Wednesday, 12 June 2019

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం – 129
శ్రీ సాయినాధుని లీలలు, మహత్యం గురించి విని, ఆయనను నాస్తిక, హేతు భావాలతో పరీక్షించుదామని వచ్చి ఆయన యొక్క కారుణ్యం, ప్రేమానురాగాలు, మమత, మహత్యం స్వయం గా అనుభవించి, తమ మనసులను మార్చుకొని, శ్రీ సాయి భక్తులుగా మారిన వారు ఎందరో వున్నారు. అందులో సోమదేవ స్వామి ఒకరు ! వారి కధను ఇప్పుడు స్మరించుకుందాం. శ్రీ సాయి లీలామృతాన్ని మనసారా ఆస్వాదించుదాము.


కాకా సాహెబ్ దీక్షిత్ తమ్ముడు భాయీజీ నాగపూరులో ఉద్యోగం చేస్తుండేటప్పుడు 1906 వ సంవత్సరం లో హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ అతనికి సోమదేవ స్వామి అనే సాధువుతో పరిచయం కల్గింది. సోమదేవ స్వామి సదాచార సంపన్నుడు. ఫరమ నిష్టా గరిష్టుడు. హరిద్వార్ లో మఠం నిర్మించుకొని అక్కడ నివసిస్తున్నాడు. ఆయిదు సంవత్సరాల తర్వాత సోమదేవ స్వామి నాగపూర్ వచ్చి భాయీజీ ఇంట్లో ఆతిధ్యం స్వీకరించాడు. మాటల మధ్యలో శ్రీ సాయినాధుని లీలలు గురించి విని ఎంతో ఆనందించి శిరిడీ వెళ్ళి సాయి దర్శనం చేసుకుందామని నిర్ణయించుకున్నాడు.మర్నాడు బయలుదేరి కోపర్గావ్ లో రైలు దిగి, టాంగాను కట్టించుకున్నాడు సోమదేవ స్వామి. శిరిడీ సమీపించేటప్పుడు దూరం గా మశీదుపై రెండు పెద్ద జండాలను చూసి ఒకింత ఆశ్చర్యపడ్డాడు . ఈ యోగి వుండే ప్రదేశం లో పెద్ద పెద్ద జండాలను కట్టించుకున్నాడు. చూస్తుంటే ఆడంబరాల యందు, కీర్తి ప్రతిష్టల కొరకు ఈ యోగి ఎక్కువగా మక్కువ చూపిస్తునట్లు వుందనుకున్నాడు. ఆ మాటే మిగితా యాత్రికులతో చెప్పగా “ అయ్యా ! జండాలను చూదగానే ఇంతగా వ్యాకులం చెందిన మీ మనస్సు మశీదులో రధం, పల్లకి, గుర్రం, లక్షలు విలువ చేసే వెండి సామానును చూస్తే ఇంకెంత చికాకు పడుతుందో కదా !” అని వారు అన్నారు. ఆ మాటలను విన్న సోమదేవ స్వామి మరింత ఆశ్చర్యం, విసుగు చెందాడు. గుర్రాలు, రధాలు, వెండి సామగ్రితో హడావిడి చెసే సన్యాసులను, యోగులను నేనింతవరకూ చూడలేదు. అటువంటి వారిని దర్శించుట కంటే వెనక్కి తిరిగి పోవడమే మేలు అని తాను వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటునట్లు మిగితా వారితో చెప్పాడు. ఆ మాటలను విన్న తోటి యాత్రికులు సోమదేవ స్వామి ని గట్టిగా మందలించారు. తప్పుడు ఆలోచనలు మానుకొమ్మని సలహా ఇచ్చారు. శ్రీ సాయినాధులు పరిశుద్ధ పరబ్రహ్మ అవతారమని, చిరిగిపోయిన దుస్తులతో చాలా సాధారణమైన జీవితం వెళ్ళబుచ్చే ఒక మహిమాన్విత, శక్తి స్వరూపమైన అసాధారణ యోగి యని, ఆయన ఈ ఆడంబరాలను గాని,కీర్తి ప్రతిష్తలను గని అసలేమాత్రం లక్ష్య పెట్టరని , వాటిని ఏర్పాటు చేసినది వారి అసంఖ్యాకమైన భక్తులే గాన ఒక్క సారి మశీదు లోనికి వచ్చి శ్రీ సాయిని దర్శించిన తర్వాత ఆయన పట్ల తగు అభిప్రాయం ఏర్పాటు చేసుకోమని చెప్పి సోమదేవ స్వామి ని బలవంతం గా మశీదు లోనికి తీసుకువెళ్ళారు. 

