Monday, 20 March 2017

శ్రీ సాయి దివ్య జ్ఞానామృతం – 35శ్రీ సాయినాధుని చాలా కాలం పూజించి సేవించిన మహా భక్తురాలు శ్రీ మతి చంద్రాబాయి బోర్కర్ యొక్క జీవితం లో శ్రీ సాయినాధులు చేసిన ఒక అద్భుతమైన లీలను మనం అధ్యాయం - 27 లో చదివాము. ఆ మహా స్వాధి జీవితం లో శ్రీ సాయి చేసిన మరి రెండు లీలలను ఇప్పుడు స్మరించుకుందాము. శ్రీ సాయినాధుని లీలా చరిత్రామృతమును మనసారా ఆస్వాదించుదాము.

1909 వ సంవత్సరం లో శ్రీమతి బోర్కర్ శిరిడీలో కోంత కాలం నివసించేందుకు వెళ్ళింది. ఆ సమయం లో ఆమె భర్త భూలోక వైకుంఠమైన పండరీ పూరు లో ఉద్యోగం చేస్తుండే వాడు. ఒక రోజు మశీదులో కూర్చొని వుండగా శ్రీ సాయి చంద్రా బాయి తో " ఆమ్మా , నువ్వు అర్జంటు గా పండరీ వెళ్ళు , నేను నీకు తోడుగా వుంతాను, నాకు ఏ రైలు అవసరం లేదు" అని అన్నారు. బాబా మాటలను బట్టి తన భర్తకు ఏదో ప్రమాదం సంభవించి వుండవచ్చని భావించిన శ్రీమతి చంద్రాబాయి హుటా హుటిన బయలు దేరి పండరీ వెళ్ళింది. అక్కడ చిత్రం గా ఆమె భర్త తాను చేస్తున్న ఉద్యోగం వదిలేసి, ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళిపోయాడు. ఆయన ఆచూకి గురించి ఎంతమంది తో వాకబు చేసినా ఏమీ ప్రయోజనం లేకపోయింది.ఇక దిక్కు తోచక ఆమె తన వద్ద వున్న మిగిలిన డబ్బుతో కురుద్వాడి వద్దకు చేరుకొని స్టేషనులో బెంచీ పై కూర్చూంది. తన ఆరాధ్య దైవమైన శ్రీ సాయే తనకు ఒక మార్గం చూపిస్తారన్న ధృఢమైన విశ్వాసం తో సాయి నామ జపం చేస్తూ అక్కడే కూర్చుంది.ఇంతలో ఒక ఫకీరు వచ్చి "వెంతనే ఇప్పుడు వచ్చే రైలు ఎక్కి ధోండ్ స్టేషనుకు వెళ్ళు, అక్కడ మీవారు వున్నారు " అని చెప్పి ఆమె చేతిలో ఒక రైల్వే టిక్కట్టును పెట్టి వెళ్ళిపోయాడు. శ్రీమతి చంద్రాబాయి ఆనందంతో ఆ ఫకీరు చెప్పినట్లే చేయగా ధోండ్ స్టేషనులో ట్రెయిను దిగగా అక్కడ అదే ప్లాట్ ఫారముపై కునికి పాట్లు పడుతున్న ఆమె భర్త కనిపించాడు.ఆయన తన భార్యను దగ్గరగా తీసుకొని క్షమించమని చెప్పి" నేను మనస్సు బాగులేక ఎక్కడికో దూరం గా పారిపోదామనుకున్నాను. కాని ఒక ఫకీరు వచ్చి నా తల్లిని అశ్రద్ధ చేయవద్దు.ఆమె ఇప్పుడు రైల్లో వస్తుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకో అని మందలించి మాయమైపోయాడు." అని అన్నారు. జరిగిన దంతా శ్రీ సాయినాధుని లీలేనని, శ్రద్ధ, విశ్వాసం తో పూజిస్తే తన భక్తులను ఎల్లవేళలా కాపాడుతారని ఆ దంపతులిద్దరికీ మరొక సారి అవగతమయ్యింది.

