Thursday, 24 August 2017

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 41


భక్తులను సంరక్షించడం లో శ్రీ సాయిది ఒక విబ్భిన్నమైన పద్ధతి. భక్తులు తన వద్దకు రోగాలతో బాధపడుతూ వచ్చి తగ్గించమని ప్రార్ధించినప్పుడు విబ్భిన్నమైన పద్ధతులలో శ్రీ సాయి వారికి చికిత్స చేసేవారు. కొంతమందికి ఊదీ, తీర్ధ ప్రసాదాలను ఇవ్వడం ద్వారా, మరి కొంత మందికి తలపై చేయి పెట్టి లేదా రోగ గ్రస్తమైన శరీరపు భాగాన్ని తాకడం ద్వారా ఇంకొంతమందికి కలలో కనిపించి తీసుకోవల్సిన మందు తెలుపడం, కొందరికి అపధ్యమైన ఆహారం స్వీకరించమనడం , ఇలా వివిధ రకాలుగా చికిత్స చెసి ఎన్నో ప్రాణాంతకమైన వ్యాధుల నుండి తమ భక్తులను శ్రీ సాయి రక్షించారు.ప్రమాదకరమైన క్షయ రోగం నుండి బాధపడుతున్నప్పుడు భక్త భీమాజీకి సాయి కలలో అతను బాధలు పడేటట్లు చెసి అతని రోగాన్ని తగ్గించారు. కలలో నరక యాతన అనుభవించిన తర్వాత జాగృత్ వ్యవస్థ లోనికి వచ్చాక అతని క్షయ రోగం మటుమాయమైపోయింది. మరొక సంధర్భం లో శ్రీ సాయి ఒక భక్తుడిని పరోక్షం గా ఎలా వ్యాధి నుంది రక్షించారో ఇప్పుడు చూద్దాం.
ఒకసారి శిరిడీలో వివశిస్తుండగా కాకా దీక్షిత్ కు (ఈయనను శ్రీ సాయి ప్రేమతో లంగడా కాకా అని అంటుండే వారు) తీవ్రం గా జ్వరం వచ్చింది. లేవలేకున్నాననీ, తనకు మందు ఇప్పించమని అతను శ్యామా ద్వారా శ్రీ సాయికి కబురు చేసాడు.శ్రీ సాయి కోపం తో "ప్రతీ వారు కోరికలతో నా దగ్గరకు వచ్చే వారే! నేనేమీ వైద్యుడను కాను. అతనిని ఇంటికి వెళ్ళిపోమని చెప్పు" అని శ్యామాతో అన్నారు." సాయి కాకా మిమ్మల్నే నమ్ముకున్నాడు. ఇంత తీవ్రమైన జ్వరం తో అతని ఇంటికి ఎలా వెళ్ళగలడు ? దయ చేసి అతని బాధను తగ్గించండి !" అని శ్యామా శ్రీ సాయి ని వేడుకున్నాడు. అయినా శ్రీ సాయి మనసు మారలేదు. బొంబాయికి తిరిగి వెళ్లడానికి తన వద్ద శెలవు తీసుకోడానికి వచ్చిన దీక్షిత్ తో శ్రీ సాయి "తక్షణమే ఇంటికి పో ! ఎలా వచ్చిన జ్వరం అలానే పోతుంది. సీమ బాదం పప్పు, పిస్తా కలిపిన పాయసం శుభ్రం గా తిని తిరుగు. పడుకోకు" అని అన్నారు. శ్యామా ను తోడుగా దీక్షిత్ తో పంపించారు శ్రీ సాయి. బొంబాయి చేరేసరికి దీక్షిత్ వళ్ళు తీవ్రమైన జ్వరం తో కాలిపోతోంది. కుటుంబ సభ్యులందరూ ఆందోళన పడ్దారు. డాక్టర్లు మందులు ఇవ్వజూసారు కాని వాటిని దీక్షిత్ సున్నితం గా తిరస్కరించాడు. ఈ భౌతిక ప్రపంచం లోని డాక్టర్ల కంటే ఈ సృష్టి, స్థితి లయకారుడు, అనంతకోటి బ్రహ్మాండాలకు నాయకుడైన శ్రీ సాయి పైనే దీక్షిత్ కు గురి. ఏ మందులు వేసుకోకుండా, శ్రీ సాయి చెప్పిన అపధ్యమైన ఆహారం తింటూ దీక్షిత్ హాయిగా వున్నాడు. జ్వరం దానంతట అదే పోయింది. శారీరక రోగమే కాక అజ్ఞానమమే మానసిక రోగం కూడా తొలగాలి అందుకే బాధలను ఓర్చుకోవాలని (సబూరి)శ్రీ సాయి ఈ లీల ద్వారా మనకు తెలియజేసారు. ఎటువంటి ప్రాణాంతక మైన వ్యాధులు సంభవించినా శ్రీ సాయి సన్నిధిని శరణు వేడితే ఆ సద్గురువు అనుగ్రహ ఫలం వలన అవి వాటంతట అవే మటుమాయమౌతాయి.

