Friday, 21 October 2016

జ్ఞానామృతం – 13దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మసంస్థాపన ల కోసం పంంధొమిదో శతాబ్దం లో ఈ భువిపై వెలసిన సమర్ధ సద్గురువు శ్రీ సాయినాధులు. తనను మనస్పూర్తిగా విశ్వసించిన తన భక్తులకు ఎళ్ళవేళలా వెన్నంటి వుండి వారికి తన అమూల్యమైన, అభేఢ్యమైన రక్షణ కవచం అందించడమే కాక, తన బోధలతో, ఉపదేశములతో వారిలో పరివర్తన గావించి , సన్మార్గంలో నడిపించే అద్భుతమైన దైవం శ్రీ సాయి. శ్రీ సాయిని నమ్మైన లక్షలాది మంది ఈనాటికీ సుఖ సంతోషాలతో, అయు: ఆరోగ్యాలతో జీవిస్తున్నారు. శ్రీ సాయి తన భక్తులను రక్షించి, వారి సమస్యనను, చింతలను, దూరం చేసే పద్ధతి చాలా విచిత్రమైనది. ఆది ఏ సాంప్రదాయాలకు, మతాలకు చెందనిది.అటువంటి ఒక విచిత్రమైన లీలను ఇప్పుడు స్మరించుకుందాము.

శ్రీ సాయికి అత్యంత సన్నిహిత , ముఖ్యమైన భక్తుడైన బాపూసాహెబ్ బూటీ ఒకసారి జిగట ఇరోచనముల వలన తీవ్రంగా బాధపడ్డాడు. స్వతాహాగా ధనవంతుడవడం వలన ఎందరో ప్రసిద్ధులైన డాక్టర్లకు చూపించుకొని వారిచ్చిన మందులను వాడాడు కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. కొద్ది రోజులలోనే బూటీ బాగా నీరసించిపోయాడు. కదల లేకపోవాడం వలన శ్రీ సాయి దర్శనానికై మశీదుకు పోలేకపోయాడు. అప్పుడు బాబా అతనిని మశీదుకు రమ్మని కబురు పంపించి, బూటీ రగానే తన ముందు కూర్చోబెట్టుకొని తన చూపుడు వేలు ఆడించుచూ తస్మాత్ జాగ్రత్త ! నీవిక విరేచనములను చేయకూడదు అని దృఢంగా పలికారు. అఖిలాంఢకోటి బ్రహ్మాండ నాయకుడు రాజాధి రాజు అయిన బాబా ఆ మాటలను అనగానే వెంటనే విరేచనాలు ఆగిపోయాయి. గొప్ప గొప్ప దాక్టర్లు, విలువైన మందులు కుదర్చలేని జబ్బును ఆ మహానుభావుడు కేవలం తన మాటలతో కుదిర్చిన వైనం అత్యంత విశిష్టమైనది.

మరొక సంధర్బంలో బూటీకి కలరా వ్యాధి సోకింది.ఒక రోజులోనే తీవ్రంగా నీరసించిపోయాడు. ఏ విధమైన ఆహారాన్ని, కనీసం నీరును కుడా తాగలేకపోయాడు.బూటీకి సన్నిహితుడైన దాక్టర్ పిళ్ళై తన వద్ద వున్న ఔషఢములనింటినీ ప్రయత్నించాడు కానీ అవి కొద్దిపాటి ఉపశమనాన్ని కూడా ఇవ్వలేకపోయాయి. అప్పుడు బూటీ మశీదుకు వెళ్ళి బాబా కాళ్ళపై పడి తన వ్యాధిని తగ్గించమని ప్రాధేయపడ్దాడు. అప్పుడు శ్రీ సాయి బాదాము పప్పు, పిస్తా,అక్రోటులను బాగా నానబెట్టి, పాలు, చక్కెరలో ఉడికించి సేవించమని చేప్పారు.ఆ మాటలను విన్న వారందరూ ఎంతగానో ఆశ్చర్య పోయారు.ఎందుకంటే వైద్య శస్త్రం ప్రకారం ఈ మిశ్రమాన్ని సేవిస్తే జబ్బు మరింత తీవ్రమై చివరకు ప్రాణాలకే ముప్పు కలుగవచ్చును. కానీ బూటీ బాబా ఆజ్ఞను శిరసావహించి ఆ మిశ్రమాన్ని సేవించాడు. చిత్రాతి చిత్రంగా బూటీ యొక్క కలరా వ్యాధి కొద్ది గంటలలో నే తగ్గిపోయి అతనికి పూర్తి స్వస్థత చేకూరింది.