మరొక సారి శ్రీ సాయినాధులు శ్రీమతి చంద్రాబాయి కలలో కనిపించి " నీ భర్తను తీసుకుపోతున్నాను. ధైర్యం గా వుండు " అని చేప్పారు. అప్పుడు చంద్రాబాయి కలలో కన్నీళ్ళ తో బాబా పాదాలపై పడి " ఈ చతుర్మాస్యం వెళ్ళేదాక ఆయన ప్రాణాలు నిలపమని కోరింది. సరేనన్నారు బాబా. చతుర్మాస్యం లో ఆమె భర్తకు ప్రమాదకరమైన జబ్బు చేసింది. డాక్టర్లందరూ ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని ఇక కొద్ది రోజుల కంటే ఎక్కువగా బ్రతకరని తేల్చి చెప్పేసారు. కాని శ్రీమతి చంద్రాబాయికి బాబాపై అమితమైన విశ్వాసం వుంది. కనుక డాక్టర్ల మాటలను పట్టించుకోలేదు. బాబా ఆశీర్వదించినట్లే చతుర్మాస్యం గడిచింది. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు,డాక్టర్లు ఇక ఆయన ప్రాణానికి ఏ ప్రమాదం లేదని చెప్పారు. ఒక రోజున ఆమె భర్త విష్ణు సహస్ర నామము చదివించుకొని, టీ త్రాగి కళ్ళు తేలేసారు,. బాబా చెప్పినది గుర్తొచ్చి ఆమె ఆయన గొంతులో గంగ వేసింది. సాయినాధా అంటూ ఆమె భర్త హాయిగా కళ్ళు మూసారు. తన భక్తురాలి నిష్కలంకమైన ప్రేమకు కరిగిపోయి, ఆమె భర్త యొక్క మరణాన్ని కూడా పోస్ట్ పోన్ చేసిన శ్రీ సాయినాధుని లీలలను వర్ణింప శక్యమా ?

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణమస్తు
సర్వే జనా సుఖినోభవంతు
లోకాస్సమస్తా సుఖినోభవంతు :

Saturday, 11 March 2017

శ్రీ సాయి దివ్య జ్ఞానామృతం – 34


శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో ధర్మానికి తీవ్ర విఘాతం కలిగినప్పుడు , అధర్మం అవధులు దాటి చెలరేగినప్పుడు దుష్ట శిక్షణ , శిష్ట రక్షణ , ధర్మ సంస్థాపన లను తన సంకల్పం గా చేసుకొని ప్రతీ యుగం లోనూ అవతరిస్తాను" అని ప్రవచించారు. ఆ ప్రకారం గానే ఆ పరమాత్మ ప్రతీ యుగం లో దేశ, కాల , మాన పరిస్థితులను బట్టి వివిధ అవతారాలలో, రూపాలలో , సిద్ధాంతాలతో ఈ భువిపై అవతరించి తన సంకల్ప కార్యాలను సంపూర్తి గావించుకొని అవతార పరిసమాప్తి చేసుకున్నారు. అట్లా ఈ పుణ్య పవిత్ర భారతా వనిలో 19 సతాబ్దం లో గోదావరీ పరీవాహక ప్రాంతమైన మహారాష్ట్రా రాష్ట్రం , అహ్మద్ నగర్ జిల్లా, శిరిడీ గ్రామం లో అవతరించి , లక్షలాది మంది భక్త జనావళికి నాటికీ, నేటికీ అజ్ఞానంధకారములను తొలగించి, వారికి జ్ఞాన మార్గం చూపించి మోక్షార్హులను గావించిన పరమేశ్వర, పరిశుద్ధ పరబ్రహ్మ అవతారం అయిన శ్రీ శిరిడీ సాయినాధులు పుణ్య పురుషులందరిలో కెల్లా అగ్రగామి, మహోన్నత మహిమాన్విత శక్తివంతులు, యోగులందరికీ సామ్రాట్ వంటి వారు. మనసా, వాచా కర్మణా తనకు సర్వస్య శరణాగతి ఒనరించిన భక్త జనులకు వారి లలాట లిఖితాన్ని సైతం తిరగ వ్రాసి శాశ్వతమైన అధ్యాత్మిక సంపదను, పరమానందాన్ని ప్రసాదించిన ఆశ్రిత కల్ప వృక్షము శ్రీ సాయి. ఈ కలియుగం లో సద్గురు శ్రేష్టుడు గా ప్రసిద్ధి గాంచిన అవతార్ మెహెర్ బాబా ఒక సంవత్సరం పాటు శిరిడీలో నివసించారు. ఆ సంధర్భం లో గుప్తావ్ అనే శిష్యుడితో శ్రీ మెహెర్ బాబా " శ్రీ సాయినాధులు ఎంతటి గొప్ప వారో తెలుసుకోవడం నీ లాంటి వారికి సాధ్యమయ్యె పని కాదు. పరిపూర్ణ మైన అధ్యాత్మిక తత్వమే శ్రీ సాయిబాబా గా ఈ జగత్తులో అవతరించింది. ఆయన తన శిష్యులకే కాదు ఈ సకల చరా చర సృష్టి మొత్తానికే జగద్గురువన్న అపూర్వమైన సత్యాన్ని తెలుసుకో . సర్వ మతముల, మహాత్ముల వ్యవస్థ కే శ్రీ సాయి చక్రవర్తి" అని తెలియజేసారు.అటువంటి శ్రీ సాయినాధులు చేసిన కొన్ని అపూర్వ, అధ్భుతమైన లీలలను ఇప్పుడు స్మరించుకుందాం.

