Thursday, 19 November 2020

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం – 168

 


సాయి భక్త శిఖామణులు : నారాయణ్ మోతీరాం జాని (రానడే)

నాసిక్ లో ఒక బ్రాహ్మణ కుటుంబం లో పుట్టిన  నారాయణ్ మోతీరాం జాని శ్రీ సాయి భక్తులలో ముఖ్యుడు.  అన్నాసాహెబ్ దాభోల్కర్ విరచిత శ్రీ సాయి సచ్చరిత్రలోని 33 వ అధ్యాయం లో ఈ భక్తునికి సంబంధిచిన ఒక కధ వుంది అయితే ఇతని ఇంటిపేరు జాని కాదని రానడే అని ఇతర పుస్తకాలలో వివరణ వుంది.

నారాయణ్ కు  చిన్నప్పటి నుండి దైవ భక్తి ఎక్కువ. తరచుగా దేవాలయలకు వెళ్ళడం, సద్గ్రంధ పఠన, భజనలు చేస్తుండే వాడు. శ్రీ గాడ్గీ బాబా, శ్రీ వల్లీ బాబా( ఇండోర్ కు చెందిన శ్రీ మాధవనాధ్ మహరాజ్ యొక్క ప్రధమ శిష్యులు) లను తరచుగా దర్శించి వారి ఆశీర్వాదాలను అందుకునేవాడు. ఈ సిద్ధపురుషులు నారాయణ్ ఇంటికి విచ్చేసి అతని ఆతిధ్యం కూడా స్వీకరించారు. అయినా శ్రీ సాయి తొలి దర్శనం లోనే ఆయనకు మహా భక్తుడైపోయాడు. శ్రీ సాయిని నిత్యం ఉదయమే ఆభిషేకాది ఆరాధనలను గావించనిదే పచ్చి గంగైనా ముట్టేవాడు కాదు.

ఇతను రామ చంద్ర వామన్ మోదక్ వద్ద గుమాస్తాగా పనిచేస్తుండేవాడు. మోదక్ తో కలిసి శ్రీ సాయిని దర్శించుకున్నప్పుడు శ్రీ సాయి  నారాయణ్ తో “ ఇతరుల వద్ద పని చెయ్యడమెందుకు ?" అని అన్నారు. వెంటనే నారాయణ్ నాసిక్ లో స్వంతంగా ఆనందాశ్రమం అనే హోటలును ప్రారంభించాడు. బాబా దయ వలన ఆ హోటల్ దిన దినాభివృద్ధి చెందింది. బాబా చూపిన ప్రేమనురాగాలకు కృతజ్ఞతగా అతను  తమ హోటల్ లో పేదవారికి ఉచితంగా భోజనం కూడా పెట్టసాగాడు. పనుల వత్తిడి కారణం గా శ్రీ సాయి సశరీరులై వుండగా కేవలం రెండు సార్లు మాత్రమే దర్శించుకోగలిగాడు.

విధి వశాత్తూ నారాయణ రావు హఠాత్మరణం చెందాడు.అతని పిల్లలు బాగా చిన్నవారు కావడం చేత  హొటల్ బాధ్యతను చేపట్టలేకపోయారు. కుటుంబ పోషణ, రక్షణ బాధ్యతంతా శ్రీమతి నారాయణ్ మీదనే పడింది. వారి కష్టాలు ఎక్కువయ్యాయి.రోజూ వేలాదిమందికి అన్నదానం చేసిన ఆ కుటుంబం రోడ్డున పడి గుప్పెడు మెతుకుల కోసం యాచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సంపదతో పాటు హితులు, సన్నిహితులందరూ మాయమైపోయారు.

