Thursday, 30 August 2018

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం – 73కలియుగ దైవం, సమర్ధ సద్గురువు అయిన శ్రీ సాయినాధుని అపూర్వ, అసామాన్య, కరుణా కటక్షముల వలన రక్షింపబడి, అతి శ్రీఘ్రముగా అధ్యాత్మికోన్నతి పొందిన ఒక సామాన్య భక్తుని గురించి ఈ అధ్యాయములో తెలుసుకుందాం.

మహారాష్ట్ర దేశం లో అహ్మద్ నగర్ జిల్లా కోపర్గావ్ తాలూకా కొరాలే గ్రామానికి చెందిన అమీర్ శక్కర్ దలాల్ కసాయి కులానికి చెందిన వాడు. బొంబాయి లోని బాంద్రా లో చాలా కాలం కమీషన్ వ్యాపారిగా పని చేసి పేరు ప్రఖ్యాతులు, సిరి సంపదలు గడించాడు.సకల కళా పోషకుడు. జీవితం అన్ని విధాలుగా ఆనందించడానికి వుందన్న సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు.ఏనాడూ భగవంతునికి కనీసం చేతులు జోడించి నమస్కరించి ఎరగడు. ఓక సమయం లో తీవ్రమైన కీళ్ళవాతం అతనికి వచ్చింది. వున్న డబ్బు,పలుకుబడి వుపయోగించి ఎందరో వైద్యులను సంప్రదించి, ఖరీదైన వైద్యలను చేయించుకున్నా, అవన్నీ తాత్కాలికంగా వుపశమనం ఇచ్చాయే కాని శాశ్వత ప్రాతిపదికపై బాధ తగ్గలేదు. ఇక ఆఖరి ప్రయత్నంగా బంధువుల , స్నేహితుల ప్రోద్భలంపై శిరిడీ వచ్చి శ్రీ సాయి కాళ్ళపై పడి తన బాధను తగ్గించమని వేడుకున్నాడు. దయా సముద్రుడు,భక్తుల పాలిటి కల్పవృక్షం అయిన శ్రీ సాయి తక్షణమే కరుణించి అతనిని చావడిలో వుండమని ఆదేశించారు. కీళ్ళ వాతం వచ్చిన ఆ రోగికి నిరంతరం తేమతో వుండే ఆ ప్రదేశం ఎంత మాత్రం పనికి రాదు. పైగా రోగాన్ని మరింత హెచ్చించే ప్రదేశం అది.అయినా శ్రీ సాయి మాటను మనస్పూర్తిగా నమ్మి అమీర్ శక్కర్ నాటి నుండి తన నివాసం చావడి లోనే ఏర్పరుచుకున్నాడు. తాను చెప్పే వరకూ మశీదుకు రావద్దని శ్రి సాయి ఖచ్చితంగా ఆదేశించారు. అయితే నాటి నుండి అమీర్ శక్కర్ జీవితం లో గొప్ప మార్పు సంభవించింది. ఉదయం, సాయంత్రం బాబా దర్శనం అయ్యేది. రోజు విడిచి రోజూ గొప్ప ఉత్సవం తో బాబా చావడికి నిద్రించడానికి వచ్చేవారు. కలియుగ దైవం, సమర్ధ సద్గురువు అయిన శ్రీ సాయి సన్నిధిలో నిద్రించడం కంటే భాగ్యం ఇంకేమి కావాలి ? ఎన్ని వేల జన్మలలో పుణ్యం చేసుకుంటే ఈ అపూర్వమైన భాగ్యం కలుగుతుంది ? పూర్తిగా తొమ్మిది నెలల పాటు అమీర్ అక్కడ జీవించాడు. ఈ మధ్య కాలం లో అమీర్ లో ఎంతో మార్పు వచ్చింది. దుష్ట సంస్కారాలు నశించాయి. విషయానందం అనుభవించాలన్న ఆసక్తి తగ్గింది. సత్వ గుణం అలవడింది. బాబా అమీర్ లో కోరుకున్న మార్పు అదే ! ఇక అమీర్ లో ఆఖరుగా మార్పు తీసుకు రాదలిచారు శ్రీ సాయి.

