Monday, 30 July 2018

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం – 67కలియుగ దైవం , భక్తుల పాలిటి ఆశ్రిత కల్పవృక్షం అయిన శ్రీ సాయినాధుని లీలలు సముద్రం వలె అనంతం. ఆయన తన భక్తుల పట్ల చూపే కరుణ అమూల్యం. తనను మనస్పూర్తిగా నమ్మి, శరణు జొచ్చి, సర్వశ్య శరణాగతి చేసిన భక్త జనావళికి ఎల్లవేళలా రక్షణ కవచం అందించే అపూర్వ, అసామాన్య, దైవం శ్రీ శిరిడీ సాయి. పూజ, వ్రతములు,త్యాగము, సేవ, తీర్ధ యాత్రలు, దానము చేయుట మొదలగు సత్కార్యముల కంటే తపస్సు చేయుట గొప్ప !.హరిపూజ తపస్సు కంటే మేలైనది. సద్గురువు యొక్క పూజ, ధ్యానము ,అర్చనలు అన్నింటి కంటే మేలైనవి. ఆనితర సాధ్యమైన ఆత్మ సాక్షాత్కారం సద్గురువు కృప వలనే సాధ్యం. కావున నిరంతరం సాయిని ధ్యానిస్తూ, చెవులతో వారి లీలలను వింటూ, నోటితో సాయి నామం పలుకుతూ, వారి అతి పవిత్రమైన రూపమును మనసులో గుర్తుకు తెచ్చుకుంటూ, బుద్ధిని వారి యందు నిల్పి, హృదయం నిండా సాయిపై పవిత్రమైన ప్రేమను నిలుపుకొని మన దైనందిన కార్యక్రమాలను చేసుకుంటూ వుండాలి. ఇంతకు మించిన సాధన మరొకటి లేదు. సంశయ స్వభావం మానవుని ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డుగోడగా నిలుస్తుంది. అట్లా సంశయ స్వభావముతో శ్రీ సాయిని పరీక్షించుదామని వచ్చిన ఒక పెద్దమనిషి లీలను ఇప్పుడు స్మరించుకుందాం !

హరి కనోబా అనే వ్యక్తి బొంబాయిలో నివసిస్తూ వుండేవాడు. తన స్నేహితుల, బంధువుల నుండి శ్రీ సాయి లీలలను అనేకం విన్నాడు. స్వతాహాగా సంశయ స్వభావం కలిగిన వాడు కావడం వలన మొదట్లో శ్రీ సాయిని నమ్మలేదు. ఏవో గారడీ విద్యలు నేర్చుకొని కనికట్టు చేసే సన్యాసిలా సాయిని భావించాడు. అయితే శ్రీ సాయిని పరీక్షించుదామని ఒక శుభ ముహూర్తాన తన స్నేహుతులతో కలిసి శిరిడీ వచ్చాడు. క్రొత్త బట్తలు,తలపై జలతారు పాగా, క్రొత్త చెప్పులను ధరించి దర్పం తో మశీదు లోనికి అడుగుపెట్టాడు. ఎంతో ధనం వెచ్చించి కొన్న క్రొత్త చెప్పులను మశీదులో ఒక మూల వుంచి సాయి దర్శనం చెసుకొని ఊదీ ప్రసాదాలను అందుకొని తిరిగి వచ్చాడు. దురదృష్ట వశాత్తు తాను వుంచిన ప్రదేశం లో తన క్రొత్త చెప్పులు దొరకలేదు. చికాకు పడుతూ మసీదు అంతా వెదకినా చెప్పులు కనిపించలేదు. అనవసరం గా శిరిడీ వచ్చి చెప్పులు పోగొట్టుకున్నానని బాధపడుతూ తన బసకు తిరిగి వచ్చాడు.