ధోంఢ్ గ్రామం లో నివసించే శ్రీమతి చంద్రా బాయి బోర్కర్ శ్రీ సాయికి భక్తురాలు.నిత్యం శ్రీ సాయికి ధూప, దీప నైవేద్యాలను సమర్పించనిదే పచ్చి గంగ కూడా ముట్టేది కాదు.ఆమె భర్త అయిన బోర్కర్ చపల చిత్తం గల మనస్థత్వం వున్న వాడు. అస్తమానం ఉద్యోగాలను మారుస్తూ , ఉరూరూ తిరుగుతూ తన కుటుంబాన్ని ఆర్ధిక సంక్షోభం లోకి నెట్టే వాడు.అయినా శ్రీమతి బోర్కర్ నిస్వార్ధం గా , చెక్కు చెరగని ఆత్మ విశ్వాసం తో శ్రీ సాయిని సేవిస్తూ వుండేది. దురదృష్టం కొలది చాలా వయసు వచ్చే వరకూ ఆమెకు సంతానం కలగలేదు. ఎంత మంది ప్రసిద్ధులైన వైద్యులకు చూపించుకున్నా , ఎన్ని ఆధునిక పద్ధతుల ద్వారా వైద్యం చెయించుకున్నా ఫలితం కలగలేదు. ప్రతీ రోజూ తనకు సంతానం కలిగించమని శ్రీ సాయిని ప్రార్ధిస్తూ వెండేది.తన 48 వ ఏట బొంబాయిలో ఒక విదేశీ దాక్టరుకు చూపించుకోగా ఇక తనకు ఈ జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదని కనుక ఆ ఆశలన్నీ వదులుకోమని ఆ డాక్టరు సలహ ఇచ్చాడు. అదే సంవత్సరం లో బాబా మహా సమాధి చెందే మూందు శ్రీమతి చంద్రాబాయి బాబాను దర్శించి , ఆయన పాదాలపై పడి కన్నీరు మున్నీరుగా ప్రార్ధించి తనకు సంతానం కలిగించమని కోరింది.ఆమె యొక్క పరిశుద్ధమైన ప్రార్ధనకు కరిగిపోయిన శ్రీ సాయి చిరునవ్వుతో తధాస్తు అని దీవించారు. చుట్టూ వున్న వారికి చంద్రా బాయి యొక్క కధ తెలుసు గనుక బాబా యొక్క ఆశీర్వాదం ఎట్లా ఫలిస్తుందా అని ఆశ్చర్య పోయారు. బాబా మహా సమాధి చెందిన అనంతరం 1921 వ సంవత్సరం లో శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ కు నెల తప్పింది. డాక్టర్లు అది ఫాల్స్ ప్రెగ్నెన్సి అని , కడుపులో ఒక కంతి లేచిందని , శస్త్ర చికిత్స ద్వారా దానిని తక్షణం తొలగించాలని సూచించారు. కానీ శ్రీమతి బోర్కర్ బాబా యొక్క వాక్కుల పట్ల అచంచల విశ్వాసం తో వుండి శస్త్ర చికిత్సకు ససేమిరా ఒప్పుకోలేదు. ఆమె ప్రాణాలకే ముప్పు కలుగబోతోందని దాక్టర్లు హెచ్చరించినా శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ వినలేదు. నెలలు నిండుతున్న కొద్దీ చంద్రాబాయి నీరసించి పోయింది. కాని ఆమెకు ఈ భౌతిక ప్రపంచం లోని దాక్టర్ల కంటే ఈ జగత్తుకే డాక్టర్ అయిన శ్రీ సాయిపై విశ్వాసం అధికం.శ్రీ సాయి వాక్కు బ్రహ్మ వాక్కుతో సమానమని ఆమెకు తెలుసు.తొమ్మిది నెలలు నిండిన వెంటనే ఏ శస్త్ర చికిత్స అవసరం లేకుందానే 51 వ సంవత్సరాల వయసులో సుఖ ప్రసవం లో పందంటి బిడ్డను ప్రసవించి యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యం లో ముంచెత్తింది. శ్రీమతి బోర్కర్.ఈ జన్మలోనే ఆమెకు సంతాన యోగం లేదని ఘంటా పధం గా తెగేసి చెప్పిన డాక్టర్లు ఈ అద్భుతాన్ని చూసి ముక్కున వేలెసుకున్నారు. భక్తుల పాలిట ఆశ్రిత కల్ప వృక్షము, కరుణా సముద్రుడు, భక్త జన సంరక్షకుడు అయిన శ్రీ సాయి చేసిన ఈ అద్భుతమైన , అపూర్వమైన లీల నాస్తికులకు సైతం కను విప్పు కలిగించగా, యావత్ ఆస్తిక ప్రపంచాన్ని ఆనం ద సాగరం లో ముంచెత్తింది.


