Thursday, 7 December 2017

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 51ఓం శ్రీ సాయి అరుణాయ నమ:
ఓం శ్రీ సాయి కరుణారససింధవే నమ:
ఓం శ్రీ సాయి అచ్యుతాయ నమ:
ఓం శ్రీ సాయి అనంతాయ నమ:
ఓం శ్రీ సాయి సుప్రసన్నాయ నమ:

శ్రీ సాయినాధులు సర్వ శక్తిమంతులు, సర్వజ్ఞలనీ తెలియజేసే మరొక అపూర్వమైన సంఘటన శ్రీ సాయి సచ్చరిత్రలో 15 వ అధ్యాయం లో వ్రాయబడింది.ఒక రోజు ఒక భక్తుడు శిరిడీ లోని మశీదులో శ్రీ సాయి పాదాల చెంత కూర్చోని వున్నాడు. అంతలో ఒక బల్లి మశీదు గోడపైకి ఎగబ్రాకి టిక్కు టిక్కు మని అరిచింది. అంతట ఆ భక్తుడు " ఆ బల్లి అరిచిన దానికి అర్ధం ఏమిటి సాయి, అది శుభమా లేక అశుభమా ? " అని శ్రీ సాయిని అడిగాడు.శ్రీ సాయి చిరునవ్వుతో " ఆ బల్లిని చూడడానికి ఔరంగాబాదు నుండి తన చెల్లెలు వస్తోంది , అందుకనే ఆ బల్లి చాలా ఆనందం గా అరుస్తోంది" అని అన్నారు. శ్రీ సాయి తనతో పరిహాసమాడుతున్నారని తలిచి ఆ భక్తుడు నోరు మూసుకొని కూర్చున్నాడు. కొద్ది సేపటి తర్వాత ఔరంగాబాదు నుండి ఒక భక్తుడు శ్రీ సాయి దర్శనానికి మశీదుకు వచ్చాడు.అతను స్వారీ చేసిన గుర్రానికి ఆకలి వలన అలసటతో కూలబడిపోయింది. దానికి ఉలవలు తీసుకురావడానికి తన దగ్గర వున్న సంచీని తీసి అందులో వున్న దుమ్ము, ధూళిని పోగొట్టడానికి సంచీని విదిలించాడు. ఆశ్చర్యకరం గా అందులో నుండి ఒక బల్లి క్రింద పడింది.చకా చకా ప్రాకుకుంటూ ఆ బల్లి మశీదు గోడను ఎక్కి ఇంతకు ముందు వున్న బల్లిని చేరుకుంది. రెండు బల్లులు ఆనందంతో కలుసుకొని , కౌగలించుకొని ముద్దాడుకున్నాయి. ఎంతో ప్రేమతో కలిసి ఆడుకోసాగాయి. బల్లి గురించి ప్రశ్నించిన ఆ భక్తుడికి ఇక నోత మాట రాలేదు.ఎక్కడ శిరిడీ ? ఎక్కడ ఔరంగాబాదు ? జరగబోయే సంఘటనను అద్దంలో చూపించిన శ్రీ సాయి సర్వజ్ఞత్వానికి జోహార్లు ! శ్రీ సాయి సాధారణ యొగి, సాధు సత్పురుషుడు కాదు. పరిశుద్ధ , పరమేశ్వర, పరబ్రహ్మ అవతారం.త్రిమూర్తి స్వరూపులు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో జరగబోయే సంఘటనలన్నీ ఆయనకు తేటతెల్లం.

