Wednesday, 11 July 2018

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 61


భగవంతుని అద్భుతమైన, అపూర్వమైన, కరుణ కటాక్షములకు పాత్రులమైన వారు ఎంతో అదృష్టవంతులు. మట్టికుప్ప లోని రాయి వంటి వారు క్షణాలలో అతి విలువైన వజ్రం లా మారిపోతారు. వారి కీర్తి ప్రతిష్టలు దిశ దిశలకు ప్రాకిపోతాయి. అయితే ఈ అదృష్టం అందరికీ లభించదు. ఆనన్య చింతనతో, తీవ్రమైన తపనతో, సాధనతో భగవంతునికి సర్వశ్య శరణాగతి ఒనరించిన భక్త శ్రేష్టులకు మాత్రమే ఈ భాగ్యం లభ్యం. శ్రీ సాయినే తమ సద్గురువుగా నమ్ముకొని రేయింబవళ్ళూ భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసిన హేమాద్రిపంత్, నానా చందోర్కర్, దాసగణు మహారాజ్ , తాత్యా కోటే పాటిల్, మహల్సాపతి , మాధవరావు దేశ్ పాండే (శ్యామా) వంటి వారు సామాన్య స్థితి నుండి ఆధ్యాత్మికం గా ఎంతో ఉన్నత స్థితికి ఎదిగి చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారసులకు సైతం నేటికీ శ్రీ సాయి రక్షణ కవచం లభ్యమౌతునే వుంది.


ఒకసారి దాసగణు మహారాజ్ ఈశావాస్యోపనిషత్తు పై మరాఠీ భాషలో వ్యాఖ్యానం వ్రాయడానికి సంకల్పించాడు.ఈ గ్రంధ రాజానికి వేదాలలో ఎంతో ఉన్నతమైన స్థానం వుంది.వేద సంహిత లోని మంత్రములు వుండడం తో దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అంటారు. దీనికి వాజసనేయ సంహితాపనిషత్తు అని మరొక పేరు కూడా వుంది. ఆన్ని ఉపనిషత్తుల కంటే శ్రేష్టముగా దీనిని పండితులు భావిస్తారు. ఈశావాస్యోపనిషత్తు గ్రంధములో ఆత్మను గూర్చి అపూర్వమైన వర్ణన వుంది. గురువు స్థానం లో వుండే యోగి శ్రేష్టుల గుణముల గూర్చి విపులం గా వ్రాయబడి వుంది. కర్మ యోగమును, జ్ఞాన మార్గమును సమన్వయం చేసిన అద్భుత కావ్యం గా ఈ ఉపనిషత్తు గూర్చి పండితులు తెలియజేసారు.ఇటువంటి అపూర్వ గ్రంధముపై వ్యాఖ్యానం వ్రాయడానికి దాసగణు ప్రారంభించి , రాత్రిబంవళ్ళూ ఆ గ్రంధాన్ని అధ్యయనం చేసాడు. కాని ఆ గ్రంధం సరిగ్గా అతనికి అర్ధం కాలేదు. ఎందరో పండితులను కలిసి తన అనుమానాలను నివృత్తి చేసుకున్నాడు కాని సంతృప్తికరం గా అతనికి సమాధానం లభించలేదు.

ఛివరకు ఒక పండితుడు దాసగణుతో ఈ పవిత్రమైన గ్రంధాన్ని అధ్యయనం చేయడం ,వివరించి చెప్పడం అంత సుళువు కాదని . ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు వద్దకు వెళ్ళి ఆయన ఆశీర్వాదములను పొందమని సలహా ఇచ్చాడు. తాను ఇంత కాలం ఏ విధం గా కాలయాపన చేసాడో గుర్తించిన దాసగణు వెంటనే శిరిడీ వెళ్ళి, శ్రీ సాయి కాళ్ళపై పడి తనకు వచ్చిన కష్టాన్ని తీర్చమని ప్రార్ధించాడు. శ్రీ సాయి చిరునవ్వుతో ఆశీర్వదించిఏ మాత్రం తొందర పడవద్దు. తిరుగు ప్రయాణం లో విల్లేపార్లే లోని దీక్షిత్ కాకా పనిపిల్ల నీ సందేహాలను తీరుస్తుందని" అన్నారు. ఆ మాటలు విన్న ఇతర సాయి భక్తులు ఆశ్చర్యం తో ముక్కున వేలేసుకున్నారు. శ్రీ సాయి తమతో హాస్యమాడుతున్నారని భావించారు. లేకపోతే చదువు సంధ్యలు లేని ఒక అనామకురాలు దాసగణు యొక్క సందేహాలను ఎలా తీరుస్తుంది ? ఇది అసాధ్యం అని అందరూ భావించారు.