తర్వాత అన్యమనస్కం గానే హరి కనోబా స్నానం చెసి , దేవునికి పూజ చెసి, నైవేద్యం పెట్టి భోజనానికి కూర్చున్నాడు. కాని మనసులో చెప్పుల గురించి చింత వదలలేదు. ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసి, ఇష్టం గా కొనుకున్న చెప్పుల జత మాయమైపోయిందే నన్న బాధ అతనిని తొలచి వేస్తోంది. అయిష్టం గానే భోజనం చేసి వాడా వసారా లోకి వచ్చి కూర్చున్నాడు. అప్పుడు ఒక కుర్రవాడు ఒక చెప్పుల జత వేలాడుతున్న కర్రను భుజానికి తగిలించుకొని హరీ కా బేటా, జరీ కా ఫేటా (తలపాగా) అని అరుచుకుంటూ వస్తున్నాడు. ఆ చెప్పుల జత తనవిగా అనిపించడం తొ పరుగు పరుగున హరి కనోబా వెళ్ళి ఆ కుర్రవాడిని ఆపాడు.ఆ కుర్రవాడు తనని వివరాలు అడుగగా , తన పేరు కని కనోబా యని, తన తండ్రి పేరు కనోబా యని,తాను బొంబాయి నుండి వచ్చానని, చెప్పాడు. అప్పుడు ఆ కుర్రవాడు ఆ చెప్పుల జతను హరి కనోబా కు ఇచ్చి వేసి తనను శ్రీ సాయి పంపారని, కనోబా కుమారుడైన హరి కనిపిస్తే వానికి జరీ అంచు తలపాగా వుందని రూఢీ చేసుకొని , వివరాలను కనుక్కొని చెప్పుల జతను ఇచ్చివేయమని ఆదేశించారని చెప్పాడు. ఆ మాటలకు హరి కనోబా నోటి వెంట మాట రాలేదు. తాను సాయి దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక్క మాటైనా మాట్లాడలేదు.అటువంటిది ఆయనకు తన వివరాలు ఎలా తెలిసాయి ? దానిని బట్టి శ్రీ సాయి సర్వాంతర్యామి యని , ఈ సృష్టిలో జరిగే సమస్తం ఆయనకు తెలుస్తుంటాయని హరి కనోబాకు అవగతమయ్యింది.వెంటనే శ్రీ సాయి దర్శనార్ధం మశీదుకు వెళ్ళాడు. పశ్చాత్తాప హృదయం తో శ్రీ సాయి కాళ్ళపై పడి తనను క్షమించమని కళ్ల నీళ్ళ పర్యంతరమై ప్రార్ధించాడు. శ్రీ సాయి చిరునవ్వుతో హరి కనోబా వైపు తన కరుణామృత చూపులను ప్రసరించగాఅ , ఆ క్షణం లో హరి కనోబా హృదయం లో అంత వరకు దట్టం గా పేరుకొని పోయి వున్న సంశయాత్మక స్వభావం పటా పంచలైపోయింది. దాని స్థానే అంతులేని విశ్వాసం చోటు చేసుకుంది. శ్రీ సాయిని పరీక్షించుదామన్న తన వైఖరికి తానే సిగ్గు పడ్డాడు.శ్రీ సాయి యొక్క దివ్యత్వాన్ని, మహత్యాన్ని స్వయం గా అనుభవించి ఆయన పట్ల అంతులెని భక్తి విశ్వాసాలను పెంచుకున్నాడు.శ్రీ సాయికి అత్యంత భక్తుడిగా మారి తన జీవిత కాలం పర్యంతరం శ్రీ సాయి సేవ, ఆరాధనలో మునిగిపోయాడు. ఓక చిన్న లీల ద్వారా సంశయాత్మక వైఖరిని తొలగించి గొప్ప అధ్యాత్మిక జాగృతిని కలిగించి, భక్తునిగా మార్చిన శ్రీ సాయి యొక్క వైభవం అపూర్వం, అసామాన్యం. మనం కూడా మన విజ్ఞానం తో, బుద్ధితో ప్రతీ విషయన్ని పరిశీలించి, తర్కించి, విమర్శించే వైఖరిని విడనాడుదాం. అధ్యాత్మికతకు కావల్సింది అచంచల భక్తి విశ్వాసాలు, నమ్మకం మాత్రమే ! ఏ మేరకు మనలో భక్తి ప్రవృత్తులు, విశ్వాసాలు చోటు చేసుకుం టాయొ, ఆ మేరకు భగవంతుని అనుగ్రహం అతి శ్రీఘ్రం గా లభిస్తుంది. ఇది సత్యం.


సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు
లోకాస్సమస్తా సుఖినోభవంతు
సర్వే జన: సుఖినోభవంతు


Friday, 27 July 2018

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం – 66శ్రీ సాయినాధుని లీలలు, మహత్యం గురించి విని, ఆయనను నాస్తిక, హేతు భావాలతో పరీక్షించుదామని వచ్చి ఆయన యొక్క కారుణ్యం, ప్రేమానురాగాలు, మమత, మహత్యం స్వయం గా అనుభవించి, తమ మనసులను మార్చుకొని, శ్రీ సాయి భక్తులుగా మారిన వారు ఎందరో వున్నారు. అందులో సోమదేవ స్వామి ఒకరు ! వారి కధను ఇప్పుడు స్మరించుకుందాం. శ్రీ సాయి లీలామృతాన్ని మనసారా ఆస్వాదించుదాము.

కాకా సాహెబ్ దీక్షిత్ తమ్ముడు భాయీజీ నాగపూరులో ఉద్యోగం చేస్తుండేటప్పుడు 1906 వ సంవత్సరం లో హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ అతనికి సోమదేవ స్వామి అనే సాధువుతో పరిచయం కల్గింది. సోమదేవ స్వామి సదాచార సంపన్నుడు. ఫరమ నిష్టా గరిష్టుడు. హరిద్వార్ లో మఠం నిర్మించుకొని అక్కడ నివసిస్తున్నాడు. ఆయిదు సంవత్సరాల తర్వాత సోమదేవ స్వామి నాగపూర్ వచ్చి భాయీజీ ఇంట్లో ఆతిధ్యం స్వీకరించాడు. మాటల మధ్యలో శ్రీ సాయినాధుని లీలలు గురించి విని ఎంతో ఆనందించి శిరిడీ వెళ్ళి సాయి దర్శనం చేసుకుందామని నిర్ణయించుకున్నాడు.మర్నాడు బయలుదేరి కోపర్గావ్ లో రైలు దిగి, టాంగాను కట్టించుకున్నాడు సోమదేవ స్వామి. శిరిడీ సమీపించేటప్పుడు దూరం గా మశీదుపై రెండు పెద్ద జండాలను చూసి ఒకింత ఆశ్చర్యపడ్డాడు . ఈ యోగి వుండే ప్రదేశం లో పెద్ద పెద్ద జండాలను కట్టించుకున్నాడు. చూస్తుంటే ఆడంబరాల యందు, కీర్తి ప్రతిష్టల కొరకు ఈ యోగి ఎక్కువగా మక్కువ చూపిస్తునట్లు వుందనుకున్నాడు. ఆ మాటే మిగితా యాత్రికులతో చెప్పగా అయ్యా ! జండాలను చూదగానే ఇంతగా వ్యాకులం చెందిన మీ మనస్సు మశీదులో రధం, పల్లకి, గుర్రం, లక్షలు విలువ చేసే వెండి సామానును చూస్తే ఇంకెంత చికాకు పడుతుందో కదా !అని వారు అన్నారు. ఆ మాటలను విన్న సోమదేవ స్వామి మరింత ఆశ్చర్యం, విసుగు చెందాడు. గుర్రాలు, రధాలు, వెండి సామగ్రితో హడావిడి చెసే సన్యాసులను, యోగులను నేనింతవరకూ చూడలేదు. అటువంటి వారిని దర్శించుట కంటే వెనక్కి తిరిగి పోవడమే మేలు అని తాను వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటునట్లు మిగితా వారితో చెప్పాడు. ఆ మాటలను విన్న తోటి యాత్రికులు సోమదేవ స్వామి ని గట్టిగా మందలించారు. తప్పుడు ఆలోచనలు మానుకొమ్మని సలహా ఇచ్చారు. శ్రీ సాయినాధులు పరిశుద్ధ పరబ్రహ్మ అవతారమని, చిరిగిపోయిన దుస్తులతో చాలా సాధారణమైన జీవితం వెళ్ళబుచ్చే ఒక మహిమాన్విత, శక్తి స్వరూపమైన అసాధారణ యోగి యని, ఆయన ఈ ఆడంబరాలను గాని,కీర్తి ప్రతిష్తలను గని అసలేమాత్రం లక్ష్య పెట్టరని , వాటిని ఏర్పాటు చేసినది వారి అసంఖ్యాకమైన భక్తులే గాన ఒక్క సారి మశీదు లోనికి వచ్చి శ్రీ సాయిని దర్శించిన తర్వాత ఆయన పట్ల తగు అభిప్రాయం ఏర్పాటు చేసుకోమని చెప్పి సోమదేవ స్వామి ని బలవంతం గా మశీదు లోనికి తీసుకువెళ్ళారు.