ఓక రోజున అమీర్ కు ఆ స్థలం పై విసుగు కలిగి ఆ రాత్రి ఎవ్వరికీ చెప్పకుండా కోపర్గావ్ పారిపోయాడు. అక్కడ ఒక ధర్మశాలలో దిగగా ఆ రాత్రి ఒక ఫకీరు అతనిని పిలిచి దాహం గా వుందని చెప్పాడు. అమీర్ వెంటనే వెళ్ళి కాసిన్ని నీళ్ళు త్రాగించగా అల్లా !అంటూ ఆ ఫకీరు అమీర్ శక్కర్ ఒడిలోనే ప్రాణాలు విడిచాడు.అమీర్ గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. సత్రం యజమానులకు గాని,పోలీసులకు గానీ ఈ విషయం తెలియ పరిస్తే ప్రధమ ముద్దాయిగా తననే నిర్భందిస్తారని భయపడి శిరిడీని శ్రీ సాయి ఆజ్ఞ లేకుందా విడవడం తనదే తప్పని తెలుసుకొని, శ్రీ సాయిని పశ్చాత్తాపంతో ప్రార్ధించి వెంటనే శిరిడీకి తిరిగి పయనమయ్యాడు.దారి పొడవునా శ్రీ సాయి నామ జపం చేస్తునే వున్నాడు.సుర్యోదయానికి ముందే శిరిడీ చేరి చావడిలో శ్రీ సాయి చిత్ర పటం ముందు కూర్చుంటే తప్ప అతనికి ఆతృత తగ్గలేదు.

కొద్ది కాలానికే అతను శాశ్వతంగా రోగ విముక్తుడయ్యాడు.శ్రీ సాయికి అక్కలంక భక్తుడు అయి జీవితాంతం అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ సాయి ఆరాధనను చేసాడు. భక్తి తత్వం లో పరిపూర్ణత సాధించి, శ్రీ సాయి ఆరాధనలో తరించి అనిర్వచనీయమైన అధ్యాత్మికానుభూతిని పొంది చివరకు శ్రీ సాయిలో ఐక్యం చెందాడు !

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు
లోకాస్సమస్తా సుఖినోభవంతు
సర్వే జనసుఖినోభవంతు


Monday, 27 August 2018

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం – 72డా పిళ్ళై అనువాడు బాబాకు అత్యంత ప్రియ భక్తుడు. ఆతని యందు శ్రీ సాయికి అమితమైన ప్రేమ. ఆతనిని భావూ (అన్నా) అని సంబోధిస్తూ అన్ని ముఖ్య విషయాలలో అతనితో సంప్రదిస్తూ వుండేవారు. ఒకసారి  డా పిళ్ళై కు నారి పుండు వ్యాధి వచ్చింది. గినియా పురుగులు శరీరం లోకి ప్రవేశించడం వలన వచ్చే ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైనదిగా ఆ రోజులలో పరిగణించేవారు. డా పిళ్ళై తన వైద్య శాస్త్ర పరిజ్ఞానమంతటినీ ఉపయోగించి ఎన్నో మందులను వాడాడు కానీ ఏం వుపశమనం కలగలేదు. పైగా వ్యాధి తీవ్రతరం కాసాగింది. బొంబాయి లో వున్న స్నేహితులను సంప్రదించాడు కాని ఫలితం కనబడ లేదు. దానితో అతడు సాయి భక్తుడు అయిన కాకాసాహెబ్ దీక్షిత్ తో నా యీ బాధ ఎక్కువగా వుంది. ఈ బాధను భరించడం కంటే చావే మేలనిపిస్తోంది. ఏ జన్మ లోనో చేసిన పాపం ఈ విధం గా నన్ను పట్టి పీడిస్తోంది.దయ చేసి శ్రీ సాయి వద్దకు వెళ్ళి ఈ బాధను రాబోయే పది జన్మలకు పంచిపెట్టవల్సిందిగా కోరండి అని అడిగాడు. దీక్షిత్ వెంటనే శ్రీ సాయి వద్దకు వెళ్ళి డా పిళ్ళై కోరికను విన్నవించాడు. మునిజన వంద్యుడు, దీనజనోద్ధారకుడు, భక్తుల పాలిట ఆశ్రిత కల్పవృక్షం అయిన శ్రీ సాయి హృదయం కరిగింది. వెంటనే దీక్షిత్ తో ఆ డాక్టర్ని నిర్భయం గా వుండమను.అతడు పది జన్మల వరకు బాధ పడాల్సిన పని లేదు. వచ్చే పది రోజులలోనే అతని బాధను తగ్గిస్తాను, నేను అందరి క్షేమం కోరే తల్లి వంటి ఈ ద్వారకామాయిలో వుండగా అతడు చావు నెందుకు కోరాలి ? అతనిని ఇక్కడకు తీసుకురండి. ఆతని బాధను శాశ్వతం గా నిర్మూలించి అంతులేని ఆనందాన్ని ప్రసాదిస్తాను అని అన్నారు.