కాని సాయి భక్తాగ్రేసరుడైన దాసగణు మాత్రం శ్రీసాయి మాటలపై విశ్వాసముంచి శిరిడీ నుండి బయలుదేరి విల్లేపార్లె లోని కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట్లో బస చేసాడు. మరునాటి ఉదయం దాసగణు నిద్ర లేవగానే పెరట్లో నుండి ఒక చక్కని పాటను విన్నాడు. దీక్షిత్ యొక్క పనిమనిషి చెల్లెలు ఒక ఎర్రచీర గురించి మృదుమనోహరం గా పాడుతోంది. ఆమె చాలా బీద కుటుంబీకురాలు. చిరిగిపోయిన బట్టలను కట్టుకుంది. అయినా తన ఊహల్లో మెదిలే ఎర్ర చీర గురించి చక్కగా పాడుతోంది. ఆమెపై జాలిపడ్డ దాసగణు అప్పటికప్పుడు ఒక ఎర్ర చీరను కొని ఆమెకు బహుకరించాడు. ఆకలితో నక నక లాడే వారికి పరమాన్నం దొరికినట్లు చీరను చూడగానే చిన్న పిల్ల మనస్సు ఆనందం తో పరవళ్ళు తొక్కింది. మరునాటి ఉదయం క్రొత్త చీరను కట్టుకొని వచ్చి ఉత్సాహం తో పని చేసింది.అందరికీ కావల్సినవి చేసి పెట్టింది. ఆమె ముఖం ఆనందం తో వెలిగిపోయింది. మరునాడు పాత బట్టలనే ధరించి పని లోనికి వచ్చింది. అయినా ఆమె లో ఆనందానికి అంతు లేదు. నిన్నటి రోజు వలె అదే ఉత్సాహం, ఆనందం ! నిరాశా నిస్పృహలు అన్నవి మచ్చుకైనా ఆమె ముఖం లో కాన రాలేదు. ఇదంతా చూసిన దాసగణు జాలి భావం మెచ్చుకోలుగా మారింది. సరిగ్గా అప్పుడే అతనిలో అజ్ఞానంధకారాలు పటాపంచలై జ్ఞాన జ్యోతులు వెలిగాయి. ఈశావాస్యోపనిషత్తు కావ్యం యొక్క నిఘూఢ రహస్యాలన్నీ సాయి అనుగ్రహం వలన క్షణాలలో అవగతం అయ్యాయి.

పిల్ల కటిక పేదది కావడం వలన చింకి గుడ్దలు కట్టుకుంది. ఖ్రొత్త చీర లభించినప్పుడు దానిని ధరించింది. రెండు సంధర్భాలలో కూడా ఆమె ఒకే విధమైన ఆనందం తో వుంది. చీర వున్నప్పుడు , లేనప్పుడు కూడా అదే సంతృప్తితో ఆమె వుంది. కాబట్టి కష్ట సుఖములనే భావనలను మన మనో వైఖరి పైనే ఆధారపడి వున్నాయి. మన పూర్వ జన్మ సుకృతం వలన కష్ట సుఖములను, లాభ నష్టములను భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. భగవంతుడిచ్చిన వాటితో మనము సంతృప్తులై వుందాలి. మనకు ఏమి ప్రసాదించినా అది మన మేలు కోసమే నని గ్రహించి అన్నింటినీ సమ భావం తో స్వీకరించి ఆయనకు కృతజ్ఞలమై వుండాలి. పిల్ల, ఆమె పేదరికం, ఆమె సంతృప్తి, ఆనందం, క్రొత్త చీర, దాసగణు యొక్క దానగుణం, ఇవన్నీ భగవంతుని ప్రతిరూపాలే ! అన్నింటి యందు భగవంతుడు సమానం గా వ్యాపించి వున్నాడు. శివాజ్ఞ లెనిదే చీమైనా కుట్టదు. భగవంతుని అనుజ్ఞ ప్రకారమే మనకు అన్ని సంఘటనలు సంభవిస్తున్నాయి. కాబట్టి ఇతరులను కష్టపెట్టరాదు, ఇతరుల సొత్తుకై మనం ఆశింపరాదు, మనకు వునదానితోనే సంతుష్టి చెందవలెను, మనకు ఏమైనా కావల్సి వచ్చినప్పుడు హృదయపూర్వకం గా భగవంతుని డినే ప్రార్ధించాలి. అంతే కాక మనం మనకు శాస్త్రములలో విధింపబడిన కర్మలను ఎల్లవేళలా చేస్తుండాలి. భగవంతుని అనుగ్రహం కోసం సత్కర్మలు ఒనరించుట అన్నింటి కంటే మేలు.భగవంతుడు సర్వాంతర్యామి. జడ, జీవ పదార్ధాలన్నింటిలోనూ సమానం గా వ్యాపించి వున్నాడు. అంతులేని నమ్మకం తో ఒక రాయిని కొలిచి , ప్రార్ధించినా మన కోరికలను తీరుస్తాడు. మానవుడైతే సమస్త జీవరాశి యందు కొలువై వున్న భగవత్స్వరూపమైన ఆత్మను దర్శిస్తాడో, అన్ని జీవ, జడ పదార్ధములను ఒకే విధం గా భావిస్తాడో అతను విధమైన మోహములకు గురికాడు. ఎటువంటి సంతోష, వికారాలకు గురి అవడు.

దాసగణుకు శ్రీ సాయినాధుని అనుగ్రహం వలన క్షణం లో జ్ఞానోదయం అయ్యింది. ఈశావాస్యోపనిషత్తు లోని అంతరార్ధం , నిఘూఢ తత్వం వెంటనే అవగతం అయ్యాయి. గ్రంధం పై మరాఠీ బాషలో అపూర్వమైన రీతిలో భాష్యాన్ని రచించి శ్రీ సాయికి అంకితం చేసాడు. ఈశావాస్యోపనిషత్తు పై మనకు లభించే వివిధ భాష్యాలలో దాసగణు మహరాజు రచించిన భాష్యాన్నే అత్యుత్తమైన దానిగా ఇప్పటికీ పండితులు భావిస్తారు.

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు
లోకాస్సమస్తా సుఖినోభవంతు
సర్వే జనసుఖినోభవంతు


No comments:

Post a Comment