లోకాస్సమస్తా సుఖినోభవంతు :
సర్వే జన: సుఖినోభవంతు

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు

Thursday, 9 March 2017

శ్రీ సాయి దివ్య జ్ఞానామృతం – 33శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ప్రవచించినట్లు ధర్మానికి తీవ్ర విఘాతం కలిగినప్పుడు ,అధర్మం అవధులు దాటి చెలరేగినప్పుడు , దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపనలను తన సంకల్పం గా చేసుకొని ఆ పరమాత్మ ప్రతీ యుగం లోనూ వివిధ అవతారాలతో , రూపాలతో ఈ భువికి దిగి వచ్చి భక్త జన సంరక్షణ గావిస్తుంటాడు. అట్లా ఈ పవిత్ర భారతావనిలో 19 వ శతాబ్దం లో అవతరించి , లక్షలాది మందికి జ్ఞాన మార్గం చూపించి వారికి ఎల్ల వేలలా రక్షణ కవచం అందించిన శ్రీ శిరిడీ సాయినాధులు అందరి పుణ్య పురుషులలో కెల్లా అగ్రగామి, మహిమాన్విత శక్తివంతుడు, యోగులందరికీ సామ్రాట్ వంటి వారు, పరిశుద్ధ పరబ్రహ్మ అవతారం. తనను మనస్పూర్తిగా నమ్మి, శరణు జొచ్చిన వారికి అభయ హస్త మందించి , వారి కష్టాలను, కన్నీళ్ళను, సమస్యలను కడ తేర్చడమే కాక , వారిని ఆత్మ జ్ఞానాన్ని అందించి , వారి వారి హృదయాలలో పేరుకు పోయి వున్న అజ్ఞానాన్ని పటా పంచలు చేసి, జ్ఞాన మార్గం లో నడిపించిన అసామాన్య, విశిష్ట గురుదేవులు శ్రీ సాయినాధులు. మనసా వాచా , కర్మణా తనకు సర్వశ్య శరణాగతి ఒనరించిన భక్తుల లలాట లిఖితాన్ని సైతం తిరగ రాసిన ఆశ్రిత కల్పవృక్షం శ్రీ సాయి. అటువంటి శ్రీ సాయినాధులు చేసిన ఒక దివ్య లీలను ఇప్పుడు స్మరించుకుందాము.

