Thursday, 4 October 2018

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 82బొంబాయిలో నివసించే ఎం. డబ్లూ.ప్రధాన్ దంపతులు శ్రీ సాయిని ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం పూజించేవారు. సంవత్సరం లో ఒకసారైనా శిరిడీ వెళ్ళి సాయిని ఆరాధించడం క్రమం తప్పకుండా చేసేవారు. వారి ఇంట్లో పనిచేసే మాధన్ భట్ అను బ్రాహ్మణుడికి దత్తాత్రేయుడు ఇష్ట దైవం. ఆతనికి శ్రీ సాయి అంటే ఏ మాత్రం నచ్చేవారు కాదు. శ్రీ సాయి ఒక సాధారణ ముస్లిం ఫకీరు అని, కొన్ని యోగ విద్యలను అభ్యసించి భక్తులను ఆకట్టుకుంటారని, అటువంటి ఫకీరును హిందువులైన మనం పూజించరాదని నిత్యం వాదిస్తుండేవాడు. ఒక సందర్భం లో ప్రధాన్ యొక్క కుమారుడికి జ్వరం తీవ్రం గా వచ్చింది. ఎంతమంది ప్రముఖ వైద్యులను పిలచినా , ఎన్ని ఖరీదైన మందులను వాడినా అసలే మాత్రం తగ్గలేదు. ప్రధాన్ దంపతులు పుట్టెడు దుఖం లో మునిగిపోయారు.శ్రీ సాయిని మనసా వాచా నమ్మి కొలుస్తున్నారు కావున తమ కుమారుడికి వ్యాధిని శ్రీ సాయే తగ్గించాలని ప్రార్ధిస్తూ కూర్చున్నారు. మాధవ్ భట్ మాత్రం ముస్లిం ఫకీరు అయిన శ్రీ సాయిని హిందూ దేవుళ్ళతో సమానం గా పూజించడం వలన హిందూ దేవుళ్ళకు కోపం వచ్చిందని, అందుకే ఆ బిడ్డ జ్వరం నయం కావడ్దం లేదని వాదించడం మొదలుపెట్టాడు.

ఆ రాత్రి మాధవ్ భట్ కలలో శ్రీ సాయి కనిపించి తన సట్కాను వూపుతూ ఈ ఇంటికి యజమానిని నేనే ! ఈ ఇంటి వారి సర్వ బాధ్యతలు నావే!అంటూ కోపంగా అన్నారు. ఆ కలతో మాధవ్ భట్ లో ఎంతో మార్పు వచ్చింది. తానెంత జపం చెసినా ఆ బిడ్డ జ్వరం తగ్గకపోయేసరికి తన ఆలోచనా ధోరణి , విశ్వాసాలలోనే లోపం వుందన్న విషయం తెలుసుకున్నాడు. వెంటనే పశ్చాత్తాపం తో శ్రీ సాయి ఫొటొ ముందు నిలబడి ఓ సాయినాధా ! నా ఇష్ట దైవం దత్తాత్రేయుడు మీరూ ఒకరే అయితే ఆ బిడ్డ వ్యాధిని తక్షణమే తగ్గించండి.నాలోని అజ్ఞానంధకారాలను పటాపంచలు చేసి సన్మార్గం చూపండిఅంటూ ఎంతో తీవ్రం గా ప్రార్ధించాడు. అత్యద్భుతం గా ఏ తర్కానికి, విజ్ఞాన శాస్త్రాలకు  అందని విధం గా ఎన్నో మందులకు రోజులపాటు తగ్గని జ్వరం కొంచెం సేపటిలో తగ్గడం ప్రారంభించింది. కొద్ది గంటలలోనే ఆ బాబు పూర్తిగా స్వస్థుడయ్యాడు. ప్రధాన్ దంపతుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. మాధవ్ భట్ కు ఇది కలా నిజమా అనిపించింది. ఆ రోజు నుండి శ్రీ సాయియే దత్తాత్రేయుడని మనస్పూర్తిగా నమ్మి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజింపనారంభించాడు.
  
ప్రధాన్ కుమారుని అనారోగ్య నెపం తో మాధవ్ భట్ యొక్క అవిశ్వాసాన్ని సరిజేసి సన్న్మార్గం లొ నడిపించిన వైనం అత్యంత ఆశ్చర్యకరం. శ్రీ సాయి వంటి సద్గురువునికే ఇది సాధ్యం.
మరొక సందర్భం లో  ప్రధాన్ శిరిడీలో శ్రీ సాయిని దర్శించి పూజాది కార్యక్రమాలను నిర్వర్తించి, తిరిగి బొంబాయి వెళ్ళడానికి సాయి అనుమతి అడిగాడు. అప్పుడు శ్రీ సాయి నా శరీరం లో ఈ ప్రక్కన నొప్పిగా వుంది. అయినా ఫరవాలేదు. నాలుగు రోజులలో తగ్గుతుంది. ఆ తర్వాతే నువ్వు బొంబాయికి తిరిగి వెళ్ళుఅని అన్నారు. ప్రధాన్ కు సాయి మాటలు ఏమీ అర్ధం కాలేదు. అయినా ఆయన ఆజ్ఞ శిరసా వహించి నాలుగు రోజుల పాటు శిరిడీ లోనే వుండిపోయాడు. ఆ తర్వాత ఇల్లు చేరాక అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అతనికి తెలిసి వచ్చింది. శిరిడీలో శ్రీ సాయి ప్రధాన్ తో మాట్లాడే సమయం లోనే బొంబాయిలో వున్న అతని తల్లికి పక్షపాతం వచ్చింది. కుటుంబ సభ్యులందరూ ఆందోళనతో ప్రధాన్ కు కబురు పంపాలని తలంచారు. అయితే ప్రధాన్ శిరిడీలో వున్నంత వరకు అతని తల్లికి ఎట్టి ప్రమాదం లేదని, అందరి బాధ్యతలను శ్రీ సాయే చూసుకుంటారని నానా చందోర్కర్ వారికి నచ్చజెప్పాడు. అయితే ఆవిడ పరిస్థితి విషమించింది. విరేచనం కూడా ఆగిపోయింది. ఏమీ చెయ్యలేక వైద్యులు చేతులెత్తేసారు. అందరూ సాయి జపం చేస్తూ కూర్చున్నారు. నాలుగు రోజుల తర్వాత ప్రధాన్ బొంబాయి చేరి ఆవిడకు సాయి తీర్ధ ప్రసాదాలను ఇవ్వగా వెంటనే విరేచనం అయ్యింది. జబ్బు కూడా నెమ్మదించడం ప్రారంభించింది. మరొక వారం రోజులలోనే ఆవిడ పూర్తిగా కోలుకుంది.

శ్రీ సాయినే సద్గురువుగా, తమ జీవిత రధసారధిగా నమ్మి కొలిచిన వారికి ఇక ఏ విషయం లోనూ చీకూ చింతా అఖ్ఖరలేదు. వారి, వారి కుటుంబ సభుల సర్వ బాధ్యతలు శ్రీ సాయివే ! కావల్సింది కేవలం భక్తి విశ్వాసాలు, సహనం, శ్రద్ధ మాత్రమే !

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు
లోకాస్సమస్తా సుఖినోభవంతు
సర్వే జన: సుఖినోభవంతు

No comments:

Post a Comment