Tuesday, 13 August 2019

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం – 146


ప్రకృతిలో ప్రతీ దానికి వృద్ధి-క్షయం-పునరుద్ధరణ సహజమైనట్లే ధర్మానికి కూడా సహజమే! అందుకే ధర్మానికి విఘాతం కలిగినప్పుడు అధర్మం పెచ్చు పెరిగినప్పుడు తాను ఏదో ఒక రూపంలో ఈ భువిపై అవతరిస్తానని దుష్ట శిక్షణ, శిష్త రక్షణ , ధర్మ సంస్థాపన గావిస్తానని శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో ప్రవచించాడు. అంతే కాక ఈ కార్య నిమిత్తం అవతరించే యోగులు,సాధు సత్పురుషులు తన ప్రతిరూపాలేనని తెలియజేసాడు. అట్లా అవతరించిన సద్గురువులలో కెల్లా శ్రేష్టుడు పరిశుద్ధ పరమేశ్వర అవతారం అయిన శ్రీ సాయి ఈ కలియుగానికి నిజమైన అధ్యాత్మిక ధర్మం తెలిపి మూఢాచారాలెన్నింటినో తొలగించారు. భక్తుల హృదయాలలో పేరు కొని వున్న అజ్ఞానంధకారములను పటాపంచలు చేసి జ్ఞాన జ్యోతులను వెలిగించారు. వారిని సన్మార్గ వర్తులను గావించారు.

శ్రీ సాయి భక్తాగ్రేసరుడైన దాదా కేల్కర్ మిక్కిలి ఆచారవంతుడు. సద్బ్రాహ్మణ కుటుంబీకుడైన కేల్కర్ సనాతన సంప్రదాయాలను ఔపాసన పట్టి తు చ తప్పక పాటించేవాడు. ఒకసారి అతనిని పరీక్షించదలిచి శ్రీ సాయి అతనికి డబ్బు ఇచ్చి మేక మంసం తెమ్మన్నారు. శ్రీ సాయి నామన్ని అణువణువులో నింపుకొని వున్న దాదా గురువాజ్ఞను శిరసావహించి తాను బ్రాహ్మణుడినన్న సంగతి కూడా విస్మరించి మంసం తీసుకురావడానికి నిస్సంకోచంగా బయలుదేరాడు. అతను మాంసం కొట్టు సమీపించే లోపలే శ్రీ సాయి మరొకరిని పంపించి ఇప్పుడు మాంసం అక్కరలేదని దాదా కేల్కర్ ను వెనక్కి రప్పించారు.  

మరొక సంధర్భం లో మశీదులో మాంసం పలవ్ వండుతున్న శ్రీ సాయి కేల్కర్ ను పిలిచి " కాస్త ఈ మాంసం పలవ్ రుచి చూసి ఎలా వుందో చెప్పు" అని అన్నారు. కేల్కర్ రుచి చూడకుండానే " చాలా రుచికరంగా వుంది సాయి" అని అన్నాడు.అతని మటలకు చిరుకోపం నటించి శ్రీ సాయి " రుచి చూడకుండానే బాగుందంటావేం ?" అంటూ అతని చేతిని గుండిగ లోనికి తోసి కాస్త తీయించి పళ్ళెంలో వేయించారు. తన ఆచారం గురించి మరిచిపోయి దాదా కేల్కర్ పలావ్ ను చేతి వేళ్ళతో నొక్కి బాగా వుడికింది బాబా అని అన్నాడు. బాబా సంతోషంగా అతనిని గిల్లారు.

ఈ విషయం లో మనం గ్రహించవల్సిందేమిటంటే తనకు ఉద్దేశించబడిన ధర్మాన్ని ఉల్లంఘించమని సాయి చెప్పలేదు.అందులోని ధర్మ సూక్షం అర్ధం కాక ఎందరో భక్తులు సాయిని అపార్ధం చేసుకున్నారు.శాస్త్ర వాక్యాన్ని విడిచి ఆయన వాక్కులను వేదాలుగా భావించి పాటించమని అన్ని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.సద్గురువు వాక్కుల యందు పరిపూర్ణ విశ్వాసముంచి ఆయనకు సర్వశ్య శరణాగతి ఒనరించిన వారికి ఉత్తమ ఫలితాలు లభిస్తాయి.

మరొక సంధర్భంలో శిరిడీ గ్రామ పరిసర ప్రాంతాలలో కలరా తీవ్రంగా వుంది. వందలది మంది ఆ వ్యాధి బారిన పడి అస్వస్థులయ్యారు. ప్రక్క గ్రామాలతో సంబంధ బాంధవ్యాలు లేకుండా శిరిడీ గ్రామస్థులెంతో జాగ్రత్త పడ్డారు. కాని సాయిని సంప్రదించకుండానే గ్రామం లోనికి కట్టెల బండి రాకను నిషేధించారు.పైగా ఆ నిబంధనను ఉల్లంఘించిన వారికి జరినామ కుడా ప్రకటించారు. రెండు రోజులలోనే ఆ ఊరిలో వంట చెరుకుకు తీవ్రమైన కొరత ఏర్పడింది. చాలా మంది ఇళ్ళళ్ళో పొయ్య వెలగలేదు. చంటి బిడ్డలు,వృద్ధులు ఆకలి బాధను తట్టుకోలేకపోయారు.ఆ సమయంలో శిరిడీ పొలిమేరల లోకి కట్టెలను మోసుకుంటూ ఒక ఎద్దుల బండి వచ్చింది. తాము విధించిన నిబంధనలను అతిక్రమించడానికి సాహసించక ఆకలి బాధలలో వున్నా ఆ బండిని ఊరిలోనికి పిలవడానికి ఎవరూ ముందుకు రాలేదు.ఇంతలో శ్రీ సాయి ఆ కట్టెల బండిని పిలిపించి మశీదులో ధునికి కొన్ని కట్టెలు వేయించి మిగితా వాటిని మశీదు ముందు పడేయించి కావల్సిన వారు తీసుకుపోవచ్చునని అజ్ఞాపించారు. సాయి మాటలపై విశ్వ్సంతో ఎందరో గ్రామస్థులు వాటిని తీసుకువెళ్ళారు. సాయి వాక్కు ప్రభావాన్న ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు. అందరి ఇళ్ళలో ఆకలి బాధలు తీరి సుఖ సంతోషాలు వెల్లివిరిసాయి.

సర్వం శ్రీ శిరిడీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు    

లోకాస్సమస్తా సుఖినోభవంతు
సర్వే జన: సుఖినోభవంతు

భక్తులందరికీ శ్రీ సద్గురు సాయినాధుని కరుణా కటాక్షములు, అనుపలభ్యమైన అనుగ్రహకవచం లభించాలని శ్రీ సాయినాధుని మనస్పూర్తిగా వేడుకుంటున్నాను

No comments:

Post a comment