Thursday, 23 November 2017

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 48


శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో ( 8 వ అధ్యాయం, 5 -6 శ్లోకములు)" ఎవరైతే తమ అంత్య దశ యందు నన్నే జ్ఞప్తి కుంచుకొనెదరో వారు నన్నే చేరెదరు. ఎవరైతే మరొక దానిని తలచెదరో వారు దానినే పొందెదరు" అని ప్రవచించాడు. తమ అవసాన కాలమందు భగవంతుడిని లేదా సద్గురువును తలచే వారు మరణం అనంతరం ఆ భగవంతుడు లేదా సద్గురువు అనుగ్రహ ఫలం వలన అతనిలో ఐక్యం అవుతారు. చివరి వరకు విషయ ధ్యానం చేసేవారు చేసేవారు ఆ విషయ లంపటం లో పడి తిరిగి మరొక జన్మ ఎత్తుతారు. ఇట్టివారికి వేయి జన్మలకైనా ముక్తి లభించదు. అయితే ఈ కలియుగంలో అందరకూ తమ అంత్య కాలమందు భగవంతుని ధ్యానం లభిస్తుందన్న నమ్మకం లెదు. మరణం అంటె కోందరికి భయం, మరి కొందరికి తాము కూదబెట్టిన ఆస్తి పాస్తుల యందు మక్కువ వదులుకోలేరు. అందుకనే చిన్నప్పటి నుండి సన్మార్గం లో నడుస్తూ, ఆరోగ్యకరమైన ఆలోచనలను చేస్తూ, భగవన్నామ స్మరణ తో మనస్సును నిలకడగా వుంచుకునే వారికి పైన చెప్పిన సాధన సులభతరం అవుతుంది. అట్లా తన అవసాన దశలో భగవత్ ధ్యానం ఒనరించి ముక్తిని పొందిన ఒక సన్యసి కధ ఇప్పుడు స్మరించుకుందాము.

