Monday, 16 January 2017

శ్రీ సాయి దివ్య జ్ఞానామృతం – 29ఈ సకల చరాచర సృష్టిలో అధర్మం అవధులు దాటి చెలరేగినప్పుడు, ధర్మానికి తీవ్ర విఘాతం కలిగినప్పుడు, తాను స్వయం గా ఈ భువిపై అవతరించి , ధర్మ సంస్థాపన చేస్తానని శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో ప్రవచించాడు.ఆ ప్రకారం గానే ఈ కలియుగం లో ఎన్నో ప్రదేశాలలో ఎన్నో రూపాలలో అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన అనే తన అవతార కార్యములను అతి సమర్ధవంతం గా ఆ భగవానుడు నిర్వర్తించాడు. అట్లా ఈ భువిపై అవతరించిన పుణ్య పురుషులలో అగ్రగణ్యులు, మహిమాన్విత శక్తిమంతులు పరిశుద్ధ , పరమేశ్వర, పరబ్రహ్మ అవతారం శ్రీ శిరిడీ సాయినాధులు. భక్తుల కెట్టి కఠోర నియమాలను పెట్టక కేవలం దర్శన, స్మరణలతోనే ప్రసన్నుడై , భక్తుల కోరికలను సత్వరం తీర్చే అపూర్వ, అసామాన్య కలియుగ దైవం శ్రీ సాయి. తనకు సర్వశ్య శరణాగతి ఒనరించి , తన పాదాల వద్ద పడవేసిన భక్తుల భారములన్నింటినీ తానే స్వీకరించి భక్త జనావళి యొక్క సమస్త చింతనలను,ఆందొళనలను, సమస్యలను, చిటికెలో దూరం చెసే కల్ప వృక్షం శ్రీ సాయి. అటువంటి శ్రీ సాయినాధులు చేసిన కొన్ని అపూర్వమైన లీలలను ఇప్పుడు ముచ్చటించుకుందాము. ఆ లీలామృతమును మనసారా ఆస్వాదిద్దాం.

బాబాకు కూర్మి భతుడైన రఘునాధ్ టెండూల్కర్ కు ఒకసారి ఒక జ్యోతిష్కుడు కనిపించి ఈ సంవత్సరం మీ కుటుంబం యొక్క గ్రహ స్థితులు ఏమీ బాగు లేవు, కావున మీకు మంచి జరిగే అవకాశమే లేదు. మీ అబాయిని కూడా పరీక్షలకు పంపవద్దు, అతనికి పాసు కావడానికి అవకాశములు లేవుఅని చెప్పాడు. దానితో రఘునాధ్ టెండూల్కర్ ఖిన్నుడయ్యాడు. తండ్రి వద్ద నుండి విషయాన్ని తెలుసుకున్న అతని కుమారుడు బాబు టెండూల్కర్ నిరుత్సాహ పడి , పాసు కానప్పుడు చదవడం ఎందుకని పుస్తకాలను పక్కన పడేసి ఏడుస్తూ కూర్చున్నాడు. ఆ సంవత్సరం అతను మెడిసిన్ పరీక్షలకు హాజరు కావల్సి వుంది. జరిగిన విషయాన్ని గ్రహించిన అతని తల్లి తనకు సాయే దిక్కని నమ్మి, శిరిడీకి వచ్చి బాబా కాళ్ళపై పడి ఆ జ్యోతిష్కుడు చెప్పిన విషయాన్ని వివరించి సలహా అడిగింది. అప్పుడు శ్రీ సాయి చిరునవ్వుతో "తల్లీ ! ఆ జ్యోతిష్యుని మాటలు కట్టిపెట్టండి. మీ అబ్బాయి తప్పక పరీక్షలలో కృతార్ధుడు అవుతాడు. ఆ హామీ నాది. నా మాటలపై నమ్మకముంచి అతనిని పరీక్షలకు హాజరు కమ్మని చెప్పు" అని ఆశీర్వదించారు. తల్లి ద్వారా ఆ విషయాన్ని తెలుసుకున్న బాబు తెండూల్కర్ సాయి తనన తప్పక గట్టెకిస్తారని నమ్మకంతో చక్కగా చదివాడు. సాయి అనుగ్రహం వలన పరీక్షలు బాగా రాసాడు కాని ఎక్కడో ఒక మూల సంశయం వుండడం వలన మౌఖిక పరీక్షకు హాజరు కాలేదు. దాంతో అతని ప్రొఫెసర్ నువ్వు వ్రాత పరీక్షలో చాలా బాగా వ్రాసావని , తప్పక వోరల్ పరీక్షలకు హాజరు కావాల్సిందిగా కబురు పంపాడు. గ్రహ స్థితుల కంటే సద్గురువు అనుగ్రహ శక్తి ఎన్నో రెట్లు మిన్న అని తెండూల్కర్ కుటుంబం ఈ లీల ద్వారా గ్రహించారు.

