Wednesday, 1 February 2017

శ్రీ సాయి దివ్య జ్ఞానామృతం – 30ఈ పవిత్ర భారతావనిలో ఇంతవరకూ అవతరించిన దివ్య పురుషులందరిలోనూ శ్రీ శిరిడీ సాయినాధులది ఒక విశిష్టమైన అవతారం. భక్త జన సంరక్షణే తన అవతార కార్యం గా భావించే శ్రీ సాయి స్మృతి మాత్ర ప్రసన్నులు. భక్తులు సర్వశ్య శరణాగతి ఒనరించి , భక్తి శ్రద్ధలతో ప్రేమ పూర్వకం గా సాయిఅని పిలుస్తే చాలు , సత్వరం ఓయీఅని పలికి , ఆపన్న హస్తం అందించి ,ఎల్లవేళలా తోడూ నీడగా నిలుస్తారు. శ్రీ సాయినాధులను తమ జీవితమనే నౌకకు చుక్కాని గా చేసుకున్న వారికి అన్ని చింతనలు, ఆందోళనలు, బాధలు, సమస్యలు ఆమడ దూరం లో వుంటాయి. జీవితం లో ఎదురయ్యే అన్ని సమస్యలకు శ్రీ సాయి పాదాలను శరణు వేడడం ఒక్కటే పరిష్కారం. తనను నమ్ముకున్న అశేష భక్త జనావళికి శ్రీ సాయి ఏ విధం గా బాసట గా నిలిచి రక్షించారో ఈ క్రింది లీలల ద్వారా తెలుసుకుందాము.

మహారాష్ట్రా లోని అకోలా గ్రామం లో నివసించే ఒక వైశ్యునికి లేక లేక ఒక ఆడపిల్ల పుట్టింది. వారు ఆ అమ్మాయిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. దురదృష్ట వశాత్తూ ఆ అమ్మాయికి ఒక విషపు జ్వరం సోకి రెండు కాళ్ళూ చచ్చుబడి పోయాయి. లేచి నిలబడ లేక ఆ అమ్మాయి మంచానికే పరిమితమైపోయింది. ఎంత మంది ప్రముఖ వైద్యుల చేత ఖరీదైన వైద్యం ఇప్పించినా ప్రయోజనం లేక పోయింది. అంతలో ఆ వైశ్యుల కుటుంబానికి తెలిసిన వారు వచ్చి రోగ నివారణార్ధం శిరిడీ లోని సాయిని శరణు పొందమని సలహా ఇచ్చారు. ఆఖరు ప్రయత్నం గా ఆ వైశ్యుడు తన కుమార్తెను శిరిడీకి మోసుకు వచ్చి శ్రీ సాయి కాళ్ళ వద్ద వుంచాడు. తన కుమార్తెకు స్వస్థత చేకూర్చమని హృదయపూర్వకం గా ప్రార్ధించాడు. దయామయుడైన శ్రీ సాయి ఆమెను ఆశీర్వదించి కొద్ది రోజులు శిరిడీలోనే వుండమన్నారు. ఆశ్చర్యాలలోకెల్లా ఆశ్చర్యం ! ఆ రోజు నుండే ఆమె కాళ్ళలో కదలికలు ప్రారంభమయ్యాయి. మూడవ రోజు కల్లా ఆమె ఎవరి సహాయం లేకుండా నడవ సాగింది. వారం రోజుల లోపే పరుగులు తీసే శక్తి లభించింది.అందరి కంటే గొప్ప వైద్యుడైన శ్రీ సాయికి సాధ్యం కానిది ఏముంది ?

1914
వ సంవత్సరం లో మహా శివరాత్రి పర్వ దినం ముందు రోజున హార్ధా అనే గ్రామం లో మేజిస్ట్రేట్ గా పని చేసిన చోటా భయ్యా తన కుటుంబం తో హఠాత్తు గా శిరిడీ ప్రయాణం కట్టాడు.వారు టాంగా లో నేమేవర్ అనే నది ఒడ్డుకు చేరేసరికి చీకటి పడిపోయింది. పడవ నడిపేవారు తమ పడవ లన్నింటినీ కట్టేసారు. ఎంత డబ్బిస్తామన్నా పడవ వేయడానికి వారు ససేమిరా ఒప్పుకోలేదు. ఇక ఆ నది ఒడ్డునే తమకు రాత్రం తా గడపక తప్పదని ఆందోళన పడిన చోటా భయ్యా తమను కరుణించమని శ్రీ సాయిని హృదయపూర్వకం గా ప్రార్ధించాడు.ఇంతలో హఠాత్తుగా సాయి వలే తలగుడ్ద, కఫ్నీను ధరించిన ఒక ముదుసలి వ్యక్తి వీరి వద్దకు వచ్చి " ఆడవారిని, చిన్న పిల్లలను తీసుకొని ఇంత పొద్దు పోయి వచ్చారేమి ?అయినా ఏం భయపడవద్దు. కొద్ది సేపట్లో ఈ పడవ వారే మిమ్మల్ని నది దాటిస్తారు" అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా కొద్ది సేపటికే ఆ పదవ నడిపే వారు వచ్చి సామానులన్నింటినీ పడవలలో సర్ధి అందరినీ పడవ ఎక్కమన్నారు." మీకు పడవ వేయనందుకు మా పై ఆఫీసరు గారు మమ్మల్ని పిలిచి చెడా మడా తిట్టారు. మీరు బాడుగ ఇవ్వకపోయినా ఫరవాలేదు, మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తాం" అని చెప్పి ఆ బెస్తవారు చోటా భయ్యా పరివారమంతటినీ సురక్షితం గా అవతలి ఒడ్డుకు చేర్చారు. ఆ మర్నాడు శిరిడీ చేరాక తమను దర్శించిన చోటా భయ్యా పరివారం తో శ్రీ సాయి " చూడండి ! నేను కల్పించుకోక పోయినట్లయితే మీకు ఎంత ఇబ్బంది ఎదురయ్యేదో ?" అని క్రితం రోజు జరిగిన సంఘటన నంతటినీ వర్ణించి చెప్పారు. తనను నమ్మి కొలిచే భక్త జనావళిని శ్రీ సాయి సురక్షితం గా ఈ భవ సాగరాన్ని దాటిస్తారనడం లో ఎటువంటి సందేహం లేదు .

లోకాస్సమస్తా సుఖినోభవంతు :
సర్వే జన: సుఖినోభవంతు

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణమస్తు