ఆ నారి పుండుతో తీవ్రం గా బాధపడుతున్న డా పిళ్ళై ను బాబా ఆదేశానుసారం వీపుపై మోసుకు వచ్చి మశీదులో బాబా వారి ఆసనానికి కుడివైపున కూర్చోబెట్టారు. బాబా అతనికి ఆనుకోవడానికి ఒక బాలీసు నిచ్చి అత్యంత ప్రేమ, జాలి,కరుణతో నిండిన స్వరం తో భావూ, ఇక్కడ నెమ్మదిగా పడుకొని విశ్రాంతి తీసుకో. మన కష్ట సుఖములకు మన పూర్వ జన్మలే కారణం. కాబట్టి గత జన్మల పాపములను అనుభవించి వాటి నుండి విముక్తులవడమే మన కష్టాలన్నింటికీ అసలైన విరుగుడు. సబ్ కా మాలిక్ ఏక్ హై ! ఆ అల్లా అత్యంత దయామయుడు.అతనిని ధ్యానిస్తూ వుండు. తప్పక నీ కష్టాలను తీరుస్తాడు.అతనికి కావల్సింది  నీ ప్రేమ,భక్తి శ్రద్ధలు మాత్రమేఅని బాబా డా పిళ్ళై తో  అన్నారు.  సాయీ, ఆ నానా ఈ కురుపుపై ఏవో మందులు పూసి కట్టు కట్టాడు, కానీ ఎంతకూ నొప్పి తగ్గడం లేదుఅని దీన స్వరం తో అన్నాడు. అందుకు బాబా మందహాసం తో ఆ నానా తెలివి తక్కువ వాడు. ఆ కట్టును వెంటనే విప్పేయి. లేకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం. కొద్ది సేపట్లో ఒక కాకి వచ్చి నిన్ను పొడుస్తుంది, అప్పుడు నీ కురుపు నయమైపోతుంది. ఆని డా పిళ్ళై కాలికి వున్న కట్టును లాగి పారేసారు. బాబా మాటలను విన్న ఇతర భక్తులు బాబా పరిహాసం చేస్తున్నారేమోననుకున్నారు. లేకపోతే కాకి పొడవడం ఏమిటి ? కురుపు నయమవడం ఏమిటి ? ఎంత ఆలోచించినా వారికి ఏమీ అర్ధం కాలేదు. శ్రీ సాయి చేష్టలు, పలుకులు అత్యంత నిగూఢమైనట్టివి, వాటిని మన పరిమిత బుద్ధితో తెలుసుకోవాలనుకోవడం చాలా అవివేకం.

