర్ణయించుకున్నారు. కాని కొడుకుకు మాత్రం ఈ ప్రయాణానికి మనస్పూర్తిగా ఇష్టపడలేదు. ఎందుకంటే తండ్రికి విగ్రహారాధన అంటే ఇష్టం లేదు. ఈ నెలరోజుల పాటు తన తండ్రి బాబా యొక్క పూజను సరిగ్గా చేయకపోవచ్చునని సంశయించాడు. కాని తాను తప్పక బాబా పూజను చేస్తానని తండ్రి వాగ్దానం చేయడంతో ఇరువురు శిరిడీకి బయలుదేరి వెళ్ళారు.

ఆ మరునాడు శనివారం తర్ఖడ్ తెల్లవారుజామునే నిద్ర లేచి, స్నానాది కార్యక్రమములను ముగించుకొని, బాబా వారి పూజను అతి శాస్త్రోక్తంగా చేసాడు. నైవేద్యంగా అర్పించిన కలకండను అందరికీ పంచిపెట్టాడు. ఈ విధంగా మూడు రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో తర్ఖడ్ బాబా వారి పూజను చేసాడు. కొడుకుకు వాగ్దానం చేసిన విధంగా పూజ జరుగుతున్నందుకు ఒక పక్క, బాబా వారికి భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వలన కలిగే అలౌకిక ఆనందం ను మరొక పక్క అనుభవిస్తూ సంతోషంగా వున్నాడు. ఒక మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నప్పుడు బాబా వారి సన్నిధిలో ప్రసాదం లేకపోవడం చూసాక అప్పుడు ఆనాటి ఉదయం పూజ చేసాక తాను నైవేద్యం అర్పించలేదన్న విషయం అతనికి జ్ఞాపకం వచ్చింది.వెంటనే తర్ఖడ్ లేచి బాబా వారి పటముకు సాష్టాంగ నమస్కారం చేసి నైవేద్యం సమర్పించనందుకు క్షమార్పణలు వేడుకున్నాడు. ఈ విషయాన్ని లేఖ రాసి బాబాను తన తరఫున క్షమార్పణలు వేడమని కోరుతూ శిరిడీ లో వున్న తన కొడుకుకు పంపించాడు.

అదే సమయంలో శిరిడీలోని బాబా వారికి హారతి కార్యక్రమము ప్రారంభమవబోతోంది.అప్పుడు బాబా తర్ఖడ్ గారి భార్యతో తల్లి ! నాకు ఆకలిగా వున్నందున ఎమైనా తిందామని బాంద్రాలో వున్న మీ ఇంటికి వెళ్ళాను. టలుపు తాళము వేసి వున్నా లోపలికి వెళ్ళి చూద్దును కదా అక్కడ తినుటకు ఏమియూ లేదుఅని అన్నారు.

తర్ఖడ్ భార్యకు బాబా వారి మాటలు ఎమీ అర్ధం కాలేదు కానీ ఆమె కొడుకుకు మాత్రం తన ఇంట్లో జరిగే బాబా పూజలో ఎవో లోటుపాట్లు జరిగినవని అర్ధం చేసుకొని వెంటనే తన ఇంటికి తిరిగి పోవుటకు ఆజ్ఞ ఇవ్వమని బాబాను వేడుకున్నాడు.అప్పుడు బాబా అతనితోఇంటికి పోనవసరం లేదు, ఆ పూజను నీవు ఇక్కడే చేయవచ్చునుఅని అన్నారు. బాబా వారు తనను క్షమించినందుకు ఆ అబ్బాయి ఎంతో సంతోషించి తన తండ్రికి ఒక ఘాటైన లేఖను వ్రాసి బాబా పూజను అసలేమాత్రం అశ్రద్ధ చేయవద్దని హెచ్చరించాడు. తండ్రీ కొడుకులు వ్రాసుకున్న ఉత్తరములు ఒకదానికొకటి దాటుకుంటూ మరొకరికి చేరుకున్నాయి.

