Tuesday, 31 October 2017

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 45


దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, భక్త జన సంరక్షణే తన ధ్యేయం గా ఈ భువుపై అవతరించిన శ్రీ సాయినాదులది ఒక విశిష్టమైన అవతారం. ఆయన తన భక్తులపై అపారమైన కారుణ్యం, ప్రేమానురాగాలను వర్షిస్తుండేవారు. కొన్ని కొన్ని సంధర్భాలలో భక్తులు తమ బాధలను మోయలేనప్పుడు వారిపై వాత్సల్యం తో ఆ బాధలను తానే స్వీకరించే వారు. తర్వాత అసలు సంగతిని తెలుసుకున్న భక్తులు శ్రీ సాయి తమపై కురిపించే అపారమైన కరుణామృతమునకు ముదమొంది ఆ అవతార మూర్తిని మరింత భక్తి శ్రద్ధలతో కొలుస్తూ వుండే వారు. అటువంటి ఒక లీలను ఇప్పుడు మనం స్మరించుకుందాము.

అమరావతి పట్టణం లో నివసించే సాయి భక్తాగ్రేసరుడు దాదా సాహెబ్ ఖపర్డే యొక్క భార్య తన చిన్న కొడుకుతో కలిసి శిరిడీ లో కొన్ని నెలలు పాటు వుంది. ఒక రోజున ఆ పిల్లవాడికి తీవ్రం గా జ్వరం వచ్చింది.వెంతనే అది ప్లేగు జ్వరం గా మారింది. ఆ రోజులలో ప్లేగు వ్యాధికి సరైన మందులు దొరకకపోవడం వలన దానిని చాలా ప్రాణాంతకమైన వ్యాధి క్రింద భావించేవారు. అందువలన ఆ తల్లి చాలా భయపడిపోయింది. అమరావతికి తిరిగి వెళ్ళి అక్కడ భర్త సహాయం తో ఆ పిల్లవాడికి మంచి వైద్యం చేయించుదామని , ఆ రోజు సాయంత్రం బాబాను సెలవు అడుగుదామని ఆమె వెళ్ళింది. బూటి వాడా వద్ద నిల్చున్న బాబాకు నమస్కరించి తన బాధను,భయాన్ని చెప్పుకొని శిరిడీ విడిచి వెళ్ళడానికి శెలవు నడిగిందామె.అప్పుడు శ్రీ సాయి మృదువైన కంఠంతో "అమ్మా ! ఏ మాత్రం భయపడవలదు. ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై వుంది.కొద్దిసేపటిలో మబ్బులన్నీ తొలగిపోయి ఆకాశం నిర్మలమౌతుంది. " అని వెంటనే తన కఫ్నీని పైకెత్తి ఆయన శరీరంపై కోడిగుడ్దు పరిమాణం లో వున్న ప్లేగు పొక్కులను చూపించి " నా భక్తుల కొరకు నేనెంత బాధపడుతున్నానో చూడండి,వారి బాధలన్నీ నావే " అని అన్నారు. ఆ దృశ్యాన్ని చూసిన వారందరి హృదయాలు ద్రవించిపోయాయి. శ్రీ సాయి హృదయం వెన్న కంటే మృదువైనది, మనసు మైనం కంటే మెత్తనైనది. తనకు సర్వశ్య శరణాగతి చేసిన భక్తుల బాధలను వారు భరించలేమని భావించినప్పుడు వాటిని తమపై స్వీకరించి అనుభవించే శ్రీ సాయి యొక్క భక్త జన వత్సలతకు, కారుణ్యానికి ఇంతకంటే రుజువేం కావాలి ? తనను శరణు పొందిన భక్తుల బాధలు,సమస్యలు,సమస్తం ఆయనే స్వీకరించి , స్వయం గా అనుభవించి తద్వారా భక్తులను బంధ విముక్తులను చేస్తున్నారు.ప్రత్యుపకారం ఏమీ ఆశించక భక్తులను సదా రక్షించదమనే అవతార కార్యాన్ని అతి సమర్ధవంతం గా నిర్వర్తించే శ్రీ సాయినాధులకు శిష్యులమైనందుకు మనమెంతో గర్వించాలి. ఆనందంతో నాట్యం చేస్తూ ఆ సాయినాధునికి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి.