మరొక సారి శ్రీ సాయి భక్తాగ్రేసరుడైన నానా చందోర్కర్ మరొక భక్తునితో కలిసి శిరిడీ నుండి బయలు దేరడానికి శ్రీ సాయిని శెలవు అడిగాడు. శ్రీ సాయి వారిరువురినీ దీవించి " భోజనం చేసి తాపీగా బయలు దేరండి." అని అన్నారు. శ్రీ సాయి ఆజ్ఞను శిరసా వహించి నానా చందోర్కర్ వాడాకు వెళ్ళి సుష్టుగా భోజనం చేసి బయలుదేరాడు. కాని నానా స్నేహితుడు మాత్రం రైలుకు వేళ అయిపోతొందంటూ ఒకటే హడావిడి చేసి భోజనం చేయ్యలేదు. మాటిమాటికీ చేతికి వాచీలో సమయం చూసుకుంటూ బయలు దేరమంటూ నానాను ఒకటే తొందర పెట్టసాగాడు, భోజనం కూడా చెయ్యలేదు. కోపర్ గావ్ స్టేషనుకు వచ్చాక ఆ రోజు రైలు ఆలస్యం గా వస్తోందని తెలిసింది. రైలు ప్రయాణం లో కూడా సరైన తినుబండారాలు దొరకలేదు.శ్రీ సాయి మాటలను వేదవాక్కుగా భావించిన నానా రైల్లో హాయిగా నిదురపోగా, శ్రీ సాయి మాటలను పట్టించుకోకుండా తన స్వంత బుద్ధితో ఆలోచించి తదనుగుణం గా ప్రవర్తించిన ఆ భక్తుడు బొంబాయి చేరే వరకూ ఆకలితో మాడిపోయాడు. తనను నమ్ముకుంటే జీవితం లో ఇక ఏ సమస్యలు ఎదురవవని, ఏ చీకు చింతా లేకుండా హాయిగా వుందవచ్చని శ్రీ సాయి ఈ లీల ద్వారా అపూర్వం గా తెలియజేసారు.


సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణమస్తు
లోకాస్సమస్తా సుఖినోభవంతు

సర్వే జన: సుఖినోభవంతు

Wednesday, 6 December 2017

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 50


ఓం శ్రీ సాయి గణేశాయ నమ:
ఓం శ్రీ సాయి పద్మనాభాయ నమ:
ఓం శ్రీ సాయి వాసుదేవాయ నమ:
ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమ:
ఓం శ్రీ సాయి దామోదరాయ నమ:

శ్రీసాయినాధుని జీవితం మూర్తీభవించిన ఆనందం గా వుంటుంది. జ్ఞాన సాగరుడు, ప్రేమస్వరూపుడు, భక్తుల పాలిటి ఆశ్రిత కల్పవృక్షం , సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ సాయినాధుని సన్నిధి అతి పవిత్రం, అతి మధురం. ఆయన దివ్య పలుకులే ధర్మ శాస్త్రాలు. భక్తులు నిత్యం తమ జీవితం లో చేయవల్సిన విధులు, ఆచరించవల్సిన పద్దతులను గురించి చిన్న చిన్న కధలుగా బోధించారు. వాటిని త్రికరణ శుద్ధిగా పాటించిన వారు తమ పూర్వ జన్మ సంస్కారాలను, పాపాలను హరింపజేసుకొని మోక్షానికి అర్హులౌతారని శ్రీ సాయి బోధించారు.