మరొక సంధర్భం లో సాయి భక్తుడైన రఘువీర పురందరే శిరిడీ యత్రకు బయలు దేరినప్పుడు అతని కుమారుడికి తీవ్రం గా జ్వరం వచ్చింది. అందుకనే అతని భార్య ప్రయాణం మానుకుంది. పురందరే తల్లి ఆమెకు తోడుగా వుండిపోతానని అంది కాని ఆ అవసరం లేదని పురందరే ఆవిడను తనతో శిరిడీకి తీసుకువెళ్లాడు. అదే రోజు రాత్రి పురందరే భార్యకు శ్రీ సాయి కలలో కనిపించి , ఆమె కుమారుడి నుదిట ఊదీ పెట్టి ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. కల చెదిరి చుట్టూ చూసేసరికి ఎవ్వరూ కనిపించలేదు. ఆ క్షణం నుండే ఆ బిడ్డకు జ్వరం తగ్గిపోయింది. ఏ మందుల అవసరం లేకుండానే క్షణాలలో తన బిడ్డ అనారోగ్యాన్ని తగ్గించిన శ్రీ సాయి భక్త వత్సలతకు , అపూర్వమైన యోగ శక్తికి ఆ తల్లి అబ్బుర పడి మనస్సు లోనే శత కోటి వందనాలను అర్పించింది.

నీ గురు సిద్ధాంతమే నీకు వేదం. నీ గురు బోధలే నీకు ధర్మ శాస్త్రాలు.గురువు లోనే సకల దేవతలు, సమస్త సాధువులు, సమస్త యోగులను దర్శించి ఆరాధించు. గురువును అన్ని వేళలా అనన్య చింతనతో, అవ్యభిచారిణీ భక్తితో ఆరాధించడం, కొరికలే కోరని స్థితికి ఆధ్యాత్మికం గా ఉన్నతి సాధించడమే మన లక్ష్యం కావాలి.”

సర్వం శ్రీ శిరిడీ సాయి పాదార్పణమస్తు

సర్వే జనా: స్సుఖినోభవంతు :