శ్రీ సాయినాధుని పలుకులను విశ్వసించిన ఖపర్డే భార్య వెంతనే తన బసకు వెళ్ళింది. శ్రీ సాయి ఇచ్చిన విభూతిని ఆ పీల్లవాడి నుదిటిపై వ్రాసి , కొంత నీటిలో కలిపి పవిత్ర తీర్ధం వలే త్రాగించి " సాయి నామస్మరణ" చేస్తూ కుమారుడి పక్కనే కూర్చుంది.అద్భుతం ! అపూర్వం !! అసామాన్యం !!! ఏ మందులు వేయకనే , ఏ చికిత్సా చేయకనే కొద్ది సేపటిలోనే అతి ప్రాణాంతకమైన ప్లేగు జ్వరం తగ్గు ముఖం పట్టనారంభించింది.చెమటలు పట్టసాగాయి. ఆ కుమారుడికి తెలివి వచ్చింది.ఎంతగానో తల్లడిల్లుతున్న ఆ తల్లి హృదయం కుదుటపడసాగింది.అంతలోనే ఆ పిల్లవాడు లేచి ఆడుకోసాగాడు.శ్రీ సాయిని స్మరించి , పరిశుద్ధమైన హృదయం తో శరణు వేడితే చాలు ! ఎంతటి వ్యాధులైనా మటుమాయం అవవలసిందే.శ్రీ సాయి పలుకులు కరుణామృతమైన చూపులే శ్రీ సాయి భక్త జనులకు దివ్యౌషధం.

సర్వం శ్రీ శిరిడీ సాయి పాదార్పణమస్తు

సర్వే జనా: స్సుఖినోభవంతు

Friday, 27 October 2017

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 44


దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, భక్త జన సంరక్షనఏ తన అవతార కార్యం గా ఆ దివి నుండి ఈ భువికేగిన శ్రీ సాయికి గల భక్తులలో శ్రీ బాలాజీ పాటిల్ నేవాస్కర్ అత్యంత ముఖ్యుడు. ఇతని గురించి శ్రీ హేమాద్రిపంత్ శ్రీ సాయి సచ్చరిత్రలో 35 వ అధ్యాయం లో వ్రాసారు. తన జీవిత కాలమంతా శ్రీ సాయి సేవలో లవలేశమైనా ఫలాపేక్ష లేకుండా గడిపిన ధన్య జీవి. ప్రతీ రోజూ శ్రీ సాయి ఏయే మార్గముల గుండా నడిచేవారో వాటన్నిటినీ ఉదయమే చక్కగా శుభ్రం చేసేవాడు.తర్వాత శ్రీ సాయికి పూజాది కార్యక్రమములను అతి శ్రద్ధగా చేసేవాడు. వ్యవసాయం వృత్తిగా స్వీకరించిన నేవాస్కర్ ప్రతీ సంవత్సరం పంటను కోయగానే మొత్తం తీసుకు వచ్చి శ్రీ సాయికి అర్పించేవాడు. శ్రీ సాయి నుండి తిరిగి ఆశీర్వచనములతో పొందిన గోధుములతో తన సంసారమును పోషించుకునేవాడు.తాను ఎంత శ్రమించి,ఆర్జించినా భగవంతుడిచ్చిన దానితో తృప్తి చెందాలన్న సిద్ధాంతాన్ని శ్రీ నేవాస్కర్ తన నిత్య జీవితం లో అద్భుతం గా ఆచరించి చూపించాడు.అతని తదనంతరం అతని కుమారుడు కూడా ఇదే పద్దతిని కొనసాగించాడు.నేటికి కూడా ప్రతీ శ్రీ రామ నవమి పండుగకు నెవాస్కర్ కుటుంబీకులు సమర్పించే గోధుమల బస్తాను మశీదులో భక్తుల దర్శనార్ధం వుంచడం , పాత బస్తా గోధుమలను పేద, సాదలకు పంచి వేయడం జరుగుతోంది.