మద్రాసులో నివసించే విజయానంద్ అనే ఒక సన్యాసి మానస సరోవరం యాత్రకై బయలుదేరాడు. మధ్య మార్గం లో శ్రీ సాయి యొక్క వైభవమును గూర్చి విని ఆయనను దర్శించుకుందామని శిరిడీకి వచ్చాడు. అక్కడ హరిద్వార్ నుండి వచ్చిన మరొక సనయాసిని కలుసుకున్నాడు. మాటల సందర్భం లో తాను చేయబోయే మానస సరోవరం యాత్ర చాలా కష్టముతో కూడుకున్నదని,మంచు ప్రదేశం కావడాన ప్రయాణం చాలా కష్టమని, భూటాన్ ప్రజలు అడుగడుగునా యాత్రికులకు కష్టాలు కలగజేస్తారని ఆ హరిద్వార్ సన్యాసి ద్వారా విని, ఎంతో నిరాశకు గురై అప్పటి కప్పుడే తన మానస సరోవర్ యాత్రను విరమించుకున్నాడు. ఆ తర్వాత మశీదులోని సాయిని దర్శించుకోగా , శ్రీ సాయి తీవ్రమైన ఆగ్రహం తొ " ఈ పనికి మాలిన సన్యాసిని బయటకు తరిమివేయండి, ఇతని సాంగత్యం మనకు మంచిది కాదు" అని అరిచారు. శ్రీ సాయికి ఈ విధమైన ఆగ్రహం ఎందుకు కలిగిందో అర్ధం కాక విజయానందుడు మశీదులో ఒక మూల కూర్చోని అక్కడి విషయాలను గమనించసాగాడు. ఆ సమయం లో మశీదు కిక్కిరిసి వుంది. ఎందరో భక్తులు తమ బాధలను శ్రీ సాయికి చెప్పుకుంటూ శ్రీ సాయి నుండి పరిష్కారం పొందుతున్నారు. వివిధ రకాల భక్తులు వివిధ పద్ధతులలో శ్రీ సాయిని పూజిస్తున్నారు. అక్కడ వున్న వరికి కుల, మత, జాతి, వర్గ, ప్రాంతీయ భేధాలు, వర్గ వైషమ్యాలు,తారతమ్యాలు లేవు.అందరిపై సమానం గా శ్రీ సాయి తన కరుణామృత చూపులతో అనుగ్రహాన్ని కురిపిస్తున్నారు. బాధలతో, దుఖంతో వచ్చిన వారు ఆనందం గా తిరిగి వెళ్తున్నారు.దీనంతటినీ గమనిస్తున్న విజయానందుడికి శ్రీ సాయిపై విశ్వాసం,భక్తి, ప్రేమ మరింత ఎక్కువయ్యాయి. అక్కడే మరి కొంత సమయం గడుపుదామని నిర్ణయించుకున్నాడు. అతడు శిరిడీలో మరి రెండు రోజులున్నాక తల్లికి జబ్బు చేసిందని తన గ్రామం నుండి జాబు వచ్చింది.అందుకని తక్షణం ఆ ప్రదేశం విడువాలని తలిచి శ్రీ సాయి ఆజ్ఞ కోసం విజయానందుడు మశీదుకు వచ్చాడు.శిరిడీని విడవడం ఇష్టం లేక ఒక వైపు,తల్లి ఆరోగ్యం క్షీణించిందన్న బాధ మరొక వైపు, ఈ విధం గా ద్వంద భావాలతో సతమత మౌతూ మనస్సు కలత చెందగ శ్రీ సాయికి సాష్టాంగ నమస్కారం చేసి మద్రాసుకు వెళ్ళడానికి ఆజ్ఞ వేడాడు.శ్రీ సాయి సర్వజ్ఞులు, సర్వ సక్తిమంతులు గావున జరుగబీయేదానిని గ్రహించి విజయానందుడితో " సన్యాసం స్వీకరించిన వారికి ఇక మమకారం తగదు.వారు దేని యందూ మమకారం వుంచుకొనరాదు.కొద్ది రొజులు ఓపిక పట్టి వుండు. ఇహ పర లోకములలో నున్న ఐహిక పరమైన విషయాల పట్ల వాంచను త్యజించు.వివేక వైరాగ్యములతో, నిత్యానిత్యములకు గల బేధమును గ్రహించి ఆ భగవంతుని పాదాలను శరణు వేడు.ఎవరైతే భక్తి శ్రద్ధలతో,ప్రేమానురాగాలతో ఆ భగవంతుడిని ధ్యానిస్తారో, ఆపదలలో ఆ భగవంతుడు స్వయంగా పరిగెత్తుకు వచ్చి తన భక్తులను రక్షిస్తాడు. ఇది సత్యం.ఈ మాటలను నీ హృదయం లో పదిల పరచుకొని , నిష్కామం తో, కోరికలు లేక రేపటి నుండి భాగవతం పారాయణం చెయ్యు. భక్తి శ్రద్ధలతో మూడు వారాలు పారాయణం చేస్తే ఆ భగవంతుడు కరుణతో నిన్ను రక్షిస్తాడు.నీ కలతలను,సమస్యలను విచారములను శ్రీఘ్రమే తొలగిస్తాడు." ని అపూర్వమైన రీతిలో బోధ చేసారు. సన్యాసి అయిన విజయానందుడికి మరణం సమీపించెనన్న సంగతి తెలుసుకున్న శ్రీ సాయి అతనికి సద్గతి ప్రసాదించే నిమిత్తమై ఈ సాధనను అతడికి ఉపదేసించారు.శ్రీ సాయి ఆజ్ఞను తు చ తప్పక పాటించిన వజానందుడు మర్నాటి నుండి లెండీ తోటలో భక్తి శ్రద్ధలతో, ఏకాగ్రతతో భాగవతం పారాయణ ప్రారంభించాడు.రెండు పారాయణలు పూర్తి చెయ్యగానే పూర్తిగా అలిసిపోయాడు.భగవన్నాస్మరణం చేస్తూ బడేబాబా తొడపై ప్రాణాలను వదిలాడు. 