మరొక లీల : సాయి భక్తాగ్రేసరుడు హరి భావూ ఫన్సే ఒక చక్కని డాక్టరు. నిస్వార్ధ తత్వం తో పేద ప్రజల సంక్షేమమే ధ్యేయం గా వృత్తి చేస్తుండే వాడు.తన స్వగ్రామం లో ఒకసారి ఒక కలరా రోగికి బాబా విభూతిని ఇచ్చారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ వీభూతిని సేవించిన ఆ రోగి యొక్క రోగం వెంటనే తగ్గిపోయింది. సరిగ్గా అదే సమయం లో ఆ ఊరిలో కలరా వ్యాధి విజృంభించింది. వందలాది మంది ఆ రోగం బారిన పడ్దారు. బాబా ఊది ఒక వ్యక్తి రోగం తగ్గించిందని తెలుసుకున్న వారు ఫన్సే ఇంటికి పరుగులు తీసారు.అందరికీ ఊదీ తలా కాస్తా పంచేయడం తో ఫన్సే వద్ద వున్న ఊదీ అంతా అయిపోయింది.ఇంక ఎవరైనా వస్తే ఏం చెయ్యాలా అన్న దిగులు ఫన్సే కు పట్టుకుంది.వెంటనే ఆ అమాయకులను ప్రాణాంతకమైన ఆ వ్యాధి నుండి రక్షించమని బాబాకు హృదయపూర్వకం గా మొర పెట్టుకున్నాడు ఫన్సే.చిత్రం గా నాటి నుండి ఆ ఊళ్ళో కలరా వ్యాధి మాయమైపోయింది. వ్యాధిన పడ్డ వారందరూ స్వస్థతను పొందగా మరి ఇంకెవ్వరూ ఆ వ్యాధి బారిన పడలేదు. ఖరీదైన డాక్టర్ల మందుల కంటే ఎంతో గొప్పగా పని చేసి, ఆ ఊరి నుండే వ్యాధిని తరిమి కొట్టిన సాయినాధుని ఊదీ యొక్క మహిమ వర్ణింపతగునా ?

లోకాస్సమస్తా సుఖినోభవంతు :
సర్వే జన: సుఖినోభవంతు
సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణమస్తు