Monday, 21 August 2017

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 40


ఈ సృష్టి అంతటికీ మూలకారణమైన ఆ సర్వాంతర్యామి అయిన భగవంతుడు సర్వ జీవులను సృష్టించి అందరికీ తండ్రి అయ్యాడు. పంచభూతముల వలె తన నుండి సకల జీవ కోటికి దేహం, పోషణ ఇచ్చి తల్లి అయ్యాడు. మానవులందరికి సన్మార్గం చూపించడం కోసం, వారికి వారికి ధర్మ యుతమైన జీవితం జీవింపజేయడం కోసం వేదాలు,ఉపనిషత్తులు , పురాణేతిహాసాలు అనుగ్రహించి అప్త వాక్యం చెప్పే మిత్రుడయ్యాడు. ఈ సకల సృష్టిలో సృష్టి, స్థితి, లయ గావించి ఈశ్వరుడయ్యాడు. అటువంటి ఆ భగవంతుని మరొక స్వరూపమే సద్గురువు. అందుకే ఆ సద్గురువు త్రిమూర్తులతో సమానమని , సద్గురువే తల్లి, తండ్రి, పరబ్రహ్మ మని గురు గీత చెబుతోంది.
కలి కాలపు ప్రభావం లో చిక్కుకొని అనుక్షణం ఎన్నో బాధలకు గురవుతున్న మానవాళికి తగు రీతిన సన్మార్గం చూపి, వారిని అనుగ్రహించడానికి భగవంతుడు ఎన్నో రూపాలలో ఈ భువిపై అవతరిస్తూ వుంటాడు. తన సశరీరులుగా వున్నప్పుడే కాక శరీరం విసర్జించిన తర్వాత కూడా తనను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తూ ఈ అవతార కార్యాన్ని నెరవేరుస్తుంటాడు. అటువంటి మహనీయులలో అగ్రగణ్యులు, మహోన్నత శక్తి సంపన్నులు, భక్తుల పాలిటి కల్పవృక్షము,కామెధేనువు శ్రీ శిరిడీ సాయినాధులు . మహారాష్ట్ర లోని గోదావరీ పరీవాహక ప్రాంతమైన అహ్మద్ నగర్ జిల్లా లోని శిరిడీ గ్రామం లో సుమారు 60 సం లు సంచరించి ఎందరో లక్షలాది భక్తులను అనుగ్రహించి ఆశీర్వదించి వారిని జ్ఞాన మార్గం లో నడిపించారు.జ్ఞానం స్వశక్తితో లభించదు. దానికి గురువు యొక్క ఆవశ్యకత తప్పని సరిగా ఉండాలి.వేద, శాస్త్రాధ్యనాలు, పురాణ పఠణం , యజ్ఞ యాగాది కర్మ కాండలు మనో నైర్మల్య దోహదాలే తప్ప, ఆత్మ సాక్షాత్కారాన్ని ఇప్పించ లెవు. బాబా వారి బోధలు విన్నూత రీతిలో వుండి భక్తులకు అర్ధ మయ్యే రీతిలో వుండేవి. ఆయన సమయానికి, సంధర్భానికి అనుకూలం గా వుండే బోధలను చేసేవారు. తనను నమ్మిన వారిని సన్మార్గం లో నిలపడానికి, వారిలో అజ్ఞానాన్ని రూపు మాపడానికి , భక్తుల సంస్కారానికి తగినట్లుగా బోధ చెయ్యడం ఆ సమర్ధ సద్గురువుకే సాధ్యం. అటువంటి బోధను ఇప్పుడు చదువుదాం.

ఒకానొక సమయం లో శిరిడీ లో కలరా వ్యాధి ఉధృతం గా వుంది.ఆ గ్రామాధికారులు రెండు చట్టాలను చేసారు. ఒకటి పొరుగూరు నుండి వంట చెరకు కట్టెల బందిని గ్రామం లోకి అనుమతించకపోవడం, రెండవది జంతు వధను నిషేధించడం. శ్రీ సాయి తాను జీవించిన 60 సం లలో తనను నమ్మిన వారి కోసం అహర్నిశలు తాపత్రయపడే వారు. ఎందరో పేదలు తమ తమ అవసరాల కోసం మశీదు లోనికి వచ్చి సరుకులను, వస్తువులను తీసుకుపోయే వారు అయినా శ్రీ సాయి వారికి ఏ విధమైన అభ్యంతరం పెట్టే వారు కాదు. ఈ మొదటి చట్టం వలన గ్రామం లో కట్టెలకు తీవ్రమైన కొరత ఏర్పడింది. అప్పుడు శ్రీ సాయి ఆ నిషేధాన్ని అతిక్రమించి ఆ ఊరి పొలిమేరల లోనికి వచ్చిన కట్టెల బండిని రప్పించి మశిదు కోసం కట్టెలను కొన్నారు, అంతే కాక ఆ కట్టెలను నిరుపేదలకు ఉచితం గా పంచి వేసారు. ఈ చర్య వలన అందరూ ఆశించినట్లు ఏ విధమైన అపకారం జరుగ లేదు సరి కదా పేద ప్రజలకు కష్టం తప్పింది.గ్రామాధికారులు బాబా యొక్క ఈ చర్యను నిస్సహాయం గా చూస్తుండి పోయారు, తర్వాత బాబా యొక్క లీల లోని అంతర్యాన్ని అర్ధం చేసుకున్నారు. సద్గురువు చెప్పినదే వేదం, సద్గురువు బోధించినవే ధర్మ శాస్త్రాలు.ఆయన మాటలే మనకు వేద వాక్కు.