ఆ విధంగా పవిత్రమైన శిరిడీ క్షేత్రం లో శ్రీ సయి సద్గురువు సన్నిధిలో అతి పవిత్రమైన భాగవత గ్రంధమును పారాయణ చెసి, స్రీ సాయిదేవుని అనుగ్రహానికి పాత్రుడై అత్యంత పవిత్రమైన భగవన్నామస్మరణం చేస్తూ ప్రాణములను వదిలిన విజయానందుడు శ్రీ సాయినాధునిలో ఐక్యం అయిపోయాడు.తన భక్తులకు శ్రీ సాయి ఒక అపూర్వమైన సాధనను ఈ లీల ద్వారా అందించారు. వీలున్నంత వరకూ భగవన్నామస్మరణ చేస్తూ , సద్గ్రంధ పఠనం గావిస్తూ భగవంతుని చింతనలో వుంటూ మన హృదయాలను పవిత్రం చేసుకోవాలి. అప్పుడు ఆ భగవంతుని కరుణ శ్రీఘ్రమే మనకు లభించి విజయానందుని వలే సద్గతి మనకు లభిస్తుంది. అతి దుర్లభమైన ఈ మానవ జన్మ లభించినందుకు సార్ధకత చేకూరుతుంది.

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణమస్తు
లోకాస్సమస్తా సుఖినోభవంతు

సర్వే జన: సుఖినోభవంతు

Tuesday, 21 November 2017

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 47


భక్తుల పాలిటి ఆశ్రిత కల్పవృక్షం,భక్త జన సంరక్షకుడు,అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు,కలియుగదైవం, అయిన శ్రీ సాయినాధులకు గల ముఖ్య భక్తులలో బలరాం దురంధర్ ఒకరు. వీరు 1878 వ సంవత్సరం లో పఠారే ప్రభు జాతిలో జన్మించారు.ఈయన లా లో డిగ్రీని పొంది బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా చాలా కాలం పనిచేసారు.క్రమశిక్షణ తో, అంకిత భావం తో పని చేసి తన వృత్తిలో చక్కని పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అటు తర్వాత బొంబాయి లోని లా కాలేజిలో ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. బలరాం దురంధర్ తన పఠారే ప్రభు జతి యొక్క సంక్షేమం కోసం విసృతం గా కృషి చేసారు.ఆ విషయాలన్నింటినీ ఒక చక్కని పుస్తకం లో వ్రాసారు. తర్వాత తన దృష్టిని అధ్యాత్మికత వైపుకు మరల్చి భగవద్గీత, రామాయణం, మహా భారతం వంటి గ్రంధాలను చదివి అందులోని తత్వాన్ని ఆకళింపు చెసుకున్నారు. బలరాం దురంధర్ పండరీపురం విఠలుడి భక్తుడు. ప్రతీ సంవత్సరం తన కుటుంబ సభులతో పండరీపురం యాత్ర చేయడం అతని జీవితం లో ఒక భాగం అయ్యింది. దురంధర్ యొక్క పూర్వ జన్మ సుకృతం వలన అతనికే కాదు అతని కుటుంబ సభులందరికీ ఆద్యాత్మిక చింతన, సద్గంధ పఠన , నిత్య పుజాది కార్యక్రమములను చేయుట వంటి సద్గుణములు అలవడ్దాయి.

ఒక సంధర్భం లో అతని సోదరులైన బాబూల్జి, వామనరావులు శిరిడీకి వెళ్ళి శ్రీ సాయిని దర్శించి చక్కని అనుభవాలను పొంది , ఆ విషయాలన్నింటినీ బలరాం కు చెప్పారు.దాంతో బలరాం తన కుటుంబ సభులందరితో కలిసి శ్రీ సాయిని దర్శనం చేసుకుందామని నిర్ణయించుకొని అందుకు తగిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు.

బలరాం శిరిడీ ప్రయాణం ప్రారంభించగానే శ్రీ సాయి మశీదులో తన భక్తులతో" ఈ రోజున నా భక్తులు వస్తున్నారు" అని ప్రకటించారు. బలరాం దురంధర్ తన కుటుంబ సభులతో శిరిడీ చేరగానే ఈ విషయం తెలుసుకొని తాము శిరిడీ వస్తున్నట్లు ఎవ్వరికీ తెలియజేయనప్పటికీ శ్రీ సాయి ముందుగానే ఈ విషయం ప్రకటించారని, అందువలన శ్రీ సాయి సర్వజ్ఞుడని నిర్ధారణ చేసుకున్నారు. అందరూ శ్రీ సాయికి సాష్టాంగ నమస్కారం చేసి కూర్చున్నారు.

