Monday, 11 March 2019

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 114శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 114

1911 వ సంవత్సరం లో ఒక వైశ్యుడు తన కుమార్తెను భుజంపై మోసుకొని శిరిడీ తిసుకువచ్చాడు. ఆ అమ్మాయికి పోలియో వలన చిన్నప్పుడే కాళ్ళు చచ్చుబడిపోయాయి.ఎందరో వైద్యులను సంప్రదించాడు,వేలాది రూపాయలను ఖర్చు పెట్టి వైద్యం చేయించినా ఏం ప్రయోజనం లేకపోయింది. ఆమెకు కాళ్ళు ఇక రావని, జీవితాంతం నడవలేదని వైద్యులు ఖండితంగా చెప్పేసారు. అంతటితో ఆశ వదులుకొని పుట్టెడు దుఖం లో జీవిస్తున్న  తరుణంలో అతని బంధువులు సమర్ధ సద్గురువు, భక్తుల పాలిటి ఆశ్రిత కల్పవృక్షం అయిన శ్రీ సాయినాధుని మహత్యం గురించి చెప్పగా గంపెడు ఆశతో అతను శిరిడీ వచ్చాడు.శ్రీ సాయిని దర్శించుకొని తన కుమార్తెకు నయం చేయమని కన్నీరు మున్నీరుగా ప్రార్ధించాడు.శ్రీ సాయి మనసు కరిగి ఆ అమ్మాయి కాళ్ళపై చేతులతో రాసి శిరిడీలో కొద్ది రోజులు వుండమన్నారు. ఆన్ని రోగాలకు దివ్యౌషధంలా  పని చేసే ఊదీని ఆ అమ్మాయి కాళ్ళపై మూడు పూటలా రాస్తుండేవాడు ఆ వైశ్యుడు. అద్భుతాలలో కెల్లా అద్భుతం. మూడవ రోజు నుండి ఆ అమ్మాయి కాళ్ళలో కదలికలు ప్రారంభం అయ్యాయి. నెమ్మదిగా లేచి నిలబడసాగింది. తండ్రి సహాయంతో తప్పటడుగులు వేయడం ప్రారంభించి కొద్ది రోజులకే నడవసాగింది. ఆ అద్భుతాన్ని చూసి అక్కడి భక్తులకు నోటమాట రాలేదు.ఆఖరి రొజున తండ్రి చేతులు పట్టుకొని ఆ అమ్మాయి స్వయంగా మశీదుకు నడుచుకుంటు వచ్చి శ్రీ సాయి కి సాష్టాంగ నమస్కారం చేసి,అమూల్యమైన ఆయన ఆశీర్వచనములను తీసుకొని ఎంతో సంతోషంతో తిరిగి ఇంటికి బయలుదేరింది.ఈ జగత్తుకే వైద్యుడు అయిన శ్రీ సాయి కి అసాధ్యమైనది ఏదీ లేదు.
మరొక సందర్భంలో గయాసిస్ అనే రైల్వే ఉద్యోగి భార్యకు పక్షవాతం వచ్చి మంచం పట్టింది.ఎందరో వైధ్యులు వచ్చి అతి ఖరీదైన వైద్యమందించారు కానీ ప్రయోజనం లేకపోయింది. జీవితాంతం మంచంపై పడి వుండవల్సిందేనని వైద్యులు  అతనికి తేల్చి చెప్పగా కొలీగ్స్ నుండి శ్రీ సాయి సమర్ధుల లీలా వైభవం గురించి విన్న గయాసిస్ ఇక ఆఖరు ప్రయత్నంగా  శిరీడీకి బండిపై తన భార్యను తీసుకువచ్చి  సాయి దర్శనం చేయించి ఆమెకు నయం చేయమని ఎంతో ఆర్తితో ప్రార్ధించాడు.పరమ దయాళువు, కరుణా సముద్రుడు అయిన శ్రీ సాయి ఆమెను ఆశిర్వదించి ఊదీ ప్రసాదాలనిచ్చి త్వరలోనే నయం అవుతుందని చెప్పారు.సాయి స్పర్శ అమోఘం, ఆయన వాక్కు బ్రహ్మ వాక్కు.వైద్యుల వలన నయం కానిది ఆ భగవంతుని అమోఘమైన దృష్టి వలనే సాధ్యం అయ్యింది.