ఇంతలో బాబాకు అత్యంత సన్నిహితుడైన అబ్దుల్ బాబా వచ్చి మశీదులు శుభ్రం చేస్తుండగా అతని కాలు పొరపాటున డా పిళ్ళై కురుపుపై పడింది. ఆబ్దుల్ కాలు పడగానే ఆ కురుపు పగిలిపోయి అందులో నుండి ఏడు గినియా పురుగులు బయటకు వచ్చాయి. చీము లాంటి పదార్ధమంతా బయటకు వచ్చేసింది. బాధ తీవ్ర స్థాయికి చేరడం తో డా పిళ్ళై పెద్దగా ఏడవసాగాడు. కాని కొంతసేపటికి బాధ తగ్గింది. డా పిళ్ళై కు ఉపశమనం కలిగింది. అప్పుడు బాబా మందహాసం తో తన భక్తులతో చూడండి, మన భావూ యొక్క జబ్బు నయపైపోయింది, ఇప్పుడు ఎంత హాయిగా నవ్వుతున్నాడో , అంతా ఆ అల్లా దయఅన్నారు.నిజంగానే బాధ తగ్గిపోవడం తో డా పిళ్ళై ముఖం పై నవ్వు వెలిసింది. అతడు అమాయకం గా బాబా! కాకి ఎప్పుడు వస్తుంది ? కురుపును ఎప్పుడు పొడుస్తుంది ? “ అని  అడిగాడు. అందుకూ శ్రీ సాయి నవ్వుతూ ఓరి అమాయకుడా ! నువ్వు కాకిని చూడలేదా ? అయితే అది ఇక రాదు.అబుల్లాయే కాకి. ఇప్పుడు నువ్వు వాడాకు పోయి హాయిగా విశ్రాంతి తీసుకో ! రెండు  రోజులలో అంతా సర్ధుకుంటుంది అని డా పిళ్ళై తలపై చేయి వుంచి ఆశీర్వదించారు. అప్పుడు బాబా పలుకులలోని అంతరార్ధం అందరికీ అర్ధమయ్యింది. బాబా తరచుగా అబ్ధుల్ ని కవ్వా (కాకి) అని పిలుస్తుండేవారు. ఇతర వైద్యుల వలె మందులు ఇవ్వకుండా , ఆపరేషన్లు చేయకుండా, ఒక నయా పైస ఖర్చు కానివ్వకుందా తనదైన శైలిలో వైద్యం చేసి డా పిళ్ళై కు వెంటనే ఆ నారి పుండును తగ్గించి వేసారు. వచ్చేటప్పుడు ముగ్గురు మనుష్యుల సహాయం తో వచ్చిన డా పిళ్ళై కొద్ది గంటల సమయం లోనే బాబా వారి సంపూర్ణ కరుణ కటాక్షాల వలన నడుచుకుంటూ తన బసకు వెళ్ళిపోయాడు. శ్రీ సాయి ప్రసాదించిన ఊదీని తినడం వలన, దానిని కురుపుపై రాయడం వలన  కొద్ది రోజులలోనే ఆ కురుపు పూర్తిగా నయమైపోయింది. ఆనితర సాధ్యమైన ఆ వ్యాధిని అతి సునాయసం గా తగ్గించిన అఖిలాంఢకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధి రాజు, యోగిరాజు అయిన శ్రీ సాయికి మనస్సులోనే కృతజ్ఞతలను తెలుపుకుంటూ  శిరిడీ విడిచి ఆనందం గా తన ఇంటికి వెళ్లాడు డా పిళ్ళై. తన భక్తుల పట్ల శ్రీ సాయికి అపారమైన ప్రేమ, దయ,  కరుణ కటాక్షాలు వున్నాయనడానికి ఈ లీల ఒక చక్కని నిదర్శనం. అందుకు భక్తుల కెట్టి కఠోర నియమాలు పెట్టక, కేవలం దర్శన, స్మరణలతోనే సంతుష్టులై తన భక్తులకు ఎల్లవేళలా అభయ హస్తాన్ని అందించే సమర్ధ సద్గురువు శ్రీ సాయి భక్త సులభుడు”. శ్రీ సాయి పాదాలే మనకు రక్ష, శ్రీ సాయి నామస్మరణమే మనకు అత్యంత శ్రేయస్కరం.  

