Tuesday, 9 July 2019

శ్రీ శిరిడీ సాయి దివ్య లీలామృతం - 135
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ,భక్త జన సంరక్షణ కోసం దివి నుండి భువి కేగిన పరిశుద్ధ పరమేశ్వర పరబ్రహ్మ అవతారం శ్రీ సాయినాధులు. శ్రీ సాయి సర్వాంతర్యామి . జడ, జీవ పదార్ధములన్నింటుఇలోనూ వ్యాపించిన కలియుగ దైవం. హేమాద్రిపంత్ శ్రీ సాయి సచ్చరిత్రలో వ్రాసినట్లు సద్గురువు అనగానే శ్రీ సాయియే మనకు జ్ఞప్తికి వస్తారు. ప్రపంచం లో ఏ మూల ఏ భక్తుడు వున్నప్పటికీ "సాయి" అని ప్రేమతో పిలిస్తే "ఓయీ" అని సత్వరం పలికి వారి కష్ట నష్టాలను తీర్చే దయార్ధ హ్దయుడు.అధ్యాత్మిక జ్ఞానం కావల్సిన వారికి , వారి అర్హతలను పరీక్షించి ఆత్మ సాక్షాత్కారం కల్గించి మోక్షార్హులను చేసే సమర్ధ సద్గురువు శ్రీ సాయి. తనను దర్శించే భక్తులతో తరచుగా శ్రీ సాయి " ఎవరూ తామంతట తాముగా శిరిడీ దర్శనం చెయలేరు.నేను సంకల్పించనిదే నా దర్శనం సాధ్యం కాదు. నా భక్తుడు ప్రపంచం లో ఏ మూల నివసిస్తున్నపటికీ పిచ్చుక కాళ్లకు దారం కట్టి లాగినట్లు వారిని శిరిడికి లాగెదను" అని అంటుండే వారు. అటువంటి ఒక పిచ్చుక కధను  ఇప్పుడు స్మరించుకుందాం.

  
   లాలా లక్ష్మీ చం ద్ అను వాడు మొదట రైల్వే లో, తర్వాత బొంబాయిలో శ్రీ వెంకటెశ్వర ప్రెస్, ఆఖరులో ర్యాలీ బ్రదర్స్ లో పని చేసాడు. 1910 వ సంవత్సరం లో క్రిస్ట్ మస్ పండుగ ముందు ఒక యోగీశ్వరుడిని స్వప్నములో చూసాడు. తర్వాత దాసగణు మహారాజ్ హరికధను వినడానికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ సాయి బాబా ఫొటో ను చూసి స్వప్నం లో చూసిన యోగీశ్వరుడు , సాయి ఒక్కరేనని నిర్ధారించుకున్నాడు. దాసగణు యొక్క హరికధలో శ్రీ సాయి మహిమలను విని శిరిడీ వెళ్ళి శ్రీ సాయి దర్శనం చేసుకుందామని అప్పటి కప్పుడే నిర్ధారించుకున్నాడు. ఆశ్చర్యం గా అదే రోజు రాత్రి అతని స్నేహితుడైన శంకర రావు లక్ష్మీ చంద్ ఇంటికి వచ్చి తాను శిరిడి వెళ్తున్నానని గావున తనతో రమని లక్ష్మీ చంద్ ను అహ్వానించాడు. లక్ష్మీ చంద్ ఆనందానికి అంతు లేకుండా పోయింది.వెంటనే తన బంధువు నుండి పదిహేను రూపాయలు అప్పు చేసి శిరిడీ బయలుదేరాడు. రైలులో ఇరువురూ చక్కని భజనలు పాడారు. తోటి ప్రయాణీకులను శ్రీ సాయి మహిమలను గురించి అడిగారు. బాబాకు జామ పండ్లు నైవేద్యం గా సమర్పించాలని సంకల్పించారు.కాని ఆ మాటే మరిచిపోయారు. శిరిడీ సమీపిస్తుండగా ఒక ముసలమ్మ తలపై జామపళ్ళ బుట్టతో వారి టాంగాకు ఎదురు వచ్చి  జామ పళ్ళను కొనవల్సిందిగా కోరింది. వారు కొన్ని పళ్ళను కొనగా, మిగిలిన పళ్ళను తన వంతుగా సాయికి అర్పించమని కోరి ఆమె వెళ్ళిపోయింది. కటిక పేదరాలైనా ఆమెకు శ్రీ సాయిపై వున్న భక్తి ప్రవృత్తులకు వారిద్దరూ ఎంతో సంతోషించారు. శిరిడీ వెళ్ళి పూజా సామాగ్రిని కొని శ్రీ సాయిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించారు. సాయి దర్శనం తోడనే లక్ష్మీ చంద్ కు అనిర్వచనీయమైన అధ్యాత్మిక అనుభూతి కల్గింది. నాటి వరకూ అతనిని పట్టి పీడిస్తున్న సంశయాలు అన్ని తొలగిపోయాయి. శ్రీ సాయి పట్ల ఎనలేని భక్తి శ్రద్ధలు, ప్రేమానురాగాలు కలిగాయి. భక్తుల పట్ల శ్రీ సాయి చూపించే కరుణకు అతని మనస్సు చలించిపోయింది. మౌనం గా శ్రీ సాయి నామ జపం చేస్తూ శ్రీ సాయి సన్నిధిలో కూర్చున్నాడు లక్ష్మీ చంద్ . అప్పుడు శ్రీ సాయి “ రాత్రం తా భజన చేస్తూ వాళ్ళిద్దరూ నాకు నిద్ర లేకుండా చెసారు. అయినా నా గురించి స్వయం గా నన్ను అడిగి తెలుసుకోవాలే గాని ఇతరులను అడగడం దేనికి ? నా భక్తులకు నా దర్సన భాగ్యం కల్గించడం కోసమే వారికి స్వప్న దర్శనం కలిగిస్తాను.శిరిడీ లోనే కాక సమస్త విశ్వమంతటా నేను నిండి వున్నాను. నన్ను దర్శించుటకు అప్పు చేయవలసిన పని లేదు” అని అన్నారు. 

