Wednesday, 12 September 2018

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం – 76కలియుగ దైవం, పరిశుద్ధ పరమేశ్వర అవతారం అయిన శ్రీ సాయినాధులకు తమ భక్తులపై గల అవాజ్యమైన ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు. ప్రపంచం లో అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ మిక్కిలి పవిత్రమైనది,స్వార్ధరహితమైనది. కాని శ్రీ సాయి తన భక్తులపై కనబరిచే ప్రేమ తల్లి ప్రేమ కంటే ఎన్నో రెట్లు గొప్పది. శ్రీ సాయి సచ్చరిత్రలో శ్రీ సాయి తన భక్తులపై అంతులేని ప్రేమానురాగాలను వర్షించిన సంఘటనలు వందలాదిగా దర్శనమిస్తాయి. వాటిని పారాయణ చేస్తే మనస్సులో ఆనంద తరంగాలు ఉవ్వెత్తున లేస్తాయి. శ్రీ సాయి వంటి సద్గురువుకు భక్తులమైనందుకు ఎంతో గర్విస్తాము.

శ్రీ సాయి భక్తాగ్రేసరునిగా పేరు గాంచిన నానా చందోర్కర్ కు నందూరుబారు నుండి పందరీపురానికి బదిలీ అయ్యింది. పందరీపురానికి భూలోక వైకుంఠమని పేరు. సాక్షాత్ శ్రీమన్నారయుణుడు విఠలుని రూపంలో అక్కడ కొలువై వున్నాడని ప్రతీతి. అధ్యాత్మికతకు నెలవై వున్న పండరీపురానికి బదిలీ అయినందుకు నానా ఎంతో సంతోషించి ఎవ్వరికీ తెలియజేయక అప్పటికప్పుడు ప్రయాణమయ్యాడు. మధ్యమార్గం లో శిరిడీలో ఆగి శ్రీ సాయి దర్శనం చేసుకో సంకల్పించాడు.

నానా చందోర్కర్ కోపర్గాం చేరేసరికి అప్పటి వరకూ మశీదులో భక్తులతో కూర్చోని సద్గోష్టి చేస్తున్న శ్రీ సాయి హఠాత్తుగా పండరీపురం విఠలుని భక్తుడు ఇక్కడికి వస్తున్నాడు. ఆతనిని మనం స్వాగతించాలి. రండి . అందరం కలిసి విఠలుని కీర్తిద్దాం.అంటూ విఠలుని భజన ప్రారంభించారు. అందరం కలిసి పండరీ పోదాం! విఠలుని దర్శిద్దాం! మనమంతా అక్కడే వసించవలెను, ఎందుకనగా అదియే మన తండ్రి నివాసంఎంతో శ్రావ్యంగా సాగిన భజనలో అందరూ తన్మయత్వం లో పాల్గొన్నారు.

ఇంతలో నానా చందోర్కర్ కుటుంబ సభులతో కలిసి మశీదుకు వచ్చి శ్రీ సాయికి పాదాభివందనం చెసి తనకు పండరీపురం బదిలీ అయ్యిందనీ,కనుక తనతో పాటు పండరీ రావల్సిందిగా శ్రీ సాయిని హృదయపూర్వకంగా ప్రార్ధించాడు.జరిగిన వింతకు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నానాకు పండరీపురం బదిలీ అయినట్లు ఎవ్వరికీ తెలుపకపోయినా సర్వజ్ఞుడు, సర్వ వ్యాప్తి అయిన శ్రీ సాయికి ఇట్టే తెలిసిపోయింది. తదనుగుణంగానే విఠలుని భజన చేసి తన సమ్మతిని తెలియజేసారు. భజన ద్వారా తనకు పండరీ రావాలన్న ఆశను కూడా వ్యక్తం చేసారు.

జరిగిన విషయాలను తెలుసుకున్న  నానా చందోర్కర్ హృదయం ఆనందంతొ ఉప్పొంగిపోయింది. బాబా తనపై చూపిన ప్రేమానురాగాలకు, కరుణకు ముదమొంది శ్రీ సాయి పాదాలపై పడి కన్నీటితో అభిషేకించాడు.రాజాధిరాజు, యోగిరాజు, సమర్ధ సద్గురువు అయిన శ్రీ సాయి ఊదీ ప్రసాదాలతో పాటు ఆశీర్వాదాలను కూడా పొంది ఎంతో సంతోషంగా కుటుంబ సభులతో కలిసి పండరీపురానికి నానా చందోర్కర్ బయలుదేరాడు. అనంతరం విధి నిర్వహణలో ఎంతో శ్రద్ధ, చాకచక్యం కనబరిచి అచిరకాలంలోనే ప్రమోషన్లను అందుకున్నాడు. శ్రీ సాయిని త్రికరణశుద్ధిగా నమ్మి కొలిచినవారికి ఇహ,పర సౌఖ్యములు ఇట్టే లభిస్తాయన్న సత్యానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేమి కావాలి ?


సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు
లోకాస్సమస్తా సుఖినోభవంతు
సర్వే జన: సుఖినోభవంతు

No comments:

Post a Comment