సాయి వారితో "మన మందరికీ గత 60 జన్మల నుండి సంబంధ బాంధవ్యాలు వున్నాయి. అందుకే మిమ్మల్ని ఇక్కడకు పిలిపించాను" అనీన్నారు.శ్రీ సాయిని దర్శించిన వెంటనే బలరాం దురంధర్ కుటుంబ సభులందరికీ ఎంతో ప్రశాంతత కల్గింది. సంశయాలన్నీ మటుమాయం అయ్యాయి. కళ్ళు ఆనందం తో వర్షించసాగాయి.భగవంతుడినీ దర్శించడం తో కలిగే అధ్యాత్మికత, అలౌకిక ఆనందం వారికి కలిగింది.భోజనానంతరం కాసేపు విశ్రమించి తిరిగి మశీదుకు వచ్చారు. బలరాం సాయి వద్దకు వచ్చి పాదములను వత్తసాగాడు.ఆ క్షణం లోనే అతనికి శక్తిపాతం జరిగి మనసు అంతర్ముఖం అయ్యింది.అత్యద్భుతమైన , అనిర్వచనీయమైన అధ్యాత్మిక జాగృతి కలిగింది. ఎన్నో సంవత్సరాలు , కఠోర నియమాలతో , తీవ్రం గా ధ్యానం చేస్తే గాని కలుగని దివ్యానుభవాలు ఆ క్షణం లో బలరాం దురంధర్ కు కలిగాయి. అప్పుడు శ్రీ సాయి చిలుము త్రాగుతూ దానిని బలరాం కు ఇచ్చి పీల్చమన్నారు. బలరాం కు జీవితం లో ఒక్కసారి కూడా ప్రొగ త్రాగి వుండలేదు.అయినా సద్గురువు ఆజ్ఞను శిరసా వహించి ఆ చిలుమును అతి కష్టం మీద పీల్చి తిరిగి బాబా కు అందించాడు.అంతే ! గత 10 సం లుగా అతడిని పట్టి పీడిస్తున్న ఉబ్బసం వ్యాధి చిలుం పీల్చిన వెంటనే మటుమాయం అయ్యింది. చూసారా మన సాయినాధుని దివ్య లీల ! ఏ మందులకూ లొంగక, తరచుగా వచ్చి పీడించే ఈ వ్యాధి చిలుం పీల్చిన వెంటనే తగ్గిపోయింది. ఇందులోని రహస్యం శ్రీ సాయినాధులు తన భక్తునిపై కురిపించిన దివ్య అనుగ్రహం తప్ప మరేమీ కాదు.

ఆ రోజు గురువారం కావడం తో సాయంత్రం దురంధర్ కుటుంబీకులు చావడి ఉత్సవం చూసారు.ఈ ఉత్సవం సమయం లో శ్రీ సాయినాధుని దివ్య ముఖం లో వారికి పాండురంగని దివ్య దర్శనం కల్గింది.ఇష్ట దేవతారాధన ఒక సద్గురువును చూపుతుందని , ఆ సద్గురువు మార్గం లో సూటిగా దిక్కులు చూడక నడచిన వారికి ఇహం లోనూ, పరం లోనూ అన్ని కోరికలు తీరి ముక్తి లభిస్తుందన్న వేదోక్తి వారికి చాలా స్పష్టం గా అర్ధమయ్యింది.నాటి నుండి వారందరూ శ్రీ సాయికి ముఖ్య భక్తులై, నిత్యం సాయిని సేవిస్తూ, కొలుస్తూ, ఆయన దివ్యానుగ్రహానికి పాత్రులై తరించారు.