ఒక రోజు చావడానికి సిద్ధం గా వున్న మేకను మశీదుకు తీసుకు వచ్చారు.శ్రీ సాయి దానిని చంపమని తన ప్రియ శిష్యుడు బడా బాబాను ఆదేశించగా " దానినెందుకు అనవసరం గా చంపడం " అని బడే బాబా తప్పించుకున్నాడు. శ్రీ సాయి తర్వాత శ్యామాను ఆ మేకను చంపమన్నారు. రాధాకృష్ణ మాయి ఇంటి నుండి కత్తి తీసుకు వచ్చి శ్యామా శ్రీ సాయి ముందర వుంచాడు కాని చంపే ప్రయత్నం చెయ్యలెకపోయాడు. శ్యామా తన ఆజ్ఞాను ఉల్లంఘించడం తో శ్రీ సాయి ఆ పనిని కాకా సాహెబ్ దీక్షిత్ కు పురమాయించారు. కాకా సాహెబ్ దీక్షిత్ సనాతన బ్రాహ్మణ కుటుంబం లో పుట్టిన బ్రాహ్మణుడు. సదాచార సంపన్నుడు , పుట్టింది మొదలు రక్తం కళ్ళ జూసి ఎరగడు. కాని శ్రీ సాయి చెప్పిందే తడువు కత్తి ఎత్తి మేకను చంపబోతుంటే శ్రీ సాయి దీక్షిత్ తో " ఆగు ! బ్రాహ్మణ కుటుంబం లో పుట్టి మేకను చంపుతావా ?" అని నిరశించారు. అప్పుడు దీక్షిత్ 'తర్కాలన్నీ నాకు తెలియవు. నా సద్గురువు మీరు.మీరు చెపిందే వేదం నాకు. మీరే నాకు దైవం మీరు ఆడేశించినప్పుడు నాకు తప్పొప్పులతో సమీక్ష లేదు" అని సవినయం గా విన్నవించుకున్నాడు.

ఇక్కడ శ్రీ సాయి ఒక దివ్యమైన బోధను కళ్ళకు కట్టినట్లు మనకు తెలియజెసారు. శిష్యులలో మూడు రకాలు వుంటారు. 1. ఉత్తములు - గురువు యొక్క ఆదేశాన్ని తు చ తప్పక పాటించు వారు 2.మధ్యములు - గురువు ఆదేశాన్ని గూర్చి తమ స్వల్ప బుద్ధితో ఆలోచన చెసి తమకు నచ్చితే చేయడం , లేకుంటే మాని వేయడం 3. అధములు -గు రువు ఆదేశాన్ని ధిక్కరించే వారు. ఎంతో కృషి చేస్తే గాని పొంద లెని జ్ఞానాన్ని మనకు అరటి పండు వొలిచి అందించినట్లు అందించారు మన సాయినాధులు. ఉత్తమ శిష్యునికి గురువు యొక్క అనుగ్రహం సత్వరం లభిస్తుంది. మధ్యమునికి అనుగ్రహ ఫలం లభించేందుకు కొన్ని జన్మలు ఎత్తవలిసి వుంటుంది. అధమ శిష్యునికి ఎన్ని జన్మలు ఎత్తినా అనుగ్రహ ఫలం లభించదు. ఒక ప్రాణిని అనవసరం గా చంపకూదదు అన్న కనీస జ్ఞానం శ్రీ సాయికి లేక కాదు ఇంత కధను నడిపించినది. ఈ కలియుగం లో మానవులు తమ స్వల్ప అల్ప బుద్ధిని ఉపయోగించి తర్క, వితర్కాలు, న్యాయ మీమాంసలో పాల్గొంటారు. అదే ఒక తార్కాణం వుంతే కనీసం ఆ బోధ ద్వారా అయినా మం చిని నేర్చుకొని, మంచి బాటలో నడుస్తారని సమర్ధ సద్గురువైన శ్రీ సాయి ఒక సంఘటన ద్వారా మనకు జ్ఞాన బోధ చేసారు.ఆ సాయి చూపిన మంచి బాటలో నడిచి ఎల్లవేళలా మనల్ని సన్మార్గం లో నడిపించమని చిత్తశుద్ధితో ప్రార్ధించు దాము. సాయిని మించిన దైవం లేరు,సాయిని మించిన సద్గురువు లేరు, సర్వం సాయి మయం. ఈ జగమంతా సాయి మయం. సాయి సాయి అన్న స్మరణ లో మన జీవితాలలో జ్ఞానాన్ని నింపుకొని ముందుకు సాగుదాం.