మశీదు లోనికి అడుగు పెట్టి దూరం నుండి శ్రీ సాయిని చూడగానే సోమదేవ స్వామి మనసు కరిగిపోయింది. కళ్ళు ఆనందం తో వర్షించసాగాయి. గొంతుక ఆర్చుకొని పోయింది. అప్పటి వరకు అతని మనస్సులో తాండవం చెసిన సంశయాలన్నీ పటా పంచలు అయిపోయాయి. అనిర్వచనీయమైన ఆనందం, శాంతి అతనికి లభించింది. వేల సంవత్సరాలు కఠోర నియమాలతో తపస్సు చేసినా కలుగని ఆత్మ సంతృప్తి , పరమానందం శ్రీ సాయిని ఒక్కసారిగా చూడగానే అతనికి కలిగింది. ఎక్కడైతే మన పంచేంద్రియాలు, మనస్సు శాంతించి ఆత్మానందం పొందుతాయో అదే మన గమ్యం ! వాటిని కలిగించువారే సద్గురువులు అన్న అతని గురుదేవుల ఉపదేశం సోమదేవ స్వామి కి గుర్తుకు వచ్చింది. వెంటనే పట్టరాని ఆనందంతో మశీదు లోనికి పరుగులు తీసాడు. కాని అతనిని చూసిన వెంటనే శ్రీ సాయి పట్టరాని కోపం తో మా వేషాలన్నీ మా దగ్గరే వుండనివ్వు. ఆడంబరాల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం వెంపర్లాడే మా వంటి కపట సాధువుల దర్శనం నీవు చేయనేల ? ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యక బయటకు దయ చెయ్యుఅని అరిచారు. ఆ మాటలకు సోమదేవ స్వామి చాలా ఆశ్చర్యపోయాడు. శ్రీ సాయికి తన మనసులో మెదిలే ఆలోచనలన్నీ తెలుసునని, తనను సంస్కరించడానికే తనపై కోపగించుకున్నారని అర్ధం చెసుకున్నాడు. దూరం నుందే మశీదులో జరిగే తతంగమంతా గమనించసాగాడు. మశీదుకు వేల సంఖ్యలో భక్తులు ఎన్నో బాధలు, చింతనలు, కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు, కోరికలతో వస్తున్నారు. శ్రీ సాయిని దర్శించి తమకు చిత్తం వచ్చిన రీతిలో పూజిస్తున్నారు. శ్రీ సాయి రక రకాల భక్తులను వివిధ రకాలుగా ఆశీర్వదిస్తున్నారు.కొందరిని కౌగలించుకోవడం, కొందరిని ఓదార్చడం, కొందరికి సలహాలు,సూచనలివ్వడం, మరి కొందరిపై తన అమృత సమానమైన దయామృత చూపులను ప్రసరించడం ఈ విధం గా అందరినీ ఆనందింపజెస్తున్నారు. ఏడుస్తూ వచ్చిన వారు ఆనందం గా తిరిగి వెళ్తున్నారు. ఇదంతా చూసిన సోమదేవ స్వామి హృదయం శ్రీ సాయిని శంకించినందుకు పశ్చ్త్తాపంతో రగిలి పోయింది. శ్రీ సాయి పట్ల భక్తి శ్రద్ధలు రెట్టింపయ్యాయి. అనుక్షణం శ్రీ సాయి నామస్మరణను చేయసాగాడు. అతనిలో శాశ్వతమైన మార్పు వచ్చాక అతనికి శ్రీ సాయి తన దర్శన భాగ్యం కలిగించారు. శ్రీ సాయి ఆశీర్వదించగానే అతనిలో గొప్ప అధ్యాత్మిక జాగృతి కలిగింది. నాటి నుండి శ్రీ సాయికి గొప్ప భక్తుడయ్యాడు. తన శేష జీవితమంతా శ్రీ సాయిని ఆరాధించడం తోనే గడిపి చివరకు శ్రీ సాయినాధునిలో ఐక్యం అయ్యాడు.