" నీవు నీ అహంకారాన్ని త్యాగం చేసి దానిని నీ సద్గురువు పాదాలలో అర్పించు. జీవితం లో విధంగా ఎవ్వరు అహంకార రహితులై వర్తిస్తారో, వారికి సద్గురువు  అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. సాధకునిలో  అహం, మమతలు, ద్వేషం ఇత్యాది భావాలు పుర్తిగా తొలగిపోవాలి. వాటి చాయలు కుదా వుండకూడదు. అప్పుడే సద్గురువు సాధకుని హృదయం లో ప్రవేశించి అనుక్షణం మార్గదర్శకత్వం ఇస్తుంటాడు. సద్గురువునే కర్తగా భావించి కార్యములకు పూనుకున్ననాడు సద్గురువే స్వయం గా అన్ని కార్యములను చేసి సాధకునికి సంపూర్ణ విజయంం ప్రసాదిస్తాడు. సాధకుడు సద్గురువుకు కేవలం ఉపకరణం మాత్రమే అని గుర్తుంచుకోవాలి.”

సర్వం శ్రీ శిరిడీ సాయి పాదార్పణమస్తు
లోకాస్సమస్తా సుఖినోభవంతు
సర్వే జన: సుఖినోభవంతు

Monday, 20 November 2017

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 46


మానవుడు సముద్రం లో మునిగితే అన్ని తీర్ధములలోనూ పుణ్య నదులలోనూ స్నానం చెసిన పుణ్యం లభిస్తుంది. అందుకు కారణం అన్ని నదులు చివరకు కలిసేవి సముద్రం లోనే !. అట్లే మానవుడు సద్గురువు పాదాలకు నమస్కరించి , అర్చిస్తే సకల దేవతలకు నమస్కరించి, పూజించిన అనంతమైన పుణ్యం దక్కుతుంది.ఎందుకంటే సద్గురువు సకల దేవతా స్వరూపమని అన్ని వేదాలు ఘోషిస్తున్నాయి. అందుకే శ్రీ సాయినాధులు తరచుగా తన భక్తులతో గురువే దైవం, నీ గురువు ఎంత చిన్నవాడైనా వాని పాదాలను గట్టిగా పట్టుకొనండి, ఆత్మ జ్ఞానం చాలా సూక్షమైనది , నిఘూఢమైనది. ఎవ్వరూ కూడా తమ స్వశక్తితో దానిని పొందుట మిక్కిలి దుర్లభం. దానిని ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు ద్వారానే అతి సులభముగా పొందగలం. అద్యాత్మిక మార్గం లో గురువు క్రమం గా సాధకులను ఒక మెట్టు నుండి మరొక మెట్టుకు శ్రీఘ్రం గా తీసుకొని పోగలరుఅని భోధిస్తుండే వారు. భక్త సులభుడు, కేవలం దర్శన, స్మరణ లతో సంతుష్టుడై తన భక్తులను ఎల్లవేళలా అభయ హస్తం అందించే శ్రీ సాయినాధులు. తనను శరణు జొచ్చిన భక్తుల కష్టాలను, కన్నీళ్ళను కడ తేర్చడమే కాక వారి హృదయాలలో జన్మ జన్మలుగా పేరుకొని పోయి వున్న అజ్ఞానపు చీకట్లను పటాపంచలు చేసి జ్ఞాన జ్యోతులను వెలిగించే వారు. వారిని సన్మార్గ వర్తులను గావించి, చివరికంటా గమ్యం చేచే అద్భుత , అసామాన్య, విలక్షణమైన సద్గురువు శ్రీ సాయి.

