Thursday, 11 July 2019

శ్రీ శిరిడీ సాయి దివ్య లీలామృతం - 136కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన’- కర్మ చేయటం వరకే నీకు అధికారం... ఫలితాల గురించి ఆలోచించకు.  నీ ప్రయత్నం, చిత్తశుద్ధి, నిర్మలత్వం, పూర్వ జన్మ సుకృతాలను బట్టి భగవంతుడు నీకు రావలసిన ఫలాలను సకాలంలో, తగిన విధంగా ప్రసాదిస్తాడు. ఫలితాలను దృష్టిలో పెట్టుకొని చేసే కర్మలు సత్ఫలితాలనివ్వవు. కర్మ సిద్ధాంతానికి ఈ సృష్టిలో సమస్త జీవులు లోబడి ప్రవర్తించవలసిందే. 

 కాని దురదృష్టవశాత్తుమనిషి కర్మ ప్రారంభించకుండానే ఫలితాల గురించి అంచనాలు వేస్తాడు. ఏమాత్రం తేడా వచ్చినా తట్టుకోలేడు. శరీరం దృఢంగా ఉంటే చాలదు. మనసులో ధీరత్వం నిండి ఉండాలి.  శారీరకంగా దుర్బలుడైనా ధీర గుణంతో సమస్యలను సులభంగా  అధిగమించే అవకాశం వుంది. నేటి తరానికి మానసిక దుర్భలత్వం ఒక శాపం గా మారింది. దీనిని అధిగమించేంందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ వంతు కృషి సల్పడం అవశ్యం.

సద్గురువు అనుగ్రహం వుంటే క్షణాలలో ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. ఆ అనుగ్రహమే లేకుంటే జన్మ జన్మల పాటు కఠోర నియమాలతో, పవిత్ర నడవడికతో, తీవ్రమైన సాధన చేసినా ఆత్మజ్ఞానం ప్రాప్తి అసాధ్యం. సద్గురువు యొక్క అనుగ్రహం అనేక జన్మల పాప సంచయాన్ని పోగోట్టి ముక్తి ప్రసాదించగల ఒక గొప్ప సాధనం.అయితే లక్షల మందిలో ఒక్కరు మాత్రమే సద్గురువు యొక్క అనుగ్రహానికి పాత్రులవగలుగుతున్నారు. అందుకు కారణం గురువును త్రికరణశుద్ధిగా నమ్మి సేవించగలిగే పరిపాకం సాధకులకు లేకపోవడమే.

సాధకుల ఆధ్యాత్మికాభివృద్ధికి ఒక సద్గురువు అవసరం ఎంతైనా వుందన్నది అక్షర సత్యం. అయితే సశరీరులుగా వున్న గురువు వుండాలా లేదా సమాధి చెందిన సిద్ధ పురుషులు కూడా సాధకులను తరింపజేయగలరా అన్న ప్రశ్న లక్షలాది మందిని వెన్నాడుతోంది. అయితే అనేకమంది సాధకుల ప్రత్యక్ష అనుభవాల బట్టి  ఆత్మ సాక్షాత్కారం పొంది ,ఆత్మ తత్వంతో విశ్వవ్యాప్తమైన సద్గురువు భగవంతుని ప్రతిరూపం గనుక సమాధి చెందినా కూడా శరీరం తో వున్నపటి లాగే సాధకులను ఆత్మపధం లో నడిపించగల సమర్ధులు. చిత్తశుద్ధి గల సాధకుడు ఒక గురువు కోసం అన్వేషణ చేసే విధం గానే గురువు సైతం చిత్తశుద్ధి గల శిష్యుని కోసం  ఎదురుచూస్తుంటారు. పవిత్ర హృదయం,నిర్మలమైన మనస్సుతో సాధనా మార్గం లో నడిచే శిష్యుల అంతరంగం సద్గురువు పంపే వాత్సల్య తరంగాలను అందిపుచ్చుకోగలుగుతుంది.అందుకే సద్గురువు సమాగమం కోసం హృదయాన్ని తెరిచిన ద్వారం వలె వుంచుకోవడం శిష్యుని  ప్రధమ కర్తవ్యం.


No comments:

Post a comment