గంగా యమునా నదులు కలియు చోటుకు ప్రయాగ అని పేరు. ఈ త్రివేణీ సంగమంలో స్నాన మాచరించిన వారికి వారి పూర్వ జన్మ దుష్కర్మలు నశించి గొప్ప్ప పుణ్యం లభిస్తుందని హిందువుల నమ్మకం. ఏకాదశి, పౌర్ణమి మరియు ఇతర పండుగ దినములలో లక్షల సంఖ్య లో భక్తులు వెళ్ళి ఈ త్రివేణీ సంగమం లో స్నాన మాచరించడం అనాది నుండి ఆచారాంగా వస్తోంది. శ్రీ సాయినాధుని నిష్కల్మష భక్తుడైన దాసగణు మహారాజు ఒకసారి త్రివేణీ సంగమం లో స్నానం చేద్దామన్న దివ్య సంకల్పం తో సాయి వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చెసి " బాబా! నాకు ప్రయాగ పోయి త్రివేణీ సంగమం లో స్నానం చేయడానికి అనుమతి ఇవ్వండి" అని ప్రార్ధించాడు. అందుకు శ్రీ సాయి చిరునవ్వుతో "త్రివేణీ సంగమం లో స్నానం చేయుటకు అంత దూరం పోవలసిన పని లేదు. నా భక్తులకు ప్రయాగ ఇక్కడే వుంది. నా మాటలను త్రికరణ శుద్ధిగా నమ్ము" అని పలికారు. అంతలోనే ఆశ్చర్యాలలో కెల్లా ఆశ్చర్యమైన సంఘటన జరిగింది. దాసగణు మహారాజ్ శ్రి సాయి పాదాలపై శిరస్సును వుంచిన తరుణం లోనే శ్రీ సాయి రెండు పాదాల బొటన వేళ్ళ నుండి గంగా, యమునా నదుల జలములు కాలువలుగా పారాయి. 

అత్యధ్బుతమైన ఈ మహత్యాన్ని చూసిన దాసగణు మహారాజు ఆశ్చర్య చకితుడయ్యాడు. ప్రేమ, భక్తావేశాలతో మైమరచాడు. కనులు ఆనందం తో వర్షించాయి.శ్రీ సాయినాధుని తన కవితా హృదయం తో వేన్నోళ్ళ కీర్తించాడు. శ్రీ సాయినాధుని బొటన వేళ్ళ నుండి జారువ్రాలిన గం గా, యమునా నదుల పవిత్ర జలాలను శిరసుపై జల్లుకున్నాడు. శ్రీ సాయి సమాధి చెందిన తరువాత దాసగణు మహారాజు ఔరంగాబాదు లో ఒక యోగి పుంగవుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసాడు. అప్పుడు ఆ యోగి అగ్రహావేశాలతో " ఓరి మూర్ఖుడా! ఈ సృష్టి అంతటికీ గురువైన శ్రీ సాయినాధుల పాదాల నుండి ఉద్భవించిన గంగా ,యములా నదుల జలములను మూర్ఖత్వం తో శిరస్సున జల్లుకున్నావే గాని తీర్ధం గా లోపలికి స్వీకరించలేదు. ఇప్పటి వరకూ ఎవరికీ లభించని అరుదైన అవకాశం నీకి లభిస్తే దానిని జారవిడుచుకున్నావు. నిన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడు " అని దాసగణు మహారాజును తిట్టిపోసాడు. అప్పటికి గానీ శ్రీ సాయినాధులు ఎంతటి అద్భుతమైన గురువో, ఆయన తనపై నిండు ప్రేమతో ఇచ్చిన అవకాశాన్ని తాను ఏ విధం గా జారవిడుచుకున్నాడో దాసగణు మహారాజుకు అర్ధం కాలెదు. తన భక్తులు కోరితే ఆ ముల్లోకాలను సైతం భువికి రప్పించగల అద్భుత, అసామాన్య శక్తి వంతుడు మన సమర్ధ సద్గురువైన శ్రీ సాయినాధులు. .