నాలో అచంచల భక్తి - విశ్వాసాలు కలిగి వుండు. అది చాలు. నీ ఆధ్యాత్మిక వికాసంం చేతి కందివస్తుంది. అనన్య చిత్తముతో నీవు భక్తి పూర్వకముగా నా యందు నీ దృష్టి వుంచు. నీ యందు నేను దృష్టి వుంచుతాను. అప్పుడు నీవు క్షణాలలొ బ్రహ్మ జ్ఞ్ఞానం పొందుతావు. మా గురువు నాకు మరేమి నేర్పించలేదు.”

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు

సర్వే జనా: స్సుఖినోభవంతు :

Friday, 18 August 2017

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 39
శ్రీ సాయినాధులు తనకు సంపూర్ణ , సర్వశ్య సరణాగతి ఒనరించి తననే సర్వస్వం గా భావించే భక్తుల , వారి కుటుంబ సభ్యుల యొక్క పూర్తి బాధ్యతలను తానే స్వీకరించి మోసేవారు. వారికి అభయ హస్తం అందించి ఎల్లవేళలా వారిని కంటికి రెప్పలా ఏ ఆపదా రాకుండా కాపాడుతుండే వారు. శ్రీ సాయి సశరీరులుగా వున్నప్పుడు తన భక్తులను ఎలా రక్షించే వారో , ఆయన మహా సమాధి చెందిన అనంతరం కూడా తన భక్త జన సంరక్షణ అనే అవతార కార్యాన్ని అంతే సమర్ధవంతం గా నిర్వర్తిస్తున్నారు. శ్రీ సాయి భక్తులకు ఈ విషయం ఎన్నో సార్లు అవగతమయ్యింది.

ఒక సంధర్భం లో శ్రీ సాయిని గర్భిణి అయిన ఒక భక్తురాలు తన అయిదవ నెలలో దర్శించుకొని తనకు సుఖ ప్రసవం అయ్యేలా చూడమని కోరింది. బాబా చిరునవ్వుతో విభూతి ప్రసాదాలను ఆమెకు ఇచ్చి తధాస్తు అని దీవించారు. ఆ భక్తురాలికి నెలలు నిండి ప్రసవ వేదన పడుతున్న సమయం లో మశీదులో వున్న బాబా హఠాత్తుగా లేచి తన భక్తులతో తనకు కడుపులో నొప్పిగా వుందని చెప్పి, ఒక గుడ్డను కడుపుకు చుట్టుకొని రెండు కొనలను గట్టిగా లాగుతుండమని చెప్పారు. భక్తులు ఆశ్చర్యం తో అదే విధం గా చెయ్యగా కొద్ది సేపటికి నొప్పి తగ్గిందని , ఇప్పుడు హాయిగా వుందని బాబా యధా విధిగా తన స్థానం లో వెళ్ళి కూర్చున్నారు. ఆ తర్వాత గ్రామం నుండి వచ్చిన కబురు ప్రకారం బాబా తనకు కడుపులో నొప్పి వుందన్న సమయం లోనే ఆ భక్తురాలు ప్రసవ వేదన పడిందని , నొప్పి తగ్గిందని చెప్పగానే ఆ భక్తురాలికి సుఖ ప్రసవం అయ్యిందని అందరికీ తెలిసింది. తాను అభయం ఇచ్చిన తరువాత ఇక ఆ భక్తుల కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు ఇక తనవే అని బాబా ఈ లీల ద్వారా అద్భుతం గా నిరూపించారు.