నైజాం ఇలాకాలోని నాందెడు పట్టణం లో రతంజీ షాపూర్జీ వాడియా అనే పార్శీ వర్తకుడు వుండేవాడు. తన బుద్ధి కుశలతతో, తెలివితేటలతో, వ్యాపార యుక్తులతో ఎంతో ఐశ్వర్యాన్ని పొందాడు.డబ్బు, పొలం,పశువులు,ఇళ్ళు ఈ విధంగా కూడబెట్టిన ఆస్తులకు అంతే లేదు. ఎంతో ఐశ్వర్యవంతుడైనప్పటికీ మిక్కిలి దయా గుణం కలవాడు.నిత్యం బీద సాదలకు అన్నదానం, వస్త్ర దానం, విద్యా దానం చేస్తుండే వాడు.అతనిని అపర కర్ణుడని అందరూ కీర్తిస్తూ వుండేవారు. ఈ లోకం లో అష్టైశ్వర్యాలతో,ఆనందం తో తూలతూగే వారు ఒక్కరూ కూడా లేరు. ప్రతీ ఒక్కరికీ ఎదో ఒక సమస్య వేధిస్తునే వుంటుంది. అదే విధం గా రతన్ జీ కి సంతానం లేకపోవడం ఒక పెద్ద సమస్య. ఆ దిగులుతోనే నిత్యం బాధపడుతూ వుందే వాడు. భక్తి లేని హరికధ వలె, చంద్రుడు లేని ఆకాశం వలె, సంతానం లేని తన జీవితం నిష్ప్రయోజనమని రతన్ జీ చింతిస్తూ వుండే వాడు. తన తదనంతరం ఈ ఐశ్వర్యం,భోగ భాగ్యాలు అనుభవించే వారే లేరని, తనకు కనీసం ఒక నలుసునైనా కలిగించమని నిత్యం ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ వుండే వాడు. ఓక రోజు నాందేడ్ పట్టణం లో దాసగణు శ్రీ శిరిడీ సాయి తత్వం పై హరికధ చెప్పాడు. హరి కధ అనంతరం దాసగణు ను రత్తన్ జీ కలిసి తన బాధను చెప్పుకొని తగిన పరిష్కారం చెప్పమని ప్రార్ధించాడు. అందుకు దాసగణు తక్షణం శిరిడీకి వెళ్ళి త్రిమూర్తి స్వరూపం, పరిశుద్ధ పరబ్రహ్మ అవతారం అయిన శ్రీ సాయినాధుని పాదాలను శరణు వెడమని సలహా ఇచ్చాడు. కన్న తల్లి కేవలం అడిగిన వెంతనే తన బిడ్దల కోరికలను తీరుస్తుందని , కాని శ్రీ సాయి మాత్రం కన్న తల్లి కంటే మిన్నగా అడగకుండానే కోరికలను తీర్చి తన బిడ్డలకు ఆనందాన్ని కలుగజేస్తారని దాసగణు చెప్పాడు.

అందుకు రత్తన్ జీ అంగీకరించి, శిరిడీ వెళ్ళి, శ్రీ సాయిని దర్శించి, వారి పాదాలకు ఒక చక్కని పూలమాలను సమర్పించి కష్టాలలో వున్న అనేకమందిని నీ సన్నిధికి వచ్చినంతనే రక్షించి కాపాడే కలియుగ దైవం నీవు. నన్ను కూడా నీ భక్తునిగా స్వీకరించి కాపాడి, నా హృదయం లోని చింతనలను దూరం చెయ్యు దేవా !అని కన్నీరు మున్నీరుగా ప్రార్ధించాడు. ఆ తర్వాత శ్రీ సాయికి దక్షిణ ఇద్దామని అయిదు రూపాయలు బయటకు తీయగా , శ్రీ సాయి చిరునవ్వుతో నాకు అయిదు రూపాయలు దక్షిణ ఇవ్వదలచితివి. కానీ నాకు ఇదివరకే మూడు రూపాయల పధ్నాలుగు అణాలు ముట్టినాయి. కాబట్టి మిగిలిన ఒక రూపాయి, రెండు అణాలను సమర్పించు అని అన్నారు. బాబా ,ఆటలకు రతన్ జీ ఆశ్చర్య పోయాడు. తాను శిరిడీ రావడం ఇదే ప్రధమం. సాయికి ఇంతకు ముందు ఎవరి ద్వారానైనా దక్షిణను సమర్పించి వుండ లెదు అయినా తాను ఇదివరకే దక్షిణ ఇచ్చానని శ్రీ సాయి అనడం లోని ఆంతర్యం గ్రహించలేకపోయాడు. వెంతనే శ్రీ సాయి అడిగిన మిగిలిన దక్షిణ సమర్పించి తనకు పుత్ర సంతానం కలుగజేయమని ప్రార్ధించాడు. ఏ మాత్రం దిగులు పడ వద్దు, ఈ మశీదు తల్లి మిక్కిలి దయార్ధ హృదయురాలు. ఎంతటి వారైనా ఈ మశీదు మెట్లు ఎక్కినంతనే అన్ని దుఖములు నశించిపోవును. నీ కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ కోరికను తప్పక తీరుస్తాడుఅని సాయి ఆశీర్వదించారు.