ఈ విధంగా వైద్య విజ్ఞాన శాస్త్రాలన్నింటికీ విరుద్ధంగా బాబా తనదైన ప్రత్యేక శైలిలో తన భక్తుల రోగాలను తగ్గించివేసారు. ఇందులో మనం గ్రహించవలసింది ఏమిటంటే బాబా మాటలే ఈ ప్రకృతి అంతటికీ శిరోధార్యం.బాబా పలుకులే వేద, విజ్ఞాన శాస్త్రాలు.సాంప్రదాయములు, ఆచార వ్యవహారములు, మంత్ర శక్తులు ,వైద్య విధానములు అన్నీ బాబా యొక్క అపూర్వమైన యోగ శక్తి ముందు దిగదుడుపే !బాబా అజ్ఞలను శిరసా వహించువారికి ఆయన యొక్క అనుగ్రహ , కరుణా కటాక్షములు లభ్యమై జీవితం ఆనందంగా, సాఫిగా సాగిపోతుంది.
శ్రీ సాయి భక్తులు సదా జ్ఞాపకం వుంచుకోవల్సిన దివ్యోపదేశం  :

ఆత్మ విమర్శ ప్రతి మానవుడు అలవర్చుకోవల్సిన సద్గుణం. తన లోని దోషాలను దర్శించుకొని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చిత్త శుద్ధితో ఒనరించడం అత్యావశ్యకం. ఆత్మ విమర్శ వలన ఇతరులను విమర్శించుట, వారి యందు దుర్గుణాలను చూచి అనుచిత మైన వ్యాఖ్యలను చేయుట, ఇతాది అవలక్షణములు నశించిపోవును. హృదయం పరిశుద్ధం అగును. సర్వ వ్యాపకత, సర్వ జీవ సమానత్వం,అనుభవించుట సాధ్యమగును. అహంకారాది దోషాలు నశించి మానవీయ స్వభావం పెంపొందును. పూర్ణ దైవత్వ సిద్ధి సాధ్యం. తన దినచర్యలో భాగం గా ప్రార్ధనతో సహితం గా ఆత్మ విమర్శ విధిగా చేయు మహా ఋషుల  జీవన విధానం మనకు ఆదర్శం.

Tuesday, 18 October 2016

జ్ఞానామృతం – 12శ్రీకృష్ణుడు భగవద్గీతలో తనకు అర్పించకుండా భుజించిన ఆహారము పాపభూయిష్టమైనదని , అందువలన నిష్కృతి లేని పాపాలను మూటగట్టుకుందురని . అదేవిధంగా భగవంతునికి అర్పించి, పావనం చేసిన పిమ్మట తీసుకున్న ఆహారం అమృతతుల్యమని అందువలన జీవునకు ఇహం లోనూ , పరం లోనూ శ్రేయస్సు కలుగుతుంగని సెలవిచ్చి ఉన్నారు. ఈ గీతా సారాన్ని కలియుగ దైవం , భక్తుల పాలిటి కల్పవృక్షం అయిన శ్రీసాయినాధులు తనదైన రీతిలో భక్తులకు బోధించారు. ఆ లీలను ఇప్పుడు స్మరించుకుందాము.

