Wednesday, 5 December 2018

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 90



కలియుగ దైవం, సమర్ధ సద్గురువు, భక్తుల పాలిటి కల్పవృక్షం అయిన శ్రీ సాయి ఎందరికో ఉన్నతమైన అధ్యాత్మికానుభూతిని ప్రసాదించి పరిపూర్ణులుగా తీర్చిదిద్దారు. వారిలో శ్రీ గాడ్గీ మహరాజ్ ముఖ్యులు.సామాన్యమైన నేత పని కుటుంబంలో జన్మించిన శ్రీ గాడ్గీ మహరాజ్ తన పూర్వ జన్మ సుకృతం వలన శ్రీ సాయి యొక్క పరిపూర్ణమైన కృపకు పాత్రులై గొప్ప యోగిగా అభివృద్ధి చెందిన వైనం అద్భుతం, అసామాన్యం. ఈ కధను ఇప్పుడు స్మరించుకుందాం.

శ్రీ గాడ్గీ మహరాజ్ యొక్క అసలు పేరు లభ్యం కాలేదు.కాని వాతి తల్లిదండ్రులు చాకలి వారు. ఆయన చిన్నతనం లో శెవ్ గావ్ అనే ఊరిలో ఒక బట్టల దుకాణంలో పని చేసేవారు.ఒకరోజు ఆ గ్రామానికి దివ్య వర్చస్సుతో వెలిగిపోతున్న శ్రీ సాయి వచ్చి భిక్ష చేస్తుండగా సదాచార సంపన్నులైన ఆ గ్రామ ప్రజలు ముస్లిం అన్న భావనతో ఆయనకు భిక్ష వేయలేదు.దానితో శ్రీ సాయి ఆ ఊరు విడిచి బయట ఒక ఏకాంత ప్రదేశం లో కూర్చున్నారు. శ్రీ సాయిని చూడగానే శ్రీ గాడ్గీ వారికి పవిత్ర భావన కలిగి  ఇంటికి వెళ్ళి రొట్టెలు,కూర తీసుకొని అన్ని ప్రదేశాలలో వెదికి ఆఖరుకు శ్రీ సాయి వద్దకు వెళ్ళి తాను తెచ్చిన ఆహార పధార్ధాలను భిక్షగా సమర్పించారు.

శ్రీ గాడ్గీని చూడగానే శ్రీ సాయి కోపంతో ఎందుకొచ్చావుఅని అరిచారు.
ఈ ఊరిలో ఒక్కరు కూడా మీకు భిక్ష వేయలేదు. నాకు ఇవ్వాలనిపించి ఇక్కడికి వచ్చానుఅని వినయంగా చెప్పారు శ్రీ గాడ్గీ.

నేనేమి కోరినా ఇస్తావా?” అని శ్రీ సాయి అడుగగా నా ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధంగా వున్నాను. నన్ను మీతో వుండనివ్వండిఅని శ్రీ గాడ్గీ సమాధానమిచ్చారు.

శ్రీ గాడ్గీ వారి వినయ విధేయతలకు, భక్తి ప్రవృత్తులకు సంతోషించిన శ్రీ సాయి శ్రీ గాడ్గీ వారి తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. ఆ క్షణం లో శ్రీ గాడ్గీ వారి హృదయం లో చెప్పలేని మార్పు వచ్చింది. సమస్త చింతనలు, దుఖం మటుమాయమై అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. వెంటనే ఇక జీవితాంతం శ్రీ సాయి చెంతనే వుండాలని నిర్ణయించుకొని పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి ఈ రోజు నాకు ఒక గొప్ప గురువు దొరికారు. వారి సన్నిధి తప్ప నాకు ఇంకేమీ ఆఖరలేదు. నేటి నుండి సర్వం త్యజించి ఆయన వద్దకు వెళ్ళిపోతున్నానుఅని తల్లిదండ్రులకు తెలియజేసి తిరిగి శ్రీ సాయి వద్దకు వెళ్ళారు. గాడ్గీని చూసిన శ్రీ సాయి ఎంతో కోపంగా మళ్లీ నన్ను పీడించుకు తినడానికే ఇక్కడికి వచ్చావుఅని తిట్టి శ్మశానం లోకి వెళ్లారు.స్వామీ, నన్ను అనుగ్రహించండి, మిమ్మల్ని విడిచి నేను బ్రతకలేను.నన్ను మీ దగ్గరే వుండనివ్వండిఅని ఎంతో దీనంగా గాడ్గీ శ్రీ సాయి కాళ్ళపై పడి కన్నీరు మున్నీరుగా ప్రార్ధించారు. ఆఖరుకు శ్రి సాయికి దయ కలిగి ఆ శ్మశానం లో ఒక గొయ్యి తవ్వి అందులో నీరు పోసి ఆ నీటిని గాడ్గీ చేత త్రాగించారు. వెంటనే గాడ్గీకు ఆరు గంటల పాటు బాహ్య స్మృతి లేకుండాపోయి సమాధి స్థితి కల్గింది. శ్రీ సాయి యొక్క అద్భుతమైన యోగ శక్తికి వందనం, అభివందనం.

