Wednesday, 20 June 2018

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 58కలియుగ దైవం, భక్తుల పాలిటి కల్పవృక్షం అయిన శ్రీ శిరిడీ సాయినాధులది ఒక విశిష్టమైన, అద్భుతమైన, అపూర్వమైన అసామాన్యమైన అవతారం. దేవదేవుడు సర్వజ్ఞుడు, సర్వ శక్తిమంతుడు. దుర్గుణములను అలవర్చుకొని పెడత్రోవ పట్టే భక్త జనావళి హృదయాంతరాలాలలో పేరుకొని పోయి వున్న అజ్ఞానంధకారములను పారద్రోలి, జ్ఞాన జ్యోతులను వెలిగించి వారిని సన్మార్గులను చేసే అద్భుతమైన దైవం శ్రీ సాయి. అందుకే శ్రీ సాయి సచ్చరిత్రలో దుష్ట శిక్షణ కంటే శిష్ట రక్షణ,భక్త జన సంరక్షణ, సంస్కరణలు గావించిన లీలలే ఎక్కువగా మనకు కనిపిస్తాయి. అటువంటి ఒక దివ్య లీలను క్రింద స్మరించుకుందాము.

పండరీపురం సబ్ జడ్జి కోర్టులో ప్లీడర్ గా పని చేసే ఒక వ్యక్తి ఒకసారి శిరిడీ వచ్చి మశీదులో దర్శనం చేసుకొని , శ్రీ సాయి పాదాలకు నమస్కరించాడు.కొంత పైకం దక్షిణ క్రింద సమర్పించుకొని మశీదులో జరిగే సంఘటనలను చూడడానికి ఒక ప్రక్కగా కూర్చున్నాడు.ఇంతలో శ్రీ సాయి లాయర్ వైపు చూసి " కలి ప్రభావం వలన ప్రజలెంత టక్కరులౌతున్నారు. ఒక వైపు దర్శనం చేసుకొని, పాదాలపై పడి నమస్కారాలు చేస్తారు, దక్షిణను ఇస్తారు, కాని చాటుగా నిందిస్తారు, అనవసరమైన వ్యాఖ్యలు చేస్తారు, ఇది ఎంతో చిత్రం కదా !" అని అన్నారు.అక్కడ వున్న ఎవ్వరికీ శ్రీ సాయి మాటలలోని అంతరార్ధం అవగతమవలేదు కాని లాయర్ మహాశయుడు మాత్రం తప్పు చేసిన వాడిలా తల దించుకున్నాడు. అతని నోటి వెంట ఒక్క మాటైనా రాలేదు. తర్వాత వాడాకు వెళ్ళి దీక్షిత్ చేతులు పట్టుకొని కన్నీళ్ళతో "బాబా చెప్పినవన్నీ అక్షర సత్యాలు. బాణాలను నాపై ప్రయోగించారు. ఇక జీవితం లో నేనెవరిపైనా అనవసరమైన వ్యాఖ్యానాలు, విమర్శలు చెయ్యను." అని అన్నాడు. తర్వాత అతను అసలు సంగతి దీక్షిత్ తో చెప్పాడు. పండరీపురం సబ్ జడ్జి నూల్కర్ ఎన్నో కష్ట నష్టాలకు లోనయ్యాడు.తీవ్రమైన అనారోగ్యం పాలయ్యాడు. ఎంత మంది డాక్టర్లను కలిసి ట్రీట్ మెంట్ తీసుకున్నా ప్రయోజనం లేకపోయింది. తన స్నేహితుని ద్వారా శ్రీ సాయి గురించి విని శిరిడీకి వచ్చి శ్రీ సాయిని శరణు వేడాడు. పండరీపురం కోర్టు ఆఫీసులో విషయం పై పెద్ద చర్చ జరిగింది.

 కొందరు నూల్కర్ యొక్క చర్యను గట్టిగా సమర్ధించగా ప్రస్తుత కధ లోని లాయర్ తన విజ్ఞానాన్ని,తెలివితేటలను ఉపయోగించి , తన వాగ్ధాటితో నూల్కర్ పై, శ్రీ సాయీపై తీవ్రమైన విమర్శలు చేసాడు.అనారోగ్యం తో బాధపడే వారు డాక్టర్ వద్దకు వెళ్ళి ట్రీట్ మెంట్ తీసుకోవాలి గాని ఇలా బాబా చుట్టూ, స్వాముల చుట్టూ తిరగడం ఏమిటని హేళన చేసాడు. శ్రీ సాయి వంటి వారు భక్తులను ఆకర్షించడానికి , వారి నుండి డబ్బు గుంజడానికి కనికట్టు విద్యలను ప్రదర్శించి, ప్రజలను మోసం చేస్తారని, ఇటువంటి వారిని నమ్మకూడదని తీవ్రమైన విమర్శలు చేసాడు. తర్వాత కొద్ది సంవత్సరాలకు పరిస్థితుల ప్రభావం వలన ఎన్నో కష్తాలకు లోనై, వాటిని తీర్చుకునేందుకు లాయర్ శిరిడీ వచ్చి బాబా దర్శనం చెసుకున్నాడు.శ్రీ సాయి సమయోచితం గా ప్లీడర్ కు ఉపదేశం చేసి అతని లోని విమర్శించే దుర్గు ణాన్ని రూపు మాపారు.

పై లీలను జాగ్రత్తగా అర్ధం చేసుకుంతే మనకు మూడు విషయాలు స్పష్టం గా అర్ధమౌతాయి.(1) ఒకరిపై అనవసరం గా విమర్శలు, వ్యాఖ్యానాలు చెయ్యకూడదు, ఇష్తం వుంటే మాట్లాడాలి, లేకుంటే మౌనం గా అవతలికి వెళ్ళిపోవాలి (2) అనవసరమైన చర్చలు, వాగ్యుద్ధాలలో మనం పాలు పంచుకోకూడదు, అవి మనలోని దుష్ట సంస్కారాలను పెంచి పోషిస్తాయి. (3) శ్రీ సాయి వంటి సద్గురువులు చేసే ఉపదేశాలను పెడచెవిన పెట్టక వాటిని జాగ్రత్తగా అర్ధం చేసుకొని ,పదే పదే మననం చేసుకుంటూ హృదయం లో పదిలపరచుకొని వాటిని నిజజీవితం లో ఆచరించాలి.ఆచరణ లో పెట్టని బోధలు ఎన్ని విన్నా అవి నిష్పలం, నిష్ప్రయోజనమౌతాయి. లీలలో శ్రీ సాయి చేసిన బోధలను మనం కూడా హృదయం లో పదిలపరచుకొని, దైనందిన జీవితం లో ఆచరించి శ్రీ సాయినాధుని కృపకు పాత్రులౌదాం.

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు
లోకాస్సమస్తా సుఖినోభవంతు
సర్వే జన: సుఖినోభవంతు