బాబా ఆశీర్వాదం పొంది నాందేడుకు వచ్చి తిరిగి దాసగణును కలిసి రతన్ జీ జరిగిన వృత్తాంతమును వివరం గా తెలియజేసాడు. అంత కంటే బాబా ఇంతకు ముందే దక్షిణ ముట్టిందన్న మాటలకు అర్ధం ఏమిటని అడిగాడు. దాసగణుకు కూడా ఈ విషయం ఒక సమస్యగా తోచింది. అయితే బాబా ద్య వలన అసలు సంగతి అతనికి అవగతం అయ్యింది. నాందేడ్ లో మౌలా సాహెబ్ అనే ఒక సిద్ధ పురుషుడు వుండే వారు. శిరిడీ దర్శనం చేయ సంకల్పించిన తర్వాత రతన్ జీ మౌలా సాహెబ్ ను తన ఇంటికి అహ్వానించారు.ఇంటికి వచ్చాక తగు రీతిన ఆయనను సత్కరించిన సంధర్భం లో సరిగ్గా మూడు రూపాయల పధ్నాలుగు అణాల ఖర్చు అయ్యింది. అదే విషయాన్ని శ్రీ సాయి తనను దర్శించిన రతన్ జీ తో చెప్పారు. దీనర్ధం శ్రీ సాయి సకల దేవతా , సాధు స్వరూపుడు. ఈ సృష్టిలో ఏ దేవుడిని కొలిచినా , సాధు సత్పురుషుడిని కొలిచినా అది సాయిని కొలిచినట్లే. సాయి సర్వజ్ఞ త్వానికి అందరూ అచ్చెరువొందారు. నాటి నుండి శ్రీ సాయి పట్ల రతన్ జీకి భక్తి మరింత ఎక్కువయ్యింది. నిరంతరం శ్రీ సాయిని ధ్యానం, అర్చన చేస్తుండే వాడు. కొంత కాలానికి రతన్ జీ దంపతులకు శ్రీ సాయి అనుగ్రహ ఫలం దక్కి సంతానం కలిగింది. వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఆ తర్వాత ఆశ్చర్యకరమైన రీతిలో వారికి 12 మంది సంతానం కలిగింది. అయితే అందులో నలుగురు మాత్రమే బ్రతికారు.రతన్ జీ యొక్క చిరకాల వాంచ నెరవేరింది. శ్రీ సాయి అపూర్వమైన కరుణా కటాక్షాల వలన అతని కోరికలన్నీ తీరడమే కాక మనస్సు లోని చింతనలన్నీ దూరమయ్యాయి.

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణమస్తు
లోకాస్సమస్తా సుఖినోభవంతు

సర్వే జన: సుఖినోభవంతు

Monday, 4 December 2017

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 49


ఇప్పటి వరకు ఈ పవిత్ర భారతావనిలో అవతరించిన సత్పురుషులలో కెల్లా కోహినూర్ వజ్రం వంటి వారు, మహా మహిమాన్వితులు శ్రీ శిరిడీ సాయినాధులు. కుల,మత,పేదా, గొప్పా బేధాలను ఎరుగక తనను శరణు వేడిన సర్వులకు అన్ని వేళలా అభయ హస్తం అందించే అవాజ్య కరుణామూర్తి శ్రీ సాయి. కలి మాయ వలన పెడద్రోవ పట్టిన మానవాళిని ఉద్ధరించడానికి వచ్చిన అవతారమే శ్రీ సాయి."గురువే సర్వస్వం, గురువును మించిన దైవం లేదని" అని అనుక్షణం చెప్పే శ్రీ సాయి భక్త సులభులు, స్మరణ, దర్శన మాత్రం చేతనే అనుగ్రహం చిందించే మహోన్నత శక్తి సంపన్నులు. ప్రజలను సన్మార్గులను చెసి, వారిని చివరికంటా గమ్యం చేర్చేందుకు మనపై కరుణతో మానవ రూపం లో అవతరించిన పరిశుద్ధ , సంపూర్ణ పరబ్రహ్మ అవతారమే శ్రీ సాయి.