ఒక సంధర్భం లో శిరిడీ నివాసి రఘురాం పాటిల్ నెవసే లో వున్న బాలాజీ పాటిల్ నెవాస్కర్ కుటుంబీకులను కలవడానికి వెళ్ళాడు. అందరూ కూర్చోని కబుర్లు చెప్పుకుంటూ వుండగా వారి పశువుల కొట్టం లోకి ఒక పెద్ద పాము బుసలు కొడుతూ దూరింది. అందువలన పశువులన్నీ భయపడుతూ అటూ ఇటూ పరిగెట్టసాగాయి. ఆ ఇంటిలోని వారందరూ భయపడిపోయారు. కాని బాలాజీ పాటిల్ నేవస్కర్ శ్రీ సాయే తనను అశీర్వదించడానికి పాము రూపం లో వచ్చారని భావించి ఒక గిన్నెలో పాలు తీసుకు వచ్చి పశువుల కొట్టం ముందు వుంచి " సాయి , దయచేసి మమ్మల్ని భయపెట్టవద్దు. ఈ పాలను స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించు" అని మనస్పూర్తిగా ప్రార్ధించాడు. ఇంట్లోని వారందరూ దగ్గరకు రావడానికే భయపడితే బాలాజీ మాత్రం సాయి నామస్మరణ చేస్తూ నిర్భయం గా దగ్గరగా కూర్చున్నాడు. శ్రీ బాలాజీ ప్రార్ధనను సాయి మన్నించారో ఏమో ఆ పాము వచ్చి పాలను నెమ్మదిగా త్రాగి పడగ విప్పి ఆశీర్వదిస్తునట్లు అటూ ఇటూ వూపి తిరిగి వెళ్ళిపోయింది. ఎంత వెదికినా మరి కనిపించలేదు.బాబా తన అనుగ్రహాన్ని ఏ రూపంలోనైనా అందజేస్తారని ఈ లీల మనకు తెలియజేస్తోంది. బాలాజీ తన కుటుంబ సభులతో శిరిడీకి వచ్చినప్పుడల్లా పై న తెలియ జెసే సేవలన్నీ త్రికరణ శుద్ధిగా చేసేవాడు.బాబా తప్పక అతని కుటుంబ సభ్యులకు బట్టలు పెట్టి అశీర్వదిస్తూ వుండే వారు.శ్రీ సాయి దివ్య అనుగ్రహ ఫలాన్ని చవి జూసిన అదృష్టవంతుడు శ్రీ బాలాజీ పాటిల్ నేవాస్కర్.