విధముగా భక్తులెవరైనా బాబాకు సమర్పించాలని సంకల్పిస్తే బాబా వారి నుండి ఎదో విధంగా ఆ వస్తువును స్వీకరించి వారిని ఆశీర్వదించేవారు. లెనిచో భగవంతునికి మొక్కుకున్నాక, దానిని తీర్చకపోతే నిష్కృతి లేని పాపాల బారిన పడవలిసి వస్తుంది , తిరిగి ఆ పాప ఫలములను అనుభవించుటకు మనము మొరి కొన్ని జన్మలను ఎత్తవలిసివస్తుంది.ఈ విధంగా తన భక్తులకు సంధర్భోచితంగా సందేశానందించి వారిని పాపముల బారిన పడకుండా చేసే బాబా వారి కరుణ, దయ,ప్రేమ పూరిత వాత్సల్యములను మనము ఏ విధంగా కొనియాడగలం ?

శ్రీ సాయి భక్తులు సదా జ్ఞాపకం వుంచుకోవల్సిన దివ్యోపదేశం  

సర్వం బ్రూయాత్,ప్రియం బ్రూయాత్న బ్రూయాత్ సత్య మ ప్రియం . ఎల్లప్పుడు సత్యమునుమధురమైన మాటలను పలుకవలెనన్నది అర్యోక్తిఅప్రియ భాషణం అన్ని పాపాలలో కెల్లా నిష్కృతి లేనిది .పరుల నిందకఠోర భాషణం , మనసును గాయపరచు విధం గా ఆరోపణలు చేయడం నిషిద్ధంపరిహాసమునకైనా కఠోర భాషణం గావించడం అత్యం త పాపం .తూటాల వంటి వాగ్భాణాలు హృదయాన్ని చిధ్రం చేయును .మానవులలో సత్సంబంధాలను చిన్నా భిన్నం చేయునుప్రియ భాషణం తేనె వలే మధురమైనదిశత్రువులను సైతం దరికి చేర్చి సంబంధ బాంధవములను పటిష్టం చేయునుఎల్లవేళలా ప్రియ భాషణం గావించడం వాచిక తపస్సుఅన్ని తపస్సుల కంటే మేలైనదిమానవులను మహనీయులుగా మార్చునదికఠోర వచనములను పలికి దశరధుని మరణానికి కారకురాలైన కైకేయిరాయబారములో కృష్ణ భగవానుడిని తూలనాడి తన వంశ నాశకుడైన దుర్యోధన సార్వభౌముల కధలుసదా కావాలి మనకు స్పూర్తి దాయకంకఠోర వచనములను సర్వదా తృజించడం శ్రేయస్కరం.

లోకాస్సమస్తా సుఖినోభవంతు :
సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణమస్తు

Saturday, 12 November 2016

శ్రీ సాయి దివ్య జ్ఞానామృతం – 20ఈ కలియుగం పాపభూయిష్టమైన యుగం. మానవులు అనుక్షణం తెలిసో తెలియకో మనసా, వాచా , కర్మణా ఎన్నో పాపాలను చేస్తుంటారు. నాటిన విత్తనపు పంటే మనకు లభిస్తుందని వీరు ఈ జన్మలో చేసే పాపాలను ఇక్కడే అనుభవించవలిసి వుంటుంది అన్నది ఆర్యోక్తి. ఒక వేళ పాప నిష్కృత్తి కాని పక్షంలో తిరిగి మరొక జన్మ ఎత్తి మిగిలిన పాపాలను మనమే అనుభవిస్తాము.అందువలన మంచి జన్మ కోసం ఇప్పుడే రంగం సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా మానవుడు తాను చేసే కర్మల వలన జనన మరణ చక్ర భ్రమణంలో చిక్కుకొని అవ్యక్తమైన ఆనందానికి ఆవాసమైన ఆ భగవంతుని సన్నిధికి శశ్వతంగా దూరమౌతున్నాడు. అందుకే ముందు ముందు మంచి జన్మలు ఎత్తాలంటే ఇప్పుడు సత్కర్మలు చేయవలిసి వుంటుంది. ఒక వేళ సర్వ సమర్ధుడైన గురువు మనకు లభిస్తే ఆ గురువుకు సర్వస్య శరణాగతి ఒనరించి, భక్తి శ్రద్ధలతో సేవించి , ఆయన అపూర్వమైన అనుగ్రహానికి పాత్రులము కాగలిగితే ఆ సద్గురువు మన కర్మ ఫలాన్ని తాను స్వీకరించి మనల్ని కర్మ ఫలం నుండి బంధ విముక్తులను చేస్తారు. కాని ఈ కలియుగంలో ఇది బహు అరుదైన విషయం. ఎందుకంటే అనుక్షణం సంశయాత్మక ధోరణిలో ఆలోచిస్తూ వ్యవహారిక ప్రపంచంలో జీవించే మనకు ఆ గురువును అవ్యభిచారిణీ భక్తితో సేవించడం కడు దుర్లభం. అందుకూ మనవంటి సాధారణ భక్తులకు కష్టాలను, సమస్యలను రప్పించి కర్మ ఫలాన్ని అనుభవిం పజేసి తద్వారా మనలను మన సద్గురువులు బంధవిముక్తులను చేస్తుంటారు. భగవంతుడిచ్చిన ఈ అమూల్యమైన జీవితాన్ని బలవంతంగా ముగింపజేసుకొని తద్వారా కర్మఫలం నుండి తప్పించుకోజూసిన ఒక భక్తుని రక్షింపజేసి వానికి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించిన వైనం ఇప్పుడు మనం చూద్దాం.