మహరాష్ట్ర రాష్ట్రం లో ముల్కీ గ్రామం లో వెంకట్రావు అనే వ్యక్తి నివసిస్తుండే వాడు.వెంకట్రావు స్వతాహాగా నాస్తికుడు. దేవుడు లేడని, రాయి రప్పలకు, చిత్రపటాలకు దణ్ణాలు పెట్టి మ్న వ్యక్తిత్వాలను కించపరచుకోవనవసరం లేదని , మానవ శక్తే అన్నింటి కన్నా గొప్పదని వాదిస్తుండే వాడు. అయితే అతని తండ్రి గొప్ప సాయి భక్తుడు. నిత్యం సాయి అర్చన,శిరిడీ దర్శనం చేస్తుండే వాడు.అనేక సందర్భాలలో బాబాను దర్శించినప్పుడు తన కొడుకు యొక్క మూర్ఖత్వం గురించి బాబాకు చెప్పి , ఎలాగైనా కొడుకును సన్మార్గం లో పెట్టమని ప్రార్ధిస్తుండే వాడు.ప్రతీ సారి ఒక చిరునవ్వే బాబాగారి సమాధానం అయ్యేది.

ఒక సారి 19 17 వసం లో ఉద్యోగ నిర్వహణ లో వుండగా వెంకట్రావుకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. సహాధ్యాయులందరూ అతనిని ఆసుపత్రిలో చేర్పీంచారు. వచ్చిన గెండెపోటు తీవ్రమైనది కావదం తో ప్రాణాలకే ముప్పు అని దాక్టర్లు తేల్చి చెప్పారు. వెంకట్రావు కుటుంబ సభ్యులందరూ శోక సముద్రం లో మునిగిపోయారు.ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో పడి వున్న వెంకట్రావుకు స్వప్నం లో బాబా దర్శనం ఇచ్చి నుదిట విభూతిని అద్ది గుండెలపై తన చేతులతో రాసి ఆశీర్వదించారు.ఆ తర్వాత ఇద్దరు సేవకుల వెంకట్రావు వారిస్తున్నా వినకుండా అతని కాళ్ళు వత్తారు.చిత్రం ! ఆ స్వప్నం వచ్చిన తరువాత వెంకట్రావు ఆరోగ్య పరిస్థిలో మంచి మార్పు వచ్చింది. గబా గబా కోలుకోవడం ప్రారంభించడం తో ఆశ్చర్యపోవడం డాక్టర్ల వంతు అయింది.ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యి సంపూర్ణ ఆరోగ్యం తో ఇంటికి వెళ్ళిన వెంకట్రావుకు దీనజనోద్ధారకుడు, భక్త జన సంతక్షకుడు అయిన శ్రీ సాయినాధుని దివ్య కటాక్షం,ఆశీస్సుల వలనే తన జబ్బు నయమయ్యిందన్న విషయం తెలుసుకొని సజలపూరిత నయనాలతో బాబాకు కృతజ్ఞతలను తెలుపుకున్నాడు.నాటి నుండి వెంకట్రావు ఆస్తికునిగా మారి గొప్ప సాయి భక్తుడయ్యాడు.త్వర లోనే శ్రీ సాయినాధుని దర్శనం చెసుకొని ఆయనను తగు రీతిన పూజించుకున్నాడు. మశీదులో శ్రీ సాయి వద్ద నున్న భాల్దారులు (సెవకులు) తనకు స్వప్నం లో కనిపించిన వారే కావడం తో ఆశ్చర్యపోయాడు.శ్రీ సాయినాధుని దివ్య లీలకు మదమొందాడు.ఆ రోజు నుండి వెంకట్రావు తన జీవితానికి శ్రీ సాయిని రధ సారధిగా చెసుకున్నాడు.తనకు ఏ కష్టమొచ్చినా శ్రీ సాయికి ఉత్తరం రాసేవాడు. ఆ ఉత్తరం శ్రీ సాయికి చేరగానే అతని కష్టం తీరేది. నాస్తికుడైన వాడిని ఆస్తికుడిగా , తన భక్తునిగా మార్చిన శ్రీ సాయినాధుని లీలలు చిత్రాతి చిత్రం.

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణమస్తు
లోకాస్సమస్తా సుఖినోభవంతు

సర్వే జన: సుఖినోభవంతు