మరొక సంధర్భం లో శ్రీ బాలాజీ పాటిల్ నేవాస్కర్ సంవత్సరీకం నాడు చాలా మంది బంధువులను నేవాస్కర్ కుటుంబీకులు భోజనానికి పిలిచారు. అయితే ఆనాడు పిలిచిన వారి కంటే మూడు రెట్లు బంధువులు రావడం తో తాము వండిన భోజన పధార్ధములు చాలవని వారు భయపడ్దారు. భోజనానికి వచ్చిన వారికి పధార్ధములు చాలక పోతే వచ్చిన వారు నిరాశతో , ఖాళీ కడుపుతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు, అది కుటుంబ పేరు ప్రతిష్టలకు తీరని దెబ్బ అని వేవాస్కర్ కుటుంబీకులు భావించారు. అయితే సాయి భక్తురాలైన నేవాస్కర్ తల్లి మాత్రం ఏ మాత్రం అధైర్య పడక సాయిని రక్షించమని మనస్పూర్తిగా ప్రార్ధించి " ఏ మాత్రం భయపడవలదు. ఇది బాబా వారి కోసం చేసిన ఆహారం కావున సరిపడకపోవడమనే సమస్యే రాదు.అన్ని పాత్రలను గుడ్డలతో పూర్తిగా కప్పివేయండి.వాటిపై సాయి ఊదీని వేయండి. గుడ్డను పూర్తిగా తీయకుండా వడ్డన చేయండి. ఆ సాయియే మనల్ని కాపాడుతారు" అని నేవాస్కర్ తల్లి తన కోడలితో చెప్పింది.ఆవిడ సలహా ప్రకారమే అందరూ సాయి నామస్మరణ చేస్తూ వడ్డన సాగించారు. ఆశ్చర్యాలలోకెల్లా ఆశ్చర్యం. వారు వండిన భోజన పధార్ధములు వచ్చిన మూడు రెట్లు బంధువులకు సరిపోవడమే కాక ఇంకా చాలా మిగిలిపోయింది.ఆ ఊరిలో వున్న బీదా, బిక్కీ, అనాధలు, బిచ్చగాళ్ళు అందరూ కూడా సంతృప్తిగా భోజనం చేసారు. చూసారా ! శ్రీ సాయి లీలామృతం ? తన భక్తునిపై శ్రీ సాయి అనుగ్రహం వర్షింపజేసిన తీరు అపూర్వం, అమోఘం, అసామాన్యం. అనేక వేల మంది సాక్షిగా జరిగిన ఈ సంఘటన భక్తులపై శ్రీ సాయికి గల అవాజ్యమైన కరుణ, ప్రేమానురాగాల గూర్చి స్పష్టం గా తెలియజేస్తోంది.కష్ట, నష్టాలకు లోనైనవారు ఎవరైనా సరే త్రికరణ శుద్ధిగా శ్రీ సాయికి సర్వస్య శరణాగతి ఒనరించి మనస్పూర్తిగా ప్రార్ధిస్తే అమోఘమైన శ్రీ సాయి అనుగ్రహ శక్తిని క్షణాలలో చవి చూడవచ్చని ఈ లీల మనకు బోధిస్తోంది.

సర్వం శ్రీ శిరిడీ సాయి పాదార్పణమస్తు

సర్వే జనా: స్సుఖినోభవంతు :

Tuesday, 24 October 2017

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 43


దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, భక్త జన సంరక్షణ అవతార కార్యం గా ఆ దివి నుండి భువి కేగిన శ్రీ సాయినాధులు తన భక్తులకు ఆపన్న హస్తమందించి ఎల్లవేళలా చెంత నిలిచేవారు. తన భక్తుల ప్రారబ్ధ కర్మను తాను స్వీకరించి తద్వారా వారిని పాప విముక్తులను చేయడం, వారి పాప కర్మను కొన్ని సంధర్భాలలో వచ్చే జన్మలకు పోస్ట్ పోన్ చేయడం, మరి కొన్ని సంధర్భాలలో వారి వారి కర్మలను అనుభవింప జేసి , తదనంతరం వారికి ముక్తి ప్రసాదించడం చేస్తుండే వారు. ఈ అవతార కార్యం లో ఆయన చెసిన లీలలు ఎన్నో ! అందులో నుండి రెండు లీలలను ఇప్పుడు స్మరించుకుందాం.!