మహారాష్ట్రలోని పూనే నివాసి అయిన గోపాల నారాయణ అంబాడేకర్ గారు బాబా భక్తుడు. అబ్కారీ సంస్థలో 10 సంలు, తర్వాత ఠాణా జిల్లాలో, జవ్వార్ ఎస్టేట్ లోను ఉద్యోగములను చేసాడు.ఈ ఉద్యోగముల్వీ తనకు సంతృప్తి నివ్వలేదు మరియూ అందు వచ్చే తక్కువ జీతముతో తన కుటుంబమును పోషించుకోవడం చాలా కష్టమయ్యేది. ఆతను ప్రతీ సంవత్సరం శిరిడీకి పోయి బాబాను దర్శించుకొని తన కష్టాలను విన్నవించుకొని తనకు ఒక మంచి ఉద్యోగం ఇప్పించవల్సిందిగా హృదయపూర్వకంగా ప్రార్ధించేవాడు. బాబా అతని ప్రార్ధనలను విని మౌనంగా వుండేవారు. బహుశా గత మరియు ప్రస్తుత జన్మల పాప ఫలములను అతని చేత అనుభవింపజేయడమే బాబా ఉద్దేశ్యం కావచ్చు.1916 వ సంలో అంబాడేకర్ యొక్క పరిస్థితి బాగా దిగజారిపోయింది. అతడు భార్యతో కలిసి శిరిడీకి వచ్చి కొన్ని నెలల పాటు వుండి బాబా సేవ తీవ్రతరం చేసాడు. ఒకరోజున అతను రాత్రి వేళ ఒక ఎడ్ల బండిపై కూర్చోని పక్కనే వున్న నూతిలో పడి ప్రాణ త్యాగం చేయ నిశ్చయించుకున్నాడు. ఆఖరు దశలో బాబా నామ జపం చేసుకుంటుండగా ఆ ఊరిలో వున్న ఒక హోటల్ యజమాని, బాబాకు గొప్ప భక్తుడైన సగుణ మేరు నాయక్ అతని వద్దకు హఠాత్తుగా వచ్చి అక్కల్కోట్ మహారాజ్ గారి చరిత్రను చదవమని చెప్పి పుస్తకాన్ని అంబాడేకర్ కు ఇచ్చాడు. అంబాడేకర్ ఆ పుస్తకాన్ని అనాలోచితంగా తెరువగా ఒక కధ వచ్చింది. అక్కల్కోట మహారాజు అయిన స్వామి సమర్ధ కాలములో ఒక భక్తుడు బాగు అవని ఒక విచిత్ర వ్యాధితో బాధపడుతుండేవాడు. ఏన్ని వైద్యాలు చేయించుకున్నా అని నిష్ప్రయోజనమయ్యాయి.ఇక తాను పడే బాధలను సహించలేక ఆ భక్తుడు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్దాడు. వెంతనే స్వామి సమర్ధ ప్రత్యక్షమై ఆ భక్తుని రక్షించి గత జన్మ యొక్క పాపపుణ్యములను నీవే అనుభవించక తప్పదు. ఖర్మను అనుభవించక ప్రాణ త్యాగము చేసినచో మిగిలిన కర్మ ఫలితాన్ని అనుభవించుటకు నీవు మరొక జన్మను ఎత్తవలిసి వుంటుంది. ప్రాణత్యాగం చాలా పాపము. ఆది బ్రహ్మ హత్యతో సమానంఅని హిత బోధ చేసారు.