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు
లోకాస్సమస్తా సుఖినోభవంతు
సర్వే జనసుఖినోభవంతు

Thursday, 23 August 2018

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం – 71


మహారాష్ట్రలో నివసించే సఖారాం ఔరంగాబాద్ కర్ అనే వాడికి  వివాహం అయ్యి 27 సం లు పూర్తయినా సంతానం కలుగలేదు. సుప్రసిద్ధులైన ఎందరో డాక్టర్ల చేత లక్షలకు లక్షలు వైద్యం చేయించుకున్నారు.ఎన్నో వ్రతాలు, పూజలు, హోమాలు చేయించారు, ఎందరో దేవతలకు మొక్కుకున్నారు గాని ఫలితం కనిపించలేదు. ఛివరకు తమకు సంతాన యోగం లేదని నిర్ణయించుకున్నారు . అంతులేని ఆందోళన, ఆవేదనతో నిస్సారమైన జీవితం గడుపుతున్నారు. శ్రీ శిరిడి సాయినాధుని మహత్యం గురించి విని శిరిడి వెళ్ళి ఆఖరు ప్రయత్నం చేద్దామని అనుకున్నారు. ఔరంగాబాద్ కర్ భార్య తన బంధువైన విశ్వనాధునితో శిరిడీ వచ్చి బాబా దర్శనం చెసుకొని అక్కడ రెండు నెలలు గడిపింది. ప్రతీ రోజూ పూజాది కార్యక్రమములను నిర్వహించడం , నాలుగు వేళలా ఆరతులలో పాల్గొనడం, సేవ, సద్గ్రంధ పఠనం, సద్గోష్టి లో పాల్గొనడం, వంటి సత్కార్యాలలో చాలా చురుకుగా పాల్గొంది. ఒక్కసారైనా బాబాను ఒంటరిగా వున్నప్పుడు దర్శించుకొని తన కోరికను వెల్లడించుదామని ఆమె అనుకుంది , కాని మసీదు ఎల్లప్పుడూ  భక్తులతో కిట కిట లాడుతుందడం వలన అది ఆమెకు సాధ్యపడలేదు. ఇక ఆగలేక ఔరంగాబాద్ కర్ భార్య శ్యామాను కలిసి తన మనసు లోని మాటను చెప్పింది. శ్యామా ఆమెకు సహాయం చేయ సంకల్పించి బాబా భోజన సమయం లో కొబ్బరికాయ ఇత్యాది పూజా ద్రవ్యాలతో మశిదు వాకిలి వద్ద సిద్ధం గా వుండమని చెప్పాడు. ఒకరోజు బాబా భోజనం చేసాక శ్యామా ఆయన చేతులను తువ్వాలుతో తుడుస్తున్నాడు. అప్పుడు సాయి ప్రేమతో శ్యామా బుగ్గలు గిల్లారు. అందుకు శ్యామా కినుక వహించి సాయి ! నా బుగ్గను గిల్లడం నీకు భావ్యం కాదు. మా బుగ్గలు గిల్లే అల్లరి దేముడు మాకు అక్కర లేదు,” అని అన్నాడు. శ్రీ సాయి చిరునవ్వుతో శ్యామా ! గత 72 జన్మల నుండి మనకు సంబంధం వుంది. అయినా నిన్ను నేను ఎన్నడూ గిల్లలేదు.ఇన్నాళ్లకు నిన్ను గిల్లగా నీకు కోపం వస్తుంది.ఆని అన్నారు. దేవా ! మాకు మీ నుండి ఎటువంటి స్వర్గ సౌఖ్యాలు అవసరం లేదు.మమ్మల్ని ఎల్లవేళలా కనిపెట్తుకొని వుండి కాపాడితే అదే చాలుఅని మనస్పూర్తిగా ప్రార్ధించాడు శ్యామా. ఈ మాటల ద్వారా తన భక్తులతో ఎన్నో జన్మల నుండి తనకు అనుబంధం వున్నదని, అన్ని జన్మలలోనూ తన భక్తులను ఒకే విధం గా కంటికి రెప్పలా కాపాడుతూ వుంతానని శ్రీ సాయి స్పష్టం గా తెలియజేసారు. అంతే కాక జనన మరణం ఎరుగని పరబ్రహ్మానిని అని, తనను నమ్మి శరణు జొచ్చే భక్త జనావళికి రక్షణ కవచం అందిస్తూ సన్మార్గ వర్తులను గావించడమే తన ముఖ్య కర్తవ్యమని శ్రీ సాయి తెలియజేసారు.