శ్రీ సాయికి నిష్కల్మష భక్తురాలైన శ్రీమతి మాలం బాయికి క్షయ రోగం వచ్చింది. బొంబాయిలో ప్రసిద్ధులైన వైద్యులెందరినో సంప్రదించి చికిత్స చేయించుకుంది , కాని ఫలితం కనబడ లేదు. ఛివరకు శ్రీ సాయిని శరణు వేడేందుకు ఆమె శిరిడీ వచ్చింది.అప్పటికే ఆమె రోగం బాగా ముదిరిపోయింది. దగ్గు తెరలు తెరలుగా వస్తూ రక్తం వాంతి చెసుకోసాగింది. శ్రీ సాయినాధులను తనకు వ్యాధి నివారించమని ప్రార్ధించగా ఆయన ఆశీర్వదించి కేవలం నీరు మాత్రమే త్రాగమని, నేలపై దుప్పటి మాత్రమే పరచుకొని పడుకోమని సూచనలిచ్చారు. శిరిడీకి వచ్చిన తర్వాత రోగం మరింత ముదిరి వారం రోజులలోనే ఆమె మరణించింది అంతకు ముందు రొజు చావడిలో నిదురించిన శ్రీ సాయి ఉదయం బారెడు పొద్దెక్కినా బయటకు రాలెదు.మరొక పక్క శ్రీమతి మాలంబాయి పార్దీవ శరీరానికి అంత్యక్రియలు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరిలోనూ ఆందోళన, విచారం. శ్రీ సాయి చావడి వదిలి బయటకు రాలెదు. ఆమె శరీరాన్ని దహన వాటికకు తీసుకు పోతుండగా ఆశ్చర్యం గా ఆమె సరీరం లో కదలికలు ప్రారంభం అయ్యాయి. కొద్ది క్షణాలలోనే ఆమెకు ప్రాణం వచ్చి లేచి కూర్చుంది. ఈ సంఘటనను ఆనాడు స్వయం గా చూసిన పుణ్యాత్ములు ఎందరో. ఎమయ్యిందని ఆవిడను అడుగగా నేను నిద్రలో వుండగా ఎవరో నల్లని వ్యక్తి వచ్చి నన్ను ఎత్తుకుపోసాగాడు. సాయి నన్ను రక్షించు అని నేను ప్రాణ భయం తో కేకలు పెట్టగా శ్రీ సాయి ఆవేశం గా తిడుతూ వచ్చి , తన సట్కాతో ఆ నల్లని వ్యక్తిని బెదిరించి నను విడిపించుకొని తీసుకు వచ్చారు. ఆ తర్వాత నిద్ర నుండి నాకె మెలకువ వచ్చింది.ఆని తన అనుభవాన్ని అందరికీ వివరించి చెప్పింది. తన చుట్టూ జరుగుతున్న ఏర్పాట్లను హూసి తాను మరణించి తిరిగి బ్రతికానని తెలుసుకున్న ఆమె సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యింది. ఇంతలో కొందరు భక్తులు పరిగెత్తుకు వచ్చి కొద్ది సేపటి క్రితం శ్రీ సాయి ఎవరినో ఆవేశం తో తిడుతూ , సట్కాతో బెదిరిస్తూ చావడి నుండి బయటకు వచ్చి మశీదు వైపుకు దూసుకు వెళ్ళారని చెప్పారు. దాంతో శ్రీమతి మాలంబాయిని మృత్యువు నుండి రక్షించినది శ్రీ సాయి కి అవగతమై ఆనందాశ్చర్యాలతో, భక్తి శ్రద్ధలతో శ్రీ సాయినాధులకు సత సహస్ర కోటి కృతజ్ఞాతాభివందనములను తెలియజేసుకున్నారు. ఈ లీలను జాగ్రత్తగా అర్ధం చెసుకున్న వారికి శ్రీ సాయినాధులు ఎంతటి మహిమాన్వితులైన సద్గురువో, భక్తుల సంరక్షన పట్ల ఎంతటి అప్రమత్తతో వుంతారో అవగతమౌతుంది. టనను సరణు వేడిన భక్తురాలిని ఆశీర్వదించారు శ్రీ సాయి. శ్రీ సాయి వాక్కు బ్రహ్మ వాక్కుతో సమానం. బ్రహ్మాశ్త్రం వలె దానికి ఇక తిరుగు లేదు. మృత్యువు ఒక నల్లని వ్యక్తి రూపం లో మాలం బాయిని కబళించగా, పరిశుద్ధ పరమేశ్వర అవతారం అయిన శ్రీ సాయినాధులు బ్రహ్మ యొక్క లలాట లిఖితాన్ని తిరగ రసి , వచ్చే జన్మ నుండి కొంత ఆయువును ఈ జన్మకు రాసి , ఆ భక్తురాలికి తన అభయ హస్తం అందించి , మృత్యువును తరిమేసి ,ఆమెకు తిరిగి పునర్జన్మ ప్రసాదించారు. శ్రీ సాయిని సంపూర్ణం గా సరణు వేడిన వారు మృత్యువునే కాదు , దేనికీ భయపదనవసరం లేదని ఈ లీల మనకు సుస్పష్టం గా తెలియజేస్తోంది.

సర్వం శ్రీ శిరిడీ సాయి పాదార్పణమస్తు
సర్వే జనా: స్సుఖినోభవంతు :