తిరిగి స్పృహ లోనికి వచ్చిన తర్వాత గాడ్గీ ఆ ఫకీరు కోసం ఎన్నో ప్రదేశాలను వెదికి, చివరకు గ్రామస్థులు ఇచ్చిన ఆచూకి ప్రకారం శిరిడీ లోని మశీదులోనికి ప్రవేశించారు. అక్కడ స్నానం చేస్తున్న శ్రీ సాయి ఫకీరు గాడ్గీని చూడగానే పట్టరాని కోపంతో తిట్లు తిట్టి ఒక ఇటుకను విసరగా అది గాడ్గీ నుదిటిపై తగిలి రక్తం ప్రసవించనారంభించింది. వెంటనే శ్రీ సాయి గాడ్గీ వద్దకు వచ్చి ప్రేమతో ఆలింగనం చేసుకొని ఈ రోజుతో నీ పాప కర్మలు సమస్తం నశించాయి.నిన్ను పరిపూర్ణం గా అనుగ్రహించాను. సదా భగవధ్యానం లో మునిగి వుండి ప్రజలకు సన్మార్గం చూపు.నీ పేరు గాద్గీ మహరాజ్అని ఆశీర్వదించారు.

నాటి నుండి శ్రీ గాడ్గీ మహరాజ్ అధ్యాత్మిక జీవితం ప్రారంభమయ్యింది. ఎందరో శిష్యగణం ఆయనకు ఏర్పడ్డారు. భక్తులకు ప్రవచనాలు చేయడంతో పాటు ఎన్నో లోకహిత కార్యక్రమాలను చేపట్టి ప్రసిద్ధి పొందారు.

ఆయన ఎన్నో ధర్మశాలలు,పాఠశాలలు,ఆసుపత్రులను స్థాపించి మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని ఆచరణ ద్వారా చూపించారు. తన యోగశక్తితో ఎందరికో నయం కాని రోగాలను చిటికెలో నయం చేసారు. దివ్య నామ సంకీర్తన ద్వారా భక్తులను భక్తావేశాలలో ముంచెత్తి వారి దుష్కర్మలను నాశనం చేసేవారు.

1927 వ సంవత్సరం లో తన శిష్యగణంతో శిరిడీ వచ్చి సంకీర్తన, సమాధి సేవ చేసి అనంతరం భక్తులతోనా గురువు సన్నిధికి చేరుకుంటున్నాను. ఆయన యొక్క పవిత్రమైన బోధలను మీ హృదయం లో పదిలపరచుకొని త్రికరణశుద్ధిగా ఆచరించి మోక్షం సాధించుకొండిఅని ఉపదేశం చేసి ఒంటరిగా నర్మదా నదీ తీరంలో బధోచ్ గ్రామం చేరి అక్కడ మహాసమాధి చెందారు. గాడ్గీ మహారాజ్ తన జీవిత ప్రస్థానం అంతటా శ్రీసాయిని సద్గురువుగా కీర్తించి కొనియాడేవారు.

 చూసారా ! శ్రీ సాయి ఎంతటి గొప్ప సద్గురువో? ఓక సామాన్యమైన చాకలి కుటుంబంలో పుట్టిన శ్రీ గాడ్గీ వారిని నభూతో నభవిష్యతి అన్నట్లుగా అసామాన్యమైన విధం గా మానవ సేవ చేయించి లోకపూజ్యులైన గాడ్గీ మహరాజుగా తీర్చిదిద్ది సాయి యొక్క అపూర్వమైన అతి శక్తివంతమైన భగవతత్వమును కీర్తించడం మనకు సాధ్యమా ?

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు
లోకాస్సమస్తా సుఖినోభవంతు
సర్వే జన: సుఖినోభవంతు