శ్రీ సాయి వెళ్ళి తన ఆసనం పై కూర్చోగానే శ్యామా ఔరంగాబాద్ కర్ ను రమ్మని సైగ చేసాడు. ఆమె ఆర్ద్రతతో పరుగు పరుగున వచ్చి శ్రీ సాయికి నమస్కరించి  కొబ్బరికాయ,ఇతర పూజాద్రవ్యాలను ఆయనకు సమర్పించుకుంది. శ్రీ సాయి కొబ్బరికాయ నాడిస్తూ శ్యామా ! ఇది ఎండిన టెంకాయ, ఇది ఏమంటుందో వినుఅని అన్నారు.

సాయి, నీ భక్తురాలు తన గర్భం లో ఒక బిడ్డను ఇదే విధం గా ఆడాలని కోరుకుంటోంది.దయ చేసి ఆమెకు ఈ వరం ప్రసాదించుఅని శ్యామా ప్రార్ధించాడు. శ్యామా మీరెంత అమాయకులు ? టెంకాయ బిడ్డలను ప్రసాదిస్తుందా ? “ అని సాయి చిరునవ్వు నవ్వారు. దేవా ! నీ ఆశీర్వాద ప్రభావం నాకు బాగా తెలుసు. నీ కరుణామృత చూపులే ఆమెకు బిడ్దల పరంపరను ప్రసాదిస్తుంది. దయ చేసి ఆ అమాయకురాలి తప్పులను మన్నించి ఆమెకు నీ వరాన్ని అనుగ్రహించు " అంటూ బాబాను శ్యామా పరి పరి విధాలుగా వేడుకున్నాడు. ఔరంగాబాద్ కర్ భార్య కూడా తమ గత జన్మల పాపములను మన్నించి తమకు ఒక బిడ్డను ప్రసాదించమని మనసులోనే ఎంతో ఆర్ద్రతతో ప్రార్ధించింది. తుదకు భక్తుల ప్రార్ధనకు, ప్రేమకు లొంగిపోయి నీకు ఒక సంవత్సరం లోగా బిడ్దలు కలుగుతారని ఆశీర్వదించారు. అట్లా ఆశీర్వదించి టెంకాయను పగులగొట్టి ఒక భాగాన్ని ఔరంగాబాద్ కర్ భార్యకు ప్రసాదం గా శ్రీ సాయి ఇచ్చారు. ఔరంగాబాద్ కర్ భార్య పట్టరాని సంతోషం తో శ్రీ సాయికి నమస్కరించి తమ ఊరికి తిరుగు ప్రయాణం కట్టింది. శ్రీ సాయినాధుని మాటలు నిజం చేస్తూ సంవత్సరం లోగా ఆమెకు పండంటి బాబు పుట్టాడు. ఆ బాబు అయిదవ నెలలో ఆ దంపతులిద్దరూ శిరిడీ వచ్చి శ్రీ సాయి దర్శనం చేసుకొని తమ బిడ్డను సాయి పాదాలపై పడుకోబెట్టి ఆశీర్వదించవల్సిందిగా ప్రార్ధించారు. తమకు పుత్రోదయం కల్గించినందుకు కృతజ్ఞతతో ఆ దంపతులిద్దరూ శ్రీ సాయికి దక్షిణగా అయిదు వందల రూపాయలను దక్షిణగా సమర్పించారు. శ్రీ సాయి వారిద్దరి పేరిట ఆ దక్షిణతో తన గుర్రమైన శ్యామకర్ణ కు ఒక శాలను కట్టించారు. వైద్యుల ట్రీట్మెంట్, జ్యోతిష్కుల పరిశోధనలను అధిగమించి తమ భక్తులకు వారి లలాట లిఖితాన్ని తిరగరాసి బిడ్డలను ప్రసాదించిన శ్రీ శిరిడీ సాయినాధుని కరుణను, ప్రేమానురాగాలను, భక్త పరాయణ తత్వాన్ని వర్ణించుటకు మాటలు చాలడం లేదు. అనుక్షణం శ్రీ సాయికి పరిపూర్ణమైన హృదయం తో కృతజ్ఞతలు అర్పించడం తప్ప మనమిక ఏమి చేయగలం ? 

