Thursday, 11 October 2018

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 84శిరిడీ సాయి నిత్య ఆరాధన ప్రాముఖ్యం

ఈ కలియుగం లో క్షీణించిపోతున్న ధర్మాన్ని పరిరక్షించడానికి, పెచ్చు పెరుగుతున్న అధర్మాన్ని శిక్షించడానికి, ఆశ్రిత భక్త జనావళిని శ్రేయో మార్గం లో నడిపించి వారిని మోక్షార్హులను గావించేందుకు నిర్గుణ, నిరాకార , త్రిగుణాతీతమైన పరబ్రహ్మం ఒక మానవ దేహం ధరించి 19 వ శతాబ్దం లో  దివి నుండి  భువి కేగింది. ఆ పరిశుద్ధ పరమేశ్వర అవతారమే శ్రీ శిరిడీ సాయినాధులు. శ్రీ సాయినాధుని కృప వలన కోట్లాది మంది అనుగ్రహింపబడ్దారు, ఆయన యొక్క అపురూపమైన కరుణా కటాక్షములు ఇప్పటికీ ఆయనను చిత్తశుద్ధితో స్మరించుకునేవారికి లభ్యమౌతునే వున్నాయి. అయితే అందుకు కావల్సింది నిరంతర చింతన,సదా స్మరణ, అను నిత్యం భక్తి విశ్వాసాలతో ఆరాధన. ఒక్క మాటలో చెప్పాలంటే మనం సాయి నిత్య భక్తులం కావాలి.

భక్తులలో గురువారం భక్తులు కూడా వున్నారు. కేవలం సాయిని గురువారం మాత్రమే గుర్తుంచుకొని ఆరాధించడం, పూజాది కార్యక్రమములను నిర్వర్తించడం, సాయి దేవాలయానికి వెళ్ళి కోరికల మూట విప్పి ప్రార్ధన చేయడం, ఆ మర్నాడు మళ్ళి సాయిని మర్చిపోవడం. సాయి సంపూర్ణ అనుగ్రహం నిత్య భక్తులకు మాత్రమే లభ్యం. గురువారం భక్తుల పై వర్షించే సాయి కరుణా కటాక్షాలు అతి స్వల్పం.

సాయి తనను ఏ విధం గా సేవించాలో చాలా స్పష్టం గా చెప్పారు. సాయి సచ్చరిత్ర నుండి ఈ క్రింది వ్యాక్యాలు సంగ్రహించబడ్డాయి :
నన్ను శ్రద్ధా భక్తులతో సదా స్మరించండి. నన్ను నిస్వార్ధం గా సేవించండి. మీకు అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. నిత్యం నా స్మరణ చేసేవారిని, నన్ను ఆరాధించే వారిని నేను తప్పక ఉద్ధరిస్తాను. ఇదియే నా వాగ్దానం

శ్రీ సాయిదేవుని పలుకులు నిశితం గా పరిశీలించినచో సదా స్మరణ, నిస్వార్ధం గా సేవ, నిత్య నామ స్మరణయే ఉత్తమ మైన ఆరాధన అని మనకు అవగతమౌతోంది. అనగా సాయి నిత్య భక్తులకే ఆయన సంపూర్ణ అనుగ్రహం ప్రాప్తం.

భగవద్గీతలో కూడా శ్రీ కృష్ణ భగవానుడు అనన్య చింతన, ఉపాసన,నిత్యం ఆరాధన చేయాలని అప్పుడు వారి యోగ క్షేమాలను తప్పక చూస్తానని అద్భుతం గా తెలియజేసారు.

ఫనుల వత్తిడి వలన లేక , ఆలసత్వం లేక స్వార్ధ చింతన తోనో ఈ కాలం లో చాలా మంది భక్తులు కేవలం గురువారాలలోనే సాయిని సేవించడం ఒక కార్యక్రమం గా పెట్టుకున్నారు. వారం లో కనీసం ఒక రోజు దైనందిన కార్యక్రమాలను పక్కన పెట్టి దేవాలయానికి వెళ్ళడం మంచిదే. కాని అటువంటి భక్తులకు శ్రీ సాయి నుండి లభించే కటాక్షం, అనుగ్రహం స్వల్పం గా వుంటుంది. అందుకే ఈ కలి కల్మషం నుండి విడిపడాలన్నా, శ్రీ సాయి చేత ఉద్ధరింపబడాలన్నా శ్రీ సాయి యొక్క అనూపమానమైన రక్షణ కవచం లభించాలన్నా మనం చేయాల్సింది సాయి యొక్క నిరంతర, నిత్య ఆరాధన.


శరీరం ఏ కర్మ చేస్తున్నా మనస్సు దైవ విచారణలో, స్మరణలో, చింతనలో మునిగి వుండాలి. ఆహారం స్వీకరించేముందు సర్వం శ్రీ శిరిడీ సాయి సమర్పయామి అని మనస్సులో నే అర్పించాలి, ఆహారం లో ఒక ముద్ద పక్కన పెట్టి ఇంటి బయట విడిస్తే పక్షులు, చీమలు వంటి క్రిమి కీటకాదులు వాటిని స్వీకరించి తమ ఆకలిని తీర్చుకుంటాయి. ఫని ప్రారం భించ బోయే ముందు సాయి అని ఒక సారి తలుచుకుంటే చాలు ఎటువంటి కష్టతరమైన కార్యమైనా దిగ్విజయం గా పూర్తవుతుంది. చివరగా కోరికలతో కాక నిస్వార్ధం గా సాయిని ప్రార్ధించాలి. మనము అడిగింది కాక మనకు అవసరమైన వాటిని శ్రేయోదాయకమైన వాటిని సాయి తప్పక ప్రసాదిస్తారు.

మన భక్తి ఆరాధనలను కేవలం గురువారాలకు మాత్రమే పరిమితం చేయక అన్ని రోజులలోనూ నిత్య భక్తుల వలె సాయిని సేవించడం సాయి యొక్క కరుణా కటాక్షములకు పాత్రులవడానికి అతి సులభమైన మార్గం.:

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు
లోకాస్సమస్తా సుఖినోభవంతు
సర్వే జన: సుఖినోభవంతు

No comments:

Post a Comment