శిరిడీలో ప్రతీ ఆదివారం సంత జరిగేది. చుట్టు పక్కల గ్రామాలనుండి ప్రజలు వచ్చి ఆ వారానికి కావలసిన సరుకులను కొనుకొని తిరిగి వెళ్ళిపోయేవారు.వెళ్ళెముందు వారు మశీదుకు వచ్చి సాయిని దర్శించుకోవడం ఒక అలవాటు. ఒక ఆదివారం ఎప్పటివలెనే మశిదు కిక్కిరిసిపోయి వున్నాది.

హేమాద్రిపంత్ బాబా ముందు కూర్చోని ఆయన పాదములను ఒత్తుతూ మనస్సులో నామజపం చేసుకుంటున్నాడు. బాబా గారి ఎడమవైపున శ్యామా, కుడివైపున బూటీ, కాకా దీక్షిత్ కుడా కూర్చోని వున్నారు. అప్పుడు శ్యామ నవ్వుతూ, " హేమాద్రిపంత్ జీ, నీ కోటుకు శనగ గింజలు అంటినవి చూడు " అని అన్నాడు. అంతే కాక హేమాద్రిపంత్ చొక్కా చేతులను తట్టగా కొన్ని శనగ గింజలు రాలిపడ్డయి.హేమాద్పంత్ వెంటనె తన చేతులను ముందుకు చాచగే మరి కొన్ని శనగపు గింజలు రాలి పడ్దాయి.

ఈ సంఘటనకు అందరూ ఆశ్చర్యపడ్డారు. శనగలు చోక్కా చేతుల లోపలకు ఎలా ప్రవేశించాయో ఎవరికి తోచినట్లు వారు ఊహించనారంభించారు. అప్పుడు శ్రీసాయి కల్పించుకొని " ఆ హేమాద్పంతుకు తాను తిన్నప్పుడు ఇంక ఎవ్వరికీ పెట్టని దుర్గుణము వున్నాది. ఈ రోజు సంతలో శనగలు కొని తానొక్కాడే తంటూ ఇకడికి వచ్చాడు" అని అన్నారు. సాయి మాటలకు హేమాడ్పంతు ఒకింత ఆశ్చర్య పడి " బాబా ! నేనెప్పుడూ దేనినీ ఒంటరిగా తిని ఎరుగను. ఈ రోజు దాకా శిరిడీ లోని సంత ఎక్కడ జరుగుతుందో కూడా నాకు తెలియదు.ఈ రోజు కూడా నేను సంతకు వెళ్ళలేదు, అయినప్పుడు నేను శనగలు ఎలా కొని వుండగలను ?నా దగ్గర ఏ వస్తువైనా వున్నప్పుడు దానిని దగ్గర వున్నవారికి పంచి ఇవ్వకుండా నేనొక్కడినీ తినే అలవాటు నాకు లేదు. అటువంటప్పుడు ఈ దుర్గుణమును , అభాండమును ఏల నాపై మోపెదవు ? " అని అడిగాడు.అప్పుడు సాయి చిరునవ్వుతో " భావూ (తమ్ముడా !)దగ్గర వున్నప్పుడు ఇంకొకరికి పంచి ఇస్తావు కానీ ఎవరూ లేన్నప్పుడు ఏం చేస్తావు? తినెటప్పుడు కనీసం నన్ను స్మరిస్తావా ?నేనెల్లప్పుడు నీ చెంత లేనా ?నీవేదైనా తిన్నేటప్పుడు నాకు అర్పిస్తున్నావా ?" ఆ మాటలకు హేమాద్పంత్ ముఖం చిన్నబోయింది. బాబా మాటలలోని అర్ధం అక్కడు కూర్చున్న వారందరికీ అవగతమై అందరి అజ్ఞానం పటాపంచలు అయ్యి జ్ఞానోదయం అయ్యింది.