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు
లోకాస్సమస్తా సుఖినోభవంతు
సర్వే జనసుఖినోభవంతు

Monday, 20 August 2018

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం – 70


నాసిక్ జిల్లాలోని మాలేగావ్ అనే పట్టణం లో ఒక డాక్టరు వుండేవాడు. వాని మేనల్లునికి ఒకసారి ఒక రాచ కురుపు లేచింది. తన డాక్టరు పరిజ్ఞనానంతటినీ వుపయోగించి వైద్యం చేసాడు గానీ మాత్రం వుపశమనం కలగలేదు. రోజురోజుకూ కురుపు యొక్క బాధ తీవ్రతరం కాసాగింది. తనకు తెలిసిన వైద్యులందర్నీ కురుపు విషయమై డాక్టర్ సంప్రదించాడు కానీ ఏం లాభం లేకపోయింది. దురదృష్ట వశాత్తూ కురుపు సెప్తిఖ్ కావడం తొ ఆపరేషన్ చేసి చెయ్యిని తీసివెయ్యాలని డక్టర్లు నిర్ణయించారు. ఇటువంటి సమయం లో పిల్లవాని తల్లిదండ్రులకు  ఒక స్నేహితుడు శిరిడీ వెళ్లి శ్రీ సాయినాధులను దర్శించమని ఆయన అనంతమైన కృపా కటాక్షాలతో అనితర సాధ్యమైన రోగాలెన్నో నయం అవుతున్నాయని సలహా ఇచ్చాడు.

సదరు డాక్టరు గారికి సాధువులన్నా, బాబలన్నా గౌరవం లేదు. ఇవ్వన్నీ నమ్మవద్దని ఎంత చెప్పినా వినకుండా, పిల్లవాని తల్లిదండ్రులు శిరిడి తిసుకువెళ్ళి శ్రీ సాయినాధుని దర్శనం చేసి తమ పిల్లవాడిని బాగు చెయ్యమని కళ్ల నీళ్ళ పర్యంతమై వేడుకున్నారు. దయార్ధ హృదయులు అయిన శ్రీ సాయి వారిని ఒదారుస్తూ, “ ఏం కలత చెందవద్దు. ఎవరైతే మశీదు మెట్లు ఎక్కారో ఇక వారి కష్టలన్నీ దూరం అవుతాయి. ఉదీని తీసుకువెళ్ళి కురుపుపై రాయండి. వారం రోజులలోనే నయమౌతుంది.ఆని తన ప్రేమామృతమైన చూపులను పిల్లవాడిపై ప్రసరించి ఆశీర్వదించారు. పిల్లవాడి తల్లిదండ్రులు బాబా చెప్పినట్లే చేసారు. విచిత్రాలలో కెల్లా విచిత్రం.

శ్రీ సాయి యొక్క మహిమాన్వితమైన విభూదీ ని రాయడం ప్రారంభించిన నాటి నుండి  కురుపు నెమ్మదించింది. నొప్పి క్రమం గా తగ్గడం తో పాటు కురుపు కూడా ఎండిపోసాగింది. ఛివరకు ఏడవ రోజున పూర్తిగా మానిపోయింది. ఒక వైపు ఆపరేషన్ ద్వారా చెయ్యని పోగొట్టుకుంటానేమోనన్న ఆందోళనతో వున్న పిల్లవాడు కురుపు నయమవడం తో మశీదుకు వెళ్ళి బాబా వారి కాళ్ళపై పడి కన్నీటితో అభిషేకం చేసాడు. సాయి యొక్క ఊదీ ప్రసాదాన్ని స్వీకరించి వారందరూ సంతోషం గా తమ గ్రామానికి తిరిగి వెళ్ళారు. మహామహులైన డాక్టర్లు నయం చెయ్యలేని రాచ కురుపును సమర్ధ సద్గురువు అయిన శ్రి సాయి నయం చెసారన్న వార్తను తెలుసుకున్న దాక్టర్ తాను కూడా  వెళ్ళి బాబా దర్శనం చేసుకుందామనుకున్నాడు.