శ్రీమతి నారాయణ్ తన కుటుంబాన్ని తీసుకు వచ్చి ఖండ్వా సమీపంలో సద్గురువు శ్రీ ధునీవాలా దాదా ఆశ్రమానికి చేరింది.ఆయనను దర్శించి తమ దీన గాధను తెలియజేయగా ఆయన ప్రేమతో వారి కుటుంబాన్ని అక్కున చేర్చుకొని తమ ఆశ్రమం లో ఆశ్రయం కల్పించారు.ధర్మశాలలొ ఒక చిన్న ఉద్యోగం కూడా ఇచ్చారు. అట్లా బాబా ప్రేరణతో శ్రీ ధునీవాలా దాదా పంచన నారాయణ్ కుటుంబానికి ఒక నీడ దొరికినట్లయ్యింది.ఏనాటికైనా తన సద్గురువు శ్రీ సాయినాధుని ఆశ్శీస్సుల ఫలితంగా తమ కుటుంబానికి మంచిరోజులు వస్తాయన్న ఆశతో వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

శ్రీమతి నారాయణ్ అన్నగారు చాలిస్ గావ్ అనే ఊరులో ఒక ప్రసిద్ధ మిల్లులో ఉద్యోగం చేస్తుండేవాడు.చెల్లెలి కుటుంబం వీధిన పడినా ఒక్క రోజయినా వారి వంక కన్నెత్తి చూసిన పాపాన పోలేదు.ఒక సందర్భం లో తన భార్యతో కలిసి శ్రీ ధునీవాలా దాదా గారి దర్శనానికి వచ్చాడు.

అన్నగారిని చూడగానే శ్రీమతి నారాయణ్ ముఖం చాటేసింది. కాని శ్రీ దాదా తనకు దక్షిణ ఇవ్వబోయిన అమె అన్నగారికి చీవాట్లు పెట్టారు. “ నాకు ఏ విధమైన దక్షిణ ఇవ్వనవసరం లేదు. ఈ మూల ఒక దీనురాలు తన పిల్లలతో కూర్చోని వుంది. ఆమెకు నీ వంతు సహాయ సహకారాలను అందించు,వారి కుటుంబానికి ఒక ఆధారం కల్పించు. వారు నా అన్నగారైన శ్రీ సాయినాధుని శిష్యులు. వారికి ఆ సాయి అండదండలు పుష్కలం గా వున్నాయి” అని  ఆమెను పిలిచి “ నీ గురుదేవులైన శ్రీ సాయిబాబా ఆశ్శీస్సులు మీ కుటుంబంపై ఎప్పుడూ వుంటాయి. తిరిగి మీ వూరు వెళ్ళి ఒక కొత్త జీవితాన్ని ప్రారం భించండి” అని ఆశీర్వదించారు.

అన్నగారిని చూడగానే శ్రీమతి నారాయణ్ ముఖం చాటేసింది. కాని దాదా మాటలకు సిగ్గుపడిన ఆమె అన్నగారు శ్రీమతి నారాయణ్ కుటుంబాన్ని తిరిగి నాసిక్ కు తీసుకువెళ్ళి తిరిగి స్వయం గా మూతబడిన హోటల్ ను తెరిపించాడు. కొంతకాలం ఆ హోటల్ పుంజుకునేవరకూ తాన దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు.  కొద్ది కాలంలోనే ఆ హొటల్ సాయి ఆశ్శీస్సుల వలన మంచి స్థాయికి వచ్చింది. అంతకంటే ముఖ్యం శ్రీ సాయి తమతో పాటు వుండి తమను రక్షిస్తున్నారన్న భావన శ్రీమతి నారాయణ్ లో అద్భుతమైన ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. ఇప్పుడు జీవితం లో ఏ కష్టం వచ్చినా శ్రీ సాయి ఆశ్శీస్సుల వలన ధైర్యం గా ఎదుర్కొని సమస్యలను పరిష్కరించుకోగలమన్న ఆత్మ ధైర్యం ఆమెలో నిండుగా వచ్చింది. తమ భావి జీవిత పర్యంతరం వారి కుటుంబం శ్రీ సాయినాధుని సేవలోనే గడిపారు.

సర్వం శ్రీ శిరిడీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు.


No comments:

Post a comment