శ్రీ సాయినాధుల మాటలు అవగతమై లక్ష్మీ చంద్ హృదయం లోని సంశయాలన్నీ పటపంచలు అయ్యాయి. అడిగిన వెంటనే సలహాలను ఇచ్చి సంశయాలను తీర్చే అపూర్వ, అసామాన్య గురుదేవులు శ్రీ సాయి.వారి మహిమలను, అనుగ్రహ ఫలాన్ని స్వయం గా దర్శించి అనుభవించాలే గాని వారి గురించి ఇతరులను అడిగి తెలుసుకోవడం భావ్యం కాదని శ్రీ సాయి అభిప్రాయం. నాస్తికులు మొదలైన వారు తమ చిత్ర విచిత్రమైన  తర్కం తో నాస్తిక వాదం తో మన మనసులలో విష బీజాలు నాటే ప్రమాదం వుంది. అట్లే శిరిడీ దర్శనం కోసం అప్పు చేయడం తగదని శ్రీ సాయి  హెచ్చరించారు.   

ఆ రోజు లక్ష్మీ చంద్ భోజనానికి కూర్చునప్పుడు ఒక భక్తుడు లక్ష్మీ చంద్ కు ఇష్టమైన సాంజాను ప్రసాదం గా ఇచ్చాడు. ఆది ఎంతో రుచి కరం గా వుండి లక్ష్మీ చంద్ కు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. మరునాడు కూడా సాంజాను తెచ్చి వడ్డిస్తే బాగుండునని లక్ష్మీ చంద్ అనుకున్నాడు కాని ఆ రోజు ఎవరూ తేలేదు. మూడవ రోజు ఆరతి సమయం లో వైవేద్యం క్రింద ఏం చేయించమంటారని బాపూ సాహెబ్ జోగ్  శ్రీ సాయిని అడిగినప్పుడు “ సాంజా “ చేయించమని సాయి ఆదేశించారు. ఆ రోజు చాలా ఆకలితో వున్న లక్ష్మీ కు సంతృప్తిగా భక్తులు సాంజా ను వడ్దించారు. అప్పుడు శ్రీ సాయి “ బాగా ఆకలితో వున్నావు గావున నీకు కావల్సిన్నంత సాంజాను తినుము. అట్లే నడుం నొప్పికి మందు వేసుకో “ అని ఆశీర్వదించారు. ఆది విన్న లక్ష్మీ చంద్ కు మనసు కరిగింది. అప్పటికి కొన్ని సంవత్సరాల నుండి అతను తీవ్రమైన నడుం నొప్పితో బాధపడుతున్నాడు. ఎంత మంది సుప్రసిద్ధులైన వైద్యులను సంప్రదించినా, ఎన్ని  మందులను వేసుకున్నా ప్రయోజనం లెకపోయింది. శ్రీ సాయి తన అమృతమైన చూపులను ప్రసరించినంతనే చిత్రాతి చిత్రం గా నడుం నొప్పి తగ్గిపోయింది. లక్ష్మీ చంద్ జీవించి వున్నంత కాలం లో మరెప్పుడూ అతనికి నడుం నొప్పి సమస్య ఎదురవలేదు. భక్తుల పాలిట శ్రీ సాయి చూపించే అవాజ్యమైన కరుణకు, మమతానురాగాలకు లక్ష్మీ చంద్ ముదమొంది శ్రీ సాయికి సాష్టాంగ ప్రణామాలను అర్పించాడు.   

No comments:

Post a comment