ఒకసారి రామదాసి అనే ఒక ప్రముఖ రామ భక్తుడు శిరిడీ వచ్చాడు. ప్రతీరోజు వేకువ జామునే లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, స్నానాది విధులను నిర్వర్తించి పట్టు బట్టలు ధరించి మశీదులో ఒక మూల కూర్చోని విష్ణు సహస్రనామము, అధ్యాత్మిక రామాయనం గ్రంధములను అతి శ్రద్ధతో పారాయణం చేసేవాడు.అతనికి శ్రీరాముడు అంతే అనంతమైన భక్తి కాని అతని హృదయం లో గర్వం ఒకింత ఎక్కువగా వుండేది. నిత్యం అద్భుతమైన అధ్యాత్మిక గ్రంధాలను పారాయణ చేసే నేను ఇతర భక్తుల కంతే ఒక మెట్టు ఎత్తులో వున్నానని భావించే వాడు. మరొక వైపు శ్రీసాయికి ప్రియ భక్తుడైన శ్యామా ఎక్కువగా చదువుకొనలేదు. శ్రీసాయికి రామునికి హనుమంతుడు చేసినట్లు నిత్యం సేవ చేయడమే తప్ప అధ్యాత్మిక గ్రంధాలను చదివేవాడు కాదు.విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం అనంతం , అపూర్వం. సకల పాపాల నుండి దురాలోచనల నుండి మనల్ని తప్పించి మోక్షార్హులను చేస్తుంది.

ఐహికపరమైన, అధ్యాత్మిక పరమైన కోరికలన్నింటినీ తృటిలో తీర్చగల అతి శక్తివంతమైన సాధనం విష్ణు సహస్ర నామ పారాయణం. కావున శ్రీ సాయి ఈ సహస్ర నామములనే మాలను శ్యామా మెడలో వేయదలిచారు.ఒకరోజు శ్రీ సాయి రామదాసిని పిలిచి తనకు కడుపు నొప్పిగా వుందని , బజారుకు వెళ్ళి సోనాముఖి అనే మూలికను తెమ్మని చెప్పారు.శ్రీ సాయి ఆజ్ఞను శిరసా వహించి తాను చేస్తున్న పారాయణను ఆపి బజారుకు వెళ్ళాడు రామదాసి.బాబా వెంతనే తన గద్దె దిగి రామదాసి పారాయణ చేస్తున్న స్థలానికి వచ్చి విష్ణు సహస్రనామం పుస్తకాన్ని తీసుకొని శ్యామాకు ఇచ్చి " ఓ శ్యామా! ఈ గ్రంధం చాలా విలువైనది,ఫలప్రదమైనది కాబట్టి దీనిని నీకు బహుకరిస్తున్నాను.