మరొక లీలలో తనను దర్శించడానికి వచ్చిన మోరేశ్వర్ ప్రధాన్ అనే భక్తుడితో శ్రీ సాయి " నా శరీరం లో ఈ ప్రక్కగా చాలా నొప్పిగా వుంది, అయినా మందులేమీ అవసరం లేదు, నాలుగు రోజులలో అదే సర్దుకుంటుంది" అని అన్నారు . ప్రధాన్ శ్రీ సాయిని దర్శించిన తర్వాత బొంబాయికి తిరిగి వెళ్ళడానికి అనుమతి అడిగాడు, కాని శ్రీ సాయి « మరొక నాలుగు రోజులు ఇక్కడే వుండి వెళ్ళు » అని అతనిని శిరిడీ లోనే వారం రోజుల పాటు వుంచేసారు. ఆ తర్వాత బొంబాయికి తిరిగి వెళ్ళిన ప్రధాన్ కు అసలు విషయం తెలిసింది. తాను శిరిడీ వెళ్ళినప్పుడు అతని తల్లికి అకస్మాతుగా పక్షవాతం వచ్చింది.కుటుంబ సభ్యులందరూ సమయానికి ప్రధాన్ లేనందుకు ఆందోళన పడ్దారు. అప్పుడు నానా చందోర్కర్ ప్రధాన్ శిరిడీలో వున్నంత వరకు అతనికి గాని , అతని కుటుంబ సభ్యులకు గాని ఎట్టీ ప్రమాదం సంభవించదని , అందరినీ ఆ సాయియే కాపాడుతారని వారికి ధైర్యం చెప్పాడు. వారాంతం లో ఆవిడ పరిస్థితి విషమించింది. ఈవాళో, రేపో అన్నట్లు ఆవిడ పరిస్థితి తయారయ్యింది. డాక్టర్లు ఇక ఏం చెయ్యలేమని చెతులెత్తేసారు. సరిగ్గా ఆ సమయం లో ప్రధాన్ శిరిడీ నుండి బొంబాయి చేరి ఆవిడకు తీర్ధ ప్రసాదాలనివ్వగా ఆశ్చర్యం గా నాటి నుండే ఆవిడ జబ్బు తగ్గు ముఖం పట్టనారంభించింది. డాక్టర్లందరూ నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తుండగా ఆవిడ నాలుగు రోజులలో లేచి తిరగసాగింది. ఛివరకు ఆ జబ్బు పూర్తిగా తగ్గిపోయింది. ఈ ప్రపంచం లో అందరి కంటే పెద్ద వైద్యుడు, సృష్టి, స్థితి, లయ కారకుడైన శ్రీ సాయికి అసంభవం అనేది లేదు. ఎటువంటి విపత్కర పరిస్థితుల నుండైనా ఇట్టె మనల్ని రక్షించగల సర్వ సమర్ధుడు ఆయన. అయితే ఆయన అనుగ్రహ ఫలాన్ని పొందాలంటే అందుకు తగిన అర్హతను మనం పొందాలి. ఆయనకు సర్వశ్య శరణాగతి చెసి మన బాధలను,కష్టాలను, కన్నీళ్ళను , సమస్యలను ఆయన పాదాలకు నివేదించి, కొండంత విశ్వాసం తో ఎదురు చూస్తే చాలు ! మనం కూడా పై భక్తుల వలే శ్రీ సాయి యొక్క దివ్య లీలలను క్షణం లో చవి చూస్తాము.

చెడ్డగుణముల వలన అనేక ఆపదలు వస్తాయి. పాపము సంభవిస్తుంది. మోసము, అన్యాయము , అవినీతి, ఆశ్రిత పక్షపాతం మొదలైన చెడు గుణములను వెంటనే విడనాడాలి. లేకుంటే మనకు నిత్య జీవితం లో ఆపదలు, అశాంతి, అనారోగ్యం, శత్రు బాధలు తప్పవు.


సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు

సర్వే జనా: స్సుఖినోభవంతు :