కాని మధ్య మార్గం లో మన్మాడు స్టేషనులో కొందరు బాబాకు వ్యతిరేకం గా చెప్పడం వలన మనసు మార్చుకొని తన మిగిలిన శెలవలను గడపడనికి ఆలీబాగ్ కు ప్రయాణమయ్యాడు. ఆలీబాగ్ కు చేరిన తర్వాత అతని హృదయవాణి శిరిడీ వెళ్ళమని తీవ్రం గా ప్రేరేపించింది. అంతే కాక రెండు రోజులు కలలో ఒక దివ్య పురుషుని దర్శనం అయ్యి ఇంకనూ నన్ను నమ్మవా అని అంటునట్లు అనిపించింది. స్వతాహాగా నాస్తిక భావాలు కల డాక్టర్ బాబాను పరీక్షించ దలచి బొంబాయిలో రెండు వారాల నుండి అంతుబట్టని విచిత్రమైన జ్వరముతో బాధపడుతున్న తన రోగికి ఒక రెండు రోజులలో వ్యాధి తగ్గితే తప్పక శిరిడి వచ్చి బాబా దర్శనం చేసుకుంటానని సంకల్పం చేసుకున్నాడు. సాయినాధుని లీలలు చిత్రాతి చిత్రం. మనో నిశ్చయం జరిగినప్పటి నుండి బొంబాయి లో వున్న రోగికి జ్వరం తగ్గు ముఖం పట్టనారంభించి రెండు రోజులలోనే సామాన్య ఉష్ణోగ్రతకు దిగింది.

రోగి బంధువులు పట్టలేని ఆనందంతో డాక్టర్ గారికి ఫోన్ చెసి విషయం తెలియపరిచారు. డాక్టర్ జరిగిన అద్భుతానికి అబ్బురపడి వెంటనే శిరిడీ వచ్చి సాయినాధుని దర్శనం చెసుకున్నాడు. సాయిని దర్శించిన వెంటనే డాక్టర్ కు ఒక గొప్ప అధ్యాత్మికానుభూతి కలిగింది. భక్తులపై సాయికి వున్న అనంతమైన ప్రేమానురాగాలకు ముదమొంది వెంటనే తన నాస్తిక భావాలను పరిత్యజించి  సాయిని తన సద్గురువుగా మనో నిశ్చయం చేసుకున్నాడు.నాలుగు రోజుల పాటు శిరిడీలో సాయి సన్నిధిలో వుండి, అక్కడి అధ్యాత్మిక రసానుభూతిని తనివి తిరా ఆస్వాదించి బాబా వారి ఊదీ ప్రసాదమును, ఆశీర్వచనములను తీసుకొని ఇంటికి వెళ్లాడు. అప్పటి నుండి అతని జీవిత విధానమే మారిపోయింది. సాయి బోధలను త్రికరణ శుద్ధిగా పాటిస్తూ నిత్యం సాయి ఆరాధనలో మునిగి తేలుతుండేవాడు. పదిహేను రోజులలో గత నాలుగు రోజుల నుండి రాకుండా వూరిస్తున్న ప్రమోషన్ వచ్చింది, హెచ్చు జీతం పై బీజాపూర్ కు ట్రాన్స్ ఫర్ చేసారు. భగవంతుని లీలను అర్ధం చేసుకోవడం ఎవరి తరం
మొదట్లో శుద్ధమైన నాస్తికుడు. అతని మేనల్లుని రోగం వలన సాయి దర్శనం అయ్యింది. నాటి నుండి సాయికి కూర్మి భక్తుడు అయ్యాడు. 

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు
లోకాస్సమస్తా సుఖినోభవంతు
సర్వే జనసుఖినోభవంతు