సమయొఛితంగా వున్న ఈ కధను చదవగానే అంబాడేకర్ కు వెంటనే జ్ఞానోదయమయ్యింది.బాబా తనకు ఏ విధంగా ఉపదేసమునందించి తన జీవితాన్ని కాపాడారో గుర్తించాక మనస్సు బాబా పట్ల భక్తితో నిండిపోయింది. కళ్ళు ఆనందబాష్పాలతో చెమర్చాయి. ఆ రోజు నుండి బాబా యొక్క సేవను , ఆరాధనను మరింత హెచ్చించాడు. ఆటుతర్వాత బాబా అతనిని జ్యోతిష్యమును చదవమని సలహా ఇచ్చారు. బాబా సలహాను అనుసరించి అంబాడేకర్ జ్యోతిష్య శాస్త్రమును చదివి, అందులో ప్రావీణ్యం సంపాదించి తద్వారా తన పరిస్థితి బాగు చేసుకున్నాడు. అచిరకాలంలోనే అంతులేని సిరిసంపదలు అంబాడేకర్ గారి వశమయ్యాయి. సంపదలతో పాటే అతనికి బాబా యందు భక్తి శ్రద్ధలు కూడా పెరిగాయి.

కష్ట నష్టములు, ఆందొళనలు, సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా మన సద్గురువు యందు నమ్మకం, విశ్వాసం రవ్వంత కూదా సడలకూడదని , ఎంత భక్తి శ్రద్ధలతో , బాబా ప్రభోదించిన శ్రద్ధ, సబూరిలతో ఆ సద్గురువును కొలుస్తూ సాధన చేస్తే అంత త్వరగా మనము ఆ సద్గురువు యొక్క కరుణా కటాక్షములకు పాత్రులమౌతామని,తద్వారా మని అన్ని కష్టములు శాశ్వతంగా దూరమౌతాయని ఈ లీల ద్వారా మనకు అవగతమౌతొంది.

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణమస్తు

Thursday, 10 November 2016

శ్రీ సాయి దివ్య జ్ఞానామృతం – 19అఖిలాండకొటి బ్రహ్మాండ నాయకుడు , రాజాధిరాజు, యోగిరాజు, పరిశుద్ధ పరమేశ్వర స్వరూపం అయిన శ్రీ సాయినాధులు తనను నమ్ముకున్న భక్తులకు ఎళ్ళవేళలా రక్షణ కవచం అందించి కాపాడడమే కాక, వారికి తగు రీతిన బోధలను చేసి వారికి అధ్యాత్మిక జాగృతిని కలిగించేవారు. శ్రీ సాయినాదుని అపూర్వమైన కరుణా కటాక్షములకు పాత్రులైన వారు ఇక జీవితంలో దేని గురించి చింతించనవసరం లేదు.నిత్యం తిండి , గూడు, వస్త్రాల కోసం అసలేమాత్రం పరుగులు తీయనవసరం లేదు. అడిగిన వాటిని మాత్రమే ప్రసాదించే కామధేనువు, కల్పవృక్షం కంటే అడుగకనే అన్నీ ప్రసాదించే శ్రీ సాయినాధులు ఎంతో మిన్న. ఈ కలియుగంలో అనేక విధములైన పాపాలను చేస్తూ, వివిధ రకములైన సమస్యలతో , ఆందోళనలతో నిత్యం సతమత మయ్యే మానవాళికి వారి కష్టాలు, కన్నీళ్ళు, చింతనలు దూరం కావడానికి శ్రీ సాయి పాదాలను శరణు వేడడమే అతి సులభమైన పరిష్కారం. అటువంటి మార్గంలో ప్రయాణించి , శ్రీ సాయి కృపకు పాత్రృలైన ఖపర్డే దంపతుల వృత్తాంతము గూర్చి ఇప్పుడు తెలుసుకుందాము.