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు
లోకాస్సమస్తా సుఖినోభవంతు
సర్వే జన: సుఖినోభవంతు

Thursday, 26 July 2018

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం – 65సాయినాధులు చేసే అపూర్వమైన, అద్భుతమైన లీలల వలన ఆయన ఖ్యాతి మహరాష్ట్ర లోనే కాకుండా యావత్ భారత దేశం లో విశేషం గా పాకిపోయింది. దేశం నలుమూలల నుండి లక్షల సంఖ్యలో భక్తులు నిత్యం శిరిడీకి వచ్చి శ్రీ సాయిని దర్శించుకునేవారు. ఆధ్యాత్మిక సిద్ధికి, లౌకికమైన కోరికల సిద్ధి కోసం ఇలా భక్తులు తమకు తోచిన విధం గా శ్రీ సాయిని ప్రార్ధించి తమ కోరికలను తీర్చుకొని అంతులేని ఆనందం తో తిరిగి వెళ్ళేవారు. శిరిడీకి వచ్చి శ్రీ సాయిని దర్శించి, తమ ఆలోచనా ధొరణిని మార్చుకొని ఆస్తికులుగా మారి తిరిగి వెళ్ళిన వారు ఎందరో వున్నారు. సాయిని గురించి విని, ఆయనను దర్శించకుండానే ఆయనపై అనుచిత విమర్శలు చేసిన వారు ఎందరో ! సాయి బ్రాహ్మణుడని, మహ్మదీయుడని, హిందూ , ముస్లిం సాంప్రదాయాలను కలగలిపి నాశనం చేస్తున్నాడని ఎందరో బాహాటం గా విమర్శించారు. మరి కొందరు శ్రీ సాయి హిందువో, ముస్లిమో తెలుసుకునే ప్రయత్నాలను తీవ్రం గా చేసారు. వారికి ఎప్పటికీ సమాధానం లభించలేదు. కారణం శ్రీ సాయి పరిపూర్ణ పరబ్రహ్మ అవతారం. కుల, మత , ప్రాంతీయ భేధాలు ఆయనకు అంటవు.హిందువు దేవాలయాలను అపవిత్రం చేస్తే శ్రీ సాయి సహించేవారు కాదు.

శిరిడీలో శిధిలావస్థలో వున్న శనేశ్వరుడు, గణపతి, శివ పార్వతుల ఆలయాలను తాత్యాకోటే పాటిల్ ద్వారా పునరుద్ధరింపజేసారు. అట్లే ఒక సంధర్భం లో సాయి భక్తాగ్రేసరుడైన నానా చందోర్కర్ తన స్నేహితునితో కలిసి శిరిడీ వచ్చి శ్రీ సాయిని దర్శనం చేసుకొని ఆయన సన్నిధిలో కూర్చున్నారు. నానాను చూదగానే శ్రీ సాయి హఠాత్తుగా కోపించినా సహవాసం ఇన్నేళ్లుగా చేస్తూ ఇంత మూర్ఖం గా ఎందుకు ప్రవర్తించావు ? అని అన్నారు. సాయి మాటలు అర్ధం కాక నానానేను చేసిన తప్పేమిటో దయచేసి వివరించండి సాయిఅని హృదయపూర్వకంగా ప్రార్ధించాడు. అప్పుడు సాయి నానా చేసిన తప్పును వివరించి ఇంకెప్పుడూ అట్లా చేయవద్దని, చేసిన తప్పును మళ్ళీ చెస్తే తీవ్రమైన శిక్ష తప్పదని హెచ్చరించారు. జరిగిన విషయమేమిటంటే - శిరిడీకి వచ్చే ముందు నానా చందోర్కర్ సాధారణం గా కోపర్ గావ్ లో దిగి దత్త దర్శనం చేసుకునే వాడు. దత్త మందిరం లో వున్న పూజారి మందిర నిర్వహణ కోసం నానా చందోర్కర్ ను చందా అడిగాడు. మొదట్లో ఇస్తానని వాగ్దానం చేసిన నానా తర్వాత తప్పించుకు తిరగసాగాడు. పూజారి వ్రాసిన ఒక్క ఉత్తరానికి కూడా సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుత పర్యటనలో తన స్నేహితుడు దత్త బంధువైనప్పటికీ , దత్తాత్రేయుడిని దర్శనం చెసుకుందామని కోరినప్పటికీ వినకుండా ఆలశ్యమైపోతొందని సాకు చెప్పి కోపర్గాం వ్ లో దిగకుండానే శిరిడీకి వచ్చేసాడు నానా చందోర్కర్ . తాను చేసిన పని శ్రీ సాయికి తెలియదనుకున్నాడు నానా. గోదావరిలో దిగి స్నానం చేసేటప్పుడు ఒక ముల్లు గుచ్చుకొని కాలం తా వాచిపోయింది. నడవలేక కుంటుతూ శిరిడీకి వచ్చి సాయి దర్శనం చెసుకున్నాడు నానా చందోర్కర్. శ్రీ సాయి ఇంకెప్పుడూ హిందూ దేవతలను అగౌరవపరచవద్దని, ప్రస్తుతం కాలి నొప్పి కొంతవరకు ప్రాయశ్చిత్తమేనని, ముందు ముందు ఇటువంటి సంఘటన పునరావృతమైతే తీవ్రమైన శిక్ష తప్పదని హెచ్చరించారు.