Saturday, 7 January 2017

శ్రీ సాయి దివ్య జ్ఞానామృతం – 28


సకల వేదాల సారం , అందరి మహనీయుల ప్రవచనా సారంశం ఒక్కటే " మానవుడు తన దేహం, బుద్ధి, మనసు, అహంకారం కాదు. ఆతని సత్య రూపం నామ రూపాలు లేని పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మం త్రిగుణ రహితమైనది. శ్రీ కృష్ణుడు భగవద్గీతలో ప్రవచించినట్లు శస్త్రముల చేతచేదింపజాలనిది,నీటితో తడుపజాలనిది, జనన మరణముల కతీతమైనది ". కాని ఈ సత్యం ఏ ఒక్క సాధకుడికీ అనుభవంలో లేదు. అందుకు కారణం అజ్ఞానము,అహంకారములు అనే మత్తు అతనిని కప్పేసాయి.మత్తు పానీయములు సేవించిన వారు మత్తులో వుండగా ఏమి చేస్తారో వారికే తెలియనట్లు, మానవుడు ఈ అజ్ఞాన, అహంకారములనే మత్తులో మునిగి వునప్పుడు తనేమి చేస్తున్నాడో తెలుసుకోలేడు.ఒక సమర్ధుడైన సద్గురువు దివ్యానుగ్రహంతో ఆత్మ జ్ఞనం పొందిన సాధకుడు ఈ మాయ, మత్తుల నుండి విడి పడ్డాక తన గత ప్రవర్తన ను చూసుకొని ఆశ్చర్యపోతాడు. ఇంతటి మూర్ఖంగా ఎందుకు ప్రవర్తించాన అని నివ్వెరపోతాడు. ఫ్రస్తుత కాలంలో మనవులకు వివిధ రకములైన సమస్యలు రావడానికి కారణం అహంకారం అనే పొర వారి మనసులను కప్పివేయడమే.ఆ త్రిమూర్తులను సైతం పట్టి పీడించే ఆ మాయా శక్తికి ఒక రూపం అహంకారం లేదా వ్యక్తిత్వం. నేను ఒక అధికారిని, నా క్రింద ఇన్ని వందల మంది ఉద్యోగులు పని చెస్తున్నారు. నాకు ఇంతటి అధికారం, పలుకుబడి, హోదా, పదవి వుంది,నాకు ఇన్ని లక్షలు విలువ జేసే ఆస్తి పాస్తులు వున్నాయి, నేను ఫలనా ఉన్నత కులంలో పుట్టాను, నేను ఇన్ని గొప్ప చదువులను చదివాను అని మిడిసిపడదమే అహంకారం.ఈ అహంకారం మానవులలో ఎన్నో పొరలలో వుండి వారి యొక్క సహజస్వరూపమైన ఆనంద తత్వాన్ని కప్పేసి, అనుక్షణం ఎన్నో రకాలుగా హింసకు గురి చేస్తుంది. ఈ కలియుగంలో ఎందరో తాము ఆత్మ సాక్షాత్కారం పొందిన వారమని, సకల విద్యా పారంగతులమని ప్రచారం చేసుకుంటూ , గురువులుగా చెలామణీ అవుతుంటారని పరశర మహర్షి ద్వాపర యుగంలోనే సాధకులను హెచ్చరించారు. తనను గురువుగా ప్రకటించుకోవడం కూడా ఒక విధమైన అహంకారమే. సద్గురువు దివ్యాశ్సీసులతో ఆ అహంకారాన్ని సమూలంగా నాశనం చేసుకొని అహం బ్రహస్మి అన్న అనుభూతిని పొందడమే ఆధ్యాత్మికత అంటే.

మానవులను అనుక్షణం చిత్రహింసలకు గురి చేసే ఈ అహంకారాన్ని తొలగించుకోవాలంతే మనము ఏమి చెయ్యాలో కలియుగ దైవం , సమర్ధ సద్గురువు అయిన శ్రీ సాయినాధులు తన భక్తులకు అపూర్వమైన రీతిలో తెలిపారు " నీవు, నేను అన్న భావనే గురు శిష్యుల మధ్య వుండే ఈ గోడ. దీనిని కూల్చితే గాని ఇదరి మధ్య ఏకత్వం ఏర్పడజాలదు. నేను ఈ శరీరాన్ని గాని, మనస్సును గానీ కాదు. నేను సాక్షాత్ పరబ్రహ్మాన్ని అన్న అనుభూతిని సాధించి అహంకారాన్ని విడిచి పెడితే గని మనిషికి ముక్తి లభించదు.వెలుగు వున్న చోట చీకటి వుండనట్లు , బ్రహ్మత్వం ఉన్న చోట అహంకారం వుందదు."