నాటి నుండే ఆమె అరోగ్యం లో మార్పు వచ్చింది. నెల రోజుల లొపలే  ఆమె పూర్తిగా కోలుకొని స్వస్థురాలయ్యింది. ఇంటికి తిరిగి వెళ్ళాక సాయి ఆరాధన, సద్గంధ పఠనం క్రమం తప్పక పూజాది కార్యక్రమాలను నిర్వర్తించడం, నామ జపం , ఊదీని సేవించడం ఇత్యాది కార్యక్రమాలలో మునిగి తేలింది.త్వరలోనే పూర్తిగా ఆరోగ్యవంతురాలయ్యింది. ఎవరి వల్లా కాని ఆ వ్యాధిని నయం చేసి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించిన సద్గురువు శ్రీ సాయి కి జీవితాంతం భక్తురాలిగా మిగిలిపోయింది.
  ఇంకొక సంధర్భం లోని పర్భనీ అనే గ్రామం నుండి ఒక వ్యక్తి వచ్చి తనపై కిట్టని వారెవరో మంత్ర ప్రయోగం చేసారని, అందువలన అన్నం వెంట్రుకల్లా కంపు కొడుతోందని, తీవ్రమైన అన్నద్వేషం కారణంగా ఏమీ తినలేకపోతున్నానని తనను రక్షించమని శ్రీ సాయి కాళ్ళపై పడి ప్రార్ధించాడు. ఎన్నో రోజుల నుండి అన్నం తినని కారణంగా అతని శరీరం తీవ్రంగా శుష్కించుపోయింది. బాబా అతనిని అల్లా అచ్చా కరేగా అని ఆశీర్వదించి  శిరిడీలో కొంత కాలం వుండమని చెప్పారు. నాటి నుండి అతని ఆరోగ్యం లో మంచి మార్పు వచ్చింది. నెమ్మదిగా అన్నం స్వీకరించడం ప్రారంభించి వారం రోజుల లోపే సుష్టుగా తినే స్థాయికి వచ్చాడు. ఏ మందులకూ తగ్గని అనారోగ్యాన్ని కేవలం స్పర్శతో,చూపులతో తగ్గించిన శ్రీ సాయి లీలా వైభవానికి ముదమొంది కృతజ్ఞతలు తెలుపుకొని ఆ వ్యక్తి తన స్వగ్రామం వెళ్ళిపోయాడు.
ఇఈక ఆఖరుగా మరొక గొప్ప లీల. నిరుపేద అయిన కార్నీక్ తరచుగా శిరిడీ వచ్చి సాయి దర్శనం చేసుకుంటూ వుండేవాడు. ఆతనికి చదువు సంధ్యలు అబ్బలేదు.తల్లిదండ్రులు, బంధువుల నుండి కూడా ఏ విధమైన సహాయం అందలేదు. సరైన ఉద్యాగం కూడా లేని కారణంగా పొట్ట పోషించుకోవడం దుర్భరం అవుతుండేది. ఒకసారి తనను దర్శించిన కార్నిక్ తో శ్రీ సాయి ఆవో షావుకార్ !అని నవ్వుతూ అహ్వానించారు. కటిక దరిద్రుడైన తనను షాహుకార్ అని సాయి ఎందుకు సంబోధించారో కార్నిక్ కు అర్ధం కాలేదు.
అయితే నాటి నుండి కార్నిక్ జీవితంలో ఒక గొప్ప మార్పు సంభవించింది. స్వగ్రామం వెళ్ళి ఒక చిన్న ఉద్యోగం లో చేరాడు.కొన్ని నెలల తర్వాత స్వంతంగా వ్యాపారం ప్రారంభించాడు. ఆది శ్రీ సాయి కృప వలన దిన దినాభివృద్ధి చెంది ఆరు సంవత్సరాలకే అతను కోటీశ్వరుడు అయ్యాడు.

నిరుపేద అయిన తన భక్తుడిని అనతి కాలం లోనే కోటీశ్వరునిగా చేసిన శ్రీ సాయినాధుల కరుణా కటాక్షాలను , ఆస్రిత భక్త పరాయణత్వాన్ని వర్ణించడం సాధ్యమా ?భక్త జనులందరికీ శ్రీ శిరిడీ సాయి యొక్క అనుగ్రహ కటాక్షములు లభించు గాక.

లోకాస్సమస్తా సుఖినోభవంతు
సర్వే జన: సుఖినోభవంతు

No comments:

Post a Comment