లోకాస్సమస్తా సుఖినోభవంతు :
సర్వే జన: సుఖినోభవంతు

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు

Wednesday, 8 March 2017

శ్రీ సాయి దివ్య జ్ఞానామృతం – 32


మన దేశం లో 19 వ శతాబ్దం లో మత మౌడ్యం తీవ్ర తరం అయ్యింది. హిందు, ముస్లిం ల మధ్య కలహాలు ఎక్కువై , ప్రాణ నష్టం జరిగి, రక్తం ఏరులై పారేది. రెండు మతాల వారు ఒకరంటే మరొకరికి ఏ మాత్రం పొడ గిట్టని దుర్భర పరిస్థితి. అటువంటి తరుణం లో రెండు మతాల మధ్య సద్భావం నెలకొల్పడానికి, సోదర భావం పెంపొందించడానికి స్వయాన ఆ పరబ్రహ్మమే ఒక ఫకీరు రూపం లో ఈ భువిపై అవతరించారు. ఆ అవతారాన్ని లక్షలాది భక్తులు సాయిఅని ఎంతో ప్రేమతో పిలుచుకునేవారు. ఇహపర శ్రేయస్సు చేకూర్చే జీవిత విధానమే ధర్మం ! అన్ని మతాలు ఒక్కటే ! అందరి మహనీయుల ప్రవచన సారాంశం ఒక్కటే! అందరు మతస్తులు ఆ పరమాత్మ బిడ్డలమే ! అందరిలో ప్రవహించేది ఒకే రక్తం. అందరిలో సజీవమై ప్రకాశించే ఆత్మ తత్వం ఒక్కటే . హిందువుల దైవమైన రాముడు , ముస్లిం ల దైవమైన అల్లా ఒక్కరే. ఆ పరమాత్ముడిని చేరేందుకు వివిధ మార్గాలే మతాలు. దారులు వేరైనా , చేరబోయే గమ్యం ఒక్కటే. ఆందుకని మీలో మీరు కలహించుకోవడం మానండి » అని శ్రీ సాయినాధులు తన భక్తులకు ప్రభోదించే వారు. మానవులలో దట్టం గా పేరుకొని పోయి వున్న మత మౌఢ్యాన్ని తొలగించి , వారికి నిజమైన ఆధ్యాత్మిక ధర్మం తెలిపి , వారిని జ్ఞా నవంతులను చేయడానికే శ్రీ సాయినాధులు అవతరించారు.

ఒకసారి శిరిడీలో ఒక ముస్లిం భక్తుడు తనకు సంతానం కలిగితే శిరిడీకి వచ్చి మిఠాయిని పంచుతానని మొక్కుకున్నాడు. బాబా అనుగ్రహం వలన అతని కోరిక ఫలించింది. పండంటి మగ సంతానం కలిగింది. కోరిక నెరవేరిన నేపధ్యం లో శిరిడీ వచ్చి మిఠాయి పంచడానికి శ్రీ సాయినాధుల అనుమతి కోరాడు ఆ ముస్లిం. బాబా చిరునవ్వు నవ్వి 'వెళ్ళి మారుతీ ఆలయం లో మిఠాయిని పంచు" అని అన్నారు. ఆ ముస్లిం బాబా మాటలకు ఆశ్చర్య పడి " నేను ముస్లిం ను కదా ! హిందువుల ఆలయం లో మిఠాయిని ఎలా పంచగలను ?" అని అడిగాడు. అందుకు బాబా నవ్వి " ఇటీవల జరిగిన యుద్ధం లో ఆంజనేయుడు అల్లాను ఓడించాడు " అని మరింత కోపంతో "ఏమి ముస్లిం వి రా నువ్వు ? ఇదేనా ఖురానును చదివి నువ్వు అర్ధం చేసుకున్నది ? వెళ్ళి మారుతీ ఆలయం లో మిఠాయిని పంచు " అని అజ్ఞాపించారు. ఇక చేసేది లేక ఆ ముస్లిం భక్తుడు మారుతి ఆలయం లో మిఠాయిని పంచి తన మొక్కును తీర్చుకున్నాడు. నామ, రూప, గుణ రహితుడు, సర్వ గతుడు, విశ్వ వ్యాప్తుడైన భగవంతునిపై భక్తికి మత భేదం అడ్డు కారాదని ఈ లీల ద్వారా శ్రీ సాయి మనకు కళ్ళకు కట్టినట్లుగా తెలియజేసారు.

మత మార్పిడిని శ్రీ సాయి తీవ్రం గా నిరసించేవారు.విశ్వానికి సృష్టి, స్థితి, లయ కారకుడైన భగవంతుడు ఒక్కడే ! సందర్భానుసారం గా వివిధ కాలాలలో వివిధ రూపాలను ధరించి తన అవతార కార్యం గావించేవాడు. అన్ని మతాలు ఆ భగవంతుడిని చేరడానికే పుట్టాయి. సర్వ మానవ సమానత్వాన్ని ఉద్భోదించే శ్రీ సాయి భక్తులకు మతం మార్చుకోవడం అనవసరం అని చేప్పేవారు.శ్రీ సాయికి కూర్మి భక్తుడైన బడే బాబా ఒక హిందువును ముస్లిం గా మార్చి శ్రీ సాయి దర్శనానికి తీసుకు వచ్చి తాను చేసిన ఘనకార్యాన్ని వివరించాడు. అప్పుడు శ్రీ సాయి ఉగ్రులై ఆ యువకుని చెంప పగిలేలా కొట్టి " నీ తండ్రిని మార్చుకున్నావట్రా ! " అని అరిచారు. తన మతాన్ని మార్చుకోవడం తండ్రిని మార్చుకున్నం త పాపమని బాబా వారి అభిప్రాయం.