అహంకారమును నాశనం చేసుకునేందుకు ముందుగా ఒక సర్వ సమర్ధుడైన గురువును ఆస్రయించాలి. అటు తర్వాత , శరీరం, మనసు, బుద్ధి, అభిరుచులు, ఆశయాలను , ఒక్క మాటలో చెప్పాలంటే మనలను సంపూర్ణంగా ఆ సద్గురువు పాదాలకు సమర్పించుకొని సర్వస్య శరణాగతి చెయ్యాలి.శ్రీ సాయి ప్రవచించినట్లు సుఖ : దుఖాలు, కష్ట నష్టాలు, పూర్వ జన్మ ప్రారబ్దానుసారమే వస్తాయి. ప్రతీ మనిషి జీవితంలో చీకటి వెలుగుల వలే ద్వందాలు రావడం అతి సహజం. ఈ సత్యాన్ని అవగతం చేసుకొని, సుఖ దుఖాలకు లోను కాకుండా , ఏది జరిగినా మన మంచికేనని భావించి , ఇచ్చేది పుచ్చుకునేది ఆ భగవంతుడేనన్న ప్రసాద భావంతో జీవిస్తూ, సదా ఆ పరమాత్మకు కృతజ్ఞులై వుండి , తమ భారమంతటినీ ఆ సద్గురువు పాదాల వద్ద విడిస్తే జీవితంలో శాస్వతమైన ఆనందానికి లోనై అతి త్వరగా పరమార్ధం పొందుతారు.

ఈ సాధనా మార్గంలో మన సద్గురువు మనలను మన విశ్వాసం ఏపాటిదో చూదడానికి ఎన్నో పరీక్షలకు గురి చేస్తారు.ఊహించలేని కష్ట నష్టాలు, అనారోగ్య సమస్యలు,కుటుంబ, బంధు మిత్రులతో కలహాలు, ఆస్తి నష్తం ఇటువంటివి ఒకదాని వెనుక మరొకటి వస్తాయి.ఏది జరిగినా అది సద్గురువు అనుగ్రహ ఫలమని గట్టిగా విశ్వసించి నిమిత్త మాత్రునిగా వున్న సాధకులకే అంతిమ విజయం లభిస్తుంది.గురువు అగ్ని లాంటి వారని భావించి, ఆ అగ్నిలో నీ వ్యక్తిత్వాన్ని నాశనం చెసుకోవాలి. గురువు ఆయుస్కాంతం వంటి వారని భావించి ఇనుము ముక్క వలే తన ప్రమేయం లేకుండానే నిస్వార్ధంగా అయన పాదాలవైపు ఆకర్షింపబడాలి. సంసారంలోనే వుంటూ సంసార సుఖాలను ధర్మ బద్ధంగా అనుభవిస్తూ నిరంతరం గురువు నామస్మరణ చెస్తూ, గురువు చూపిన అధ్యాత్మిక మార్గంలో అలుపెరుగని ప్రయాణం చెసే వారికే అంతిమ విజయం ప్రాప్తిస్తుంది. శ్రీ సాయి భక్తాగ్రేసరుడు అయిన హేమాద్పంత్ తన సాయి సచ్చరిత్రలో శ్రీ సాయినాధుని సందేశాన్ని ఏ విధంగా అందించారో చూడండి." నువ్వు నీ అహంకారాలన్నింటినీ వదిలి పెట్టి నాకు సంపూర్ణ శరణాగతి చెయ్యు. అప్పుడు మీ అజ్ఞానం సమూలంగా నాశనమౌతుంది. ఆజ్ఞాన అహంకార రహితులై ఎవరు ప్రవర్తిస్తారో వారిపై నా అనుగ్రహం శ్రీఘ్రంగా వర్షిస్తుంది. అప్పుడు అటువంటి భక్తుల హృదయంలో నేను సదా నివసిస్తాను. వారిని చివరి కంటా గమ్యం చెర్చి వారి ఋణం తీర్చుకుంటాను "