అమరావతి నగరంలో దాదా సాహెబ్ ఖపర్డే అనే ఒక గొప్ప లాయర్ వుండే వాడు. ఆతను గొప్ప ధనవంతుడు, అధ్భ్జుతమైన తెలివితేటలు గలవాడు, ఎటువంటి క్లిష్టమైన కేసులనైనా వాదించి గెలవగల సమర్ధుడు. బాలగంగాధర్ తిలక్ కు ప్రియమైన శిష్యుడు. అంతకంటే ఎక్కువగా బాబా కు కూర్మి భక్తుడు. బాబా యూక్క అనేకమంది భక్తులు బాబాతో తరచుగా వాదులాడేవారు, కాని బ్రహ్మజ్ఞాని అయిన బాబా సమక్షంలో ఖపర్డే నోరు మెదిపేవాడు కాదు.అనేక వేద శాస్త్రాలను పారాయణ చెసి, పంచదశి వంటి అధ్భుతమైన గ్రంధాలను ఇతరులకు బోధించె ఖపర్డే బాబా యొక్క అవతార వైశిష్టం గ్రహించినవాడు కావున ఆయన ముందు నోరెత్తడానికి సాహసించేవాడు కాదు. ఆసలైన భక్తుడు ఎలా ప్రవర్తించాలో ఖపర్డే ఆచరణ పూర్వకంగా చూపించాడు. ఖపర్డే యొక్క భార్య బాబాను దర్శించుకుందామని శిరిడీకి వచ్చి అక్కడ ఏడు నెలలు వుంది. ఆమెకు బాబా యందు విశేషమైన భక్తి శ్రద్ధలు వున్నాయి. ఫ్రతి రోజూ, తన చేతుల మీదుగా వండిన ఆహారమును నైవేద్యం కోసం మశీదుకు తీసుకు వస్తుండేది. బాబా దానిని స్వీకరించి, పావనం చేసిన తరువాత మాత్రమే ఆమె భోజనం చేస్తుండేది. అటు సూర్యుడు ఇటు పొడవవచ్చునేమో గాని ఖాప్రడే గారి భార్య మాత్రం తన క్రమం తప్పేది కాదు. బాబాకు ఆమె యొక్క భక్తి శ్రద్ధలను చూసి సంతోషించి, ఆమె యొక్క నిలకడ భక్తిని ఇతర భక్తులకు భోధించ సంకల్పించారు.