మరొక సంధర్భం లో సాయి భక్తాగ్రేసరుడైన దాదా కేల్కర్ ను సాయి పిలిచి కొంత డబ్బిచ్చి మాంసం కొని తీసుకు రమ్మన్నారు.దాదా కేల్కర్ సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాడు. సదాచార సంపన్నుడు. రక్తం చూస్తే చాలు కళ్ళు తిరిగి క్రింద పడిపోతాడు. అటువంటి వ్యక్తి తన సమర్ధ సద్గురువైన సాయి చెప్పిన వెంటనే నిస్సంకోచం గా బయలుదేరాడు. మధ్య మార్గం లో అతనిని వెనక్కు పిలిచి ఇంకెవరినైనా పంపించమని చెప్పారు శ్రీ సాయి. ఇంకొక సారి మశీదులో మాంసం పలావు వండుతున్న శ్రీ సాయి దాదా కేల్కర్ ను పిలిచి "పలావు ఎలా వుందో రుచి చూడు" అని అడిగారు. కేల్కర్ చూడకుండానే "చాలా బావుంది" అని అన్నాడు. సాయి నవ్వుతూ "రుచి చూడకుండానే బాగుందంటావేం ? " అంటూ కేల్కర్ చేతిని బాండీ లోనికి తోసి "సరిగ్గా విడికిందో లేదో చూడు, ఆచారం గురించి భయపడకు " అని ప్రేమగా అతనిని గిల్లారు.

ఆచార వ్యవహారాలు శరీరానికే గాని ఆత్మకు లేవు. పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సాయి తన ఆజ్ఞలను శిష్యులు ఏ మేరకు పాటిస్తున్నారో పరీక్ష చేసేందుకే నిషిద్ధమైన పనులను పురమాయించేవారు. గురువు పాదాలకు సర్వశ్య శరణాగతి చేసే గురువు ఆజ్ఞ ను తు:చ: తప్పక పాటించే భక్తులకే గురువు యొక్క అనుగ్రహ ఫలం శ్రీఘ్రం గా లభిస్తుంది. గురువు ఆజ్ఞలను తన స్వంత బుద్ధితో ఆలోచించి తర్క, వితర్కాలను చేసే వారికి ఎన్ని జన్మలకైనా అనుగ్రహం లభించదు.

లోకాస్సమస్తా సుఖినోభవంతు :
సర్వే జన: సుఖినోభవంతు
సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు

Saturday, 4 March 2017

శ్రీ సాయి దివ్య జ్ఞానామృతం – 31అఖిలాంఢకోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు అయిన శ్రీ సాఅయినాధులు తన చిత్ర విచిత్రమైన పద్ధతులద్వారా , తన భక్తుల లోనే కాకుండా, తన వద్దకు వచ్చే అందరి మనసులలో వున్న సంశయ స్వభావాలను, సందిగ్ధ ఆలోచనలను, అపనమ్మక ధోరణులను తొలగించి వారిలో తన పట్ల, దైవం పట్ల నమ్మకం దృఢమగునట్లు చేసేవారు. ఇందుకోసం కొన్ని సార్లు భోధల ద్వారా, మరికొన్ని సార్లు కేవలం కంటిచూపు ద్వారా, స్పర్శ ద్వారా కూడా వారి హృదయాలలో పరివర్తన తీసుకొచ్చేవారు. భక్తులు , సందర్శకులు , ఆఖరుకు నాస్తికులు కూడా శిరిడీ నుండి తిరిగి వెళ్ళేటప్పుడు పరిశుద్ధ హృదయులై, అన్ని సంశయములను తొలగించుకొని పరిపూర్ణమైన ఆనందం స్వంతం చేసులొని తమ తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళేవారు.. అటువంటి ఒక లీలను ఈ క్రింద ముచ్చటించుకుందాము.