లోకాస్సమస్తా సుఖినోభవంతు :
సర్వే జన: సుఖినోభవంతు

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణమస్తు

Monday, 2 January 2017

శ్రీ సాయి దివ్య జ్ఞానామృతం – 27భగవంతుడే సద్గురువు. సద్గురువే సర్వేశ్వరుడు. సూక్ష్మంగా చెప్పాలంటే ఇష్ట దేవతారాధన సద్గురువును చూపుతుంది. పరమేశ్వరుని పంచకృత్యాలు సృష్టి, స్థితి, సంహార, తిరోధానుగ్రహాలు. వీటిలో మూడు కార్యాలయిన సృష్టి, స్థితి, లయలను నిర్వహించేందుకు భగవంతుడు తనను తాను త్రిమూర్తులుగా పరిణమింపజేసుకున్నాడు. ఆనుగ్రహ మూర్తి అయిన పరమేశ్వరుడు సృష్టి లోని జీవజాలం అజ్ఞానంతో అధోగతి పాలు కాకుండా ధర్మాన్ని వేదంగా చేసాడు. వేదం స్పష్టంగా అర్ధమయ్యేటట్లు దాని సారాన్ని ఉపనిషత్తులుగా రచింపజెసాడు. వీటి పట్ల కూడా అవగాహన లేని వారి కోసం వారిని అజ్ఞాన అంధకారముల నుండి తప్పించి జ్ఞాన మార్గంలో నడిపించడానికి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులనే మూడు రూపాలుగా విరాజిల్లే పరమాత్మ, త్రిమూత్యాంశలను ఏకాంశగా మలచుకొని గురువుగా, సిద్ధి ప్రదాతగా, ఆశ్రిత జన సర్వాభీష్త ప్రదాయిగా శ్రీ దత్తాత్రేయునిగా ఆత్రి, అనసూయల యందు దత్తాత్రేయునిగా అవతరించారు. దత్తాత్రేయుడే సద్గురువు. కలియుగంలో ధర్మం నశించి, మానవాళి ధర్మాలను విడిచి, కర్మ భ్రష్టులై, అజ్ఞానంధకారములలో కొట్టు మిట్టాడుతున్న తరుణంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపనల కోసం విలక్షణంగా చిరిగిన కఫ్నీ, ఒక పొడుగాటి జుబ్బా, భుజానికి జోలె,చేతిలో సటకాతో దివి నుండి భువికేగిన పరిశుద్ధ పరబ్రహ్మమే శ్రీ సాయినాదులు.

బాబా గారు ఎవరి సంస్కారానికి తగిన ఉపదేశం ఇచ్చి సంస్కరించేవారు. భి.వి.దేవ్ దహను గ్రామానికి మామలతదారుగా పనిచేసేవాడు. ఆతనికి ఎప్పుడు " జ్ఞానేశ్వరి " గ్రంధం పారాయణ మొదలు పెట్టినా ఏదో ఒక ఆటంకం వస్తూ వుండేది. సద్గ్రంధ పఠన కూడా సద్గురువుని అనుగ్రహం వలనే సార్ధకమవుతుందని విశ్వసించి సాయినాదుని భక్తుడైన దేవ్ గ్రంధాన్ని సాయి ఆశీస్సులు పొంది చదవాలని నిశ్చయించుకొని శిరిడీ వెళ్ళాడు. బాబా వారు సర్వాంతర్యామి. ఆయన దేవ్ నుండి 20 రూపాయల దక్షిణ తీసుకొని పారాయణ విషయం మాట్లాడ లేదు. మశీదు కిక్కిరిసి వుందదంతో దేవ్ ఒక మూల కూర్చున్నాడు. బాబా వారు అతడిని పిలిచి తన పాద సేవ చేస్తూ ప్రశాంతంగా కూర్చోమన్నారు. దేవ్ ఆరతి అయిపోగానే అక్కడే వున్న బాలక్ రాం అనే భక్తుడిని అతను బాబా వారికృపను ఎలా పొందాడో చెప్పమనగా అతడు చెప్పసాగాడు.ఇంతలో బాబా దేవ్ ను పిలిచి కోపంతో " నా గుడ్డపీలికలను ఎందుకు దొంగలించావు ? తల నెరిసినా నీ పద్ధతిని మార్చుకోలేదు కదా, నిన్ను గొడ్డలితో నరుకుతాను " అని కేకలేసారు. ఒక్కసారిగా బాబా వారు ఎందుకు తన మీద కోపం వహించారో దేచ్కు అర్ధం కాలేదు. కాస్సెపు తర్వాత బాబా దేవ్ ను పిలిచి గుడ్డ పీలికల విషయం చెప్పి నిన్ను బాధ పెట్తానా ? దొంగతనం చేస్తే ఒప్పుకోక తప్పదు " అని అతను నుండి మరి పన్నెండు రూపాయలు దక్షిణ తీసుకొని " నీ గదిలో విశ్రాంతిగా కూర్చోని జ్ఞానేశ్వరిని పారాయణ చెయ్యు.నీకు నేను జలతారు శాలువాను ఇవ్వడానికి సిద్ధంగా వుంటే ఇతరుల గుడ్దపీలికలను దొంగలించవలసిన అగత్యం ఏమిటి ? " అని ఆశీర్వదించారు. బాబా వారి ఆశీస్సులను పొందిన అత్యుత్సాహంతో దేవ్ పారాయణ మొదలు పెట్టగా ఇసారి అది నిరాటంకంగా సాగింది.