మశీదు లోనికి అడుగు పెట్టి దూరం నుండి శ్రీ సాయిని చూడగానే సోమదేవ స్వామి మనసు కరిగిపోయింది. కళ్ళు ఆనందం తో వర్షించసాగాయి. గొంతుక ఆర్చుకొని పోయింది. అప్పటి వరకు అతని మనస్సులో తాండవం చెసిన సంశయాలన్నీ పటా పంచలు అయిపోయాయి. అనిర్వచనీయమైన ఆనందం, శాంతి అతనికి లభించింది. వేల సంవత్సరాలు కఠోర నియమాలతో తపస్సు చేసినా కలుగని ఆత్మ సంతృప్తి , పరమానందం శ్రీ సాయిని ఒక్కసారిగా చూడగానే అతనికి కలిగింది. ఎక్కడైతే మన పంచేంద్రియాలు, మనస్సు శాంతించి ఆత్మానందం పొందుతాయో అదే మన గమ్యం ! వాటిని కలిగించువారే సద్గురువులు అన్న అతని గురుదేవుల ఉపదేశం సోమదేవ స్వామి కి గుర్తుకు వచ్చింది. వెంటనే పట్టరాని ఆనందంతో మశీదు లోనికి పరుగులు తీసాడు. కాని అతనిని చూసిన వెంటనే శ్రీ సాయి పట్టరాని కోపం తో “ మా వేషాలన్నీ మా దగ్గరే వుండనివ్వు. ఆడంబరాల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం వెంపర్లాడే మా వంటి కపట సాధువుల దర్శనం నీవు చేయనేల ? ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యక బయటకు దయ చెయ్యు” అని అరిచారు. ఆ మాటలకు సోమదేవ స్వామి చాలా ఆశ్చర్యపోయాడు. శ్రీ సాయికి తన మనసులో మెదిలే ఆలోచనలన్నీ తెలుసునని, తనను సంస్కరించడానికే తనపై కోపగించుకున్నారని అర్ధం చెసుకున్నాడు. దూరం నుందే మశీదులో జరిగే తతంగమంతా గమనించసాగాడు. మశీదుకు వేల సంఖ్యలో భక్తులు ఎన్నో బాధలు, చింతనలు, కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు, కోరికలతో వస్తున్నారు. శ్రీ సాయిని దర్శించి తమకు చిత్తం వచ్చిన రీతిలో పూజిస్తున్నారు. శ్రీ సాయి రక రకాల భక్తులను వివిధ రకాలుగా ఆశీర్వదిస్తున్నారు.కొందరిని కౌగలించుకోవడం, కొందరిని ఓదార్చడం, కొందరికి సలహాలు,సూచనలివ్వడం, మరి కొందరిపై తన అమృత సమానమైన దయామృత చూపులను ప్రసరించడం ఈ విధం గా అందరినీ ఆనందింపజెస్తున్నారు. ఏడుస్తూ వచ్చిన వారు ఆనందం గా తిరిగి వెళ్తున్నారు. ఇదంతా చూసిన సోమదేవ స్వామి హృదయం శ్రీ సాయిని శంకించినందుకు పశ్చ్త్తాపంతో రగిలి పోయింది. శ్రీ సాయి పట్ల భక్తి శ్రద్ధలు రెట్టింపయ్యాయి. అనుక్షణం శ్రీ సాయి నామస్మరణను చేయసాగాడు. అతనిలో శాశ్వతమైన మార్పు వచ్చాక అతనికి శ్రీ సాయి తన దర్శన భాగ్యం కలిగించారు. శ్రీ సాయి ఆశీర్వదించగానే అతనిలో గొప్ప అధ్యాత్మిక జాగృతి కలిగింది. నాటి నుండి శ్రీ సాయికి గొప్ప భక్తుడయ్యాడు. తన శేష జీవితమంతా శ్రీ సాయిని ఆరాధించడం తోనే గడిపి చివరకు శ్రీ సాయినాధునిలో ఐక్యం అయ్యాడు. 

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు
లోకాస్సమస్తా సుఖినోభవంతు
సర్వే జన: సుఖినోభవంతు

No comments:

Post a Comment