ఒకనాడు యధావిధిగా ఖపర్డే గారి భార్య మధ్యాహ్న భోజన సమయంలో ఒక పళ్ళెంలో ఆహార పధార్ధాలను తీసుకు వచ్చి బాబా ముందు పెట్టి చేతులు జోడించి నిలబడింది. ఇతర భక్తులతో మాట్లాడుతున్న బాబా వెంటనే ఆ పళ్ళెమును అందుకొని అందు పధార్ధములను త్వర త్వరగా తిననారంభించారు. ఈ దృశ్యాన్ని చూసిన ఇతర భక్తులు విస్మయానికి లోనయ్యారు.బాబా యొక్క ముఖ్య భక్తుడైన శ్యామా బాబాతో " ఓ దేవా ! ఈ రోజున ఎందుకు ఈ విధంగా పక్షపాత వైఖరిని చూపిస్తున్నావు ? ఇతరుల పళ్ళెములను చూడనైనా చూడకుండా అవతలికి నెట్టి వేస్తావు, కాని ఈమె తెచ్చిన భోజనమును ఎందుకంత ప్రేమతొ అతృతతో తినుచున్నావు ? “ అని అడిగాడు. అప్పుడు బాబా అక్కడున్న వారందరితో ఛూడండి నాయనలారా ! ఈ భోజనం నిజానికి చాలా అమూల్యమైనది. గత జన్మలో ఈమె ఓక వర్తకుని ఇంట్లో ఆవుగా జన్మించింది. ఆ ఆవు ఇచ్చే పాలతో ఆ వర్తకుడు నా పూజాది కార్యక్రమములను బహు చక్కగా నిర్వర్తించేవాడు. తదుపరి జన్మలో ఈమె ఒక తోటమాలి, ఆ పై జన్మలో ఒక క్షత్రియుని ఇంట్లొ జన్మించి ఒక భాగ్యవంతుడైన, నా భక్తుడైన వర్తకుడిని వివాహమాడింది. తరువాత ఇప్పుడు ఒక బ్రాహ్మణుని ఇంట్లో జన్మించింది నా యొక్క మరొక భక్తుని వివాహమాడింది. చాలా జన్మల తరువాత ఈమెను చూస్తున్నాను కాబట్టి ఆమెపై ఎనలేని ప్రేమతో ఆమె తెచ్చిన అన్నమును తింటున్నాను. ఇంకా ప్రేమమయమైన కొన్ని ముద్దలను తిననివ్వండి.అంటూ బాబా గారు త్వర త్వరగా ఆ పళ్ళెమును ఖాళీ చేసారు. నొరు, చేతులు కడుగుకొని, తిరిగి తన గద్దెపై కూర్చోని ఖపర్డే భర్యను దగ్గరకు రమ్మని పిలిచారు. ఆమె అంత బాబా దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళను వత్తసాగింది. ఆమె యొక్క యధార్ధమైన ప్రేమకు బాబా సంతోషించి ఆమెతో మెల్లగా నువ్వు ఇకపై రాజారాం అనే మంత్రాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ వుండు.నీవు ఈ సాధనను చేసినచో నీ జీవితాశయమును పొందుతావు. నీ మనస్సు, చిత్తము శాంతిస్తాయి.అని అన్నారు. అదియే శక్తిపాతము. బాబా తన శిష్యులకు ఆద్యాత్మిక జాగృతిని కలిగించే విధానము. ఈ యోగ ప్రక్రియ ద్వారా తన శక్తిని సాధకుని సహస్రార చక్రం నుండి శరీరం లోనికి పంపించి కుండలినీ జాగృతిని కలిగిస్తారు. తద్వారా సాధకుని చిత్తమంతయూ శాంతించి క్షణాలలో అతి దుర్లభమైన ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. బాబా చెప్పిన విధంగా ఖపర్డే భార్య ఆ మంత్రాన్ని జపిస్తూ ,అనుక్షణం బాబా నామ స్మరణతో, బాబాయొక్క పూజాది కార్యక్రమాలను నిర్వర్తిస్తూ, అద్భుతమైన అధ్యాత్మిక అనుభవములను పోంది చివరకు బాబాలో ఐక్యమయ్యింది. దీనిని బట్టి బాబాకు తన భక్తుల పూర్వ జన్మల గురించి అన్ని తెలుసుననీ, క్రితం జన్మలో తన భక్తులైనవారిని ఈ జన్మలో అతి చాకచక్యంగా తగిన అనుకూల పరిస్థితులను కల్పించి తన వద్దకు లాగుకొని వస్తారని అర్ధమౌతోంది. ఆ భగవంతునికి తప్ప సాధారణ యోగులకు ఇది సాధ్యమా ? బాబా సాక్షాత్తు ఈ సృష్టికి మూలమైన భగవంతుడనడానికి ఇంతకంటే వెరే ఆధారాలు ఇంకా ఏం కావాలి ? బాబా పై మన భావం ఎంత విశాలంగా వుంటుందో ఫలితం కూదా అంతే విశాలంగా వుంటుంది. ఒక సాధారణ గృహస్తు స్త్రీని తన వద్దకు రప్పించుకొని, తగు రీతిన ఆధ్యాత్మిక బోధలను చేసి, శక్తిపాతం గావించి, మిగితా జీవితమంతా సాధనలు చేయించి చివరకు ఆమెకు ముక్తిని ప్రసాదించిన వైనం అత్యధ్భుతం, అపూర్వం.

ఈ లీలను భక్తి తో పఠించిన వారికి ఆ సాయినాధుని అపూర్వమైన కరుణా కటాక్షములు లభిస్తాయని మనసారా కాంక్షిస్తున్నాము.

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణమస్తు