బాబా తనను ఎందుకు కోపడ్దారో దేవ్ కు అర్ధమయ్యింది. పరిశుద్ధ పరబ్రహ్మ స్వరూపులయిన సాయిని ఎదురుగా ఉంచుకొని సాయి అనుగ్రహం పొందాలి గాని వేరే వారి నుండి సాయిని గురించి తెలుసుకుందామన్న దేవ్ ఆలోచనలను బాబా విధం గా సంస్కరించారు. సామాన్యుల బోధలు చింకి గుడ్దలు. సద్గురువు బోధించేది జరీ శలువ అని బాబా తన లీల ద్వారా దేవ్ కు అర్ధమయ్యే రీతిలో చూపించారు.బోధించడమే కాక, ఒక సంవత్సరం తర్వాత దేవ్ కు కలలో కనిపించి అతని పారాయణ ఎలా సాగుతున్నదో వివరాలను అడిగి తెలుసుకున్నారు.జ్ఞానేశ్వరి గ్రంధం అర్ధం అవడం కష్టంగా వుందని దేవ్ చెప్పగా, ఎలా పారాయణ చెస్తే గ్రంధంలోని విషయాలు అర్ధమౌతాయో బాబా అతనికి వివరించారు. అప్పటి నుండి సాగిన దేవ్ యొక్క పారాయణ నిరాటంకా సాగి గ్రంధం లోని విషయాల పట్ల దేవ్ గొప్ప పట్టు సాధించాడు. గురువు శరీరంతో ఎదురుగా ఉందగా వారి వద్ద స్వయంగా రెలుసుకోవాలి గాని ఇతరులనుండి తెలుసుకోవాలనుకోవదం దొంగతనంతో సమానం అని బాబా బోధించారు.

కార్యమైనా, సద్గ్రంధ పఠన అయినా గురువు అనుగ్రహం వలనే చేయగలం , చదవగలం. బాబా వారు గురువును గురించి తెలుసుకోవాలి , లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానికా ? అని ప్రశ్నించేవారు. సద్గురువు అనుగ్రం వుంటే ఎంతటి క్లిష్టమైన కార్యమైనా సాధ్యమే. సత్యాన్ని మన పవిత్రమైన మనసులో పదిల పరచుకొని సద్గురువు గురించి తెలుసుకుంటూ, నిత్యం చింతన చేస్తూ, అనన్య భక్తితో ఆరాధిస్తూ , ఆత్మ జ్ఞానికి,మోక్ష సిద్ధికి చిత్త శుద్ధితో కృషి చేద్దాం.

లోకాస్సమస్తా సుఖినోభవంతు :
సర్వే జన: సుఖినోభవంతు
సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణమస్తు