నువ్వు దీనిని పారాయణ చేయుము.అది నీకెంతో ఉపకరిస్తుంది. ఒకప్పుడు నా జీవితం ఎంతో అపాయం లో పడింది. అప్పుడు ఈ పుస్తకాన్ని నా హృదయానికి హత్తుకున్నాను. అంతే, నా కష్టాలన్నీ సత్వరం తీరిపోయి, జీవితం లో మునుపటి ఆనందం తిరిగి వచ్చింది." అని అన్నారు. శ్యామా బాబా మాటలకు అంగీకరించలేదు." సాయి, ఈ పుస్తకం రామదాసిది. అతను కోపిష్టి వాడు కాబట్టి అతనితో తగువు పడడం నాకు ఇష్టం లేదు.అంతే కాక నేను అనాగరికుడిని, దేవనాగరి లిపిని చదవలేను"అని అన్నాడు. వినోదం కోసం శ్రీ సాయి తనకు రామదాసికి తగువు పెడుతున్నారని శ్యామా తలచాడే కాని తనకు బాబా గొప్ప మేలు కలుగజేయనున్నారని భావించలేదు.అయినప్పటికీ బాబా బలవంతం గా ఆ పుస్తకాన్ని శ్యామాకు ఇచ్చి " రోజుకు ఒక నామమైనా చదువు, అది నీకెంతో మేలు కలుగజేస్తుంది, ఇది నా ఆదేశం ' అని అన్నారు.
ఇంతలో రామదాసి సోనాముఖి తీసుకు వచ్చాడు. తన పుస్తకం శ్యామా చేతిలో వుండడం చూసి కోపంతో మండిపడ్డాడు. శ్యాతన పుస్తకాన్ని దోంగలించాడని" తీవ్ర స్వరం తో శ్యామాపై విరిచుకు పడ్దాడు. మాయే కడుపు నొప్పి సాకుతో బాబా చేత తనను బజారుకు పంపేలా చేసాడని, తర్వాత శ్యామా తన పుస్తకాన్ని దొంగలించాడని" తీవ్ర స్వరం తో శ్యామాపై విరుచుకుపడ్డాడు. శాంత స్వరం తో ఏదో చెప్పబోయాడు. కాని రామదాసి అసలేమాత్రం వినిపించుకునే స్థితిలో లేడు.అప్పుడు శ్రీ సాయి కలుగజేసుకొని " ఓ రామదాసి ! ఎందుకు రాక్షసుని వలే అంతలా అరుస్తున్నావు ? శ్యామా మనవాడే కదా. ఎందుకు అతనిని దూషిస్తున్నావు? ఎంతో మహిమాన్వితములైన , పవిత్రములైన గ్రంధములను నిత్యం పారాయణ చేస్తున్నావు గాని ఇంకా నీ మనస్సు అపవిత్రం గ, అస్వాధీనము గా వుంది.అన్ని విషయాలలో నిర్మలుడిగా వుండాలనే బోధను ఆచరించలేని నువ్వు ఎట్టి రామదాసివి ?నిజమైన రామదాసికి మమత కాక సమత వుండవలెను.ఒక పుస్తకం కోసం శ్యామాతో అంతగా దెబ్బలాడుతున్నావు ? ధనం ఇస్తే పుస్తకాలు అనేకం దొరుకుతాయి కాని మనుష్యులు మాత్రం రారు.శ్యామాకు నీ పుస్తకం తో ఎటువంటి సంభంధం లేదు.దానిని నేనే అతనికి ఇచ్చాను" అని ఎంతో మృదువుగా అన్నారు. బాబా పలుకులు ఎంతో నెమ్మదిగా వున్నప్పటికీ అవి రామదాసిపై ఎంతో ప్రభావం చూపాయి. వాని హృదయం లో పేరుకొని వున్న అజ్ఞానపు చీకట్లను పటాపంచలు చేసాయి. పశ్చాతాప హృదయం తో శ్రీ సాయినాధుని పాదాలపై పడి క్షమించమని అతి దీనం గా ప్రార్ధించాడు. బాబా దయాపూరిత స్వరం తో " నా పలుకులను జాగ్రత్తగా నీ హృదయం లో పదిలపరచుకొని వాటిని తు చ తప్పక జీవితం లో ఆచరించు, నీకెంతో మేలు కలుగుతుంది" అని ఆశీర్వదించారు.బాబా పలుకులను విన్న శ్యామాకు కూడా జ్ఞానోదయం అయ్యింది. భగవన్నామస్మరణ ఫలితం, విష్ణు సహస్రనామ వైశిష్ట్యం చక్కగా తెలిసి వచ్చాయి.భక్త జన సంరక్షకుడు , భక్తుల పాలిటి కల్పవృక్షము, సమర్ధ సద్గురువు శ్రీ సాయినాధుని ప్రభోధాన్ని చక్కగా వంట పట్టించుకొని త్రికరణ శుద్ధిగా ఆచరించి వారిద్దరూ అధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు.

సాధకులలో చాలా మందికి ఆధ్యాత్మిక జీవితం సత్ఫలితాలనివ్వకపోవడానికి ముఖ్య కారణం సంశయాత్మిక ధోరణి. తాను కోరిన కోరికలు తీరితే భగవంతుడు లేదా సద్గురువు తన ప్రార్ధనలను మన్నించినట్లు , కోరికలు తీరని పక్షం లో తన ప్రార్ధనలను మన్నించనట్లు, సద్గురువు తన పట్ల కఠిన వైఖరి అవలంబించినట్లు భావిస్తాడు. ఇది సరి కాదు. సంశయాత్మక, వ్యాపార ధోరణే గురువుకు, సాధకుని మధ్య ఒక అడ్డుగోడ నిలుపుతుంది. విశ్వాసమనే శక్తితో సాధకుడు గోడను కూల్చివేయాలి. పరిపూర్ణ విశ్వాసం తో సద్గురువును త్రికరణ శుద్ధిగా సేవించడమే మన కర్తవ్యం.”


సర్వం శ్రీ శిరిడీ సాయి పాదార్పణమస్తు