హేమాద్పంత్ శనగలు తినుటను ఆసరాగా చేసుకొని శ్రీ సాయి ఒక అద్భుతమైన, అపూర్వమైన బోధను చేసారు.మనస్సు, బుద్ధి పంచేంద్రియముల కంటే ముందుగా విషయములను అనుభవిస్తాయి, కనుక మమము ముందే ఏ విషయానైననూ భగవదర్పితం చేయాలి.అప్పుడు మనకు ఆ విషయములందు అభిమానము అదృశ్యమైపోతుంది.విషయములను అనుభవించే మూందు బాబా మన చెంతనే వున్నట్లు భావించినచో ఆ వస్తువును మనము అనుభవించవచ్చునా లేదా అన్న ప్రశ్న ఉదయించి తద్వారా వైరాగ్యం, వివేకము ఉదయిస్తాయి. అధ్యాత్మిక జీవితంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి.మనము మన సద్గురువును లేదా ఇష్ట దైవమును స్మరించనిదే ఏ పనినీ చేయరాదు. మనస్సును ఈ విధముగా క్రమశిక్షణతో వుంచినట్లయితే శ్రీఘ్రమే ఆ సద్గురువు యొక్క అపూర్వమైన,అత్యద్భుతమైన కరుణా కటాక్షాలకు పాత్రులమవుతాము.

శ్రీ సాయి చేసిన ఈ భోధనామృతమును మనసారా వంటబట్టించుకొని భక్తులందరూ తమ తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళారు.
శ్రీ సాయి భక్తులు సదా జ్ఞాపకం వుంచుకోవల్సిన దివ్యోపదేశం :

నలుగురి కొరకు జీవించడం, నలుగురి క్షేమం ఎల్లవాళలా కాంక్షించడం, సదా భగవన్నామస్మరణ చేయడం శ్రీ సాయి భక్తుల ముఖ్య కర్తవ్యం.  తమకు ఒక ఉనికి కల్పించిన ఈ సమాజం యొక్క ఋణం ఏదో ఒక రూపేణా తీర్చుకోవడం ఎంతో అవసరం. కష్టాల కల్లోలం చుట్టుముట్టినప్పుడుభగవంతుడు జ్ఞప్తికి వచ్చుట తీవ్రమైన వేదనతో   కష్ట నష్టములను  దూరమొనర్చమని కోరికల మూటతో ప్రార్ధన గావించడం, అనంతరం భగవంతుడిని మరచుట మానవ నైజం. సుఖముల పానుపుపై తేలియాడే సమయమందు భగవంతుడిని జ్ఞప్తికి చేసుకోవడం బహు అరుదైన విషయం. స్వార్ధపు చింతనతో కోర్కెల మూటతో చేయు ప్రార్ధనలు ఆ సర్వేశ్వరుడిని చేరలేవు. చిత్త శుద్ధి లేని శివ పూజ ఫలించదు. భగవంతుడిని కష్ట నష్టములను తీర్చెడి యంత్రము వలే భావించే నేటి తరం మానవునికి  భక్తి, ముక్తి, మోక్షం అసాధ్యం. అనుక్షణం భగవంతుడిని జ్ఞప్తికి తెచ్చుకొని ఆయన అనుగ్రహ ఫలం వర్షించని క్షణం  వ్యర్ధమని తలుస్తూ కష్ట సుఖములను  ఆయన పవిత్ర ప్రసాదము గా భావించి ఆనందం గా యధాతధముగా స్వీకరించడమే  నిస్వార్ధ , నిష్కల్మష భక్తుల తత్వం, రక్తి, విరక్తి అను నవి భక్తికి కారణములేసుఖములలో మునిగి భగవంతుడిని విస్మరించుట , కష్టములు ఎదురైనప్పుడు నిందించుట కూడని పనులు. ఈ పాపములకెన్నడూ నిష్కృతి లేదు.