కాకా మహాజని స్నేహితుడు ఒకడు విగ్రహారాధనకు విముఖుడు.బాబాలను, స్వాములను అస్సలు నమ్మడు.ఇతరుల ద్వారా బాబా గురించి విని శిరిడీలో జరిగే వింతలను చూద్దామని సంకల్పించాడు.కాకా మహాజని తో నేను శిరిడీకి వచ్చి అక్కడి వింతలను, విశేషాలను చూస్తాను. కాని బాబాకు నమస్కరించడం, దక్షిణ ఇవ్వడం వంటి పనులను చేయను అని ఖచ్చితంగా చెప్పేసాడు. బాబాకు నమస్కరించమని అక్కడ ఎవ్వరూ బలవంతపెట్టరని, మనకు తగిన రీతిలో అక్కడ ప్రవర్తించవచ్చునని కాకా అతనికి జవాబిచ్చాడు. ఇద్దరు కలిసి బొంబాయి విడిచి ఆ మర్నాడు శిరిడి చేరారు. వారు మశీదు మెట్లు ఎక్కినంతనే కొద్ది దూరంలో నిల్చొని వున్న శ్రీ సాయి వారిని మంచి మాటలతో ఆహ్వానించారు. బాబా మాటలను విన్నంతనే కాకా మహాజని స్నేహితుడు ఆనందంతో పరుగు పరుగున వెళ్ళి బాబా కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నాడు. ఆతని ప్రవర్తనకు కాకా ఒకింత ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత అసలు సంగతి అడుగగా బాబా నా తండ్రి కంఠముతో నను ఆహ్వానించారు. ఎప్పుడో గతించిన నా తండ్రి కంఠం ఇన్నేళ్ళ తర్వాత విన్న వెంతనే నా హృదయం మైమరిచిపోయింది. నా తండ్రిని గుర్తుకు తెచ్చిన బాబా వారి కరుణా వాత్సల్యం గురించి ఏమని చెప్పగలను అని గద్గద స్వరంతో చెప్పాడు కాకా స్నేహితుడు.

తమను దర్శించిన కాకా మహాజనిని బాబా వరుసగా దక్షిణ అడుగసాగారు. తన భక్తులు మొక్కిన మొక్కులను తీర్చుటకు, వారి పాప పరిహార్ధం బాబా వారిని దక్షిణ అడుగుచుండేవారు. బాబా కాకనే దక్షిణ అడిగారు గానీ అతని స్నేహితుడిని అడుగలేదు. నేనూ నీతో పాటు వున్నాను కదా, నన్నెందుకు బాబా దక్షిణ అడగడంలేదు ?” అని అతని స్నేహితుడు కాకాని అడిగాడు.అతని మనసులోని మాటలను కనిపెట్టినవాని వలే బాబా నీకు ఇవ్వడం ఇష్టంలేదని బొంబాయిలో నీ స్నేహితుడికి చెప్పావు కాబట్టి నిన్ను నేను దక్షిణ అడగడం లేదు. కానీ నీకు మనస్పూర్తిగా ఇవ్వాలనిపిస్తే ఇవ్వవచ్చునుఅని అన్నారు. కాకా మహాజని స్నేహితుడు అందుకు ఎంతో సంతోషించి అప్పటి వరకు కాకా ఇచ్చినంత దక్షిణను సమర్పించుకున్నాడు.అప్పుడు బాబా వారికి ఒక చక్కని బోధను చెసారుమా మధ్య వున్న ఆ తెరను తీసివేయండి. నిజానికి గురు శిష్యుల మధ్య బేధమేమీ లేదు. ఇద్దరూ పరమాత్మ స్వరూపులే ! కాని శిష్యుని అంతరంగం అజ్ఞనంతో మలినమైపోయి వుండడం వలన తన అసలు స్వరూపాన్ని దర్శించలేక పోతున్నాడు. గురువుకు సంపూర్ణ శరణాగతి చేస్తే అప్పుడు గురువు తన అపూర్వమైన శక్తితో శిష్యుని యొక్క అజ్ఞనాన్ని తొలగించివేస్తారు. అందుకని గురువు వేరు, శిష్యుడు వేరు అన్న బేధ భావమును మీ మనస్సులనుండి తీసివేయండి

బాబా చేసిన ఈ అపూర్వమైన బోధకు పరవశం చెందిన వారు ఇరువురూ ఎంతో ఆనందంగా తమ ఇంటికి బయలు దేరారు


సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణమస్తు