మరొక సంధర్భం లో శిరిడీలో ఒక గొప్ప తుఫాను సంభవించింది. నల్లని మేఘాలు ఆకాశాన్ని కప్పివేసాయి. గాలి తీవ్రం గా వీచి అందరినీ భయకంపితులను చెసింది. ఊరుములు, మెరుపులతో కూడిన కుంభవృష్టి కురిసి శిరిడి అంతా జల దిగ్భంధం లో చిక్కుకుంది. శిరిడీ లో వున్న శనేశ్వరుడు, మారుతి, ఖండోబా, శివపార్వతులు, గణపతి మొదలైన ఆలయాలన్నీ నీట మునిగాయి. ప్రజలందరూ మశీదుకు పరుగులు తీసి శ్రీ సాయి కాళ్ళపై పడి, కన్నీరు మున్నీరుగా ప్రార్ధించి తమను రక్షించమని కోరుకున్నారు. ఆపదలో వున్న తన భక్త జనావళిని చూసిన శ్రీ సాయి హృదయం కరిగిపోయింది.వెంటనే ఆయన సట్కా తీసుకొని మశిదు బయటకు వచ్చిఆగు ! నీ తీవ్రతను తగ్గించుఅని గర్జించారు. క్షణాలలో వాతావరణం ప్రశాంతతను సంతరించుకుంది. తుఫాను తగ్గిపోయింది. శిరిడీ గ్రామం లో ప్రవేశించిన నీరు అంతా బయటకు పారింది. ఆకాశం నిర్మలమైపోయింది. ప్రజలందరూ శ్రీ సాయిని స్తుతిస్తూ తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఆశ్చర్యకరం గా గ్రామం లోని ఆలయాలు నీట మునిగినా వాటికి వీసమెత్తు నష్టం కూడా జరగలేదు. మర్నాటి నుండి అందులోని దేవతలు యధాతధం గా శిరిడీ జనుల పూజలందుకున్నారు.హిందూ దేవతలను అపహాస్యం చెసినా, విగ్రహాలను నిర్లక్ష్యం చేసినా శ్రీ సాయి అగ్రహానికి గురి కాక తప్పదని పై లీలల ద్వారా మనం గ్రహించాలి.

"సబ్ కా మాలిక్ ఏక్ హై


సర్వ మానవులలో వున్నది ఒక్కటే పరమాత్మ.ఎదుటి వారి హృదయం లో వున్న   పరమాత్మను దర్శించగలిగితే నీవు వేరే ఏ దేవాలయానికి వెళ్ళనవసరం లేదు.

శ్రద్ధ వున్నవాడే అన్నీ వున్నవాడు.శ్రద్ధ లేనివాడికి ఎన్ని సంపదలు వున్నా ఏమీ లేని వాడి క్రిందే లెఖ."


సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు

లోకాస్సమస్తా సుఖినోభవంతు
సర్వే జన: సుఖినోభవంతు