Monday, 20 March 2017

శ్రీ సాయి దివ్య జ్ఞానామృతం – 35శ్రీ సాయినాధుని చాలా కాలం పూజించి సేవించిన మహా భక్తురాలు శ్రీ మతి చంద్రాబాయి బోర్కర్ యొక్క జీవితం లో శ్రీ సాయినాధులు చేసిన ఒక అద్భుతమైన లీలను మనం అధ్యాయం - 27 లో చదివాము. ఆ మహా స్వాధి జీవితం లో శ్రీ సాయి చేసిన మరి రెండు లీలలను ఇప్పుడు స్మరించుకుందాము. శ్రీ సాయినాధుని లీలా చరిత్రామృతమును మనసారా ఆస్వాదించుదాము.

1909 వ సంవత్సరం లో శ్రీమతి బోర్కర్ శిరిడీలో కోంత కాలం నివసించేందుకు వెళ్ళింది. ఆ సమయం లో ఆమె భర్త భూలోక వైకుంఠమైన పండరీ పూరు లో ఉద్యోగం చేస్తుండే వాడు. ఒక రోజు మశీదులో కూర్చొని వుండగా శ్రీ సాయి చంద్రా బాయి తో " ఆమ్మా , నువ్వు అర్జంటు గా పండరీ వెళ్ళు , నేను నీకు తోడుగా వుంతాను, నాకు ఏ రైలు అవసరం లేదు" అని అన్నారు. బాబా మాటలను బట్టి తన భర్తకు ఏదో ప్రమాదం సంభవించి వుండవచ్చని భావించిన శ్రీమతి చంద్రాబాయి హుటా హుటిన బయలు దేరి పండరీ వెళ్ళింది. అక్కడ చిత్రం గా ఆమె భర్త తాను చేస్తున్న ఉద్యోగం వదిలేసి, ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళిపోయాడు. ఆయన ఆచూకి గురించి ఎంతమంది తో వాకబు చేసినా ఏమీ ప్రయోజనం లేకపోయింది.ఇక దిక్కు తోచక ఆమె తన వద్ద వున్న మిగిలిన డబ్బుతో కురుద్వాడి వద్దకు చేరుకొని స్టేషనులో బెంచీ పై కూర్చూంది. తన ఆరాధ్య దైవమైన శ్రీ సాయే తనకు ఒక మార్గం చూపిస్తారన్న ధృఢమైన విశ్వాసం తో సాయి నామ జపం చేస్తూ అక్కడే కూర్చుంది.ఇంతలో ఒక ఫకీరు వచ్చి "వెంతనే ఇప్పుడు వచ్చే రైలు ఎక్కి ధోండ్ స్టేషనుకు వెళ్ళు, అక్కడ మీవారు వున్నారు " అని చెప్పి ఆమె చేతిలో ఒక రైల్వే టిక్కట్టును పెట్టి వెళ్ళిపోయాడు. శ్రీమతి చంద్రాబాయి ఆనందంతో ఆ ఫకీరు చెప్పినట్లే చేయగా ధోండ్ స్టేషనులో ట్రెయిను దిగగా అక్కడ అదే ప్లాట్ ఫారముపై కునికి పాట్లు పడుతున్న ఆమె భర్త కనిపించాడు.ఆయన తన భార్యను దగ్గరగా తీసుకొని క్షమించమని చెప్పి" నేను మనస్సు బాగులేక ఎక్కడికో దూరం గా పారిపోదామనుకున్నాను. కాని ఒక ఫకీరు వచ్చి నా తల్లిని అశ్రద్ధ చేయవద్దు.ఆమె ఇప్పుడు రైల్లో వస్తుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకో అని మందలించి మాయమైపోయాడు." అని అన్నారు. జరిగిన దంతా శ్రీ సాయినాధుని లీలేనని, శ్రద్ధ, విశ్వాసం తో పూజిస్తే తన భక్తులను ఎల్లవేళలా కాపాడుతారని ఆ దంపతులిద్దరికీ మరొక సారి అవగతమయ్యింది.

మరొక సారి శ్రీ సాయినాధులు శ్రీమతి చంద్రాబాయి కలలో కనిపించి " నీ భర్తను తీసుకుపోతున్నాను. ధైర్యం గా వుండు " అని చేప్పారు. అప్పుడు చంద్రాబాయి కలలో కన్నీళ్ళ తో బాబా పాదాలపై పడి " ఈ చతుర్మాస్యం వెళ్ళేదాక ఆయన ప్రాణాలు నిలపమని కోరింది. సరేనన్నారు బాబా. చతుర్మాస్యం లో ఆమె భర్తకు ప్రమాదకరమైన జబ్బు చేసింది. డాక్టర్లందరూ ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని ఇక కొద్ది రోజుల కంటే ఎక్కువగా బ్రతకరని తేల్చి చెప్పేసారు. కాని శ్రీమతి చంద్రాబాయికి బాబాపై అమితమైన విశ్వాసం వుంది. కనుక డాక్టర్ల మాటలను పట్టించుకోలేదు. బాబా ఆశీర్వదించినట్లే చతుర్మాస్యం గడిచింది. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు,డాక్టర్లు ఇక ఆయన ప్రాణానికి ఏ ప్రమాదం లేదని చెప్పారు. ఒక రోజున ఆమె భర్త విష్ణు సహస్ర నామము చదివించుకొని, టీ త్రాగి కళ్ళు తేలేసారు,. బాబా చెప్పినది గుర్తొచ్చి ఆమె ఆయన గొంతులో గంగ వేసింది. సాయినాధా అంటూ ఆమె భర్త హాయిగా కళ్ళు మూసారు. తన భక్తురాలి నిష్కలంకమైన ప్రేమకు కరిగిపోయి, ఆమె భర్త యొక్క మరణాన్ని కూడా పోస్ట్ పోన్ చేసిన శ్రీ సాయినాధుని లీలలను వర్ణింప శక్యమా ?

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణమస్తు
సర్వే జనా సుఖినోభవంతు
లోకాస్సమస్తా సుఖినోభవంతు :