Monday, 17 October 2016

జ్ఞానామృతం – 11ఓం శ్రీ సాయి భక్త జన ప్రియాయ నమ:
ఓం శ్రీ సాయి సర్వ వ్యాధి నివారకాయ నమ:
ఓం శ్రీ సాయి కృపానిధయే నమ:
ఓం శ్రీ సాయి పరమాత్మనే నమ:
ఓం శ్రీ సాయి మహా సేవ జనకాయ నమ:

ఈ కలియుగంలో  మనము ప్రతీ క్షణం తెలిసో, తెలియకో ఎన్నొ పాపాలను చేస్తూ వుంటాం. ధనార్జనే పరమావధిగా బ్రతికే మానవునికి తన దైనందిన జీవితంలో దైవానికి, గురువుకు స్థానం లేకుండా చేసేసుకున్నాడు. తత్ఫలితంగా ఎన్నొ సమస్యలకు, అశాంతికి, ఆందొళనలకు గురవుతున్నాడు. కాని గురువుకు సర్వస్య శరణాగతి చేసిన వారు మాత్రం ఆ గురువు యొక్క అపూర్వ కరుణా కటాక్షాలకు పాత్రులగుతూ ఎంతో సంతోషకరమైన జీవితం అనుభవిస్తున్నారు. అంటే దీనర్ధం గురువు భక్తులకు చింతలు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు వుండవని కాదు.కల్లోల కడలిలో క్రుంగిపోతున్నా , తన భక్తులను ఆ గురువే వచ్చి రక్షించి, వారిని ఈ సంసారమనే కడలి నుండి సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తాడు. ఆ సద్గురువును నమ్ముకున్న వారు మరింక ఏ విషయం గురించి ఆలోచించనవసరం లేదు. హాయిగా తమ బరువు బాధ్యతలను ఆ సద్గురువు పాదాలకు అప్పగించి నిశ్చింతగా వుండవచ్చు.ఈ సత్యాన్ని గ్రహించిన వారు ధన్యులు. మిగితా వారు మాత్రం అనుక్షణం ఆ బరువు బాధ్యతలను మోయలేక మోస్తూ, కృంగిపోతూవుంటారు.

ఈ కలియుగంలో ఆ సద్గురువుకు సర్వస్య శరణాగతి చెయ్యడమే సాధనమని తెలుసుకున్నాము కదా ! అట్లే సద్గురువు యొక్క బోధలే మనకు వేద శాస్త్రాలు.ఆయన చెప్పిన మార్గమే మనకు అనుసరణీయం.తన భక్తులకు సమర్ధ సద్గురువైన సాయి ఎన్నో బోధలను చేస్తుండేవారు. ఆయనకు బోధలను చేయడానికి ప్రత్యేక సమయం కాని, స్థలం కాని, సమయం కాని అవసరం లేకుండేది. సంధర్భావసరముల బట్టి వారి ప్రభోధము నిరంతరం జరుగుతూ వుండేది. ఓకనాడు ఒక భక్తుడు మశీదులో తన తోటి భక్తుని గురించి విమర్శించసాగాడు. ఆ తోటి భక్తుడు చేసిన మంచి పనులను విడిచి అతడు చేసిన తప్పుల గురించి తీవ్ర పదజాలంతో ఘాటైన విమర్శలను చేయసాగాడు.ఆ దూషణలను విన్న ఇతరులు విసిగిపోయారు. ఆర్త భక్త జన పరాయణుడైన సాయి సన్నిధిలో ఇటువంటి విమర్శలు ఏల అని మనస్సులో బాధపడసాగారు. ఆ భక్తుడు తన తోటి భక్తుడిని విమర్శిస్తూ ఎంతటి పాపం మూటకట్టుకుంటున్నారో సర్వజ్ఞుడైన సాయి గ్రహించారు. ఆ మధ్యాహ్నం శ్రీ సాయి లెండీ తొటకు వ్యాహ్యాళికొ పోయేసమయంలో ఆ భక్తుడు బాబాని దర్శించి ప్రణామం చేసాడు. అప్పుడు శ్రీ సాయి మలమును తింటున్న ఒక పందిని చూపించి " చూడు నాయనా ! అమేధ్యాన్ని ఎంతో ప్రీతిగా తింటున్న ఆ పందిని చూడు.నీ ప్రవర్తన, స్వభావము కూడా అంతే. ఎంత ఆనందంగా నీ సాటి సోదరుని తిడుతున్నావు ? కోటి జన్మలలో ఎంతో పుణ్యం చేయగా నీకీ అరుదైన మానవ జన్మ లభించింది.దీనికి సార్ధకత చేకూర్చడానికి ప్రయత్నించాలి గాని ఈ విధమైన దూషణలను  చేసి ఎందుకు కొండంత పాపాన్ని మూటకట్టుకుంటున్నావు ?" సాయి మాటలతో ఆ భక్తునికి తన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే క్షంచమంటూ శ్రీ సాయి పాదాలపై పడ్డాడు. శ్రీ సాయి అప్పుడు తన బోధను ఈ విధంగా కొనసాగించారు. " చూడు నాయనా ! ఇతరులను విమర్శించువాడు, దూషణములను చేయువాడు ఒక విధంగా తాను నిందించువానికి సేవ చేస్తున్నాడు. అది ఎట్లనిన, ఇతరులను నిందించడమంటే వారి శారీరక మలినములను తన నాలుకతో నాకి శుభ్రపరచడంతో సమానం.ఇట్టి అపరిశుభ్రమైన కార్యములను చేయడం నీకు తగునా ?భగవంతుని సృష్టిలో అందరూ సమానులే ! ఆ కుల, మత, జాతి , వర్ణ వైషమ్యాలను మనము సృష్టించుకున్నాము.ఎవరి పూర్వ జన్మ సంస్కారములను బట్టి వారు జీవితంలో ప్రవర్తించడం జరుగుతుంది.వారి ప్రవర్తన మనకు నచ్చనంత మాత్రాన, వారిని విమర్శించడం తగదు.ఇతరులను దూషించడం భగవంతుని దూషణతో సమానం.ఒకరు ఇంకొకరిని దూషిస్తే నాకెంతో బాధ కలుగుతుంది, కనుక ఆ పనులను ఇక మీదట చేయవద్దు" మానవ ప్రవర్తనపై శ్రీ సాయి ఎంతటి అపూర్వమైన దివ్య బోధను చేసారో చూడండి. ఆ పరిశుద్ధ పరమేశ్వర అవతార స్వరూపునికి ప్రణమిల్లి ఆ దివ్య సందేశాన్ని మనసులో పదిల పరచుకొని ఆ ప్రకారంగా జీవించి, సాయి అనుగ్రహ, కటాక్షములకు పాత్రులమవుదాము.


సర్వ మత సమానత్వం, సర్వ జీవ హితం, ధర్మాచరణ, నిర్మలమైన హృదయం కలిగివుండుట,పవిత్రమైన నడవడిక, తల్లిదండ్రులు, పెద్దలు, గురువుల పట్ల ప్రేమానురాగాలు, భక్తి శ్రద్ధలు కలిగి వుండడం శ్రీ సాయికి ఎంతో ఇష్టం. సదా భగవన్నామం ఉచ్చరించు భక్తులంటే శ్రీ సాయినాధునికి బహు ప్రీతి. తన భక్తులు ఈ ప్రపంచంలో ఎక్కద వున్నా సరే పిచ్చుక కాళ్ళకు దారం కట్టి లాగినట్లు తన వద్దకు లాగుకొని, వారికి అనేకరీతుల హితబోధ చేసి, సన్మార్గంలో నడిపించి చివరకు వారికి మోక్షం ఇవ్వడమే సమర్ధ సద్గురువు శ్రీ సాయి కర్తవ్యం.